మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-3
పేదరికం వలన మెట్రిక్ తర్వాత చదవలేక పోయిన కేశవ సుత్ 1890లో ఉద్యోగం కోసం బొంబాయ్ వెళ్లి ఎవరినీ అర్ధించకుండా ఒక మిషన్ స్కూల్ లో టీచర్ గా చేరాడు.జ్ఞానోదయ పత్రికలోనూ పని చేశాడు .తర్వాత దాదర్ న్యు ఇంగ్లీష్ స్కూల్ టీచర్ గా నియుక్తుడై ,ట్యూషన్లు కూడా చెప్పాడు .ఇంత చేసినా నెల రాబడి 25రూపాయలే .ఇష్టం లేకపోయినా బొంబాయి లోనే స్థిరపడాలని 1893లో నిశ్చయం చేసుకొని ఉండిపోయాడు .’’ఆత్మావలోకన్ ‘’అనేస్వీయ చరిత్ర కవిత లో కుటుంబ కలహాలు తెలియజేశాడు 1819 లో కళ్యాణ్ లో ఇంగ్లీష్ స్కూల్ టీచర్ గా చేశాడు .కొద్దికాలం కమిష రేట్ లో గుమాస్తా గా ఉన్నాడు .తనకు ఇష్టం లేకపోయినా కరాచీకి బదిలీ చేస్తే రిజైన్ చేశాడు .మోర్స్ కోడ్ ను అధ్యయనం చేశాడు. 1893లో సావంతవాడి లో టీచర్ చేశాడు .
బొంబాయి లో ఉండగానే కాశీనాథ రఘునాధ మిశ్ర ,జనార్దన ఢోండో.భా౦గలే బాలకృష్ణ కాలేల్కర్ అనే యువ రచయితలూ సంపాదకులతో పరిచయం పొందాడు .1895లో స్థాపింపిబడిన మనో రంజన్ మాసపత్రికలో కవితలు రాశాడు .భా౦గలే ఆపత్రికలో బంకిం చంద్ర చటర్జీ బెంగాలీ నవలలను , గుజరాతీ నవలను అనువాదం చేశాడు .బంకిం రాసిన’’ ఆనంద మఠం’’నవల 1894లో ‘’ఆన౦దాశ్రమం ‘’పేరుతొ మరాఠీ లోకి అనువాదం చెందింది .మన జాతీయ గీతం ‘’వందేమాతరం ‘’ఈ నవలలోనిదే .కేశవకు డా కాశీ నాథ హరిమోదక్ ,కిరాత్ ,గజానన్ భాస్కర వైద్య కవులతోనూ పరిచయం కలిగింది .వైద్య సోదరుడు కేశవ సుత ఊహా చిత్రాన్ని పెన్సిల్ తో గీశాడు .ఆర్య సమాజ,క్రైస్తవ సమాజ సమావేశాలకు వెళ్లి ఆసక్తిగా వినేవాడు కేశవ .1896లో బొంబాయి లో ప్లేగు వ్యాధి విపరీతం గా వ్యాపించటం తో ఖాందేశ్ లోని భాద్గాం కు వెళ్ళాడు .భార్యా పిల్లల్ని మామగారింట చాలీస్ గావ్ లో ఉంచాడు .మామగారి సలహాతో ఖాండ్ గావ్ లో నెలకు 15 రూపాయల జీతం తో టీచర్ గా చేరాడు .1897నుంచి 1904వరకు అక్కడే ఉంటూ ,1998లో ట్రెయినింగ్ స్కూల్ లో చేరి పాసై ,1901లో ఫైజ్ పూర్ హిందూ హైస్కూల్ హెడ్మాస్టర్ అయ్యాడు కేశవ .ఇంగ్లీష్ బోధించేవాడు .దురదృష్టం వలన అక్కడా ప్లేగు వ్యాపించగా ,మేనేజిమెంట్ తో పడక బదిలీ కోరగా1904 న దార్వార్ హైస్కూల్ కు మరాఠీ టీచర్ గా ట్రాన్స్ ఫర్ అయ్యాడు
ఖాందేశ్ లో కవితా ప్రచురణ లక్ష్యంగా ‘’కావ్య రత్నావళి ‘’అనే పత్రిక ఉంటె దానికి తనకవితలు పంపేవాడు కేశవ .దాని సంపాదకుడుకవితాభిరుచిఉన్న నరసింహ ఫడ్న వీస్ ‘’మా పత్రిక గర్వించదగ్గ పంచ రత్నకవులలో కేశవ సుత ఒకడు ‘’హరప్ ళేతీ, శ్రేయ ‘’అనే అతనికవితనుచివరి సారిగా మా పత్రికలో ప్రచురించాం .స్వతంత్ర భావాలతో భావౌన్నత్యం ఉత్క్రుష్టత తో అందర్నీ ఆకర్షించాడు .అతని చిత్తవృత్తి ఆచరణ సాధ్యం కానిది .మానసిక స్థితి ఆస్థిరం .సిగ్గు ఎక్కువ ఎప్పుడూ కలిసి మేము అతనితో మాట్లాడలేక పోయాం ‘’అని 1905చివరి ‘’కావ్యావళి’’ లో రాశాడు .
కేశవ బాంబేలో ఉండగా పరిచయమైన మహారాష్ట్ర బైరన్ కవి గా ప్రసిద్ధుడైన వినాయక జనార్దన్ కాన్దీకర్ కవి కేశవ లాగానే సామాజిక హింస ,రాజకీయ దాస్యం లను వ్యతిరేకించాడు .జీవిత చరమాంకం లో కేశవ కొంత సుఖం అనుభవిస్తూ ,ప్రకృతి శోభను ఆస్వాదిస్తూ ,కవిత్వ తత్వ సమాలోచనచేస్తూ ,ఉద్గ్రంథ పఠనం చేస్తూ గడిపాడు .1904 ఏప్రిల్ నుంచి 18నెలలు దార్వార్ లో గడిపాడు .తనమరణం గురించి ముందే గ్రహించాడేమో 25-5-1905’’చిపులన్ ‘’అనే చివరికవిత గురించి ఒక స్నేహితుడికి జాబు రాస్తూ ‘’మనోరంజన్ లో వచ్చిన నా కవిత చదివే ఉంటావు .నా హృదయస్థితి ఎలా ఉందొ ఊహించే ఉంటావ్ .నా గుండె తాపం తో బీటలు వారింది .శాంతికి ఏది మార్గం ?’’అని మనసులోని బాధను చెప్పుకొన్నాడు.
నిజంగానే మార్గం లేకుండా పోయింది అక్టోబర్ చివర్లో హుబ్లీలో ఉంటున్న తన దూరపు పినతండ్రి ‘’హరి సదాశివ దామ్లె ‘’ను చూడటానికి భార్య కూతురులతో వెళ్ళాడు .నాలుగు రోజుల్లో తిరిగి వెడదామనుకొన్నాడు .నవంబర్ 7 న ప్లేగువ్యాదిసోకి చనిపోయాడు .ఎనిమిది రోజులతర్వాత భార్యకూడా మరణించింది .అంత్యక్రియలు పినతండ్రే చేశాడు .ముగ్గురు కూతుళ్ళను అయనే కొంకణ్ కు పంపాడు .అందులో ఒకామె కొద్దిరోజుల్లోనేచనిపోయింది .చివరి ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి కానీ వారి వివరాలు తెలియలేదు .
39ఏళ్ళ విషాద జీవితాన్ని గడిపినవాడు కవి కేశవ సుత్.ఆయనకవితలలోనే ఆయన జీవితం తెలుసుకోవాలి .వార్షిక కవి సమ్మేళనాలు గురించి కేశవ ఒక మిత్రునికి ఉత్తరం రాస్తూ –‘’భావ సాదృశ్యం గలకవులు కలిసి కవితలు రాసి వినిపిస్తే బాగు౦టు౦దికానీ ,మందగాచేరితే రసాభాస అవుతుంది’’అని రాశాడు .మరో మిత్రుడికి ‘’ఒక శతాబ్దకాలం గా మరాఠీలో కావ్యం రాలేదు .మీ స్నేహితుడికి చిన్న చిన్నకవితలను వదిలి కావ్య రచనచేయమని చెప్పు.నేను వామనుడిని .త్రివిక్రముడు అయ్యే లక్షణాలు నాలో లేవు .అందుకే నామీద నాకే అసహ్యం .చిల్లర కవిత్వ కవులను అభినందించలేను ‘’అని రాశాడు .ఈ ఉత్తరాలన్నీ కేశవ ఇంగ్లీష్ లో రాసినవే .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-11-21-ఉయ్యూరు