తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-7
, రాజధాని కళాశాలలో అయ్యర్ నిజాయితీ ,పాండిత్యం సునిసితహాస్యం తో విద్యార్ధులను ఆకట్టుకొన్నాడు .కొ౦దరు అసూయా పరులు అయ్యర్ క్లాసులలో గోలచేయమని కొందరు విద్యార్దులను పురిగొల్పగా ,వారొక ‘’నచ్చినార్కిలియార్ ,శంకరాచార్య లతోపాటు అయ్యర్ కూడా అదే దారిలో తప్పులు చేశాడు ‘’అని కరపత్రం రాసి వదిలగా ఒక విద్యార్ధి బాధాపడుతూ అయ్యర్ కు ఇవ్వగా చిరునవ్వుతో ‘’ఆ మహానుభావుల స్థాయిలో ఈ అల్పుణ్ణీనిలబెట్టారు ‘’అనగా అందరూ పెద్దగా నవ్వారు .
అయ్యర్ కు జీవితం ,పరిశోధనా ఏక సూత్రమే .అత్యంత సహనం ఆయన ముఖ్య లక్షణం .భారతీయ సాహిత్య వైభవం ,మత సంప్రదాయాల గొప్పతనాన్ని వీలైనప్పుడల్లా చెబుతూ ఉండేవాడు .ఒకపోలీస్ అధికారి జయసింగ్ ఇంటిపక్కన అయ్యర్ కాపురం .ఒక తమళభాషాభిమాని సింగ్ దగ్గరకొచ్చి ‘’కావడిచ్చిందు ‘’.’’తిరుప్పగళ్’’లలోని గీతాలు చదివగా ,అందులోని శృంగారానికి సింగ్ ఉగ్రుడై ,అలా౦టివి పిల్లల్ని చెడగొడతాయికనుక నిషేధించాలన్నాడు .ఈవిషయం తెలిసి అయ్యర్ ఆయన ఇంటికి వెళ్లి ,’’మన సంస్కృతిని సరిగా అర్ధం చేసుకున్నవారికే ఇలాంటి భావం కలుగుతుంది కానీ సాహిత్యాన్ని మరో పార్శ్వం నుంచి చూడాలి .సంగయుగకవులు దాన్ని ఆదరించారు .వాటిలో సాహిత్య వైభావాన్నే మనం చూడాలి ‘’అని చెప్పగా సింగ్ ప్రసన్ను డయ్యాడు .కొందరు అవాంఛనీయ కవిత్వం రాసి విద్యార్ధులను చెడగొడుతున్నారు ‘’అనగా అయ్యర్ ‘’మీరు తమిళ విరోధులని చాలా మంది నాతొ చెప్పగా అలా అనకూడదు అన్నాను .మీరు చెప్పినట్లు సంగ సాహిత్యం లో స్త్రీ వర్ణ ఎక్కువగానే ఉంది. అదే చదివి అభిప్రాయానికి రాకూడదు .నవరసాలలో శృంగారం ఒకటి. సంస్కృత కావ్యాలలోనూ ఇది పుష్కలం .సంగకాల కృతులన్నీ నేను పూర్తిగా చదివాను. అందుకే తమిళులు నన్ను అభిమానిస్తున్నారు .స్త్రీ వర్ణనలో సాహిత్య సౌరభం ,సందర్భ శుద్ధి నే చూడాలి .మీరు సాహిత్యాన్ని నాశనం చేయాలనుకొంటే సంస్కృత ,తమిళ సాహిత్యాలేవీ మిగలవు ‘’అనగా సింగ్ అన్నిటా శృంగారం ఉందా అని అడిగితె అయ్యర్ ‘’అశ్లీలం వేరు ,రసానందం వేరు. జీవితం లో ప్రేమ ముఖ్యమైనది. పురాణాలు కావ్యాలు దీనినే చెప్పాయి .భగవంతుని ప్రియుడుగా తానూ ప్రేయసిగా వర్ణించి ఆళ్వార్లు ,నాయనార్లు గీతాలు రచించిపాడారు .తేవారం ,తిరువాచికం లో,దివ్య ప్రబందాలలోనూ శృంగారం ఉంది .అక్కడ ఉన్నది దేహం ,ఆత్మల శృంగారం ‘’అని అయ్యర్ చెప్పగా ‘అదంతా తనకు గందరగోళ౦గా ఉందని సింగ్ అంటే ,అయ్యర్ ‘’భారతీయ రసతత్వం తెలుసుకొనే తీరిక మీకు ఉన్నట్లు లేదు .గ్రామస్త్రీలు ,కూరగాయలు పెరుగు పాలు అమ్మే స్త్రీలు రవికలు కట్టుకోరు .చీరలు మాత్రమె కడతారు .చూసే వారి కళ్ళల్లో దోషమే కానీ వారిలో దోషం లేదు ‘’అనగా ‘’నిజమే ‘’అని సింగ్ అనగా ‘’దేవాలయ గోపురం మీద చెక్కిన శిల్పాలు స్త్రీల సర్వా౦గా లను ప్రదర్శించినా ,ఎవ్వరికీ నీచంగా అనిపించదు. తల్లి రొమ్ము మీద ఆడుకొనే పసి వాడికి వేరే భావం రాదు ‘’ప్రణయం ద్వారా భగవద్దర్శనం ‘’అనేది భారతీయ సంస్కృతీ ,తత్వశాస్త్రం .ఏవో కొన్ని వర్ణనలు మాత్రమె చూసి ఆ కావ్యాలు నిషేధించాలనుకొంటే సంస్కృత ,తమిళ సాహిత్యాలు సముద్రం లో పాతిపెట్టాల్సిందే ‘’అనగా తన అజ్ఞానాన్ని క్షమించమని, తత్వం ఎదో ఇప్పుడు బోధపదిందని కృతజ్ఞుడను అని పోలీసు అధికారి సింగ్ మనస్పూర్తిగా అన్నాడు .
మీనాక్షి సుందరం రాసిన ‘’త్యాగరాజ లీల ‘’అనే అనువాద కృతిని అయ్యర్ ప్రచురించి ,ఖ్యాతి పొందాడు ఇది ఆయన ప్రచురించినవాటిలో తలమానికం .తిరువారూర్ లో వేంచేసి ఉన్న శ్రీత్యాగరాజ స్వామివారి 360కథలలో పిళ్ళై 14మాత్రమె అనువాదం చేశాడు.దీనినే అయ్యర్ ప్రచురించాడు .
మహామహోపాధ్యాయ అయ్యర్
1906లో స్వామినాధ అయ్యర్ కు ప్రభుత్వం ‘’మహాహోపాధ్యాయ ‘’బిరుదునిచ్చిసన్మానించింది . అప్పటివరకు సంస్కృత విద్వాంసులకు మాత్రమె ఇస్తున్న ఆ బిరుదును ఇప్పుడు మొదటిసారిగా తమిళ విద్వాంసుడు అయ్యర్ కు దక్కిన అరుదైన గౌరవం .భాషాభిమానులందరూ మహా సంతోషించారు.తమిళ భాషకు దక్కిన అత్య౦త విలువైన గౌరవం ఇది ..వేల్స్ రాజదంపతులు భారత్ పర్యటనకు వచ్చారు .మద్రాస్ లో గవర్నర్ నివాసం లో హేమా హేమీలతో గొప్ప విందు జరిగింది .ఇండియన్స్ చాలా మంది నివసించే మద్రాస్ నగర ప్రాంతాన్ని ఆంగ్లేయులు ‘’బ్లాక్ టౌన్ ‘’అని పిలిచేవారు .వినటానికే కర్ణ కఠోరంగా ఉన్న ఆపేరుమార్చి రాజురాకసందర్భంగా ‘’జార్జి టౌన్ ‘’అని పేరుపెట్టారు .అయ్యర్ కు స్వర్ణకంకణం ప్రదానం చేశారు .అయ్యర్ ను సత్కరించటానికి రాజధాని కాలేజిలో బ్రహ్మాండమైన సభ జరిగింది .తమిళమహాకవి,స్వదేశమిత్రన్ పత్రిక సంపాదకుడు సుబ్రహ్మణ్య భారతి హాజరయ్యాడు .ఉప్పొంగిపోయిన భారతి అయ్యర్ పై మూడు పద్యాలు అప్పటికప్పుడే రాసిచదివి అభిమందించాడు –
1-‘’సవితలో కాంతి, తేనెలో తీయదనం ఉన్నదనీ –దేవతలు చిరంజీవులనీ ,-ఎవరైనా ప్రశంసిస్తారా ?కుంభ ముని అనదగ్గ స్వామి నాథ పండితుడు –కీర్తి గడించి నందుకా ఇంత సంబరం ?’’
2-తమిళ ప్రశస్తి తెలియని అన్యులు –ప్రకృతం మన పాలకులైనా –కుంభకోణం స్వామి నాథుని గౌరవించారు –మహామహోపాధ్యాయ బిరుదమిచ్చి –పా౦ పాండ్యుకాలం లోజీవించి ఉంటె -ఈ పండితునికి ఇంకెంత గౌరవం లభించేదో ?
3-మదిని విచారించకు –నిధిలేదనీ ,సౌఖ్యాలు లేవనీ –కుంభకోణం స్వామినాథ సూరీ –తమిళభాష మనినంతకాలం –తెలుస్తుంది నీకు కవుల ప్రశంస –లభిస్తుంది వారి కృతజ్ఞత –చిరంజీవి వయ్యా నీవు అయ్యరూ ‘’
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-11-21-ఉయ్యూరు