22-మరుపు లో హాస్యం
మరుపున్నవాడు కూడా అసంబద్ధంగా మాట్లాడి హాస్యకారకు డౌతాడు .ఇదీ అసంబద్ధ ప్రలాపమే .ఒకడు డాక్టర్ దగ్గరకెళ్ళి తన మరుపు జబ్బు గురించి చెప్పుకొన్నాడు ‘’మా ఆవిడ బజారుకెళ్ళి ఎదో తెమ్మంటు౦ది .కాస్త దూరం వెళ్ళగానే ఆవిడ ఎక్కడకు వెళ్ళమన్నదీ, ఏది తెమ్మన్నదీ గుర్తుకు రాదు .’’అని మొరపెట్టాడు .’ఎన్నాళ్ళయింది ఈ జబ్బు వచ్చి ‘’అని అడిగితె ‘’ఏమి జబ్బు ?’’అని డాక్టరుకు బిపి తెప్పించాడు .
తాగుబోతు హాస్యం –తాగుబోతుల ప్రలాపాలూ ఇలానే ఉండి,హాస్య స్ఫోరకాలౌతాయి .ఇద్దరు ఫ్రెండ్స్ బార్ కి వెళ్లి పూటుగా లాగించి బయట కూచుని ఆకాశం వైపు చూస్తూ ఒకడు ‘’అరె చంద్రుడు ఉదయిస్తున్నాడు చూడ్రా’’అంటే ‘’అరె బేవకూఫ్ అతడు చంద్రుడు కాదు సూర్యుడు .సూర్యుడు సముద్రం లోకి దూకుతున్నాడు చూడు చోద్యం ‘’అన్నాడు .ఇంతలో బార్ లోంచి ఒకడు తాగి బయటకు వచ్చి ,మధ్యవర్తిత్వం చెయ్యమంటే ‘’ఒరే భాయీ !మాది ఈ వూరుకాదు.కనుక నాకు తెలీదు ‘’అని తప్పించుకొన్నాడు .
మరో చోట ఒక తాగుబోతు వీధిలోతూలుతూ నడుస్తూ ఉంటె, పోలీస్ ఎదురై ‘’ఇలా నడుస్తున్నావేమిటి ?ఒకకాలు సైడు కాలువ గట్టు మీద ,రెండోకాలు కాలవలో పెట్టీ ‘’అని అడిగాడు .తాగుబోతు ‘’బతికిన్చార్ సార్ !నాకాళ్ళ లో ఒకటి పొడుగ్గా ,ఒకటి పొట్టిగా ఉ౦దేమిటబ్బా ,అని బుర్ర బద్దలు కొట్టుకొంటున్నాను ‘’అని చెప్పి మామూలుగా నడిచి వెళ్ళాడు .
మరో తాగుబోతోపాఖ్యానం –ఒకడు ఫుల్ గా తాగి బల్లముందు కూచుని ఆలోచిస్తూ ఏదో రాస్తున్నాడు .స్నేహితుడు వచ్చి ‘’ఏం రాస్తున్నావ్ ?’’అని అడిగితె ‘’ఉత్తరం ‘’అంటే ఎవరికీ అంటే నాకే అనగా .ఏం రాస్తున్నావ్ అంటే ‘’ఎలా తెలుస్తుంది ఇది పోస్ట్ బాక్స్ లో వేస్తె రేపుకానీ నాకు అందదు కదా.అప్పుడు చదివి చెబుతా ‘’అన్నాడు .ఇదీ అస౦బద్ధ ప్రలాపమే .
అవివేకి పద ప్రయోగ హాస్యం –వ్యాకులం మరుపు ఎదో విషయంలో వివేకం కోల్పోయి ఉచితానుచితాలు చూడక ,అసభ్య అనుచిత మాటలు మాట్లాడితే నవ్వు తన్నుకొస్తుంది అంటారు మునిమాణిక్యం మాస్టారు .ఉదాహరణ –ఒక అల్లుడు పండక్కి అత్తారింటికి వెళ్ళాడు .అత్తగారు ‘’మీ మామగారు పనిమీద బయటికి వెళ్ళారు వచ్చేసరికి మధ్యాహ్నం రెండు అవుతుంది .ఇప్పటికే పన్నెండు అయింది .అరిసెలు మినపసున్ని ఉండలు రెడీగా ఉన్నాయి తింటావా లేకపోతె ఇంకో గంటలో పిల్లలు చద్దన్నాలు తింటారు వాళ్ళతో తింటావా ?’’అని అడిగితె’’అత్తగారూ !ఇప్పుడు అరిసెలు సున్ని ఉండలు పెట్టండి తిని ,పిల్లలతో చద్దన్నం తిని ,మామగారు రాగానే ఆయన పంక్తిలో కూచుని భోజనం చేస్తాను ‘’అన్నాడు అత్తగారు ఏమనుకొంటు౦ది అనే జ్ఞానం లేకండా .
అబద్ధాలాడే వాడూ ఈ జాతి లోకే వస్తాడన్నారు మాస్టారు .ఒకతప్పు తప్పించుకోటానికి ఒక అబద్ధం ఆడి దాన్ని నిలబెట్టుకోటానికి మరిన్నిఆడతాడు .దీనికి ఉదాహరణ మునిమాణిక్యమే చెప్పారు ‘’నా స్నేహితుడు సౌందర్య పిపాసి .దొరికిన స్త్రీలతో కామకలాపాలు చేయటంలోదిట్ట .ప్రజా సంబంధమున్న ఆఫీసులో పనిచేస్తున్నాడు .అతనితో సరసానికి ఆడ వాళ్ళు సిద్ధంగా ఉండేవారు .ఇది పై అధికారికి తెల్సి చీవాట్లు పెట్టి ‘’ఎవరైనా పరాయి అమ్మాయితో కనిపిస్తే తక్షణం ఉద్యోగం పీకేస్తా ‘’ఆన్నాడు .పరాయిస్త్రీ అన్నాడుకదా స్వ, పర భేదం ఆయనకేం తెలుస్తుందని’’ లైట్ తీస్కుని’’ మామూలుగా సాగిస్తూనే ఉన్నాడు .ఒక రోజు ఒక సుందరితో బీచ్ లో తిరుగుతుంటే ఆ అధికారి ఎదురురాగా ,మొదట కొంచెం తత్తరరపడ్డా ,తేరుకొని బె ఫర్వాగా ఎదురు పడి’’సార్!ఈ మె నా భార్య ‘’అనగా అధికారి నిప్పులు కక్కుతూ ‘’స్కౌండ్రల్ ’ఈవిడ నా పెళ్ళాం .మళ్ళీ నీ మొహం నాకు చూపించకు ఫోఫో ‘’అన్నాడు ‘’చివరికి ఏమైందో మనకు అక్కర్లేదుకానీ మనకు సురుచిర హాస్యం అందింది .ఔచిత్యం కోల్పోయి అబద్ధాలు ఆడటం అనే ఈ వ్యాపారం హాస్యం సృష్టించింది అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు మాష్టారు .
శ్రీ మునిమాణిక్యం మాస్టారు గారికి కృతజ్ఞతలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-12-21-ఉయ్యూరు