పరిచ్ఛేదక ప్రయోగ హాస్యం
ఇతరపదాల సా౦గ త్యంనుంచి విడదీస్తే ,వికృతి చెంది హాస్యం పుట్టటమే పరిచ్చేదక ప్రయోగ హాస్యం .చిగురు ఆకు కలిస్తే చిగురుటాకు .చిగురు తీసేస్తే టాకును ప్రత్యేకంగా తీసుకొంటే అది పరిచ్చేద శబ్దం అవుతుంది .’’కృపారసంబు పై జల్లెడు మోము వాడు ‘’లో జల్లెడు ను జల్లించి బయటికి తెస్తే మిగిలిన దానికి పూర్వం ఉన్న అర్ధం పోయి వేరే అర్ధం వస్తుంది .జల్లెడు మోము వాడు అంటే జల్లెడ వంటి ముఖం ఉన్న వాడు అనే అర్ధం వచ్చి హాస్యం పుడుతుంది అన్నారు మునిమాణిక్యం మాస్టారు .
తెలుగు పాఠం చెప్పమని హెడ్ మాస్టారు మునిమాణిక్యం గారిని ఆదేశించారు ఒకసారి ..తెలుగు పంతుళ్ళ క్లాసుల్లో కిష్కింధా కాండె అవుతోందని ఇంగ్లీష్ వచ్చినవాడు తెలుగు చెబితే గ్లామర్ కలుగుతుందని హెచ్ ఎం భావన . సిడ్దౌన్,డో౦టాక్ అని దబాయిస్తే నోరు మూసు కుంటారని ఆశ .తనకు తెలుగు లో పాండిత్యం లేకపోయినా ఎదో పెద్దాయన అడిగాడు కదా అని సరే అన్నారు మాస్టారు .కానీ తెలుగు పండితులకు ఎక్కడో కారం రాసినట్లు ఉండి ‘’సడేలే ఈయనేం చెబుతాడు ‘’అని గొణిగారు.ఆమాటకు అర్ధం చెప్పండి ,ఈ పదాన్ని విడదీయండి అని పిల్లల్ని ఎక్కేసి పంపేవారు .కొద్దికాలం అవగానే గురూ గారికి వ్యాకరణం రాదు అని ప్రచారం ఊపు అందుకొన్నది .ప్రతి తలక మాసిన వాడూ వచ్చి ప్రశ్న అడగటం ఈయన ఎదో చెప్పటం వాడు నవ్వు కొంటూ వెళ్ళటం అనే ప్రహసనం చాలా రోజులు జరిగింది .ఒక రోజు ఒక కొంటె గాడు ‘’మాస్టారూ !ల౦గూడి ‘’ అంటేఅర్ధమ్ ఏమిటండీ ?’’అని అడిగితె ఆమాట ఇది వరకు ఎన్నడూ విన్నట్లు లేక ఎక్కడిది అని అడిగితె ‘’వెంకయ్య వ్యాకరణం ‘’లోది అన్నాడు.ఇంతలో బెల్ కొట్టగా బతుకు జీవుడా అని బయట పడ్డారు .మర్నాడు కూడావాడు తగులుకొన్నాడు .ఆమాట ఎక్కడుందో తెచ్చిచూపించమన్నారు మునిమాణిక్యం .తెచ్చి చూపించగా అందులో –అ ఆ ఇఈ లంగూడి ‘’ అని ఉన్నదాన్ని చదివి నవ్వుకొని మాటను విడదీస్తే ఎలా కొంప ముంచు తుందో తెలిసింది .లతో కూడి లంగూడి అయి తికమక పెట్టింది అన్నారు మాస్టారు .
మరో సారి ఇంకో కుర్రాడు రావణుడి ఇంటి పేరేమిటి అని అడిగితె ఆకాలం లో ఇంటి పేర్లు లేవని చెబితే ‘’కాదు మాస్టారు ‘’గాదె’’ అండీ ‘’అన్నాడు .ఎక్కడుందో చూపించమంటే తీసుకురాగా చూస్తె ‘’గర్వించి చెడిపోయేగాదె రావణుడు ‘’అని ఉంది .సంధి తెలియక పోవటం వలన వచ్చిన చిక్కు ఇది అన్నారు మాస్టారు .’’అల్లుడా రమ్మని ఆదరంబున బిల్వ బంపుమామ ను బట్టి జ౦ప గలమే ‘’పద్యం లో ‘’బంపు మామ ‘’చాలాకాలం తెలుగు నేలపై షికారు చేసింది అన్నారు మాస్టారు .ఇతర శబ్దాలనుంచి విడదీస్తే వచ్చే విపరీతార్ధం వచ్చి హాస్యం పుడుతుంది .ఇదికూడా శబ్దాశ్రయ హాస్యం లో భాగమే అంటారు మునిమాణిక్యం .
శ్రీ మునిమాణిక్యం మాస్టారు గారికి కృతజ్ఞతలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-11-21-ఉయ్యూరు