19-అనులాప పద ప్రయోగ హాస్యం
దీనినే’’ ముహుర్భాషా’’అంటారనీ ,ఒకే అర్ధం కల రెండుమాటలను కలిపితే వచ్చేది హాస్యాస్పదం అవుతుందని మునిమాణిక్య గురూప దేశం .ఉదాహరణ –కిరసనాయిల్ నూనె ,హోలు మొత్తమ్మీద , చీకటి గుయ్యారం ,మగ పురుషుడు ,చీకటి గాడాంధకారం ,తీపిమధురం ,అగ్గినిప్పు ,పేపరు కాయితం ,చేదు విషం ,పులుపు రొడ్డు ,చచ్చిన శవం ,చచ్చిన చావు ,వంటి మాటలు వింటే గలగలా కాకపోయినా ముసిముసిగా నవ్వు పూస్తుంది .ఇలా మాటలని కలపటాన్ని ఇంగ్లీష్ లో టాటోలజి’’-tautology అంటారని మాస్టారు భాష్యం చెప్పారు .Tautology is ,using two or more words to express the same meaning ‘’example –female women అని నిర్వచనమూ ఉటంకించారు .
బధిర సమాధాన పద ప్రయోగ హాస్యం
మనం ఒకటి చెబితే చెవిటి వారికి అది ఏదోగా వినిపించి సంబంధం లేని మాటలు మాట్లాడితే నవ్వు తో చస్తాం . లింవీరేశ లింగం గారు దీనిపై ఒక ప్రహసనమే రాశారు .చెవిటి వాడొకడు పూట కూళ్ళమ్మ ఇంటికి వస్తాడు ‘’అయ్యా ఇప్పుడే ఇల్లు నిండిపోయింది బస కు చోటు లేదు ‘’అని అంటే ,చెవిటాయన ‘’మెడ మీద గది అయితేనేమండీ నాకు అభ్యంతరం లేదు .నేను ముసలివాడినికాడు ఎక్క లేక పోటానికి ‘’అంటూ మేడ మెట్లెక్కి ఆవిడ వాడుకొంటున్న గదిలోకి వెళ్లి విశ్రమిస్తాడు .భోజన సమయం లో అందరికీ అరటిపళ్ళు వేస్తూ ‘’మీకూ రెండు వేయనా ఖరీదు నాలుగు అణాలు ‘’అంటే వాడు ‘’ఊరికే వేస్తానంటే ఎవరొద్దంటారు ‘’అని పెద్దగా నవ్వాడు .ఆమె బిత్తరపోయి ‘’ఊరికే కాదు నాలుగణాలు ‘’అంటే ‘’నువ్వు డబ్బు తీసుకొను అంటే నేనుమాత్రం ఏం చేస్తా సరే అలానే కానీ ‘’ఇందులో ఒకరిమాటకు ఇంకోరిమాటకు పొత్తు కుదరదు.వినేవాళ్ళ చెవులకు బోలెడంత విందు .ఇందులో ఆయన పూర్తి బధిరుడు .
మరికొందరికి సగం సగం వినిపించి ఏదో చెబితే మనకు నవ్వొస్తుంది .తల్లిని ఇంటిపంనుకట్టాలి డబ్బు ఇవ్వమని అంటే ‘’తొంటి పన్ను కట్టట మేమిట్రా.నాదగ్గర డబ్బులు దానికోసం ఎందుకు ?డాక్టర్ దగ్గరకు వెళ్లి ఒక రూపాయిస్తే పన్ను హాయిగా పీకేస్తాడు ‘’ అంటే విన్నమనం 32పళ్ళతో ఇకిలిస్తూ నవ్వకుండా ఉండగలమా ?
ఒకాయన ఒక చేవిటావిడ ఇంటికి వస్తే ‘’మా ఇల్లు ఎలా కనుక్కొన్నావు ?’’అని అడిగితె ‘’జవాను తీసుకొచ్చాడు ‘’అంటే ‘’అదేమిటీ శవాన్ని మోసుకోచ్చినవాడివి స్నానం చెయ్యకుండా అన్నీ ముట్టుకున్నావు .మేము బస్తీలో ఉన్నా ఇంకా ఆచారం వదలలేదు .నూతి దగ్గరకు వెళ్లి స్నానం చేసిరా ‘’అంటే విని నవ్వక చస్తామా ?ఒకసారికోర్టు వారు ఆమె కొడుక్కి సమన్లు పంపారు .ఆమెకు కాగితం ఇచ్చి కొడుక్కి ఇవ్వమన్నాడు అమీను .ఆమె ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోకుండా తీసుకోకపోతే ‘’ముసలమ్మగారూ మీరు తీసుకోకపోతే కాగితం గోడకి అంటించి చక్కా పోతాను ‘’అంటే ‘’ఏమి ప్రేలావురా ?ఒళ్ళు కొవ్విందా ?ఆ వెధవకాగితం నేను పుచ్చుకొను అంటే మా కోడలికి అంటించి వెడతానంటావా ?మా అబ్బాయి రానీ నీ భరతం పట్టిస్తాను ‘’అంటే అమీనుతోపాటు మనమూ పగలబడి నవ్వుతాము .
శ్రీ మునిమాణిక్యం మాస్టారు గారికి కృతజ్ఞతలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-12-21-ఉయ్యూరు