మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-2
కేశవ సుత్ మొదటినుంచి బలహీనుడు ,ఎప్పుడూ సణుగుతూ ఉండేవాడు .ఒంటరిగా వాహ్యాళికి వెళ్ళేవాడు .ముఖం ఆలోచనా గభీరం ,చూపు ఎప్పుడూ కిందకే ఉండేది .తీక్ష్ణమైన కను చూపులు .ఎత్తు5అడుగులు గుండ్రని ముఖం పై ముడుతలు .’’ముఖం ఖిన్నంగా ఉంటేనేం దివ్య ప్రభతో అతడు చేసే గానం ప్రపంచ ప్రజలకు ఆనందం కల్గించేది .వాడిన ముఖం నుంచి సుందర భవిష్యత్తు శాశ్వతానందం కలిగించే అమృత కవిత్వం వెలువడేది ‘’అని తనకవిత ‘’దుర్ముఖ్ ఖేలా ‘’(ఖిన్న వదనుడు )లో ఆయనే చెప్పుకొన్నాడు .అందుకే 1886లో ఆయన తమ్ముడైన ఫిలాసఫీ ప్రొఫెసర్ ఇంట్లో కుటుంబం అంతా సమావేశమైనా కేశవ ఫోటో తీయి౦చుకోలేదు .
ప్రాధమిక విద్యలో ఉపాధ్యాయుల హింసను భరించ లేకపోయాడు .1882లో బరోడా లో ఉన్న అన్న శ్రీధర్ ఇంటికి వెళ్ళాడు .ఎనిమిది నెలలకే అతడు చనిపోగా ,వార్ధాలో ప్లీడర్ గా ఉన్న మేనమామ శ్రీరామ చంద్ర గణేష్ కరందీకర్ ఇంట్లో చదువు కొనసాగించాడు . ‘’కృష్ణాజీ’’ అంటే కేశవ సుత్ తమ్ముడు మోరోపంత్ తో కలిసి నాగపూర్ వెళ్ళారు.వీరిని చదివించే ఆర్ధిక స్థితి తలిదండ్రులకు లేదు .అక్కడి వేడికి అతని దుర్బల శరీరం తట్టుకోలేక పోయింది కానీ అక్కడే సుప్రసిద్ధ మహారాష్ట్ర కవి రెవరెండ్ నారాయణన్ వామన్ తిలక్ ,ప్రొఫెసర్ పట్వర్ధన్ తో స్నేహం కలిగింది .తిలక్ పరిచయం వలన కృష్ణాజీ కి కవిత్వం పై అభిరుచికలిగింది .తిలక్ ‘’మేము మంచి మిత్రులం .కేశవ లో కవితావిర్భావం గమనించాను .1883లో నాగపూర్ ,,88,89 లలోపూనాలో ,95,96 లలో బొంబాయ్ లో కలుసుకొన్నాం .’’అని రాశాడు .పూనాలో న్యు ఇంగ్లీష్ స్కూల్ లో మెట్రిక్ చదువుతున్నప్పుడు తిలక్ ను కలిశాడు .అప్పుడే క్రైస్తవ పత్రిక ‘’జ్ఞానోదయా ‘’సంపాదక వర్గం లో తిలక్ చేరాడు .తిలక్ దీనికి కవితలు పంపేవాడు .10-2-1895లో తిలక్ క్రైస్తవం లో చేరాడు .బైబిల్ పై ఆసక్తి ఉన్న కేశవ కూడా అందులో చేరుతాడేమో అని బంధువులు భయపడేవారు .చేరతానని తమ్ముడు సీతారాం కు చెప్పాడు కూడా .తిలక్ కవిత్వం ప్రసాద గుణం కలిగిఉంటే కేశవుని కవిత్వం ఓజో గుణభరితం .తిలక్ చనిపోయాక రెండు కవితలురాసి 1906జనవరి లో కావ్య రత్నావళి ,ఫిబ్రవరిలో మనోరంజన్ పత్రికలో ప్రచురించాడు కేశవ .
నాగపూర్ లో ఉండగా సంఘ సంస్కర్త శ్రీ వాసుదేవ బలవంత్ పట్వర్ధన్ తో కేశవ కు పరిచయం కలిగి ,1888లో ఆయనపై ఒక దీర్ఘకవిత రాశాడు .ఇద్దరికీ అభ్యుదయ భావాలున్నాయి .డెక్కన్ వర్నాక్యులర్ సొసైటీ కి పట్వర్ధన్ శాశ్వత సభ్యుడు .అగార్కర్ తర్వాత ఆయనే ‘’సుధాకర్ ‘’పత్రికా సంపాదకుడయ్యాడు .పట్వర్ధన్ పై కేశవ కవిత –‘’విశ్వాన్తరాళలోని చుక్కలతో కవి ఆత్మలను దర్శిస్తాడు .ప్రజలుఅద్దం లో చూస్తె ,కవి బండలద్వారాకూడా చూస్తాడు’’ఈ కవితపై అమెరికన్ కవి తాత్వికుడు ఎమెర్సన్ ప్రభావం ఉంది అంటారు .
1883లో స్వగ్రామం ఖేడ్ లో కొంతకాలం ఉండి,పై చదువులకు పూనా వెళ్లి 11-6-1884న న్యు ఇంగ్లిష్ స్కూల్ లో చేరి ,1889లో మెట్రిక్ ను 23వఏట పాసయ్యాడు కేశవ ..ఆస్కూల్ లోప్రముఖ మరాఠీ నవలారచయిత ,పత్రికా సంపాదకుడు హరినారాయణ ఆప్టే తో పరిచయం కలిగింది కవి ,అనువాదకుడు .గోవింద వాసుదేవ కణిట్కర్ తో నూ స్నేహం కలిసింది .ఇతనిభార్య గొప్ప విదుషీ మణి.ఆంగ్లకవి స్కాట్ శైలిలో యితడు రాసిన ‘’అక్బర్ ‘’,కృష్ణకుమారి ‘’వంటి చారిత్రకకవితలను జస్టిస్ ఎం. జి .రానడే బాగా మెచ్చాడు .మెసర్స్ హైమ్స్,ఎలిజబెత్ బార్రెల్ బ్రౌనింగ్ ,తోరు దత్ కవితలంటే కనిట్కర్ కు ప్రాణం .థామస్ మూర్ ,థామస్ హుడ్,బైరన్ ,బర్న్స్,కీట్స్ లిరిక్కులను అతడు అనువాదం చేశాడు .కేశవ ,ఆప్టే లు మనోరంజన్ ,ఆణీ,నిబంధ చంద్రికా పత్రికలకు తమకవితలు రాసేవారు .1880-90లో కేశవ 13కవితలు ఆమాసపత్రికలో ప్రచురించాడు .
కేశవ కవితా సరస్వతి ఆంగ్లకవితాధ్యయనం తో ప్రభావితమైంది .సాల్ గ్రేవ్, మైకే ,మాక్మిలన్ కవితలను బాగా చదివాడు .ఉత్తరాలలొఎమర్సన్ గురించి చాలాసార్లు ప్రస్తావించాడు .తోరు దత్ కవిత ‘’ఎ షీఫ్ గ్లీన్డ్ ఇన్ ఫ్రెంచ్ ఫీల్డ్స్ ‘’కూడా చదివాడు .షేక్పియర్ ,డ్రామండ్,గేథే,అల్లాన్ పో ,లాంగ్ ఫెలో కవితల్ని అనువాదం చేయటమేకాక స్వయంగా కొన్ని ఇంగ్లీష్ పోయెమ్స్ రాసే ప్రయత్నం చేశాడు .’’పాంచ్ –కవి ‘’అనే గ్రంధం లో ప్రొఫెసర్ ఎం వి రాజాధ్యక్ష సంస్కృత వాగ్మయాన్ని కేశవ ఔపోసన పట్టాడని రాశాడు .న్యు ఇంగ్లిష్ స్కూల్ లో అగార్కర ,లోకమాన్య బాల గంగాధర తిలక్ అధ్యాపకులుగా ఉన్నా ,కేశవ కు వారి బోధనపై అభిరుచి ఆసక్తి కలగలేదు .అగార్కర్ సంఘ సంస్కరణకు ప్రభావితుడయ్యాడు .క్లాస్ లో కూర్చునితిలక్ మొదలైన వారిపై కార్టూన్లు వేస్తూ ఉండేవాడు .మహా వక్తలు అంటే మహా ఇష్టం .పూనా ఆందోళన కాలం లో చిఫ్లూమ్కర్ ‘’తన నిబంధమాల లో ‘’ఇంగ్లీష్ నేర్వటం ఆడ సింహం పాలు తాగటం లాంటిదే ‘’ అని 1880నుంచి వ్యాఖ్యానిస్తూ ఉండేవాడు .సుధాకర్ పత్రికలో అగార్కర్ సంఘ సంస్కరణ లపై రాసేవాడు. కిర్లోస్కర్,భావే లు మహారాష్ట్ర రంగస్థలాన్ని ప్రభావితం చేస్తుంటే కేసరి పత్రికలో తిలక్ గర్జిన్చేవాడు .ఆప్టే మరాఠీ నవలకు శ్రీకారం చుట్టి దున్నేస్తున్నాడు .మనవాడు సిగ్గులమొగ్గల బుట్ట కనుక దేనిలోనూ కలిపించుకో కుండా షెల్లీ లాగే కవిత్వానికే పరిమితమై ‘’drive my dead thoughts over the universe –like withered leaves to quicken a newbirth ‘’అనే షెల్లీ కవిత ‘’ఓడ్ టు వెస్ట్ విండ్ ‘’కవితా భావంలా ఆకాంక్షించాడు .
కేశవ తమ్ముడు మోరో కేశవ దామ్లే బాంబే యూని వర్సిటి నుంచి ఫిలాసఫీ హిస్టరీ డిగ్రీ పొంది ,ఉజ్జైన్ మాధవ కాలేజిలో ఫిలాసఫీ ప్రొఫెసర్ గా 1894నుంచి 1907వరకు పనిచేశాడు .1908లో ఆకాలేజి మూతపడితే ,నాగపూర్ సిటి హైస్కూల్ లో టీచర్ గా చేరి 1913లో రైలు ప్రమాదం లో చనిపోయాడు .ఇతడు 900 పేజీల మరాఠీ వ్యాకరణాన్నిరాసిన వ్యాకరణ ఉద్దండ పండితుడు .బర్క్ ఉపన్యాసాలను అనువదించాడు .తర్కానికి అద్భుత ప్రారంభ గ్రంధం రాశాడు .మరో తమ్ముడు సీతారాం కేశవ్ దామ్లె పత్రికా రచయితా ,నవలాకారుడు ,దేశభక్తుడు .జ్ఞానప్రకాష్ ,రాష్ట్ర మత్ పత్రికలకు సంపాదక వర్గం లో ఉన్నాడు .మూల్షీ సత్యాగ్రహం లో పాల్గొని రెండేళ్ళు జైలులో ఉన్నాడు .ఇంతటి ప్రతిభా సంపన్నులైన తమ్ముళ్ళు అల్పాయుష్యుతో చనిపోవటం తో కేశవ జీవితం లో ,కవిత్వం లోనూ ,విషాదం చోటు చేసుకొని కవిత్వం లో ప్రతి ఫలించింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-11-21-ఉయ్యూరు