తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-10(చివరి భాగం )
ధనవణికన్ పత్రిక ‘’మహావిద్వాంసులు స్వామినాధయ్యర్ అజ్ఞాత తమిళ మహాపురుషులగురించి విలువైన విషయాలు త్రవ్వి తీసి లోకానికి తెలియబరచారు .సాంప్రదాయ విద్వాంసులు కూడా ఆయనలా సరళంగా రాయగలరని నిరూపించారు .ఆయన శైలి అద్భుతం చిన్న చిన్న మాటలతో ,సరళ సుందరంగా రాస్తారు ‘’అని మెచ్చింది .మీనాక్షి సుందర పిళ్ళై జీవిత చరిత్ర ’మహా విద్వాన్ మీనాక్షి సుందరం పిళ్ళై అవర్ గళ్ చరిత్తిరం’’ రెండుభాగాలుగా వెలువడి నందుకు అయ్యర్ పరమానంద భరితుడయ్యాడు.మార్గదర్శకమైన వచనకావ్యం గా అది చరిత్రలో నిలిచిపోయింది .
అశీతి అయ్యర్
అయ్యర్ 80 వ జన్మ దినాన్ని వైభవంగా జరపాలని అభిమానులు సర్ పిటి రాజన్ అధ్యక్షతన సన్మాన సంఘం ఏర్పరచారు .విశ్వవిద్యాలయ సెనేట్ హాల్ లో సర్ మహమ్మద్ ఉస్మాన్ అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది .ఆయన తమిళ భాషకు చేసిన కృషి ని సన్మానపత్రం లో విశదీకరించి,గౌరవ పురస్సరంగా 3001 రూపాయల నగదు అందించారు .మద్రాస్ తమిళ సాహిత్య సంఘాలన్నీ ‘’తమిళ తాత ‘’కు ప్రశంసాపత్రాలు బహుమతులు అందజేశాయి .ఇవన్నీ తమిళతల్లి అనుగ్రహం అని ముక్తసరిగా వినయంగా అయ్యర్ బదులు గా స్పందిస్తూ –‘’నామనస్సు ఆనంద జలధిలో తేలిపోతోంది .భగవద్దర్శనం గురించి ‘’సేక్కిళారు’’చేసిన వర్ణన గుర్తుకొస్తోంది .దాన్ని వర్ణించి చెప్పటానికి మాటలు రావటం లేదు .ఆ దర్శనం నన్ను కాపాడుగాక .మీ ఆదరాభిమానాలు భవిష్యత్తులో నా తమిళ పరిశోధనకు మీరుమంచి ప్రోత్సాహం కల్పించినందుకు ధన్యవాదాలు’’అన్నాడు .అయ్యర్ చిత్రపటాన్ని సర్ మహమ్మద్ ఉస్మాన్ ఆవిష్కరించగా ,విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు లిటిల్ హేయిల్స్ స్వీకరించాడు హరికేశవ కల్లూర్ ముత్తయ్య భాగవతార్ పాడిన తమిళ కృతులతో సభ సమాప్తమైంది ..కలైమగల్ పత్రిక ప్రత్యెక సంచిక వెలువరించింది .ఈ జన్మదినోత్సవాన్ని తమిళనాడు అన్ని ముఖ్య పట్టణాలలో, జాఫ్నా ,రంగూన్ లలో కూడా పండుగలా జరుపుకొన్నారు.
కలైమగళ్ పత్రికలో ఒకసారి అయ్యర్ ‘’బిచ్చగానిపాట ‘’అనే వ్యాసం రాస్తే ,చదివిన రాజాజీ 22-5-1937న అయ్యర్ కు ఒక ఉత్తరం రాస్తూ –‘’మీ బిచ్చగానిపాట మహాద్భుతం మంచి .కథ, గొప్ప కథనం రసప్రవాహం తో నిండి ఉంది .ఈ కథకు నేనైతే ‘’ ఊరిని తగలబెడుతుందా ?’’అని పేరు పెట్టి ఉండేవాడిని ‘’అన్నాడు .
1937లో మద్రాస్ లో జరిగిన భారతీయ సాహిత్యసమావేశానికి మహాత్మా గాంధీ అధ్యక్షత వహించాడు .స్వాగతోపన్యాస౦ అయ్యర్ చేశాడు .తమిళప్రాభవం సంస్కృతీ గురించి విపులంగా అయ్యర్ పేర్కొనగా గాంధీకి అందులో చాలాభాగం కొత్త అనిపించింది .ఆన౦ద మనస్కుడై మహాత్ముడు ‘’రూపుకట్టిన తమిళ౦ గా భాసిస్తున్న అయ్యర్ గారి విద్యార్ధిగా ఉండాలని నా మనసుకోరుతోంది .ఆ అవకాశం ఎప్పుడొస్తుందో ?””అన్నాడు ,నానాటికీ వయసు మీదపడుతున్నా అయ్యర్ సంగకాలపు ‘’ కురు తొంగై’’కావ్యాన్ని పరిశోధించటానికి మొదలు పెట్టాడు .అంతకు ముందే ఒకరు దాన్ని ప్రచురించినా అదంతా తప్పుల తడక .అయ్యర్ విపుల వ్యాఖ్యతో పరిష్కరణ ప్రతి తయారు చేసి పద్యం ప్రతిపదార్ధం తాత్పర్యం ప్రత్యెక వివరణ సంవాద రచనలు,ఉదాహరణలు ,పాఠాంతరాలు,విపుల పద పట్టికతో సహా 1937లో ప్రచురించాడు .
తిరుప్ప నందాళ్ మఠాధిపతి స్వామినాథ తంబిరాన్ కోరికపై ‘’కుమార గురువరర్ ‘’ ప్రబంధాలు పరిశోధించి అయ్యర్1939 వెలువరింఛి ఆయనను దర్శించటానికి వెళ్ళాడు .అక్కడకు వచ్చిన కవిపండిత శాస్త్రకారులతో అయ్యర్ కు గొప్ప కాలక్షేపమేజరిగింది .చాలారోజులు అక్కడే ఉన్నాడు .ఒకరోజు ఉదయం పడకకుర్చీలో అయ్యర్ విశ్రాంతి తీసుకొంటుంటే మఠాధిపతి దొడ్డి తలుపు వైపు నుంచి లోపలికి రాగా ‘’ఎవరా వచ్చేది ‘’అంటే ‘’స్వామిగళ్’’అనే మాట వినిపించగా ,అయ్యర్ వినయంగా లేస్తూ ‘’మీరు రావాలాస్వామీ కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా ,అదీ దొడ్డివైపు నుంచి రావటమా ??’’అన్నాడు .ఆయన ‘’మీరు చేసిన ఉపకారానికి ఇది ఏపాటిది ?’’శివరాళు౦దు దేశికర్’’’’కుమర గురుపరర్ ‘’,రచనలు ప్రచురించి మాకుటుంబానికీ ,మఠానికీ ఎంతో గౌరవం కల్పించారు .దీనికి ప్రత్యుపకారం నేనేం చెయ్యగలను ??’’అని వెయ్యిరూపాయలఖరీదైన వెండిపళ్ళెం అయ్యర్ చేతిలో ఉంచి ఆశ్చర్యపరచారు .ఈ విషయానికి పొంగిపోయి నలుగురికీ అయ్యర్ చెప్పుకోనేవాడు ‘
స్వీయ చరిత్ర రాయమని చాలామంది అయ్యర్ ను కోరారు .ఒకా అభిమాని దాని ప్రచురణకు 501రూపాయలు అడగకుండా నే పంపాడు .అయ్యర్ చరిత్ర ధారావాహికంగా తన పత్రిక ఆనంద వికటన్ వారపత్రిక లో ప్రచురిస్తానని సంపాదకుడు కల్కి కృష్ణమూర్తి చెప్పాడు .’’ఎన్ చరిత్తరం ‘’అంటే నా చరిత్ర గా దాన్ని రాయటానికి అయ్యర్ ఒప్పుకొని 1940జనవరి నుంచి ధారావాహికంగా రాశాడు .ప్రతివారం ఉత్కంఠ తో ఎదురు చూసేవారు అయ్యర్ రచనకోసం .తన సాంస్కృతిక వారసత్వాన్ని అయ్యర్ అద్భుతంగా చిత్రించాడు .1942ఏప్రిల్ లో అయ్యర్ మరణించేదాకా ఈ ప్రవాహం సాగి,అసమగ్రంగా నిలిచిపోయింది .
1942ఏప్రిల్ 12 సోమవారం అయ్యర్ మేడ మీద గదిలో బల్లపై పడుకుని ఉదయమే లేచి ,కి౦దికి దిగుతూ పడ్డాడు .మోకాలుకు దెబ్బతగిలి రక్తం కారింది వైద్య పరీక్షలో ఎముక విరిగినట్లు తెలిసింది .రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులవి .మద్రాస్ వాసులు తమ కుటుంబాలను పల్లెటూళ్ళకు తరలిస్తున్నారు యుద్ధభయం తో .అయ్యర్ ను ‘’తిరుక్క ళుక్కుండ్ర౦’’ లో ఉన్న తిరువాడు దురై మఠానికి చెందిన భవనం లోకి తరలించారు .ఏప్రిల్ 11న తనత్యాగారాజ విలాసం నుంచి కారులో బయల్దేరే ముందు అయ్యర్’’ దేవా ! తిరుక్క ళుక్కుండ్ర౦ లో నువ్వు ఎన్నో అద్భుతాలు చేషావు ‘’అనే ’’తిరువాచకం గీతాన్ని చదివాడు .మళ్ళీ ఇంటికి తిరిగి వస్తానా ?అనుకొంటూ బయల్దేరాడు .సాయంకాలానికి కారు గమ్యస్థానం చేరింది .తాళపత్ర ప్రతుల్ని ఇంటి దగ్గరే వదిలేసి వచ్చినందుకు శిశువుకు దూరమైన తల్లి పడే బాధలా బాధపడ్డాడు .తండ్రి ఆవేదన అయ్యర్ కొడుకు అర్ధం చేసుకొని ,కొద్దిరోజుల్లోనే వాటిని అన్నిటినీ కొత్త నివాసానికి తరలించి అయ్యర్ కు ఊరట కలిగించాడు .
కొద్ది రోజులకు అయ్యర్ ఆరోగ్యం కుదుటబడి లేచి కూర్చో గలిగాడు .అయ్యర్ పై ఈపుస్తకం రాసిన శిష్యుడు తన తండ్రి ఆరోగ్యం బాగా లేదని తెలిసిమైసూర్ వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చి ఒకరోజంతా గురువుతోగడిపి తమిళ సాహిత్యం పై మాట్లాడుకొన్నారు’’ కంబరామాయణం’’ ,’’తేవారం’’ లను సక్రమంగా ప్రచురించాలని అయ్యర్ అభిప్రాయ పడి’’ఇందులో నువ్వు సహాయం చేస్తావా ?ఏదీ నీ చెయ్యి నాకుఒకసారి ఇవ్వు ‘’అని అడిగి తీసుకొన్నాడు .అదే ఆఖరి స్పర్శ అని శిష్యుడు గ్రహించలేదు .శిష్యుడు మైసూర్ వెళ్ళాడు గురువు అనుజ్ఞ తీసుకొని .
అయ్యర్ కి జ్వరం వస్తే కొడుకుకు టెలిగ్రాం ఇవ్వగా ,అతడువచ్చే లోపే అయ్యర్ 28-4-1942న 87 వ ఏటశివ సాన్నిధ్యం చెందాడు .శ్రీమతి రుక్మిణీదేవి అరండేల్’’ తమిళతాత అయ్యర్’’ పేరుమీదుగా తిరువాన్మయూరు లో ఒక గ్రంథాలయం స్థాపించి ,అయ్యర్ సేకరించినవీ ,ప్రచురించినవీ అన్నిటినీ భద్రపరచినది .త్యాగరాజ చెట్టియార్ సజీవులై ఉండగా ఆయనపై తానేమీ రాయలేక పోయిందుకు అయ్యర్ బాధ పడేవాడు .మద్రాస్ లో కాంగ్రెస్ భవనం లో సభ జరిగినపుడు రాజాజీ అయ్యర్ ను సుబ్రహ్మణ్య భారతిపై ప్రసంగించమని కోరగా అద్భుతంగా మాట్లాడగా రాజాజీ పరవశంతో ‘’వశిష్టుడు విశ్వామిత్రుడిని బ్రహ్మర్షి అనటం వల్ల ఆయన కీర్తి పెరిగినట్లు అయ్యర్ ప్రశంసావాక్యాలవల్ల భారతి కీర్తి ఇనుమడించింది ‘’అన్నాడు .
‘’తమిళులకు ఒక ప్రత్యెక విలక్షణమైన చరిత్రను సంపాదించి ఇచ్చిన స్వామినాథ అయ్యర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది .సంగకాలపుకావ్యాలను వెతికి తీసి తమిళ భాషా సేవ చేశాడు .ఆయన వచన రచనలు ‘’వచనం లో వెలసిన వర్ణ చిత్రాలు ,సాంస్కృతిక కోశాలు ‘’ .
ఆధారం –మొదట్లోనే చెప్పినట్లు కి .వా .జగన్నాథన్ తమిళ రచనకు ప్రేమానంద కుమార్ చేసిన ఆంగ్ల అనువాదానికి తెలుగు లో శ్రీ చల్లా రాధాకృష్ణ శర్మ చేసిన ‘’ఉ.వే.స్వామినాథ అయ్యర్ ‘’పుస్తకం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-11-21-ఉయ్యూరు