మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-5(చివరి భాగం )
అనువాద కేశవ
కేశవ సుత్ రాసిన 132కవితలలో అనువాదకవితలు 25.వీటిలో నాలుగు మాత్రమె సంస్కృతం నుంచి మిగిలినవి ఆంగ్ల కవితలనుంచి అనువదించాడు .సంస్కృత కవితల్ని మక్కీకి మక్కీ అనువాదం చేశాడు .కాళిదాసు రఘు వంశం ఏడవ సర్గ లో 5నుంచి 12వ శ్లోకం వరకు అనువాదం చేసి తనకవిత్వానికి శ్రీకారం చుట్టాడు .భారవి కిరాతార్జునీయం మొదటి సర్గలో 26శ్లోకాలు అనువదించాడు .ఇది కొంత మెరుగుగా ఉంది .మరి రెండు సంస్కృత కవితలు అందులో ఒకటి హాస్య స్ఫోరకమైనదానినీ మరాఠీకరించాడు .
ఆంగ్ల కవితను వాదం లో విలియం డ్రమండ్ రాసిన –డత్ దెన్ ది వరల్డ్ గో దస్,ది లెసన్స్ ఆఫ్ నేచర్ కవితలు ,ఇబి బ్రౌనింగ్ రాసిన –వర్క్ ,షేక్స్పియర్ రాసిన –లవ్, సిన్స్ బ్రాస్ నార్ స్టోన్,పోస్ట్ మార్టెం కవితలు ,ధామస్ హుడ్-ది డెత్ బెడ్ ,అలాన్ పో-డ్రీం విదిన్ ఎ డ్రీం,ఎమర్సన్ –ది అపాలజీ ,స్కాట్ –కుపిడ్ అండ్ కాన్ పోస్పే ,జాన్ లిలే ,లేహంట్ రాసిన –రాన్డీన్ లను ఆంగ్లం నుంచి అనువాదం చేశాడు ,జర్మన్ కవి గోథె రాసిన –ఎ లిటిల్ రోజ్ఆన్ ది హీత్ ,విక్టర్ హ్యూగో కవితలు –ది బట్టర్ ఫ్లైస్ ఆజ్ వైట్ ఆజ్ స్నో ,నెపోలియన్ లిపెటిట్ లను వాటి ఆంగ్లమూలాలను అనుసరించి అనువదించాడు .ఇంగ్లీష్ కవితలను అనుసరించి లాంగ్ ఫెలో కవిత –దిఓల్డ్ క్లాక్ ఆన్ ది స్టేయిర్స్,అలాన్ పో –రావెన్ ,జాన్ డ్రై డెన్ కవిత –అలేగ్జా౦డర్స్ ఫీస్ట్ ఆర్ దిపవర్ ఆఫ్ మ్యూజిక్ లను ప్రతిభావంతంగా అనువదించాడు .అవన్నీ సర్వోత్తమాలు అన్నారు పట్వర్ధన్, జోగ్ వంటి విమర్శకులు .
కేశవ సానెట్
మరాఠీ కవిత్వం లో ‘’సానెట్ ‘’ను ప్రవేశ పెట్టిన ఘనతకేశవ సుత్ దే.మయూరాసన్ ,ఆణీతాజ్ మహల్ సానెట్ ను 13-11-1892లో రాశాడు .సానెట్ లో 14పంక్తులు ఉంటాయి కనుక మొదట్లో ‘’చతుర్దశ పది ‘’అన్నాడు .తర్వాత సానెట్ అనే పిలిచాడు. దుర్ముఖ్ లేలా కూడా సానెట్ వంటిదే .ఇందులో 16పాదాలు పెట్టాడు .మిల్టన్ ,షేక్స్ పియర్ పద్ధతినే కేశవ పాటించాడు .ఈ అనువాదాలతో ఆయన విశాల దృక్పధం ,ఉదారహృదయం తెలుస్తుంది ,ఈ సానెట్ లు తర్వాత మరాఠీ కవిత్వం లో అ౦తర్భాగం అయింది.తర్వాతకవులు సానెట్ ధోరణిలో వీరగాధలు ,లఘు కావ్యాలు రాశారు .ఈ శైలికి కేశవ్ మార్గదర్శి .
కొత్తదారులు
అక్షర గణాల కంటే మాత్రా గణాలపై మక్కువ చూపి ,నాలుగుపాదాల కవిత్వం కాక వాటి సంఖ్య నతిక్రమించి కవితలల్లాడు .హిందీ ‘’దోహా’’ ను మధ్యయుగ కవి మోరోపంత్ అనుసరించాడు .మళ్ళీ కేశవ్ దాకా ఎవరూ దాని జోలికి పోలేదు .మత వేదాన్తాలకు ఉపయోగించే ఛందస్సు ను వాస్తవికత ,సంఘ సంస్కరణ కు వాడాడు .లిరిక్ లో ఉండే మాత్రా సామ్యాన్ని కూడా వదిలేసి పాదాలను పల్లవిగా మాటిమాటికీ ఉపయోగించాడు .భావాన్ని బట్టి పాదాలను సాగదీశాడు కూడా .. అంత్యప్రాసలలో కొత్త ప్రయోగాలు చేశాడు . ‘’తుతూరీ అంటే బాకా ,ఘూ బడ్-అంటే గుడ్లగూబ కవితలలో మొదటి మూడు పాదాలకు ఒక అంత్య ప్రాస ,చివరి మూడు పదాలకు వేరొక అంత్యప్రాస వాడాడు .స్వర సంబంధ అంత్య ప్రాసలకూ ఇంగ్లీష్ కవుల్లాగా ప్రాదాన్యమిచ్చాడు .గుడ్డిగా ఎవర్నీ అనుకరించలేదు .’’శబ్ద ప్రయోగ కవి’’ అన్నాడు కేశవ్ ను పట్వర్ధన్ .శబ్దాశ్రయ కవిత అనువాదానికి లొంగదు .
విమర్శనాత్మక ధోరణి
హాస్యానికి విముఖుడు అయినా ఇతరుల హాస్యాన్ని ఆస్వాదించే సహృదయత ఉంది .’’లోకం మూర్ఖుల మయం –వారిని చూడకుండా ఉండాలంటే తలుపులు మూస్తే సరిపోదు –తాను ముఖం చూసుకొనే అద్దాన్ని పగల గొట్టాలి ‘’అన్నాడు అని బోల్యోకవితను అనువదిం చాడు .కేశవ కు ము౦దు దాకా సామాన్యుడు కవితా వస్తువు కాలేదు .అది అతనితోనే మొదలైంది .అతని కవితలో నిగూఢ జిజ్ఞాస ,అనంతత్వం పై అభిమానం కనిపిస్తాయి .దేవీ దేవతల గురించి ప్రత్యేకంగా రాయకపోయినా, ఆధ్యాత్మిక జిజ్ఞాస అతని కవిత్వం లో అంతర్వాహినిగా ఉంటుంది .’’నూతన మానవతా వాదాన్ని’’ ఆవిష్కరించాడు .కనుకనే అతనికవిత శ్రేష్టం విశ్వ జనీనం అయింది .
చుట్టూ క్రౌర్యం నిర్దాక్షిణ్యత ఉన్నా నిరాశ పడనికవి కేశవ.అతని సౌందర్య భావం స్థిరం, శాశ్వతం .ప్రేమతో మృత్యువును ,కరుణ తో క్రౌర్యాన్ని జయించ గలడు .కాళ్ళకింద పచ్చిక కప్పిన భూమిని ,నెత్తిమీద నీలాకాశాన్ని ప్రేమించటం తప్ప దేన్నీ కోరడు..’’ఛందశ్శిల్ప నూత్న ప్రయోగ కర్త’’ అతడే .మరాఠీ కవిత్వ శైలికి ,విషయం పట్ల చెలరేగిన విప్లవ భావాలకు అతడే’’ ఊట బుగ్గ ‘’అన్నది ప్రముఖ విశ్లేశషకురాలు కుసుమావతీ దేశ పాండే .
నవ సైనికుడు కేశవ
‘’నవ్యయుగ నవ సైనికుడిని నేను –నన్నెవరూ ఆపలేరు –ఏజాతికీ చెందిన వాడినీ కాను –విశ్వమంతా వ్యాపించిన పతితులలో నేనూ ఒకడిని –సర్వత్రానాసహోదరులే గృహ చిహ్నాలే –అందరూ నా వాళ్ళే –నేను వాళ్ళ వాడినే –విశ్వాన్ని దర్శించి ఆరాధించి నన్ను నేను ఆరాధించు కొంటాను –కాలం శాంతి సామ్రాజ్య స్థాపన కోరుతుంది-దానికి అవతరించిన ప్రవక్తను నేను –నవ సైనికుణ్ణి నేను ‘’అని గొప్ప కవిత రాశాడు బహుశా మన అనుభూతికవి తిలక్ కు ఈకవిత ప్రేరణగా నిలిచిందేమో నని పిస్తుంది .
‘’మేమంతా ఈశ్వరుని ప్రేమపాత్రులం –ఈ భూమిని మాకు ఆడుకోవటానికిచ్చాడు ‘’మరోకవిత –‘’నాకొక బాకా తెచ్చివ్వు –ప్రాణవాయువుతో ఊది ఆకాశాన్ని బద్దలు చేస్తా ‘’ మరోటి –‘’పాతని చావనీ –భవిష్యత్తు పిలుపు విను – సంఘ శక్తి పునాదుల్ని –పూర్వాచారం చీలికలు చేసిపగుళ్ళు రేపింది-నిస్వార్ధ ప్రేమతో దాన్ని నింపి నిర్మించాలి –వెనకాడ కండి –ధీరులు కష్టాల్లో ఉత్సాహం పొందుతారు –ధర్మం సుస్థిరం అన్న దాన్ని మూర్ఖులు విస్మరించారు .సమానత్వ పతాక ఎత్తండి ‘’అని గర్జించిన దేశభక్త వీరకవి కేశవ సుత్.
ఆధారం –మొదటిఎపి సోడ్ లోనే చెప్పినట్లు – ప్రభాకర్ మచ్వే మరాఠీ లో రాయగా ,శ్రీ ఎస్ .సదాశివ తెలుగులోకి అనువాదం చేస్తే ,కేంద్ర సాహిత్య అకాడెమి 1970 లో ముద్రించిన ‘’కేశవ సుత్..
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-11-21-ఉయ్యూరు