తిట్టి పని సాధించుకొన్న శ్రీనాథుడు
శ్రీనాథ కవి సార్వ భౌముడు తెలుగు రాయని దగ్గరకు వెళ్లి ‘’ధాటీ ఘోటక రత్న ఘట్టన మిల ద్రాఘిష్ట కళ్యాణ ఘంటా టంకార విలు౦ఠ లుంఠిత మహోన్మత్తాహిత క్షోణి భ్రుత్కోటీ రాంకిత కుంభినీధర సముత్కూట ఝాటకర్ణాటాంధ్రధిపా-సామరాయని తెలుంగా –నీకు బ్రహ్మాయువౌ ‘’అని దీవించి –‘’అక్షయ్య౦బుగసాంపరాయని తెలుంగా ధీశ –కస్తూరికా భిక్షాదానము సేయురా –సుకవి రాట్బ్రు౦దారక శ్రేణికిన్-దాక్షారామ చళుక్యభీమవర గంధర్వాప్సరో భామినీ వక్షోజ ద్వయ కుంభి కు౦భములపై వాసించు తద్వాసనల్ ‘’అని కస్తూరికోసం చెయ్యి చాపి ఉంటాడు అన్నారు మునిమాణిక్యం .మొదట్లో దీర్ఘ కఠినపద సమాస౦వాడటం తన కవితా పాండిత్య ప్రకర్ష తో హడల గొట్టించ డానికే నట .తన్ను తాను పొగుడుకోవటం ఎదుటి వాడిని తక్కువ చేయటమే .అంటే సాంపరాయని రెండు తిట్టి ‘’ఇప్పుడు ఏమంటావ్ ?కస్తూరి ఇస్తావా ఇవ్వవా ‘’ అని అడిగి నట్లు తోస్తుంది అన్నారు చక్కగా ఎస్టిమేట్ చేస్తూ మాస్టారు .
నువ్వు బాగా ఎడ్చావు అంటే అందులో కొంటెదనం ఉందన్నారు మాస్టారు .ఆమె ఒళ్ళు మండటానికి అన్నమాట .ఇదీ ఒకరకమైన తిట్టు కిందే జమ వేశారు మునిమాణిక్యం .కలస్వనం తో ఏడ్చినా ,పల్లవ గ్రాస కాషాయ కంఠకాకలీధ్వనితో ఏడ్చినా ,కాంభోజీ మేళవిపంచికారవ సుధా పూరంబుతో ఏడ్చినా అది ఏడ్పే కాని ఇంకోటికాదు .ఇలా ఏడ్చినా దానితో మహా బాగా ఎడ్చావు అంటే ఒక రకమైన విక్కిరి౦పే అని తేల్చారు .అయితే ఈతిట్లు సుకుమార,సుందర, శ్రవణ పేయంగా ఉన్నాయి ట.తెనాలికవి తనకవిత్వం లో తప్పు పట్టలేరనీ ,తప్పు పట్టితే –‘’మొగమటు కిందుగా దివిచి ముక్కలు వోవ నినుంప కత్తితో సిక మొదలంట గోయుదును ,చెప్పున గొట్టుదు,మోము దన్నుదున్ ‘’వాచ్యంగా మరీ బండగా మోటుగా తిట్టాడు .కానీ పైన పద్యాలు కృష్ణ శాస్త్రి కవిత్వం లా లలిత సుకుమార ౦గ హాయిగా ఉన్నాయన్నారు మాస్టారు.కనుక తిట్టటం తిట్టి౦చు కోవటం మనోహర వ్యాపారం అన్నారు మునిమాణిక్యశ్రీ .రమ్యంగా తిట్టటం వాక్ చమత్కృతి, హాస జనకమూ అవుతుందట .
తిట్టుకవిత్వమంతగా సరసమైనదీ ,ఉత్తమహాస్యం అనిపించుకోనిదీ అయినా ,అది హాస్య రచనే. వాటిలో చమత్కార ,హాస్యాలు కలిసి ఉన్నాయట .’’పెట్ట నేరని రండ,పెక్కు నీతుల పెద్ద – గొడ్రాలి ముండకుగొంతు పెద్ద –గుడ్డి గుర్రపు తట్టు గుగ్గిళ్ళు తిన పెద్ద –వెలయ నాబోతు క౦డలకు పెద్ద –అల్ప విద్యావంతుడా క్షేపణకుపెద్ద –రిక్తుని మనసు కోరికలపెద్ద – మధ్య వైష్ణవునకు నామములు పెద్ద ‘’లో దుష్టాచారాలను ఖండించి హాస్యం కలిపించాడు కవి .మనకున్న ద్వేషాన్నీ కోపాన్నీ ఇంకెవరైనా బహిర్గతం చేస్తే మనకు సంతోషం కలుగుతుంది .మనం చేయలేని పని వాడుచేశాడుకనుక ఎవర్ని ఎవరు తిట్టినా మనకు ఆనందం కలుగుతుందని తీర్పు చెప్పారు మునిమాణిక్యం.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-11-21-ఉయ్యూరు