అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-2
అర్ధం చేసుకొనే తండ్రి ఉన్న మంచి గృహ వాతావారంలో బెజ్బారువా బాల్యం గడిచింది వైష్ణవసాహిత్యం ,సంస్కృతీ ,ఆంగ్ల సాహిత్యం ఉదార మానవతా వాదం అనే రెండు లోకాలలో పెరిగాడు .ఇంట్లో ఉన్న ధర్మ శాస్త్ర గ్రంథాలైన ‘’పుటులు’’చదివి ప్రభావితుడయ్యాడు .తండ్రి ‘’గురు చరిత్ర ‘’అనే కవి శంకర దేవ్ చరిత్ర రాశాడు .ఆతర్వాత ఈయన ‘’శంకర దేవ్ –మహా పురుష శంకర దేవ్ ఆరు శ్రీమాధవ దేవ్ ‘’ ‘’పుస్తకాలు రాశాడు .కలకత్తా రిప్పన్ కాలేజిలో చదువుతుండగా పాల్ గ్రేవ్ రాసిన ‘’గోల్డెన్ ట్రెజరీ ఆఫ్ లిరిక్స్ ‘’పాఠ్య గ్రంథమై, ఆంగ్లకవుల స్వర్ణ రాజ్యం లో ప్రవేశించాడు .బైరన్ ,కీట్స్ ,షెల్లీలను చదివి జీర్ణించుకొన్నాడు .టాగూర్ కవిత్వాన్ని అధ్యయనం చేశాడు .వక్తల ఉపన్యాసాలను విని నోట్ చేసుకొని వల్లించేవాడు .ఇంగ్లీష్ సాహిత్యం లో మేలిమిని ,అందాల్నీ అర్ధం చేసుకొన్నాడు .1890-1930 కాలం సంధికాలం .మార్పులతో లక్ష్య సిద్ధి లేని లోకానికి ఒక స్వరూపం, ఏకాగ్రత చేకూర్చినవాడు బెజ్బరూవా .అందుకే ఆ కాలాన్ని ‘’బెజ్బరూవా యుగం ‘’అన్నారు విశ్లేషకులు అత్యంత గౌరవంగా ..అ యుగ చైతన్యాన్ని తన ప్రతి రచనలోనూ ప్రదర్శించి చూపాడు .విక్టర్ హ్యూగోలగా ఈయన మహా కాంతి కేంద్రమయ్యాడు .తన సమకాలికులు సి.కె .అగర్వాల్ ,హెమ్ గోస్వామిలను దాటి ముందుకు వెళ్ళాడు .నవ చైతన్యానికి కేంద్రమైన కలకత్తా లో 1889లో ఆధునిక అస్సామీ సాహిత్య ఉద్ధరణ కోసం ‘’జానకి ‘’పత్రిక స్థాపన అగర్వాల్ చేశాడు ..దీనికి అండ గా నిబడ్డాడు బెజ్బరూవా. ఆ పత్రికలో ఆయన సృష్టించిన పాత్ర ‘’కృపా వర్ బరువా ‘’తో అరంగేట్రం చేశాడు .
25-8-1888 న బెజ్బరూవా. ఆధ్వర్యం లో ‘’అస్సామీయ భాషా ఉన్నతి సాధినీ సభ ‘’ఏర్పడింది .ఇది అపురూప భావ చైతన్యానికీ ,సంచలనానికి వేదిక అయింది .ఆస్సామీ విద్యార్ధులు ప్రతి ఆదివారం సమావేశమై గోష్టి జరుపుకొనే వేదికగా మారింది .దీనికి ఒక ఏడాది కార్యదర్శిగా పని చేశాడు .ఈ సభ ధ్యేయాన్ని ‘’జానకి పత్రికలో 1889 లో ప్రచురించాడు .అవి- అస్సామీ భాషను,సాహిత్యాన్నీ అభి వృద్ధిచేయటం , వ్రాతప్రతులు సేకరించి ప్రచురించటం ,యూని వర్సిటీలలో అస్సామీ భాష బోధనా భషగా ఉండేట్లు చేయటం ,భాషను సాహిత్యానికి అనుగుణంగా వ్యవస్థీకరించటం ,వైష్ణవ సాహిత్యం లోని భాష్యాలను క్రోడీకరించటం ,అస్సాం సాహిత్య రాజకీయ మత చరిత్రలను సమకూర్చటం ,సంస్కృత సాహిత్యాన్ని అస్సామీ లోకి అనువదించటం ,అస్సామీ భాషలో వార్తాపత్రికలు ,విజ్ఞాన పత్రికలను ప్రచురించటం .
కలకత్తాలోని అస్సామీ విద్యార్ధులు మొదటిసారిగా షేక్స్ పియర్ రాసిన ‘’ది కామెడి ఆఫ్ ఎర్రర్స్ ‘’నాటకాన్ని అస్సామీ లోకి ‘’భ్రమరాంగ ‘’గా బెజ్బరూవా ఆధ్వర్యం లో ఆర్.డి. బారువా ,ఆర్. కే. బర్కకతిజి బారువా ,జీ.స్. బారువాలు , వచనం గా అనువదించి మార్గదర్శనం చేశారు. ‘బ్లాంక్ వెర్స్ ఇంకా అడుగుపెట్టలేదు .సంప్రదాయ పద్ధతిలో పెరిగి కలకత్తా వంటి కాస్మోపాలిట్ మహా నగరం లో ఉన్నా ,విజాతీయత స్వేచ్చ కొంత సడలించినా తీవ్ర ధోరణులలోకి మాత్రం చేరలేదు .ఈ కొత్త సంపర్కం ఆయన మేధా నైశిత్యాన్నీ ,అవగాహనా పటుత్వాన్నీ బగా పెంచింది .అస్సామీ ప్రజలకు సేవ చేయాలనే మహత్తర ఆశయం బలంగా మనస్సులో నిలిచింది .గుండె నిబ్బరం కల వాడుకనుక రాబర్ట్ బ్రౌనింగ్ లా జీవితం పట్ల ఆశాభావం ,విశ్వాసం పెంచుకొన్నాడు .ఎదురు దెబ్బలు తగిలినా నిరాశా నిస్పృహ పొందకుండా ముందుకే అడుగులు వేసిన ధీరో దాత్తుడు .. బెజ్బరూవా రచనల్లో దేశాభిమానం,సామాజిక ఆదర్శాలు కనిపిస్తాయి .అస్సామీజీవిత విధానాన్ని గొప్పగా చిత్రించాడు .జీవన విధానాన్నీ సంస్కృతిని పునరుద్దీపింప జేసి, నవ సమాజ సృష్టి జరగాలనే ఆలోచన ప్రజలలో కలిగించాడు .మహా కావ్యం ,మహా నాటకం రాయక పోయినా ,జయమతి కుమారి ,చక్రధ్వజ్ సింహా తప్ప ,మిగిలినవన్నీ దేశ భక్తీ ప్రబోధకాలే . జీవితానంతర మార్గ దర్శిగా ఉన్న మాధ్యూ ఆర్నోల్డ్ లాగా కాకుండా ,తన జీవితకాలం లోనే ఒక మహా సంస్థగా రూపొందాడు .ఆయన విమర్శలు, చెంప దెబ్బలు ప్రజలకు ఎంతో మధురంగా ,మార్గ దర్శకం గా ఉండేవి .’’జాతీయుల సమక్షం లో ఆయన పేరెత్తితే,అది జాతీయ పతాకోత్సవమే అవుతుంది’’అని నార్వేజియన్ రచయిత ‘’బ్యోన్ సన్’’గూర్చి బ్రాండే చెప్పినమాటలు ఇక్కడ బెజ్బరూవా కు కూడా పూర్తిగా వర్తిస్తాయి .
అస్సాం లోని ఇసుకతిన్నె పై ఉన్న దిబ్రూగర్ లో బెజ్బరూవా26-3-1938న 70వ ఏట మరణించాడు .అక్కడే దహన సంస్కారాలు జరిగాయి .’’ఆయన చెప్పిన దాంట్లో లోపాలు,పొరబాట్లు ఉండచ్చు కానీ మనిషిగా చూడటానికి ఆ మనిషి లేడు.ఉన్నది నిత్యానుభవమైన ఒక భావ సంవృతి మాత్రమె ‘’అని ఫ్రాయిడ్ గురించి ఆంగ్లకవి డబ్ల్యు హెచ్ ఆడెన్ అన్నమాటలు అక్షరాలా బెజ్బరూవా కు వర్తిస్తాయి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-12-21-ఉయ్యూరు