అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా
అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా గొప్ప దేశభక్తుడు ,కవి ,నాటకకర్త, కథకుడు వ్యాస రచయిత.ఈయన జీవిత చరిత్రను అస్సామీ భాషలో అస్సామీ సాహిత్య చరిత్ర రాసిన ఆచార్య హేమ్ బారువా రచించగా ,శ్రీ ఆర్ ఎస్ సుదర్శనం తెలుగు అనువాదం చేయగా కేంద్ర సాహిత్య అకాడెమి 1972లో ప్రచురించింది .వెల రూ -2-50 ముఖ పత్ర రచన ప్రముఖ దర్శక నిర్మాత సత్యజిత్ రే, ముఖ చిత్ర రచన శ్యామల్ సేన్ చేశారు .
సంగ్రహ జీవిత చరిత్ర
1868నవంబర్ శరత్కాలం లో లక్ష్మీ నాథ బెజ్బారువా జన్మించి, నవంబర్ లో పుట్టిన వారంతా బహుముఖ ప్రజ్ఞా వంతులు అవుతరాన్న జ్యోతిష్ శాస్త్ర విషయాన్ని రుజువు చేశాడు .తండ్రి దీనా నాథ బెజ్బరువా బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగి . ఆకాలం లో ప్రయాణాలన్నీ నదులమీదే .ఉద్యోగ రీత్యా బదిలీఅయి తండ్రి కుటుంబాన్ని నౌగాంగ్ నుంచి పల్లపు ప్రాంతమైన బార్ పేటకు పడవలపై వెడుతూ రాత్రిళ్ళు బ్రహ్మపుత్రా నదీ తీరం లోని ఇసుకతిన్నెలపై పడవలను కట్టి విశ్రాంతి తీసుకొన్నారు .అలాంటి సమయం లో ఆహతాగురి అనే ఊరు దగ్గర ఇసుక తిన్నె ను ఆనుకొని ఉన్న పడవలో మన బారువా జన్మించాడు .బ్రహ్మపుత్ర నిర్ఝర ధ్వనుల లో ,ప్రకృతి కాంత అంద చందాల మధ్య ,సంగీతమూ వెన్నెల తాండ వించే ‘’లక్ష్మీ రాత్రి’’ వేళలో అస్సామీ నవ్య సాహిత్యానికి విక్టర్ హ్యూగో లాంటి యుగ కర్త పుట్టాడని లక్ష్మీ నాథ అని పేరుపెట్టారు .అక్కడ పుట్టటమే ఒక మధుర కావ్యం .కుటుంబం లో అయిదవ సంతానం యితడు .
అస్సామీ వైష్ణవ సంస్కృతికి వారణాసి అయిన బార్ పేట లో తండ్రి మూడేళ్ళు పని చేసి ,కొండలు లోయలు ప్రకృతి కి గని అయిన తేజ పూర్ వెళ్ళాడు.పిల్లల్ని చూడటానికి మతవిషయాలు జానపద సంస్కృతీ కరతలామలకం గా ఉన్న
రవినాథ్ అనే కుర్రాడిని నియమిస్తే ,అతడు క్రమశిక్షణ నేర్పి మనవాడిని గొప్పగా ప్రభావితం చేశాడు . జానపద గేయాలూ ,పౌరాణిక గాధలు బాల బారువాకు నేర్పాడు.ఇవే తర్వాత ఆయనకు ప్రేరణగా నిలిచాయి .పిల్లలకోసం రాసిన కథల్లో వీటి ప్రభావం బాగా ఉన్నది .ఇంకా ఎగువనున్నలోయలోని లఖిం పూర్ ప్రాంతానికి తండ్రి కుటుంబాన్ని మార్చాడు.వీళ్ళ ఇంటి దగ్గర ఉన్న కంసాలి సిద్దేశ్వర్ చేసే నగలు, కొలిమి నిప్పురవ్వలు పనితనం చూసి మనవాడు బాగా ఆకర్షితుడయ్యాడు .ఒక రాగి నాణెం ఇచ్చి, చిన్న గిన్నె అతనితో చేయించుకొనేవాడు .పొరుగున ఉన్న దుర్గేశ్వరశర్మతో’’సుతులి ‘’అనే మట్టి వాయిద్యం చేయి౦చు కొన్నాడు .దీనితో సంగీత సాధన చేస్తూ తృప్తి పొందేవాడు .ఆకంసాలి కూతురు జయ అతనితొఆటలాడుకొనెది .ఆమెపై ఆతర్వాత ‘’మాలతి ‘’అనే మధురకవిత రాశాడుకూడా .డాంటే కవికి ‘’బియాట్రిస్’’ పట్ల ఉన్న ఆరాధనే ఇక్కడ మనకవికీ ఆమెపై ఉంది-‘’ఆమె చిరునవ్వుతో నవ్వుతాను –ఆమె కన్నీటితో ఖేదిస్తాను –ప్రియమాలతి ఒడిలో తలవాల్చి కనుమూస్తాను ‘’అనేదే ఆకవిత .
గౌహతీలో మొదటి సారిగా బడికి వెళ్ళాడు .తర్వాత చదువు శివ సాగర్ లో .తండ్రి రిటైర్ కాగానే ఇక్కడే స్థిరపడ్డాడు.ఆకాలం లో అస్సామీయులపై బెంగాలీ భాష ప్రభావం ఎక్కువ .ప్రభుత్వం ప్రాధమిక బెంగాలీ పాఠశాలల్ని ఏర్పాటు చేసింది .ఆ భాష నేర్వటానికి మొదటిపుస్తకం తర్కాలంకార్ రాసిన ‘’శిశు శిక్ష ‘’ .అప్పుడు అస్సాం లో ప్రభుత్వ భాష బెంగాలీయే .కనుక అన్నీ బెంగాలీలోనే నేర్పేవారు .కానీ అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ,ఆనంద రాం ధేకియల్ , ఫోకన్ వంటి వారి నిర్విరామ ప్రయత్నాలతో బెంగాలీ బదులు అస్సామీ భాష ప్రవేశించి మహోపకారం చేసింది .అస్సామీ అంటే బెంగాలీ భాష మాండలికమే అని,స్వతంత్ర భాష కాదని వాదించేవారు .దీనిపై తిరుగుబాటు చేసి తన రచనలు వ్యక్తిత్వం ద్వారా నిర్మాణాత్మక కృషిద్వారా అస్సామీ భాషకు పట్టాభి షేకం చేసిన వాడు బెజ్బారువా
తండ్రి సంప్రదాయ హిందువే అయినాసమాజం, జీవితం పట్ల ఉదార హృదయుడు. హేతుబద్ధత ,పురోగతి ఆయనకు ఇష్టం. అదే మార్గం కొడుకు చేబట్టాడు . వైష్ణవం ఇతివృత్తంగా చాలా రచనలు చేసినా ,అది ప్రత్యామ్నాయం అనీ మిగిలిన శాఖలకు విరుద్ధమనీ ఎక్కడా చెప్పలేదు బెజ్బారువా .గతం లోని మంచిని తీసుకొని ముందుకు వెళ్లాలని తండ్రీ కొడుకుల భావన .తండ్రికి ఇంగ్లీష్ పరిజ్ఞాన బొత్తిగా లేనే లేదు కానీ ఇంగ్లీష్ ను తిరస్కరించలేదు .పిల్లల ఇంగ్లీష్ చదువులకు అడ్డు చెప్పలేదు .అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ వాళ్ళు శివ సాగర్ లో ఇంగ్లీష్ స్కూల్ పెట్టినట్లే ,తండ్రి దీనానాథ్ ఉత్తర లఖిం పూర్ లో ఇంగ్లీష్ స్కూల్ పెట్టించాడు .బెజ్బరువా విద్యలో ఆస్తికత అంతర్వాహిని గా ఉండాలని అభిలషించాడు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి 1866లో ప్రవేశ పరీక్ష పాసయ్యాడు బారువా .తర్వాత కలకత్తాలో చదివి ఎఫ్ .ఎ. 20వ ఏట పాసయ్యాడు కలకత్తా జనరల్ అసెంబ్లీ కాలేజి లో చదివి 1890 లో పట్టభద్రుడయ్యాడు.ఇంగ్లాండ్ వెళ్లి పై చదువులు చదువుకోవాలనుకొన్నా ,కుటుంబ ఆచారాల వలన వెళ్ళలేక పోయాడు .కనుక కలకత్తాలోనేఎం ఏ,ఆతర్వాత బిఎల్ చేశాడు .కలకత్తా రిప్పన్ కాలేజి న్యాయశాస్త్ర విద్యార్ధిగా రోజూ హైకోర్ట్ కు వెళ్ళేవాడు .అక్కడ లోక వ్యవహారాలపై అనుభవం సంపాదించాడు .బిఎల్ పరీక్ష తప్పాడు కారణం ఆ పరిక్షలు అయ్యాక మినిమం మార్కులను పెంచేశారట .హైకోర్ట్ లో సిండికేట్ పై దావా వేశాడు .కాని గెలవలేదు .లాయర్ ఆశ తీరలేదు నిరుత్సాహపడ్డాడు .ఆంగ్లకవి బ్రౌనింగ్ గురించి ‘’న్యాయవాదిగానో ,రాయబారిగానో ,మేధాశక్తి ప్రధానమైన వృత్తిలో రాణి౦ప దగిన వాడు ‘’అని లాండర్,కార్లైల్ అన్నమాటలు మన బెజ్బారువా కు వర్తిస్తాయి .
కలకత్తాలో బి .బరోవ తో కలిసి కలప వ్యాపారం పెట్టాడు .ఇద్దరి మధ్య కెమిష్ట్రీ బాగా కుదిరి సంపన్నులయ్యారు .బెజ్బారువా మహర్షి దేవెంద్రనాథ ఠాకూర్ మనవరాలు ప్రజ్ఞా సుందరీ దేవిని బ్రహ్మ సమాజపద్ధతిలో 11-3-1891న పెళ్ళాడాడు మామగారు పదివేలు కట్నం ఇస్తామన్నా వద్దన్నాడు .వరకట్నం బెంగాలీ సమాజాన్ని పీల్చి పిప్పి చేసింది. ఆ దురాచారం అస్సాం లో లేదు .కట్నాల గురించి తర్వాతకాలం లో వ్యాసాలూ రాశాడు .’’ఆత్మ సంతృప్తి కన్నా ఆనందం లేదు ‘’అన్న అరిస్టాటిల్ మాట పాటించి ఆత్మతృప్తీ ,ఆనందం చిన్నప్పటినుంచి పొందుతూనే ఉన్నాదు .సమకాలికుడైన సి.కె .అగర్వాల్ కంటే ప్రతిభకలవాడు కాకపోయినా ,జర్మన్ సి౦ఫనిమా౦త్రికుడు బీథోవెన్ లాగా అస్సామీ సాహిత్యానికి అంకితమై, మకుటం లేని రారాజయ్యాడు బెజ్బారువా .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-12-21-ఉయ్యూరు