18-పారిభాషిక పదప్రయోగ హాస్యం
కొన్ని పారిభాషిక పదాలు ఆ శాస్త్రంలోనే రాణిస్తాయి వాటిని తెచ్చి మామూలు మాటలలో పొదిగితే ఒక రకమైన చమత్కారం కలిగి నవ్వు పుట్టటమే పారిభాషిక పద ప్రయోగ హాస్యం .ఉదాహరణ –‘’వితంతులకు శిరో ము౦డనం స్మార్తులలో నిత్యం ,అద్వైతులలొ వైకల్పికం .,విశిష్టాద్వైతులలో ముండనము లేదు’’అన్నారట స్వామి శివశంకరస్వామి అని మునిమాణిక్యం ఉవాచ .ఇంకోఆయన ‘’ధూళి పాళ వారు విశ్వనాథ కు తత్సమం అన్నాడట .మాస్టారి ఇంట్లో వరసకు బావమరది అయిన ఒక కుర్రాడున్నాడు .ఎవరో ‘’ఎవరా అబ్బాయి ?’’అని అడిగితె జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి ‘’ఔప విభక్తికం ‘’అన్నారట .విశాఖ జిల్లావారు అన్నాన్ని ‘వణ్ణ౦ ‘’అంటారు ఎందుకు అలా అంటారని అడిగితె ఒక శర్మగారు అది ‘’యణా దేశ సంధి ‘’అన్నాడట .
ఒకాయనకు భార్యమాట ‘’మహావాక్యం ‘’అహం బ్రహ్మాస్మి లాగా అన్నాడట ఒకాయన ..ఒక ఇంటాయన పెళ్ళాన్ని ‘’ఇవాళ ఏమిటీ’’ సత్పదార్ధం ‘’అని అడిగాడట .అంటే వండిన వాటిలో బాగా రుచిగా ఉన్నదిఏది అని ఆయన భాష్యం.రావూరు వారిని మాస్టారు ‘’కూటస్థుడు’’అంటే ఏమిటి ?అని అడిగితె ‘’భార్య ఏమన్నా ,ఎంత ని౦దించినా,పట్టించుకోకుండా ,వికారం పొందకుండా ఉండే సద్గ్రుహస్తు’’అన్నారట .ఇదంతా వేదాన్తపారిభాషిక హాస్యం .
ఒక భార్యాభర్తలు పోట్లాడుకొని కొంతకాలం మాట్లాడుకోకపోతే ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు?అని రావూరు ను అడిగితె ‘’ఇద్దరికీ రాజీ కుదిర్చే ఏర్పాటు జరుగుతోంది .’’నిర్వహణ సంధి’’ జరగచ్చు .కాకపొతే’’ ముఖ సంధి’’లో ఆ పోట్లాట అంతం కావచ్చు .చివరకు’’ గర్భ సంధి’’ లో వ్యవహారం పర్యవసానం చెందుతుంది ‘’అన్నారని మునిమాణిక్యం గారువాచ .కానీ ఏమీ బోధపడక వివరించమని కోరితే ‘’మధ్యవర్తులు ఇరువైపులా చెప్పిచూశారు పోట్లాట ఆగిపోతే నిర్వహణ సంధి అలా కుదరకపోతే భర్తే కాస్త తగ్గి భార్య దగ్గరకు వెళ్లి ముఖం మీద ముఖం పెట్టి చెవిలో మంచి మాటలు రహస్యంగా చెప్పి ,వీలయితే ముద్దుపెట్టి రాజీ చేసుకొంటే అది ముఖ సంధి .కొంతకాలానికి వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తే ఆమెకు గర్భం వస్తే వివాదం సమసిపోతే గర్భ సంధి అ౦టారనిచెబితే పగలబడి నవ్వారట మాస్టారు.ఇదంతా ఆలంకారిక పారిభాషిక ప్ర’యోగం .
మాస్టారు తన స్నేహితుడిని ‘’అధ్యవసాయం ‘’అంటే ఏమిటిఅని అడిగితె ‘’ఒకరకమైన వ్యవసాయాన్ని అధ్యవసాయం అంటారు’’అన్నాడట .వ్యభిచారీ భావం అంటే ఏమిటి అని అడిగితె ‘’అది అంత మంచి భావం .కాదు అదొక క్షుద్రభావం ‘’అన్నాడట అంటే అతడికి ఆలంకారిక పరిభాష అర్ధమే తెలీదన్నమాట అన్నారు మునిమాణిక్యం సార్.
ధ్వని లో హాస్యం –ఒక వాక్యానికి అందరికీ తెలిసిన అర్ధం ఒకటి ఉంటె ,సహృదయులకు మాత్రమె స్ఫురించే అర్ధమే ధ్వని .మాస్టారి ఫ్రెండ్ కొత్త అర్ధం చెప్పాడట –‘’వాడు ధ్వనించాడు ‘’అంటే బాగా చప్పుడు చేశాడు అని అర్ధం ట.కనుక ధ్వని అంటే చప్పుడు చేయటం అని వాక్రుచ్చాడట .అలాంటప్పుడు నవ్వక చస్తామా ?ఒకరింటికి వెడితే అక్కడిపిల్లలు కొట్టుకొంటూ చెంబూ తప్పాలా గిరాటేస్తూ కన్పిస్తే ‘’ఏమిటి ఈ మోత ?’’అని మాస్టారు అడిగితె ‘’వస్తుధ్వని ‘’అంటే వస్తువులు చేసే ధ్వని అని ఆయన భావనట.మనకూ నవ్వు రావాలి తప్పకుండా .ఒక ఇంట్లో పిల్లల్ని తల్లి పిచ్చ పీకుడు పీకితే వాళ్ళు లబోదిబో మని ఏడుస్తుంటే ‘’ఇదేం ధ్వని బాబూ ‘’అని అడిగితె ‘’రసధ్వని ‘’అని ముసిముసి నవ్వులు నవ్వాడట .అంటే కరుణ రౌద్రరసాలు ఆధ్వనిలో అభి వ్యక్తమయ్యాయని టీకా చెప్పాడట .ఇలా పారిభాషిక పదాలకు వింత అర్ధ స్ఫూర్తి కల్పించి వాడితే హాస్యం ఉత్పన్నం అవుతుందని మునిమాణిక్యం గారన్నారు .ఇలాంటి పారిభాషిక పదప్రయోగాన్ని అలంకార శాస్త్రం లో ‘’అప్రతీక పద ప్రయోగం ‘’అంటారని మునిమాణిక్యంగారువాచ .
శ్రీ మునిమాణిక్యం మాస్టారు గారికి కృతజ్ఞతలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-11-21-ఉయ్యూరు