మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-4
ప్రకృతి కవి కేశవ
కేశవ సుత్ కు ప్రకృతికి విషాద అనుబంధమేదో ఉంది .రమణీయ కొంకణ్ తీరాన్ని మాతృదేవి ఆరాధనతో తనివితీరా వర్ణించాడు కవితలలో .కాళిదాసు ఋతు సంహారాన్ని గుర్తు చేస్తూ ‘’పర్జన్యావ్రత్ ‘’దీర్ఘ కవిత రాశాడు .దివాళీ కవితలో శరత్ వర్ణన చేశాడు .పువ్వుల్ని సీతాకోక చిలకల్ని ప్రతీకలుగా వాడాడు .ప్రాచీన రుషిలాగా’’అరణ్యాలలో నిత్య యౌవనం లసిస్తుంది .మహోదాత్తత శాశ్వతంగా దొరుకుతుంది .దివ్యమైన సత్ ఎప్పుడూ పునరావృత్త మౌతుంది . దిగంతాల దూర తీరాలలో మనిషి స్వభావానుశీల రూపసౌన్దర్యం దర్శిస్తాడు ‘’అంటాడు .ప్రకృతిలో ఈ కవి ఉపశాంతి పొందాడు .’ఎన్నో సార్లు మనసు విరిగి –ఆశలుచచ్చిపోగా –వాటిని వెతుక్కుంటూ ఏకతార మీటుకొంటూ నిర్జ రారణ్యాలలోకి వెళ్ళాలి’’.అతనికి ప్రకృతికి ఉపదేశకునిగా ,సహచరుడుగా అనిపిస్తుంది కానీ క్రూరంగా మాత్రం కాదు .’’’సుడిగాలిలో గిరగిరా తిరుగుతూ సచ్చిదానందంలో లయం కావాలని ఉంది ‘’అన్నాడు .వాగులు గుట్టలదగ్గర జీవితా దర్శం కనిపించి రమింప జేస్తుందని అంటాడు .నదీ తీరం లో అద్భుత తత్త్వం మహోదాత్తత దర్శిస్తాడు మబ్బు తునక నుంచి గతం లో లీనమై పరవశిస్తాడు ..
సమకాలీన మరాఠీ కవులలో రెవరెండ్ తిలక్ ,కేశవ సుత పిల్లలకు ,పువ్వులకు చెందిన కవులు .బాలకవి ధోమ్రే ప్రకృతి ఒడిలో పాప . కేశవ తర్వాత కాల కవితలలో మనిషికి ప్రకృతికి మధ్య ఘర్షణ కనిపిస్తుంది .పువ్వు ధూళి అయినట్లు రవిబింబం –కరాళతరంగాలలో లయించి ‘’నట్లు కనిపించింది .దైవం పై విశ్వాసం ఉన్నవాడు కాదు కేశవ .కాని మిత్రుడు కిరాత్ తో ‘’ఎదో వింత మధురనాదం నాలో నాకు వినబడుతోంది ‘’అన్నాడు .ప్రకృతి పరమాత్మ అయితే ,అంతా ప్రేమ మయమే అయితే ప్రపంచం లో ఇంతదుఖం ఎందుకు ?అని ప్రశ్నించాడు .’’ఈ దృశ్యమానమైనది అంతా స్వప్నం లో స్వప్న దర్శనం ‘’అన్నాడు .
కేశవ ప్రేమ
‘’మరాఠీ ప్రణయ కవిత్వానికి కేశవ వైతాళికుడు ,.అతనికవితలలో ఆంగ్లకవితా చాయలున్నా ,కాళిదాస భవభూతుల కవితలలతో తనకవిత్వాన్ని అను సంధించాడు .మధ్యయుగ కవిత్వాలలో సామాజిక జీవిత స్ప్రుహలేదు .పవిత్రప్రేమ సహజ ప్రేమ ,ప్రేమ వివాహాల ప్రసక్తి కనిపించదు .వ్యక్తి స్వాతంత్ర్యం స్థాపింప బడ్డాక సామాజిక బంధాలు సడలి అలాంటి కవితా భావాలకు కేశవ సుత వాణి ఉషస్సూక్తం ‘’..అని అనిల్ దేశ పాండే (అనిల్ )వ్యాఖ్యానించాడు .సాంప్రదాయ పద్ధతికి భిన్నంగా భార్యా భర్తల ప్రణయాన్ని ‘’ప్రియే చే ధ్యాన్ ‘’కవితలో రాశాడు కేశవ .ప్రేయసి ప్రియులు ప్రణయ బంధం లో బంధింపబడినాం’’అంటాడు మరోకవితలో .ప్లెటానిక్ ప్రేమ ను అభిమానించాడు .’’ప్రేమను నిన్నూ తప్ప వేరే ఏదీ ఆలోచించను ‘’అన్నాడు ఇంకో కవితలో.బాడ్లియర్ కవితలాగా ఇతని ప్రణయ కవిత కాల్పనిక లోకం లో విహరిస్తుంది .కేశవది’’నవ్య మర్మ కవిత ‘’అని కితాబిచ్చాడు దేశపాండే . ‘’జీవితపు లోతులు పరిశీలించి ,జీవితానుభవాలను ప్రయోగాత్మకం గా పరిశోధించిన తాత్విక కవి ‘’అన్నాడు ఎస్.జె.భగత్ .ప్రేమలోని వివిధ అవస్తలు వర్ణించాడు.కేశవకు పూర్వం ఉన్న మరాఠీ కవిత ‘’లావణి’’ అనే శృంగార ప్రధానమైనది.కేశవ కవిత్వం లో ప్రణయం దివ్య ప్రణయం గా పరి వర్తనం చెందింది .దానిలోని ఇంద్రచాప వర్ణాలు సన్నని విషాద రేఖనుండి వెలువడ్డాయి .’’ప్రేమదివ్యం అలౌకికం .ప్రేమ బీజం హృదయం లో మొలకెత్తి పుష్పిస్తుంది .అది బజారులో దొరికేదికాదు .ఇంకోదాని బదులుగా దొరికేదికాదు ప్రేమ .ప్రేమ వలన ప్రేమ లభిస్తుంది ‘’అంటాడు .ఇది కబీర్ దోహా వంటిదే .అచ్చంగా మన కృష్ణ శాస్త్రిగారూ ఇలానే అన్నారు . ‘’ముండ్ల పొదలు నరికి .క్రూరమృగాలను చంపి ఆమెకోసం కోట నిర్మిస్తా .ఆమె సుఖం కోసం నా ప్రాణాలు ఇస్తా .వనలతలలలాగా ఒకరినొకరం అల్లుకుపోతాం .నరకాన్ని స్వర్గం గా మారుస్తాం ‘’అన్నాడు కవిత్వం లో .అతడిది ఆదర్శ ప్రేమ .జెన్ని లేహంట్ కవితా వస్తువు లన్నీ కేశవ కవితలో దొరుకుతాయి .
కేశవ ప్రణయకవిత కరుణామయం .చెదిరిన కలలసమాహారం .విరహ వేదన ఉన్నా ,ఎడ్గార్ అలన్ పో ఛాయలున్నా కవిత వేదనా భరితం .’’నన్ను దుఖం తో పొంగి పోరలనీ – అది నా విషాద హృదయం పై బరువు .నాగాయాలను కెలకక నన్ను వదిలి వెళ్ళు ‘’అంటాడు దేవులపల్లి లాగా ‘’ఏను అనంత శోక భీకర లోకైక తిమిరపతిని ‘’అన్నట్లుగా .13-11-1893న రాసిన కవిత లో షాజహాన్ నిర్మించిన మయూర సింహాసనం ,తాజమహల్ ల గురించి చెబుతూ ‘’మయూరాసనం ఖర్చు ఆరుకోట్లు .రాజులు దానిముందు నిలబడి చేతులు జోడించి ,తమతలలు ఆయన గుప్పిటలో ఉన్నట్లు గిలగిల లాడేవారు .గంభీర యమునా తీరం లో ప్రియురాలికోసం మూడు కోట్లు ఖర్చు చేసి ‘’ప్రేమమందిరం’’ కట్టించాడు .దొంగలు సింహాసనం ఎత్తుకుపోతే ,ఆ తాజసుందరి జ్ఞాపకాలలో నిలిచి ఉంది .మనిషీ నీ పనుల పర్యవసానం ఇదే .స్వార్ధ ప్రకృతికి ఎంత ధూపం వేసినా పొగ ప్రపంచం నుంచి మాయమౌతుంది .ప్రేమకోసం చిన్న అగరు బత్తి వెలిగిస్తే దాని సువాసన విశ్వమంతా వ్యాపిస్తుంది ‘’.సుకుమార శైలితో ,సున్నిత కవిత్వం తో మరాఠీ ఆధునిక ఉత్తమ ప్రణయ కవిత్వాన్ని రాసిన యుగ కర్త కేశవ సుత్.
సమాజ వ్యవస్థ పై తిరుగుబాటు
‘’నవ సిపాయి ‘’,తుతారీ ,స్పూర్తి ‘’అనే మూడు కవితలు మించి రాయకపోయినా కేశవ ఆమరుడు అయి ఉండేవాడు ‘’అన్నది శ్రీమతి చారు శీల గుప్తే .ఈ మూడూ అంతకు పూర్వం లేని విప్లవభావ కవితలే .దురాచారాలను తూర్పారబట్టి మానవతా వాదానికి కేతనమైన కవితలే .ఇతడి దేశభక్తి కవితలన్నీ 1890కి ముందే రాసినవి .వీటిలో రాజకీయ ప్రసక్తి లేదు .గతాన్ని తవ్వి బుజాలు ఎగరేయకుండా వర్తమానంలోని అసమానతలు దృష్టికి తెచ్చాడు కేశవ .అతడు విప్లవవాదికాడు.’’ఉత్క్రాంత వాది’’.కాలం కంటే ముందు ఆలోచించిన వాడు .ప్రగతి పధగామి .నిర్దేశకుడు కాదు .సర్వమానవ సమానత్వం సౌభ్రాతృత్వం ,స్వాతంత్ర్యం కోరినవాడు కాని రాజకీయ వాది కాదు..
పిల్లల చిత్తాన్ని ఆకర్షించకుండా బెత్తాలతో భయపెట్టే క్రూర చండామార్క గురువులపై –‘’కటిక వాడి వృత్తిని ఎందుకు తీసుకోన్నావ్ ?పసివాడిని అంత రాక్షసంగా హింసించే హక్కు నీకెవరిచ్చారు “”అని గద్దించాడు ఒక కవిత లో .భారత దేశ పరిస్థితులను అవగాహన చేసుకొని ‘’ఏకా భారతీయాచే ఉద్గార్ –ఒక భారతీయుని మాట ‘’అనే కవితలో ‘’సూర్యుడు ఉదయించి చాలా పైకి ప్రాకినా-మా భాగ్య సూర్యుడు పైకి ప్రాకే దెప్పుడు ?క్షీణత కారు చీకటై కమ్మేసింది –పరతంత్రులమైనమాకు చూడటానికి కళ్లు వినటానికి చెవులు లేనే లేవు ‘’అన్నాడు ..ఈదాస్యం ఎప్పుడు తొలగుతుంది పంజరం నుంచి ఎప్పుడు బయటపడతాం-మా జాతికి పూర్వ వైభవం ఎప్పుడు ?”’అని బాధ పడ్డాడు .పాశ్చాత్య భావాలను నిరసిస్తూ’’ఏక్ ఖేడే’’కవితలో ‘’ఇవి చిన్న గుడిసేలే కానీ –సుందర సౌధాలు కావు –అక్కడ రోగాలు కాపురం ఉంటాయి –ఇక్కడ ఉండవు –రోగం సుకుమారమైనది –అది పరుపులపై పడుకొంటుంది –పూరి గుడిసెలో ముతక గొంగళిపై ఎలా పడుకొంటుంది ?-ఈ గుడిసెలలో మంచి కృషీ వళురు నివశిస్తారు ‘. కీర్తి అంటే ప్రజల తలలపై తురాయిగా చేరిన పక్షి ఈక –పక్షి తూటా దెబ్బతగిలి పడిపోతెనేగా , ఈక లభించేది ?’’అన్నాడు .గాంధీ గారి ‘’పల్లెలకు తరలండి ‘’నినాదానికి కేశవ కవిత మార్గ దర్శి .టాగూర్ కూడా ‘’మాతిర్ డాక్’’లో ఇదేభావం చెప్పాడు .’’నేను ఈ ప్రపంచ కోలాహాలాన్ని వదిలేసి ప్రశాంత పల్లెటూరికి వెడతాను ‘’అన్న హాలీ కవిత కూడా ఇలాంటిదే. దీనినే ‘’కాల్పనిక పలాయన వాదం ‘’అంటారు .’’ప్రతి పలాయనం ఒక పరి పూర్ణతే ‘’అన్నాడు ఆల్డస్ హక్స్లీ ‘’ఎండ్స్ అండ్ మీన్స్ ‘’లో .
స్త్రీ విద్యా ప్రోత్సాహం, బాల్య వివాహాల పై నిరసన ,విధవల కేశఖండనపై ఆక్షేపణా ,అస్పృశ్యతా నిరసన లను కేశవ తనకవితలలో సూటిగా ప్రస్తావించాడు.ఇతడు సృష్టించిన కార్మికుడు ‘’ఎర్ర కామ్రేడ్ ‘’కాదు .అప్పటికి ఇండియన్స్ కు కారల్ మార్క్స్ ఎవరో తెలీదు .అన్ని రంగాలలో దేశం అభివృద్ధి చెందాలనే కేశవ తపన ,ఆ కాంక్ష .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-11-21-ఉయ్యూరు