మాకు సిరివెన్నెల పంచి ,నువ్వు కటిక చీకటి కప్పుకొని వెళ్ళిపోయావా సీతారాముడూ!
హాట్రిక్ గా మూడు, మొత్తం 11 నందులను కైవశం చేసుకొని ,ఆనందికే ప్రభువైన వాడిని ‘’ఆది భిక్షువు వాడి నేది కోరేదీ ?బూడిదిచ్చే వాడి నేది అడిగేది ?”’’’అని ప్రశ్నించి , ‘’విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం…ఓం.మ్మ్..’’అని ప్రణవానికి నిర్వచన ప్రవచనం చేసి ,ప్రాణనాడులకు స్పందన కలిగించి ,యద కనుమలలో ప్రతిధ్వనించే ‘’ఆ విరించి విపంచి గానాన్ని ఆవిష్కరించి తొలి చిత్రంతో నే మనకొక మహా కవి మళ్ళీ ఆత్రేయ ,వేటూరి తర్వాత పుట్టి ఆధునిక సినీ కవిత్రయాన్ని స్థాపించాడని ముచ్చట పడ్డాం .తెలుగు సినీ లిరిక్కులకు సిరివెన్నెలై ,దాదాపు 35ఏళ్ళు సినీ వినీలాకాశాన్ని ఏలినవాడు’’ చెంబోలు సీతారామ శాస్త్రి ‘’,కాకినాడ వాసి .ఆ నీళ్ళలోనే అన్నీ ఉన్నాయి దాన్ని సార్ధకం చేశాడు .సంగీతం సామం నుంచి పుట్టిందని మనకు తెలిసినా ‘’ సరస స్వర సుర ఝరీగమనమౌ సామ వేద సార మిది’’అని సంగీతం తో చెప్పిన ఘనుడు .విశ్వ కావ్యానికి భాష్యంగా ‘’ ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రులపైనా..
జాగృత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన… ‘’
పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము ‘’అయి౦దన్నాడు మనోహరంగా .పుట్టగానే ప్రతి శిశువు పలికే జీవన నాదతరంగం ట.’’ చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం…
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా..
సాగిన సృష్టి విలాసము’’గా అపూర్వంగా ధ్వని౦పజేశాడు ‘’అంతే కాదు శాస్త్రి ‘’నా ఉచ్చ్వాసం కవనం ,నా నిశ్వాసం గానం ‘’అని చిరునామా కూడా తెలియజేసి మహా కవుల కోవలోకి చేరాడు .’’తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది?’’ కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది?’’బండరాళ్లకు చిరాయువిచ్చితేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది?ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు ‘’అని వ్యాజస్తుతి సినిమాలో చేసి సేబాష్ అనిపించాడు సీతారాముడు .ఆవూరివారంతా తనవారు అని ‘’ ననుగన్న నా వాళ్ళు… ఆ… ఆ… నా కళ్ళ లోగిళ్ళు’’అనీ ,ఎన్నాళ్ళో గడిచి ఇప్పుడు కలిశాక ‘’ ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాక “”అని తాను పుట్టి పెరిగిన ఊరును ,తనవవాళ్ళ గొప్ప నాష్టాల్జియా తో అభివర్ణించాడు .అతడి వేణుగానానికి పరవశించిన ఆ చిన్నది’’కన్నె మూగమనసు కన్న స్వర్గస్వప్నమై తళుకుమన్న తార చిలుకు కాంతి చినుకులై
గగనగళము నుండి అమర గానవాహిని “
జాలువారుతోంది ఇలా అమృతవర్షిణి ‘’అయిపోయి ఆ మురళిలో తన హృదయమే స్వరాలుగా మారిపోయింది ‘’అని మహా భావుకతతో చెప్పించాడు .ఆ దృశ్యాన్ని విశ్వనాథీ కడు మనోజ్ఞంగా చిత్రించి సాఫల్యం చేకూర్చాడు .అలాగే ప్రకృతికా౦తకు ఎన్నెన్ని హొయలు వగలు సోయగలు ఉన్నాయో చెప్పాడు మరోపాటలో ‘’ సిరివెన్నెల నిండిన ఎదపై
సిరిమువ్వల సవ్వడి నీవై
నర్తించగరావేళా… నిను నే కీర్తించే వేళా’’అని పరవశించిపాడాడు ఆమెనూ పిలిచి పొంగిపోమ్మన్నాడు.’’ అలల పెదవులతో శిలల చెక్కిలిపై
కడలి ముద్దిడు వేళా పుడమి హృదయంలో
ఉప్పొంగి సాగింది అనురాగమూ
ఉప్పెనగ దూకింది ఈ రాగమూ’’అని అనురాగ రాగాల మేళవింపు కూర్చాడు .ఈపాట చిత్రీకరణలో విశ్వనాథ్ప్రతిభ పతాక స్థాయి చేరింది . ఫోటోగ్రఫీ నిండుతనం చేకూర్చింది .’’ప్రకృతి కాంతకూ ఎన్నెన్ని హొయలో
పదము కదిపితే ఎన్నెన్ని లయలో’’అని ఆ ఆనంద హేలలో మనల్నీ మైమరపిస్తాడు శాస్త్రి .విశ్వనాథ్ ,సిరివెన్నెల ,మహదేవన్,బాలు ‘’ విశిష్ట చతుష్టయం ‘’ ‘’సాధించిన అద్భుత దృశ్య,శ్రవ్య ,సంగీత కావ్యం చేశారు సిరివెన్నెల సినిమాను.ఏమిచ్చి మనం వాళ్ళ ఋణం తీర్చుకోగలం?
‘’బలపం పట్టి భామ వొళ్ళో అ ఆ ఇఈ ‘’నేర్చుకొన్నా ,పంతం పట్టి ప్రేమ వొళ్ళో ఆహా ఓహో పాడుకోనేట్లు ‘’చేసిన శాస్త్రి ప్రేమ బడిలో ‘’అయితే గియితే వద్దని వారించి ,సరసం ఇంకా ఎక్కువైతే ఛాచా చీఛీ’’దాకా వస్తుందని ముందు జాగ్రత్త చెప్పాడు .అన్నమయ్య పాటా అని పించే ‘’తెల వారదేమోస్వామి నీ తలపుల మునుకలో ‘’పాట రాశాడు .’’ చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరువై అలసిన దేవెరి,
అలసిన దేవెరి అలమేలు మంగకూ …. ‘’
అంగజు కేలిని పొంగుచు తేల్చగ
మక్కువ మీరగ అక్కున చేరిచి
అంగజు కేలిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునె మది మరి మరి తలచగమరి మరి తలచగ’
అని అన్నమయ్య స్థాయి కవిత చిలికి౦చాడు.
స్వర్ణకమలం లో కవితా స్వర్ణ కమలాలు వికసి౦ప జేశాడు. అందులో అందరూ మెచ్చే పాట’’అందెల రవమిది పదములదా ?అంబరమంటిన హృదయానిదా?’’అమృతతగానమిది పెదవులదా,అమితానందపు యద సడిదా’’అని ఆశ్చర్యపోయేట్లు రాశాడు .’’ఆగిన సాధన సార్ధకమందగ యోగ బలముగా యాగ ఫలముగా -బ్రతుకు ప్రణవమై మ్రోగుకదా ‘’అని దాని సార్ధకత వివరించాడు చిక్కని చక్కని పద సంయోగంతో అర్ధభావ గాంభీర్యంతో .మువ్వలు ఉరుముల సవ్వడిఅవ్వాలని , మెలికలు మెరుపుల మెలకువలై –మేను హర్ష వర్ష మేఘమై ,మేని విసురు వాయువేగమై –అంగభంగిమలు గంగ పొంగులై –హావభావాలు నింగి రంగులై –లాస్యం సాగే లీల రస ఝరులు జాలువారరేలా-జంగమమై జడ పాడగా –జలపాత గీతముల తోడుగా –పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతికాగా ‘’అందెల రవళి సాగాలని అతడు కోరాడు అలానే ఆమె ఆడింది నయనమనోహరంగా ప్రకృతిలో .’’ నయనతేజం నకారంగా ,మనోనిశ్చయ౦ మకారంగా ,శ్వాస చలనమే శికారంగా , వాంచఛితార్ధమే వకారంగా,యోచన సకలం యకారంగా ,నాదం నకారమై ,మంత్రం మకారం, స్తోత్రం శికారం ,వేదం వకారం ,యాగం యకారం ,ఓం నమశ్శివాయ ‘’అంటూ అందులోని పరమార్ధాన్ని మహా వైభవంగా వర్ణించి శివకవుల స్థాయి చేరాడు సిరివెన్నెల .చివరగా ‘’ భావమే మౌనపు భావ్యం ,భరతమే నిరతరభాగ్యం ,ప్రాణ పంచమమే పంచాక్షరిగా,పరమ పదము ప్రకటించగా –ఖగోళాలు పద కింకిణులై –దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా ‘’అని రాసిన పాట శివతాండవం గా శివమనోహరంగా ,శివ హృదయ సాక్షాత్కారంగా ,శివతత్వ విచారంగా ,పరమపద సోపానమార్గంగా రాయటం సామాన్యకవులకు అలవి అయ్యే విషయం కాదు .హృదయం అంతా శివమయమైనప్పుడే సాధ్యమయ్యే మహనీయ గేయం ఇది .శివ పూజకు పనికి వచ్చే నీరాజనమిది .సుభాష్ సిరివెన్నెలా ‘’స్వర్ణకమలం ‘’లో సిరివెన్నెల మెరుపులు మెరిపించి ఆ పరమశివునే మెప్పించావ్ .’’బూడిద పూసుకొనే వాడి ‘’విభూతి,ఐశ్వర్య దర్శనం చేసి ,మాకూ ఆ అనుభూతినిచ్చావ్ .సుదీర్గంగా సాగే ఈపాట నృత్యం ఎక్కడా బిగువు సడలలేదు .విశ్వనాథ్ టేకింగ్ మహాత్మ్యం అది .పాటకుపరమ సార్ధకత తెచ్చారు భానుప్రియ, వెంకటేష్ .అతడి ఆలోచనలకు తగిన ప్రతిఫలం ఆమె పొంది తండ్రి కోరిక తీర్చి సుస్థిరయశస్సు సాధించింది అతడి ప్రేరణా ,సాహచర్యంతో .ఈ సినిమా అద్భుతమైన క్లాసిక్ .విశ్వనాద్ కీర్తి కిరీటం లో మరో సిరి వన్నెల చిన్నెల కలికితురాయి .
అలాగే స్వాతి కిరణం సినిమాలో ‘’ఆనతీయరా ప్రభూ ,తెలిమంచు కురిసిందీ,వైష్ణవి భార్గవి, భవానీ శివానీ ‘’గీతాలకు ప్రాణం పోశాడు .’’ఆనతీయరా పాటలో ‘’ సన్నుతి సేయగా.. సమ్మతి నీయరా.. దొరా…
సన్నిధి చేరగా… ఆనతి నీయరా.. హరా, నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాలవాణితో విరించి విశ్వనాటకం
నీ సైగ కానిదే జగాన సాగునా ఆ యోగమాయతో మురారి దివ్యపాలనమ్
వసుమతిలో ప్రతి క్షణం.. పశుపతి నీ అధీనమై
వసుమతిలో ప్రతి క్షణం.. పశుపతి నీ అధీనమై
కదులునుగా సదా సదాశివ’’
అలాగే -తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
దోవపొడవునా కువకువలా స్వాగతం
నీ కాలి అలికిడికి మెలకువలా వందనంల గొంతు వణికింది పిలుపునీయనా ప్రభూ
భానుమూర్తి… నీ ప్రాణకీర్తన విని
పలుకని ప్రణతులని ప్రణవశృతిని
పాడనీ ప్రకృతిని ప్రధమ కృతిని //తె
భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు
నీ రాజసానికవి నీరాజనాలుభూపాల నీ మ్రోల ఈ బేల గానాలు
నీ రాజసానికవి నీరాజనాలు’’
మరో గోప్పపాట -శృంగారం తరంగించు… సౌందర్యలహరివని …
శృంగారం తరంగించు.. సౌందర్యలహరివని …
శాంతం మూర్తీభవించు.. శివానందలహరివని…
శాంతం మూర్తీభవించు.. శివానందలహరివని…
కరుణ జిలుగు సిరినగవుల కనకధారవీవని ..
నీ దరహాసమే దాసుల దరి చేర్చే దారియని ..
శతవిధాల శృతివిధాన స్తుతులు
సలుపలేని.. నీ సుతుడనే శివాని
శిరౌద్రవీర.. రసోద్రిక్త … భద్రకాళి నీవని
భీతావహ భక్తాళికి.. అభయపాళి నీవనివాని.. భవాని.. శర్వాణి..
భీభత్సానల కీలవు.. భీషణాస్త్ర కేళివని
భీషణాస్త్ర కేళివని…
అద్భుతమౌ.. అతులితమౌ.. లీల జూపినావని
గిరినందిని శివరంజని భవభంజని జననీ
శతవిధాల శృతివిధాన స్తుతులు
సలుపలేని.. నీ సుతుడనే శివాని
శివాని.. భవాని.. శర్వాణి..
ఇవన్నీ శివ ,శివానందలహరి గీతాలే అమృతపు సోనలే .మానసిక ఆన౦దాన్ని చేకూర్చే గీతాలే .హృదయపు లోతుల్లోంచి పెల్లుబికిన మృత ఝరీ ప్రవాలే .సిరివెంనేలకు పెట్టిన కీర్తి కిరీటాలే .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-12-21-ఉయ్యూరు
Excellent analysis
ధన్యవాదాలు