అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-4(చివరి భాగం )
నాటక కర్త
‘’హాస్య నాటకం అంటే సామాజిక ధర్మ భ్రంశాలను వేళాకోళ౦ గా చిత్రించేది ‘’అని భావం .కానీ ,బెజ్బరూవా సన్ని వేశ ప్రధానాలైన ప్రహసనాలే రాశాడు.నమూనా పాత్రలే కనిపిస్తాయి .బెన్ జాన్సన్ లాగ ‘’మానవుల దౌష్ట్యం తో కాకుండా తెలివి తేటలు లేకపోవటం తో వినోది౦చాడు ‘’ .మానవ ప్రకృతి విడ్డూరాలు చూపాడు .అస్సామీ లో తొలి నాటకకర్తలలో ఒకడైన హెచ్. సి.బరువ రాసిన కన్యాకీర్తాన్ నాటకం హాస్యనాటకాలకు దారి చూపింది .మనవాడు రాసిన నోమల్,లిటికాయ్ వంటివి సామాజిక ప్రయోజనం లేని తక్కువ స్థాయివే .రక్తికట్టే రంగస్థల నాటకాలు రాసినా సార్ధకాలు అనిపించుకోలేదు .గ్రామ్య నుడికారాలు ,మాల్ ప్రాప్ అస్తవ్యస్త పదాలు ఎక్కువ .పౌరాణిక సందర్భాలను కొన్ని చోట్ల అపభ్రంశం చేశాడు కూడా .సమాజం లో కొన్ని విలువలు తారుమారై మనో దౌర్బల్యాలవలన ఏర్పడిన విడ్డూరాలను అపహాస్యం చేశాడు .’’ప్రహసనం మనల్ని అభూత కల్పనలతొ ఆనందింప జేస్తుంది ‘’అన్న డ్రైడేన్ ఇతడికి ఆదర్శం .శబ్దాలగారడీ ,సన్ని వేశాలకల్పన అమోఘం .’’రచయిత వ్యక్తిత్వపు రంగుతోదిద్దిన భిన్న వ్యక్తిత్వాలు ‘’గా ఉంటాయి .బర్మీయులు అస్సాం పై దాడి చేసిన చారిత్రిక పూర్వ రంగాన్ని ‘’బెలిమర్ ‘’నాటకంగా రాశాడు .ఆనాటి సంఘం ఎముకలు కుళ్ళి ,రక్తపాతం అల్లకల్లోలంగా ఉన్నదాన్ని గొప్పగా చిత్రించాడు .అహోం వంశ రాజులపాలన అంతం కావటంతో నాటకం ముగుస్తుంది .ఇది దేశ ప్రజల విషాద గాధ.శిల్ప రీత్యా ‘’జయమతికువారి ‘’నాటకం రసోద్దీప్తి కలిగిస్తుంది .’’సంఘర్షణ నాటకానికి ఆత్మ ‘’అన్న ఆలర్డిస్ నికోల్ ను అనుసరించాడు .చంగ్ మయ్ హృదయం మానవ కారుణ్య క్షీరం తో పొంగిపొరలుతుంది .స్త్రీపాత్రల్ని వాస్తవంగా చిత్రించాడు .అస్సాం పల్లపు ప్రాంతాల దుర్బల వాస్తవికత ,సంఘర్షణ ,,కుట్ర,కుతంత్రాలు ,పర్వత ప్రాంతాలలో భావనామయ సౌందర్యాలను చిత్రించాడు .అతడి అమర సృష్టి ‘’దాలిమ ‘’పాత్ర.ప్రస్తుతం ఉన్న విజ్ఞాన దృష్టితో గతాన్ని చూసే ప్రయత్నం తో ‘’చక్రధ్వజ సింహ ‘’రాశాడు .సమాజం అంతరాత్మను మేల్కొల్పాడు .చారిత్రకనాటక సీరియల్స్ ను అకలంక దేశ భక్తితో రాశాడు .షేక్స్పియర్ ప్రభావం కనిపిస్తుంది .’’చరిత్ర అంటే ఘనీ భవించిన క్షణాల గురించి తెలిపే సాంకేతిక రచన కాదు ‘’అంటాడు .మొత్తం మీద హాస్యప్రధాన మైనవీ చారిత్రిక అంశాలతో ఉన్నవీ అయిన నాటకాలు రాశాడు .
కథా రచయిత
ఆధునిక కథ ఎలా ఉంటుందో బెజ్బరూవా రచనలు తెలియ జేస్తాయి .జానపదానికి తనప్రతిభకు మంచి లంకె వేశాడు .బెంగాలీలో రాయటం మొదలుపెట్టి ,దమ్ము చాలక అస్సామీలో రాశాడు .అదే అస్సామీసాహిత్యానికి ఎనలేని కీర్తి సాధించింది .బాల సాహిత్యం లో పిల్లల మనస్తత్వాలను బాగా చూపించాడు .శక్తివంతమైన పాత్ర చిత్రణ చేశాడు .జానపదాలు నిరక్షరాస్యుల ఆత్మ కథలు అన్నట్లుగా రాశాడు .నీతిలేకున్నా ,మానవత స్పర్శ ఉంటుంది .అమాయకత్వం ,భావ స్నిగ్ధతా ఉన్న లోకాన్ని ఫోటో తీసినట్లు రాశాడు .అసంభవాన్ని సంభావ్యం చేస్తాడు .ఇతని జానపద కథల సంపుటి 1912లో’’కకదోతాఅరునటిలోరా’’గా వెలువడింది .అప్పుడే ‘’సురవి ,తర్వాత ఏడాది జాన్ బిరి సంపుటులు తెచ్చాడు .’’సాంప్రదాయక దృష్టి తో వ్రాయబడిన బెజ్బరూవా కథలు జీవితాన్ని సహజ భావ ఉద్వేగాలతో సుఖ దుఖాలతో వర్ణించిన మొట్ట మొదటి ప్రయత్నం .నవీనులం అనుకోని విదేశీయత తో చలికాచుకొంటూ అదే నిజమని నమ్మే బుద్ధిహీనత ప్రదర్శించటం ,దేశాభిమానానాన్ని రగుల్కొల్పటం చేశాయి .స్విఫ్ట్ రచనా విధానం లో ఈదడిత్ సిట్వేల్ అన్నట్లు ‘’చదువుతుంటే పళ్ళు పులిసిపోతాయి ‘’.ఆధునికత మోజులో వికృతమైన పేర్లు పెట్టుకోవటం ,సంప్రదాయాలను పూర్తిగా తె౦చు కోవటం మొదలైన వాటిని ఉతికి ఆరేశాడు .పాత్రలను తమాషాగా చూశాడుకానీ ఈసడింపు తో మాత్రం కాదు .అమృత జీవనంగా ఉండేట్లు రాశాడు .’’అస్సామీ యుడిని అనే ఎరుకతో రాసిన అస్సామీయుడు ఆయన’’ .అతడి ప్రతిభ విమర్శనాత్మకమేకానీ సృజనాత్మకం కాదంటారు .ఏరాబరి కథశిల్ప సౌష్టవం సాంఘిక నైతిక ప్రయోజనం ఉన్నది .కలకత్తా లోని ‘’కోలులు ‘’,’’ముందా ‘’ల వంటి వారితో అతడికి పరిచయం ఏర్పడి ఆ అనుభవ సారం రచనల్లో ప్రతిబింబించింది .మిస్టర్ ఫిలిప్ సన్ లో టీ తోటల లో పని చేసే వారిజీవితం ఆంగ్లో ఇండియన్ల మేనేజర్ నీతి బాహ్యతా చూపాడు .అస్సామీ నాగరక సమాజం ,బ్రిటిష్ పాలన లో వంగ దేశం లో మారుతున్న సమాజం గురించి రాసినవే ఇవన్నీ .అనివార్యమైనఒక సంకర మనస్తత్వాన్ని చూపించాడు .విదేశీ సంస్కృతిని అడ్డుకోవటానికి సర్వ శక్తులా కృషి చేశాడు .’’పాపా’’అని తన పిల్లల చేత పిలిపించుకోనేవాడు .కులీన కుటుంబాలమధ్య సంఘర్షణ ‘’పదుం కువారి ‘’కద.
కవి
గేథే కాలం లో జర్మన్ సాహిత్యం వికసించినట్లు బెజ్బరూవా ,అగర్వాల్ కాలం లో అస్సామీ సాహిత్యం వికసించింది .ప్రణయ గీతాలు ,ప్రకృతి పద్యాలు ,పాటలు దేశ భక్తీ గీతాలు రాశాడు బెజ్బరూవా.’’ప్రియ తమ సౌందర్య ‘’కావ్యం లో భావ చిత్రాలద్వారా ప్రేయసి లావణ్యాన్ని ఆవిష్కరించాడు .ప్రేమకు సౌందర్యానికి పెన్నిధి ప్రకృతి అంటాడు .టాగూర్ లాగా ‘’ప్రేమే జయిస్తుంది-మృత్యువు దాని బానిస ‘’అన్నాడు .శిల్పం తెలిసిన కవితాలోకం లో ,సహజ సుందర జానపద కవితాలోకం లో విహరించాడు .’’పాదం కింద నలిగే ప్రతి దర్భామ్కురం –దైవత్వం తో చైతన్య భరితంగా ఉంటుంది ‘’అన్నాడు .మిస్టిక్ కవి మాత్రం కాదు .కవిత్వం అంటే ‘’విషాద గీతి ,గద్గద కంఠం-భగ్నహృదయుని రుతి –కళ్ళ చివర బాష్పాలు –వేదనాభరిత అశాంతి ‘’అని కవిత్వాన్ని నిర్వచించాడు .’’విదేశీ ప్రభావితం తాలూకు పిల్లకాలువలు –కొద్దికాలం లో మహా నదిలో కలిసిపోతాయి ‘’అని ధైర్యంగా చెప్పాడు .కర్షక గీతాలతో ఉర్రూతలూగించాడు .’’ధన్ బరు అరురతని ‘’గొప్ప భావావేశ౦ తో ఉన్న ముగ్ధ ప్రణయ గాధ .
అస్సామీ జాతీయ గీతం ‘’ఓమోఅసోన దేశ్ ‘’రాసి తన దేశ భక్తిని ప్రకటించాడు .రాబర్ట్ బ్రౌనింగ్ లాగా దేశభక్తి భావం ఉజ్వలంగా ఉంటుంది –‘’ఓ నా మాతృభూమీ –సల్లలిత ధునీపరివృతా –మధుర ఫల సమృద్ధా – ప్రియతమ భూమీ ‘’అని కీర్తించాడు .ఎన్నో దేశభక్తి గీతాలురాశాడు .’’మనం పేదలం కాము –ఎన్నటికీ కాలేము –మనకు అన్నీ ఉండేవి ,ఉన్నాయికూడా-మనం వాటిని గుర్తించే ప్రయత్నమే చెయ్యటం లేదు ‘’అన్నాడు .’’చెట్టు ఆకులు తొడిగినంత సహజంగా కవిత్వం పుట్టుకు రాకపోతే-ఆకవిత్వం అసలు రాకపోవటమే మేలు ‘’అన్నాడు కీట్స్ కవి .ఇలానే సహజ సుందరంగా ఉంటుంది బెజ్బరూవా కవిత్వం ‘’.దృష్టిలో ,శ్రవణం లో ,హృదయాను భూతిలో ,హావ భావాల్లో రచనలో డికెన్స్ లాగా ‘’కార్లైల్ లాగా ‘’ఆకలించుకొనే కన్నూ ,చిత్రిన్చేహస్తమూ ‘’ఉన్నవాడు .అస్సామీ దేశ సాహిత్యం లో జానకి పత్రిక మైలు రాయి అయితే ,అందులో బెజ్బరూవా సాహిత్యం అర్ధ శతాబ్ది పాటు సొగసులు గుప్పించింది .సమాజానికి దారీ తెన్నూ ,ఏకత్వం కల్గించాడు ..అతని దృష్టి నుంచి చూస్తె వస్తువు స్వరూపం వికటించి నట్లు కనిపిస్తుంది ,అతనిలాగా అస్సామీ జీవితాన్ని వేళాకోళం చేసిన వారు లేరు .అర్ధ శతాబ్దికాలం సాహిత్యాన్ని ఏలిన మహానుభావుడు .వస్తు స్వరూప దర్శనం లో అభినివేశం ,దానికి తగిన శైలి,పరిశీలనాత్మక మానవతా గుణం ,దృష్టి వైశాల్యం బెజ్బరూవా సాహిత్య సృష్టికి విశిష్ట సౌందర్యాన్ని చేకూర్చాయి .
ఈయన చనిపోయిన మార్చి 26 ను ‘’సాహిత్య దివస్ ‘’గా గౌరవప్రదంగా జరుపుకొంటున్నారు .ప్రభుత్వం ఆయన గౌరవార్ధం ప్రత్యెక స్టాంప్ విడుదల చేసింది .
ఆధారం –మొదటి ఎపిసోడ్ లోనే చెప్పినట్లు హేమ్ బారువా అస్సామీ భాషలో రాసిన పుస్తకానికి శ్రీ ఆర్ .ఎస్ .సుదర్శనం తెలుగులోకి అనువదించిన ‘’లక్ష్మీ నాథ బెజ్బరూవా ‘’పుస్తకం .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-12-21-ఉయ్యూరు