హంసలదీవి శతకం
మధురకవి కాసుల పురుషోత్తమకవి హంసల దీవి శతకం రాయగా ,1925లో మచిలీ పట్నం బుట్టాయ పేటలోని నేషనల్ ప్రెస్ లో వేమూరి చిరంజీవావదానుల చేత ప్రకటితమైనది .వెల తెలుపలేదు .ఎలాంటి ఉపోద్ఘాతం , కవి పరిచయాదులు కూడా లేవు .సూటిగా శతకాన్ని ‘’’లలితా కృష్ణాబ్ది సంగమ స్థల విహార –పరమ కరుణా స్వభావ గోపాల దేవ’’మకుటం తో ప్రారంభించి ‘’శత సీస పద్యాల కాసులు రాల్చాడు ‘’కాసుల పురుషోత్తమకవి .మొదటిపద్యం –
‘’శ్రీ రుక్మిణీ మనస్సార సే౦దిర-సత్యభామా ముఖాబ్జాత మిత్ర –జాంబవతీ పటుస్థన శైల జీమూత –ఘన సుదా౦తాన యోవన మదేభ
లక్ష్మణా పరి రంభ లలిత పంజరకీర –భాద్రావలీతరంగ వనమరాళ-మిత్ర వి౦దా ధర మృదు పల్లవ పిత –రవి జాదృగుర్పల రాజబింబ
షోడశ సహస్రకామినీ స్తోమకామ –భావజ విలాస భావజ విలాస
హంసల దీవి వాస –లలిత కృష్ణాబ్ధి సంగమస్తల విహార –పరమకరుణా స్వభావ గోపాల దేవ’’ అని శ్రీకృష్ణుని అష్టభార్యల వర్ణన చేశాడు .
కాసులకవి వ్యాజస్తుతి గా కావ్యాలు రాశాడు .క్రీశ.1791లో కృష్ణాజిల్లా దేవరకోట అనే చల్లపల్లి సంస్థాన రాజు అంకినీడు రాజా ఆస్థానకవి .మోపిదేవి దగ్గర పెద ప్రోలు గ్రామవాసి . నేను మొట్టమొదట మోపిదేవి హైస్కూల్ లో సైన్స్ మాస్టర్ గా చేరినప్పుడు ఈ పేద ప్రోలులోనే కాపురం పెట్టి రోజూ మోపిదేవి వెళ్లి ఉద్యోగం చేసి వచ్చేవాడిని .పుల్లమ రాజు అనే పేరు కూడా ఈకవికి ఉంది ఈయన రచనలు అర్ధాంతర న్యాస అలంకారాలతో ఉంటూ రచనలకు వన్నె తెచ్చాయి.
వీరు జన్మించిన పెదప్రోలు గ్రామంలో, వీరి విగ్రహాన్ని, 2012, ఏప్రిల్-29నాడు ఆవిష్కరించారు. ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం గ్రామములో వేంచేసియున్న శ్రీ ఆంధ్రమహావిష్ణువు ఆలయం ప్రాంగణంలో, శ్రీ కాసులపురుషోత్తమ కవి విగ్రహాన్ని, 2016, ఫిబ్రవరి-11వ తేదీనాడు ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని శ్రీ కాసుల పురుషోత్తమ కవి వంశీకులైన శ్రీ జాడల్రిజా సాగర్ రాజు, శ్రీ కాసుల కృష్ణంరాజు, శ్రీ కాసుల శ్రీధరరాజు ఏర్పాటు చేసారు.
రచనలు
విజయనగర సామ్రాజ్య ప్రాభవంలో వెలిగిన ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం, తరువాత సరైన పాలన లేక నిర్లక్ష్యానికి గురి అయ్యిందిట. అప్పుడు కాసుల పురుషోత్తమ కవి ఈ స్వామి పై నిందాస్తుతిగా ఆంధ్ర నాయక శతకాన్ని రచించాడుట. ఇది విని అప్పట్లోని జమీందారు ఈ ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించాడని చెప్పుకుంటారు.
ఆంధ్రనాయక శతకం:- ఈ శతకం సీస పద్యాలతో రచించ బడింది. అద్భుతమైన ధార, ఆకట్టుకునే శైలి ఈ కవి సొత్తు. మీరు ఈ శతకాన్ని ఇక్కడ చదివి ఆనందిచవచ్చు. శ్రీకాకుళం గ్రామములోని శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ శ్రీకాకుళేశ్వరస్వామివారిని కీర్తించుచూ రచించిన ఆంధ్రనాయకశతకం లోని 108 పద్యాలను, ఆ ఆలయప్రాంగణంలో రాతి శాసనాలరూపంలో భద్రపరచారు. ఈ పద్యాలను వారి వారసులు శ్రీ కాసుల కృష్ణంరాజు, రాజశ్రీధర్ లు, ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయకులు గాయకులు శ్రీ శ్రీకృష్ణచే ఆలపింపజేసి, సీ.డీ.రూపంలో నిక్షిప్తం చేసారు. ఈ సీ.డీ.లను 2016, ఫిబ్రవరి-4వ తేదీనాడు ఆలయంలో ఆవిష్కరించారు.
హంసల దీవి శతకాన్ని ఇది హంసలదీవిలోని అధిషాసనదైవమైన గోపాలదేవునిపై ఆంధ్రనాయక శతకకర్త శ్రీ కాసుల పురుషోత్తమకవిచే కూర్చబడినది. శ్రీ కాసుల పురుషోత్తమ కవి తలిదండ్రులు రమణమాంబ, అప్పలరాజులు, కాశ్యపగోత్రజుడు. విద్యాగురువు శ్రీమాన్ అద్దంకి తిరుమలాచార్యులవారు.
ఈ హంసలదీవి గోపాల శతకం, కవిగారు రచించిన నాలుగు శతకాల్లో మూడవది. మొదటి రెండూ, మానసబోధ శతకం,రామా! భక్తకల్పక ద్రామా అన్న మకుటం గల శతకాలు అలభ్యాలు. కవి ఈ శతకంలో భక్తిమీర భాగవతం లోని గాధలను తనివితీరా గానం చేశారు. ఆ చేసిన తీరులో భగవంతునితో ఆయనకు గల సన్నిహితత్వం ఎలాంటిదో అవగతమవుతుంది. పద్యం నడిపించిన తీరు అత్యద్భుతం. కాగా ఆయనకు గల శబ్ధాధికారం నన్నయకు సాటి వచ్చేది. అంత్యానుప్రాస, ముక్తపదగ్రస్తాలు ఈయనకు ఒదిగినట్లు మరొకరికి ఒదుగలేదంటే అతిశయోక్తి కాదు. ఇక భాషాపటుత్వ విషయం చెప్పనే అక్కరలేదు. శతకమంటూ చదవటం ప్రారంభిస్తే, పూర్తి చేసే దాక వదలిపెట్టలేము. భక్తులు, విద్యార్థులూ, పఠించి లాభపుదురుగాక అని ఆశిస్తూ…
- ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు
ఒకవేళ చీకటింటికి దీప మిడినట్లు
తేటగా సర్వంబు దెలిసియుండు
నొకవేళ నీహార మెనసిన పద్మంబు
గతి బోల్పదగి మందమతిగనుండు
నొకవేళ ద్విరదమూరక త్రొక్కిన కొలంకు
పగిది నెంతయుఁ గల్కబారియుండు
నొకవేళ క్రొత్తవీటికి మీను బ్రాకిన
కరణి మహాశలఁ దిరుగుచుండు
గాని నిశ్చలపడదు నామానసంబు
భావజవిలాస! హంసల దీవివాస!
లలిత కృష్ణాబ్ది సంగమస్థల విహార!
పరమ కరుణాస్వభావ! గోపాలదేవ!
భావం – స్వామీ నామనస్సు ఏనాడు నిశ్చలంగా ఉండదయ్యా
ఒకసారి చీకటింట్లో దీపం పెట్టినట్టుగా, అంతా సుస్పష్ట
మౌతుంది. ఒక సమయంలో మంచుతో కూడిన పద్మంలా
మందమతిగా ఉంటుంది. ఒక్కోసారి ఏనుగు త్రొక్కిన
సరస్సులా కలుషితమైపోతుంది. ఒక్కొక్కొప్పుడు క్రొత్తనీటికి
ఎదురు ప్రాకే చేపలా గొప్ప ఆశలతో తిరుగుతూ ఉంటుంది.
మన్మథాకారా కృష్ణా సముద్ర సంగమ స్థలమైన హంసలదీవిలో
విహరించువాడా దయాస్వభావా గోపాలదేవా – అని భావం
ఈ శతకంలో మకుటం మూడుపాదాలు గమనించగలరు.
అచ్యుతవరలబ్ధకవితా విదగ్ధుడు — ఆంధ్రనాయకశతక కర్త శ్రీ కాసుల పురుషోత్తమకవివరుడు.
ఈ శారదాతనయుడు ఆంధ్రశతక సారస్వతచరిత్రలోనే శాశ్వత నిరుపమ స్థానాన్ని సంపాదించుకున్న అకళంక, అపూర్వ పుణ్యమయ గ్రంథరచయిత. వీరి రచనలగురించి విశ్వనాథ సత్యనారాయణగారు “సాహిత్య సురభి” అనే తమ గ్రంథంలో ఇలా అన్నారు:
“– – -కాసుల పురుషోత్తమకవి- – -శతకములు మాత్రమే వ్రాసెను. అతని కవిత్వము కావ్యదోషము లెరుంగనిది“.
మరొక సందర్భంలో ఒక సభలో మాట్లాడుతూ విశ్వనాథవారే ప్రస్తావవశంగా ఇలాగ అన్నారట:
“తెలుగులో భాగవతాన్ని పోతనగారు రచించి ఉండకపోతే, పురుషోత్తమకవి తప్పక వ్రాసివుండేవాడు“.
అంటే పురుషోత్తమకవి పోతనగారి స్థాయికిచెందిన సహజకవి,పండితుడు, మహాభక్తుడు అన్నమాట.కృష్ణా జిల్లాలోని దివిసీమకిచెందిన పెదప్రోలు పురుషోత్తమకవిగారి స్వస్థలము. అప్పలరాజు-రమణమ్మ దంపతుల కుమారుడు పురుషోత్తమకవి. చిన్నతనంలో వారి పేరు ‘పుల్లంరాజు’ట! కాని పురుషోత్తమ నామధేయమే ఆయనకి స్థిరపడింది. వారు “వంది”(తెలుగులో భట్రాజులు) కులానికి చెందినవారు. “వందంతే ఇతి వందినః” అంటే స్తోత్రముచేసేవారని అర్థం! “వది” ధాతువు-root-నుంచి ‘వంది’ అనేమాట వచ్చింది. ఈ ధాతువుకి “అభివాదనమూ,స్తుతి చేయుట” అని అర్థం. ఈ వందిపరంపర గురించి కాళిదాసమహాకవి తన రఘు వంశ మహాకావ్యం(IV—6.) లో ఇలాగ తెలియచేసేరు:
“పరికల్పిత సాన్నిధ్యా
కాలే కాలే చ వందిషు |
స్తుత్యం స్తుతిభిః అర్థ్యాభిః
ఉపతస్థే సరస్వతీ” ||
“ఆయా సందర్భానుసారంగా సరస్వతీ దేవి వందిలకి సన్నిహితంగావుంటూ, వారు స్తోత్రంచెయ్యవలసిన విషయానికి అనుగుణమైన అర్థ-శబ్దాలని వారియందు కలిగింప చేస్తూంటుంది”.
దీనివలన మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే వంది-మాగధులు ప్రత్యేక వాగ్ధేవతానుగ్రహం-అంటే పలుకులవెలది ప్రసన్నతని సహజంగానే కలిగివుంటారన్నమాట.
కాసుల పురుషోత్తమకవిగారు ఈ దివ్యానుగ్రహాన్ని తన ఇష్టదైవమైన పురుషోత్తముడికి సంపూర్ణంగా సమర్పించుకున్నారు. ఈ దివ్యానుగ్రహంతో వారు నాలుగు శతకాలు రచించేరు:
కవిత్వం లో కాసులను ఏరుకొందాం –‘’కుబ్జగంధమొసంగి కొమరు ప్రాయంబున –శాతకుమ్భ శలాక రీతిగా ‘’ఉందట .మాలికుడు మాలికలు అర్పిస్తే మౌనులు గగన నిర్మలత పొందారట .రీజకుడు శుభ్రవస్త్రాలిస్తే ఇహ పర సౌఖ్య లబ్దిపొందాడు .విదురుడు ఇష్టాన్న భోజనం పెట్టి పరమ భాగవతోత్తముడు అయ్యాడు .గురుపుత్రుని బ్రతికించి కుచేలునికి కలుములిచ్ఛి ,అర్జున సారధ్యం చేసి గెలిపించి ఉత్తర గర్భాన్ని కాపాడటమే సాక్షి ఆయన కృప అనంతం .
‘’గతి నీవే సుమ్ము ,నీవతి వేగరమ్ము నా మతి బాదుకొమ్ము –కామితములిమ్ము – కృపాశాలి వన్న –నేనపచారి నన్న –నింత పరాకు నీకున్న నేపమురన్న ‘’అంటాడు ఆర్తిగా .’’ఏ తండ్రి నిర్మించే భూతక పంచ క గునోపెతావయవ సర్వ చేతంబు /
?ఏ సద్గురుడు దెల్పెహితవుగా సుజ్ఞాన మెలమి గర్భస్థ జీవులనెల్ల’’ఏస్వామి రక్షించాడు అని స్తుతించాడు .నిద్రలో కూడా స్వామి దర్శనమే కోరాడు .వరదివాకర నిశాకరులు నీ నేత్రాలు పరమేష్టి నీ నాభి పద్మ సంభవుడు ,కమలజాండాలు నీ చేతి బంతులు ,నిఖిల తరంగిణులు నీ సపాదకములు ‘’అని వర్ణిస్తాడు .
‘’అత్యున్నతా కారి వయ్యు బలీంద్రుని యాచించు చొ గుజ్జువైతి వీవు –సద్గుణ శాలివైనా సత్రాజిత్తుని శమంతకమణి ఇమ్మని దేబిరించావు .అఖిల పూజార్హుడవైనా బాపనయ్యలని అన్నం అడిగావు ,అసహాయ శూరుడవైనా పారిజాతం పీక్కొని పరుగోపరుగు లంకిన్చావు –ఘనులకు యాచన లాఘవమే అనిపించావు అని వ్యాజస్తుతి చేశాడు .అక్రూర విదుర భీష్మ అమ్బరీషుల పై చూపిన దయారసం తనపైనాచిలకమన్నాడు .శబరీ నహల్య పాంచాలి ఉత్తర లను బ్రోచినట్లు ధృవ,విభీషణ గుహులపై చూపినకూర్మి చూపమన్నాడు –‘’నమ్మినాడను పోషించ న్యాయమయ్య’’అని భారం ఆయనమీదే వేశాడు .’’భువనముల్ గన్న తండ్రివి నిజంబుగా నీడ –నీ బిడ్డ నని నే గణియిమ్పవలేనే ‘’అని లోక రక్షా జాగరూకుడవైన నువ్వు నాపై పరాకు ఎందుకు చూపిస్తున్నావు ,సకలాన్తరాత్మ స్వామివి. నా మనో వ్యధ నేనే చెప్పాలా ?’’అని ప్రశ్నించి ‘’ఎద్ది భవదిచ్చ నా రీతి నేలుమయ్య ‘’అని ఆయనకే వదిలేశాడు
సముద్ర తరంగాలు లెక్కపెట్టవచ్చుకానీ నీ చరిత్రలు వర్ణించలేము –గంగానది నీటి ని గణించ వచ్చుకానీ ,నీ గుణాలు వర్ణించలేము –వర్ష దారలు లెక్కపెట్టవచ్చుకానీ నీ లీలలు వర్ణించలేము ,ఆకాశంలో చుక్కలు లెక్కవేయవచ్చుకానీ ,నీ వినోదాలు వర్ణించలేము –‘’తరము గాదైన తోచినంతయే నుతించాను ‘’అని వినయంగా చెప్పుకొన్నాడు .’’జగతి జీవుడు పునర్జన్మ దుఃఖము బాయు –భద్రమౌ శాశ్వత పదము దొరకు –దాసులకు నీదు నామ కీర్తనల వలన ‘’అని అభయమిచ్చాడు అందరికి పురుషోత్తమ మహాకవి .
నీ కథా కావ్యం నిర్మించి బమ్మెర పోతన ,నీకు అర్పణ గా అన్నదానం చేసి కోట సింగన ,అర్ధు లపాలిటి కల్పవృక్షం భాస్కరుడు ,నీకు కోవెలకట్టి కృత్తి వెంటి వెంకటాచలం లు మృతి చెందినా కీర్తి స్థిరులయ్యారు అని అలాతరించినవారిని మనకు జ్ఞాపకం చేశాడు .తాను కాశ్యప గోత్రుడనని ,కాసుల వంశం లో అప్పలరాజు ,రమణా౦బ లకు పుత్రుడననీ ,అద్దంకి తిరుమలాచార్య తనగురువనీ ,’’భవ తీర్ధ మరందపాన ద్విరేఫా య మాన మానసు డను,-మాన్యహితుడ –పురుషోత్తమాఖ్యు౦డ-పూల్దండ వలె నీకు శతకంబు గూర్చితి శాశ్వతముగ-చిత్త గింపుము నీ పాద సేవకుడను –భావజ విలాస హంసల దీవి వాస –లలిత కృష్ణాబ్ధిసంగమ స్థల విహార –పరమ కరుణాస్వభావ గోపాల దేవ’’అని నూరవ పద్యంతో హంసల దీవి శతకం ముగించాడు కాసుల పురుషోత్తమ కవి .
శతకమంతా ఉదాహరి౦పదగిన పద్యాలే. ఆయన భావుకతకు పరమ భక్తి తాత్పర్యాలకు వర్ణనా వైదుష్యానికి ,ఔచిత్య ప్రకర్షకు ,ఆర్తికి అద్భుత శయ్యా సౌభాగ్యానికీ ,కృష్ణాప్రవాహ సదృశ పద్య ఝరి కి అబ్బురపడతాం .ఆశ్చర్యా౦బు ధిలో మునిగి తేలుతాం .హంసల దీవి కృష్ణా సంగమ పవిత్ర స్నానం చేసినంత అనుభూతి పొందుతాం . కవీ, మనమూ ధన్యులం . ఇప్పుడు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ చరిత్ర తెలుసుకొందాం –
శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఒక పవిత్ర పుణ్య స్థలం. పూర్వం దేవతలు ఈ గుడిని నిర్మించారు అని ఇక్కడి ప్రజల నమ్మకము.ఈ ఆలయానికి గాలిగోపురం ఉండదు. ఇక్కడ మాఘ పౌర్ణమి నాడు ప్రత్యేకమైన పూజలుమహోత్సవాలు, అన్నదానం జరుగుతాయి. ఈ ఆలయంలోని శ్రీ వేణుగోపాలస్వామి పిలిస్తే పలుకుతాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ ప్రాంతంలో బయటపడిన శ్రీ కృష్ణుడి విగ్రహం అనుకోని కారణంగా దెబ్బతినడంతో, దానిని ప్రతిష్ఠించే విషయమై ప్రజలు ఆలోచనలో పడ్డారు. అప్పుడు వారిలో ఒకరికి స్వామి కలలో కనిపించి చెప్పిన ప్రకారం కాకరపర్రు వెళ్ళి ఓ గృహస్థుని ఇంట్లో కాకరపాదు కింద భూమిలో వున్న స్వామివారి విగ్రహాన్ని వెలికితీశారు. ఈ కారణంగానే ఆ ఊరికి కూడా కాకర పర్తి అనే పేరు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఇక్కడ బయటపడిన శ్రీ వేణుగోపాల స్వామిని హంసలదీవికి తెచ్చి ప్రతిష్ఠించారు. అయితే ప్రపంచంలో ఎక్కడా కనిపించని విధంగా ఈ విగ్రహం నీలమేఘ ఛాయలో ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.
ఈ దేవాలయం, విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివారి దేవాలయానికి దత్తత దేవాలయంగా ఉంది.
ప్రత్యేక పూజలు.
ఈ ఆలయంలో వేణుగోపాలస్వామి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేతుడై పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇక్కడి దేవాలయ కుడ్యాలపై రామాయణ ఘట్టాలు అందంగా చెక్కబడి ఉన్నాయి. తూర్పు చాళుక్యుల శిల్పకళా వైభవానికి అద్దం పడుతుంటాయి. ప్రతి యేడు మాఘ శుద్ధ నవమి నుంచి బహుళ పాడ్యమి వరకూ స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా వేలసంఖ్యలో వచ్చిన ప్రజలు స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తరువాత అక్కడికి దగ్గరలో ఉన్న సాగరంలో కృష్ణానది (తుంగ – భద్ర నదులను తనలో కలుపుకున్న కృష్ణవేణి ఇక్కడే సముద్రంలో కలుస్తుంది) క్షేత్రంలో స్నానం చేసి తరిస్తుంటారు.
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, మాఘ పౌర్ణమికి వైభవంగా నిర్వహించెదరు. మాఘ శుద్ధ త్రయోదశినాడు ఉదయం స్వామివారిని శాస్త్రోక్తంగా పెళ్ళికుమారునిచేసి ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. చతుర్దశినాడు ఉదయం శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారికి కుంకుమపూజను రాత్రికి స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. పౌర్ణమినాడు రథోత్సవం మరుసటిరోజున చక్రస్నానం (వసంతోత్సవం) మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు.
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-11-21-ఉయ్యూరు