శ్లిష్ట పద ప్రయోగ హాస్యం
పదాలను శ్లేషించి విశేషార్ధం సృష్టించటం మనకావ్యాలలో పుష్కలం .శ్లిష్టపద ప్రయోగం వలన హాస్యం పుట్టించటం చాలా అరుదే .దీనినే ఇంగ్లీష్ లో ‘’పన్’’అంటారు .ఉదాహరణ –ఒకాయన చాలా అప్పులు చేసి చచ్చాడు .అప్పులవాళ్ళు వచ్చి తమకు రావల్సిన ఆస్తి వశం చేసుకొని అతని భార్య పిల్లలమీద కొంత దయ చూపి కొంత ఆస్తి వదిలేశారు .ఇంతలో ఆ చనిపోయిన ఆయన స్నేహితుడు వచ్చి ‘’మా వాడు చనిపోయాడు కనక బతికి పోయాడు .బతికి ఉంటె అన్యాయంగా చచ్చేవాడు ‘’అన్నాడు .ఇక్కడ చావటం బతకటం ఒకచోట ఒక అర్ధం లో మరో చోట వేరే అర్ధం లో వాడబడి హాస్యాన్ని చిందించిందని మునిమాణిక్యంమాస్టారు ఉవాచ .
హాస్య బ్రహ్మ’’ భకారా’’ అంటే భమిడి పాటి కామేశ్వరరావు గారు ఒకసారి ‘’మనకవులు బతికి ఉన్నన్నాళ్ళు చచ్చినట్లుండి,చచ్చాక బతకడం మొదలు పెడతారేమో ‘’అన్నారని మాస్టారన్నారు.పూర్వ కవుల సంభాషణలో ఎంత హాస్యం దొర్లిందో మనకు దాఖలాలు లేవన్నారు .ఆ సంపద గాలికి కొట్టుకు పోయిందనీ ,కాలం మింగేసింది ,చాటువులలో కొద్దిగా మిగిలింది అనీ బాధపడ్డారు మునిమాణిక్యం.శ్రీనాధుడు పల్నాడులో తిరుగుతూ నీటి ఇబ్బంది చూసి శివుడిని ప్రార్ధిస్తూ ‘’సిరిగలవానికి చెల్లును –తరుణుల పది యారు వేల దగ పెండ్లాడన్ –తిరిపెమున కిద్దరాండ్రా పరమేశా గంగ విడువు పార్వతి చాలున్ ‘’అని చెప్పిన చాటువు లోకం లో బాగా క్లిక్ అయింది .ఇక్కడ గంగ శబ్దం శ్లేషించబడి చమత్కారమై హాస్యంపుట్టింది .
సిడ్నీ స్మిత్ అనే ఆంగ్లేయుడు వీధిలో నడుస్తుంటే ఎదురెదురు ఇళ్ళల్లోని ఆడవాళ్ళు పోట్లాడుకోవటం ,ఇద్దరి మధ్య రోడ్డు ఉండటం చూసి ‘’It is impossible for those women to agree since they are arguing from different premises ‘’అన్నాడు ఇక్కడ ప్రిమిసేస్ అనే మాట శ్లేష పొంది౦ది .ఒక అర్ధం ఆవరణ అయితే మరో అర్ధం తర్క శాస్త్రం లో వాదనకు ప్రాతిపదిక అని అర్ధం అని మాస్టారు విశ్లేషించి చెప్పారు . ఇలాంటిదే తెలుగులో ఒక సంగతి ఉంది .ఒక పెద్దాయన అన్ని విషయాలు పకడ్బందీ గా చూసుకొని చనిపోయాడు .స్మశానానికి తీసుకు వెళ్ళటానికి శవ వాహకులు దొరకలేదు .అక్కడే ఉన్నాయన మిత్రుడు ‘’మా వాడు బతికి ఉన్నప్పుడూ నిర్వాహకుడే ,చనిపోయినా నిర్వాహకుడే అయ్యాడు ‘’అన్నాడు ఇందులో శబ్ద చమత్కారం ఉత్తమహాస్యం కాకపోయినా ,హాస్యపు పలుకు బడే అని పిస్తుంది .
శ్లిష్టా సీతారామ శాస్త్రి గారు గుంటూరు మిషన్ కాలేజిలో పని చేసేవారు .ఒక రోజు ప్రిన్సిపాల్ ఆయన్ను పిలిపించి ‘’మీకు ఎన్నేళ్ళు ‘’అని అడిగితె ‘’తిమ్మిదేళ్ళు’’అన్నారు అంటే 63 అని ఆయన అభిప్రాయం .శివ శంకర శాస్త్రి గారు ఒకసారి బందర్లో ఉన్న మునిమాణిక్యం గారింటికి వచ్చి దొడ్లో అరటి చెట్ల దగ్గర ఆడుకొంటున్న వారబ్బాయిని ‘’ఏం చేస్తున్నావురా ?’’అని అడిగితె ,వాడు ఆడుకొంటున్నాను అని చెబితే శాస్త్రిగారు ‘’రంభతో క్రీడిస్తున్నావురా ‘’అన్నారట రంభ అంటే అరటి చెట్టు అనే అర్ధంకూడా ఉంది .రంభ ,క్రీడించటం రెండు పదాలు శ్లేష పదాలు .
ఒకసారి రావూరు వెంకట సత్యనారాయణ రావు గారు ఎవరినో ‘’చంద్రమతి ,సుమతి ఉన్నారా ?’’అని అడిగితె ‘’ఆడవాలళ్ళా అండీ ‘’అని అడిగితె రావూరు ‘’ఆడవాళ్లకు కాక మగాళ్ళకు’’ మతి’’ఎక్కడు౦దయ్యా ?’’అన్నారు ఇదో రకం శ్లేష అన్నారు మాస్టారు .ఈ శాబ్దిక హాస్యం అత్యున్నత హాస్య౦ కిందకు రాదు అని కొందరు అంటారు .ఒక ఇంగ్లీష్ గ్రంధ కర్త ‘’It cannot be denied that an adroit play upon words rarely fails to make the reader smile .But punning pure and simple cannot reach a high standard of humour and should be indulged in with great discretion and very sparingly ‘’ అన్నాడని మునిమాణిక్యం మాస్టారు చెప్పారు.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-11-21-ఉయ్యూరు