అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-3
వ్యాసకర్త
ఆత్మాశ్రయ వ్యాసాలలో సృజనాత్మక రచయితగా రాణించాడు బెజ్బరూవా .ఇవి లోకజ్ఞాతకు నిదర్శనాలు .’’హాస్యం సామాజికం ‘’అన్న బెర్గ్ సన్ మాట ఈయనకు వ్యక్తిగతమూ అయింది .భారంగా ఉన్న జీవితాన్ని హాస్యపు తునకలతో పైకి తేల్చాడు .1914-18కాలపు ఆంగ్ల అపహాస్యపు కవులకు తన సమకాలీన ఇంగ్లీష్ కవుల కోవకు చెందినవాడుగా గుర్తింపు పొందాడు .ఇతని మేలిమి గుణాలు స్వయం ప్రకాశకాలు .’’శిక్ష వెయ్యటం సంఘ విధ్యుక్త ధర్మమే అయినా ,సంస్కరించి మళ్ళీ చేర్చుకోవటం అంతకంటే గొప్ప ధర్మం ‘’అన్న డేవిడ్ ఎస్.జోర్డాన్ భావం తో ఈయన రచనలో హాస్య అవహళనాలున్నా ,మనిషిని సం స్కరించటమే ధ్యేయం .మాధ్యూ ఆర్నోల్డ్ ‘’ఒక్కొక్క గాయాన్నీ ,ఒక్కొక్క బాధనీ గమనించి వ్రేళ్ళతో తట్టి తడిమి ,పట్టి చూసి ‘’ఇదిగో నీ జబ్బు ఇక్కడ ఉంది ‘’అని చెప్పినట్లు ఈయన అవహళనను సంస్కరణ కోసమే ఎంచుకొన్నాడు .’’హేళనాత్మక రచయిత ప్రేమిస్తూ ఏవగించు కొంటాడు ‘’అంటుంది కేధరిన్ రీన్ .ఈయన రచనల్లో హేళన ఉన్నా విదేశీయులపై అభిమానమూ కనిపిస్తుంది .మానవుల బలహీనతల్ని దోషాలను ఎండకట్టటం లో ఎక్కడా దురహంకారం ప్రదర్శించలేదు .మానవత్వానికి సంక్రమించిన విడ్డూరాన్ని చూసి నవ్వేశాడన్నమాట.అతని దృక్పధం –మానవత, సామాజిక అవగాహన .అతని పాత్రలు ‘’ఫాల్ స్టాఫ్’’వంటివి. హేతుబద్ధతకు పెద్ద పీట వేశాడు , డబ్ల్యు హెచ్ ఆడెన్ లాగా ద్వేషం ,ప్రేమ కలగలసిన పాత్రలు .అనటోల్ ఫ్రాంక్ వోల్టైర్ గురించి ‘’వోల్టైర్ వ్రేళ్ళ మధ్య కలం నవ్వుతూ పరిగెత్తు తుంది ‘’అన్నమాట ఈయనకూ పూర్తిగా వర్తిస్తుంది.ఒకరకంగా బ్రాండే అన్నట్లు ‘’నవ్వులతో చంపేశాడు ‘’చమత్కారాన్ని ఆంతర్యం లో ప్రసరించే మెరుపు తీగ’’లాగా వర్ణిస్తాడు .ఆ కాలం లో ఇలాంటి శిల్పం ఎవరూ ప్రదర్శించలేదు .
సజాతీ విజాతీ భావాలలో మన సమాజం విజాతీ ధోరణులలో పడిపోతుంటే ,మన సంస్కృతిలో అంతర్భూతమైన విలువలను చక్కగా గుర్తింప జేశాడు .హోమర్ రాసిన ‘’ఇలియడ్ ‘’,’’ఒడిస్సీ ‘’కావ్యాల్లాగా మారుతున్న సమాజం మధ్యతరగతి కి దిగువన ఉన్న అస్సామీయులను జీవిత విధానాలను వాస్తవంగా చిత్రించాడు .ఇంగ్లీష్ కవి ఛాసర్ సమకాలీన సమాజాన్ని అంగీకరించాడనీ ,విమర్శించలేదని ‘’ఆల్డస్ హక్స్లీ ‘’చెప్పాడు .కాని ఈయన విమర్శించకుండా దేనినీ అంగీకరించలేదు.’’హేళన చేసే రచయిత తానూ స్పృశించిన ప్రతి దానిపైనా తనముద్ర వేస్తాడు .అతని దృష్టి మనలో కూడా కలిగించి కృతకృ త్యుడౌతాడు’’అన్నాడు జాఫ్రే బుల్లో .అలాగే ఇతని రచనలలో ఒక ప్రధాన భావమో ,ఉద్రేకమో ఉంటూ దాన్ని ఆలంబనం చేసుకొని భిన్న దొణులను ,భిన్న విషయాలనూ కలుపుతాడు .’’శాతురా’’ ప్రక్రియలో సామాజిక జాగృతి పొంగి పొరలుతుంది . అస్సాం సాహిత్యం లో ‘’ఆహోం’’తర్వాత ఏర్పడిన స్తబ్ధత తర్వాత ఈయన వచ్చి చైతన్యం కలిగించాడు ..
బెజ్బరూవా హాస్యం లో లాలిత్యం ఉండదు .కడుపు చెక్కలయ్యే హాస్యం భళ్ళున వస్తుంది ,కత్తికోత హేళన ఉంటు౦దికొన్ని చోట్ల . చమత్కారం యాదృచ్చికమే .ఆయనది అద్దం లాగా ప్రతిఫలించే తెలివి అంటారు .ఆయన కృషి విలువలు సాహిత్య పరమైనదే కాకుండా ,మానసిక తత్త్వం దృష్ట్యా కూడా ఎన్నదగినది .వికట హాస్యం కిందిపొరల్లో సూక్ష్మగ్రాహ్య విమర్శ దోబూచులాడుతుంది .
భీమ చరిత చమత్కార ఉల్లాస వినోదాలున్న వైష్ణవీయ రచన .శంకర దేవ్ ,రుక్మిణీ హరణ్ లలు ఈ ప్రభావ రచనలే .అస్సామీ సాహిత్యం లో హాస్యానికి ప్రత్యెక స్థానం కల్పించినవాడు బెజ్బరూవా .ఈహాస్యం లో 1-నవ్వటమే ముఖ్యం 2-అపహాస్యం విసుర్లతో నవ్వు పుట్టించటం అనే రెండు పాయలు ఉన్నాయి .అతడిది దృష్టి వైశాల్యం ,విషయ పరిజ్ఞానం ,శైలీ పాటవం .అతడిది హద్దుమీరని ఏవగింపు .అన్నిట్లో తటస్థ స్వభావం ,భావ స్వాతంత్ర్యం .సమాజ పునరుద్దీపనకు ,సమైక్య సిద్ధాంతానికీ ఆలంబనాలు .క్రోధం లేకుండా దెబ్బతీయటం ఆయన ప్రత్యేకత .
ఇతడి రచనలు -1-మేధస్సుతో ఉన్న క్లుప్త రచనలు 2-ఉరకలేసే ఉప్పొంగే హాస్యంతో ఉన్నరచన అని రెండురకాలు .హాస్యాన్ని నిర్దాక్షిణ్యంగా ప్రయోగించిన’’డ్రైడన్ ‘’అంత దౌర్జన్యంగా లెంపలు వాయిన్చేట్టుగా దాడి చేయలేదు.అర్ధ శతాబ్దిక్రితం ‘’ఉద్రేకం వచ్చిన బుర్రలు ఎలా పని చేశాయో ‘’అతని రచనలు ప్రతిధ్వనించి చూపుతాయి .కపోతర్ తపాలా వ్యాసం సామాజికం . దైనందిన జీవన పరిధిలోకి దాన్ని లాక్కొచ్చి ,జనసామాన్యానికి పరిచితమైన సమ్మోద ప్రక్రియగా మార్చాడు .లాంబ్ ,డీక్వీన్సేన్సి ల లాగా ఇతడి వ్యాసం సన్నిహిత భావ ప్రకటనకు అనువైన సాధనమైంది .ఇతని ఆత్మాశ్రయ వ్యాసాలు నాలుగు సంపుటాలుగా వచ్చాయి .అవే-బర్బకోవార్ కకోతర్ కపోతా ,ఒవతాని ,బర్బరోవర్ భావర్ బర్బురాని ,బర్బురోవర్ బులాని .’’అస్సామీలాగా బతుకు.అనుకరణ వద్దు ‘’అని శాసిస్తాడు .సామాజిక్ లో బూటక ఆచారాలు నకిలీ దేశాభిమానం ,వ్యక్తిగత దురహంకారం లను దుయ్యబట్టి ,అస్సామీ భాషకు హృదయం అర్పించాడు .భాషాప్రయోగం లో మడికట్టుకొన్నా ,ఇతరభాషాపదాలనుచేర్చుకోవటం లో ఉదారత చూపాడు .ఒవతాని లో సంఘ సంస్కరణ అన్ని చోట్లా కనిపిస్తుంది .ఈ నాలుగు సంపుటాలలో అతడి భావ పరిధి విస్తరణ కనిపిస్తుంది .అతడిది శబ్ద ప్రధాన హాస్యం భాకారా మాస్టారిలా .’’నిష్టమైన ప్రేమ అంటే దేవుడి మీద ప్రేమ .ప్రేమ ఒక్కటే ఆత్మను అచంచల నిర్మల ఆనందం తో నింపుతుంది .’’అని వైష్ణవ సాహిత్య అధ్యయనం ద్వారా గ్రహించాడు .దర్శనానికి అధ్యయనానికి అభేదం గుర్తించాడు .మామూలు మనిషికి అలవికాని భావాలు ఆశయాలు తేట తెల్లంగా చక్కని నుడికారం తో చెప్పటం ,ధార్మిక ,దార్శనిక విషయాలను సూక్ష్మగ్రాహకంగా సహజ పాండిత్యం తో చెప్పటం అనే రెండు విధాల సాహిత్యానికి ఆయన సవ్య సాచిగా విలసిల్లాడు .భాషా స్రష్ట అయ్యాడు .
‘’అర్చనా వేదికపై బలి ఇవ్వటం పనికి రాదు ‘’అని ఎలుగెత్తి చాటిన అరిష్టాటిల్ పై ఏధేన్స్ నగరం లో నేరం మోపినట్లే ,ఇక్కడ నిర్మాణాత్మకమైన సందేహాలతో ఉత్ప్రేరి తుడైనశంకర దేవ్ ,మాధవ దేవ్ కూడా రాజాగ్రహానికి గురై తూర్పుఅస్సాం నుంచి పశ్చిమ అస్సాం కు వలస పోయి వైష్ణవాన్ని ప్రచారం చేశాడు .ఈ మహానుభావుని చరిత్రను బెజ్బరూవా రాసి ధన్యుడయ్యాడు .’’కృష్ణ అంటే ఇహం లో మహాదానందాన్నిచ్చేవాడు ‘’అని శ్రీధరస్వామి చెప్పాడు .ఈవిషయాన్ని ఈయన ‘’కృష్ణ తత్వ ‘’లో సంపూర్ణంగా రాసి ఆవిష్కరించాడు .అతి గహనమైన ‘’రాస లీలాతత్వాన్ని ‘’బుద్ధికి పదునుపెట్టి ఉదాత్తంగా రాశాడు ‘’శృంగార రసంలో నిబద్దులైనవారు నిర్మల మతులు ఔతారు ‘’అని బోధించాడు శంకరదేవ్ .గీతా తత్త్వం లో భగవద్గీత విశేషాన్ని వివరించాడు .తత్వ కథలో ధార్మిక మతవిషయాలు రాశాడు .దీన్ని సంయమనంతో సూటిగా అర్ధవంతంగా రాశాడు .వర్షం తర్వాత వచ్చే ఎండలా స్నేహభావం తో ఉంటుంది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-12-21-ఉయ్యూరు