పుత్ర శతకంకవిరత్న శ్రీ లక్కెన మల్లికార్జునుడు రచించి ,వల్లూరుపాలెం గ్రామ ప్రెసిడెంట్ శ్రీ కొడాలి పున్నయ్య చౌదరికి అంకితం చేసిన కందాలతో కూర్చిన ‘’పుత్ర శతకం ‘’1938లో ఎ.జి. ప్రెస్ విజయవాడ లో ముద్రింపబడింది. వెల.3అణాలు .బాలబాలికలకు ఉపయోగ పడేట్లుగా శతకాన్ని రాశానని కవి చెప్పారు .దీనికి వీర శైవగురుకులం భూషణులు ‘’వేద కావ్యస్మృతి దర్శన తీర్ధ సాహిత్య విశారద శివశ్రీ పండిత చిదిరిమఠంవీర భద్ర శర్మగారు ముందు మాటలు రాస్తూ ‘’ఉపాధ్యాయుడైన ఈ కవి బాలుర హృదయాలను గ్రహించి సరళంగా ఈశతకం రాశారు .దీన్ని విద్యాధికారులు అనివార్య పాఠ్యం గా నిర్ణయించాలి ‘’అన్నారు .విజయవాడ సీనియర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ వేదమూర్తులు శ్రీ కుప్పా వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి ‘’ఈ కవి మల్లికార్జున శతకం ,శ్రీ సీమంతిని ,,కరి బసవేశ్వర బోధామృతం కూడా రచించారు .పుత్రశతకం ప్రాధమిక స్థాయిలో తప్పక బోధింప వలసిన పుస్తకం .ఇందులో నీతి ,సత్సంఘం దైవ భక్తీ చదువు వినయ సంపద అభిమానం ధైర్యం ఉపకారం మొదలైనవన్నీ వివరించారు .ప్రతి పద్యం అర్ధ గాంభీర్యం తో ఉంది ‘’అన్నారు .మచిలీ బందరుకు చెందిన వ్యాకరణ విద్యా ప్రవీణ శ్రీ బివి వరప్రసాద రాయ వర్మ ‘’శతకం సరస వచో లాలిత్యంగా ఉంది ;శైలి హృద్యం’’అన్నారు .వల్లూరు పాలెం బోర్డు ఉన్నత ప్రాధమిక పాఠశాల ప్రధానొపాధ్యాఉలు శ్రీ లొల్ల బాలకోటేశ్వరరావు ‘’రసవంతమైన పద్యాలతో నీతికి నిధిగా ఉన్న శతకం.బాలుర కోమల హృదయాలలో ఈ పద్య భావాలు నాటితే వారి జీవితం మూడు పూలు ఆరు కాయలుగా వర్దిల్లటం ఖాయం..సత్ప్రవర్తన అలవడుతుంది .విద్యా శాఖాధికారులు ఈ శతకాన్ని 2,3తరగతులకు పఠనీయ గ్రంథం గా తప్పక చేయాలి ‘’అన్నారు .ఈ బాలకోటేశ్వర రావు గారు నేను సైన్స్ మాస్టర్ గా మోపిదేవి జిల్లా పరిషత్ హైస్కూల్ లో మొదటి సారిగా1963లో ఉద్యోగం లో చేరినప్పుడు అక్కడ సెకండరి గ్రేడ్ టీచర్ ,గా ఉండేవారు. వీరిని మా హెడ్ మాస్టర్ శ్రీ తూమాటి కోటేశ్వరరావు గారు ‘’గురువుగారు ‘’అని చాలా భక్తితో పిలిచేవారు .మోపిదేవిలో ఉండగానే ప్రభావతి తో నా వివాహం జరిగింది ..ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం లో ఒక నెలరోజులు రోజూ ఒక దంపతుల చేత కల్యాణం చేయించారు .మా దంపతులతో కూడా చేయించి ఆ పుణ్యాన్ని మాకు దక్కించారు .వీరి పెద్ద కుమారుడుశ్రీ శ్రీరామమూర్తి జూనియర్ తెలుగు పండితులుగా మాతో పని చేశారు. ఇంకొక కుమారుడు మా హైస్కూల్ లో అప్పుడు 9వ తరగతి చదివేవాడు.తెల్ల పంచే తెల్ల లాల్చీ ఉత్తరీయ౦ ,పిలకా తరచూ ముక్కుపోడుం పీలుస్తూ తో తమాషాగా ఎడమకన్ను మూసి కనిపి౦చేవారు.ఆయన ,ఆ పరిసర ప్రాంతాల వారందరికీ గురు సమానులే . .ఆయుర్వేద శిరోమణి శ్రీ మద్దాలి వెంకటేశ్వరరావు ‘’భక్తీ యుక్తి ముక్తి తో సరస పద గు౦ఫిత౦గా శతకం ఉంది.చిరుతలపాలిటి’’జేజేల మ్రాకు ‘’అనవచ్చు ‘’అన్నారు . ఆ తర్వాత కవి కృతి కర్తపై పద్యాలు రాసి ‘’మృదు మధుర స్వభావి ,శాంతమనస్కుడు ,గ్రామాభ్యుదయానికి పాటుపడినవాడు ,లోకజ్ఞాని ,సంపదలతో తులతూగే వాడు కీర్తి సాంద్రుడు అయిన గ్రామ ప్రెసిడెంట్ శ్రీకొడాలి పున్నయ్య చౌదరి అని కీర్తించి –‘’ఎన్నో శుభముల నాతడు –నెన్నగ నా కొసగి యుంట నిది యర్పింతున్ –చెన్నుగ నిలగలదాకను-మిన్నగ నలరారునట్లు మేదిని యందున్ ‘’అని శుభం పలికారు . ఆ తర్వాత శివ ,శివా విఘ్నేశ బ్రహ్మ వాణీ స్తుతి చేసి ,శ్రీనాథ నన్ని చోడ సోమనాథ భవభూతి ,నన్నయ తిక్కనాది కవులను స్మరించి ,వీర భద్ర గురుదేవుని కీర్తించి ‘’పుత్రా ‘’మకుటంతో మొదలు పెట్టాడు .ధర్మం వేదం శాస్త్రాలు వీరశైవం గురించి చెప్పి –‘’శ్రీకర విద్యల గరపుచు –ప్రాకటముగ నీతిగరపి భవ్య శుభంబుల్ –చేకూర చేయు వారలు – నీకెప్పుడు దైవ సములు నిక్కము పుత్రా ‘’అని దైవసమానుల గురించి ఘనం గా చెప్పారు .తలిదండ్రులు గురువులు జ్ఞానం తెలిపేవారు, అగ్రజులుపెద్దలు దైవ సమానులే అన్నారు .భారతం నీతులకు పెన్నిధి .అభి వృద్ధికోసం సత్సంఘాన్ని నెరపాలి .పండిత గోష్టిలో ధర్మం మెండుగా గ్రహించాలి .’’చదువే జ్ఞానమొసగును- చదువే గురు భోగ భాగ్య సంపదలొసగున్ –చదువే పాత్రత నొసగును –చదువే సత్కీర్తి నొసగు చదువుము పుత్రా ‘’అని పుత్ర వాత్సల్యంగా చదువుకొని బాగు పడమన్నారు .వినయం బహుజన మైత్రిని సంపాదిస్తుంది ,కోరిన కోర్కేలిచ్చి సద్గుణాలు కలిగిస్తుంది .సంపాదనకంటే ఖర్చు తక్కువగా ఉంటేనే పురోగతి ఉంటుందని హెచ్చరిక చేశారు .’’మన యాంధ్ర భాష మీదను –మన యాంధ్ర జనంబుమీద మహిమాస్పదమౌ –మన యాంధ్ర భూమిమీదను –మనుజున కభిమాన ముంట మంచిది పుత్రా ‘’ అని ఆంధ్రం ఆంద్ర భాష పై అభిమానము౦డాలని 80ఏళ్ల క్రితమే చెప్పిన గొప్పభాషాభిమాన కవి.పరహితం చూడక ,పరులకు నష్టం కలిగిస్తే ‘’పరమేశుడే నిను జెరచుపుత్రా ‘’అన్నారు. ‘’నీరము కానని పంట కు –నీరదముల్ గురియ ఫలము నెగడిన రీతిన్ –దీరాత్ముల కిడివిత్తము –దారుని సత్కీర్తి ‘’పొందు అన్నారు .గురువులకు ఎదురాడవద్దనీ ,అధికారులవద్ద అబద్ధాలు చెప్పద్దనీ ,పుణ్యప్రదమైన ధర్మమూ మరువ వద్దనీ ‘’హితవు చెప్పారుకవి .’’యాచకుల బాధ బెట్టకు –మాచారము వదలబోకు ‘’శత్రువుతో మర్మం చెప్పకు ,త్రాచులతో స్నేహం చేయకు అన్నారు .పొడవటానికి వచ్చే దున్నల్ని శిక్షించినట్లే దుర్మార్గులకు గుణ పాఠం చెప్పాలి.’’నడవడి కీర్తికి మూల – మ్మడకువమూలంబు విద్య లార్జి౦చుటకున్-తొడవగు ధర్మము కలిమికి –చెడుటకు మూలమ్ము చెడ్డ చేతలు పుత్రా ‘’అని కారణాలు చెప్పారు .’’సభలలో పలుకే పస –కులుకే పస వేశ్యలకు కుజనులకెంతో-యలుకే పస భోగులకును-వలపే పస దీని తెలియ వలయు పుత్రా ‘’అని ససిగా పస ను పనసపండు వొలిచి చేతిలో పెట్టినట్లు చెప్పారు .దొంగల్ని రాజు కొరత వేయిస్తాడు .చొరత్వంతో సిరి దూరమై పోతుంది .చోరత్వం లేకపోతె శుభాలు కలుగుతాయి .పరనింద చేస్తేదురితాలు,క్రూర దుఖం ,విరోధం ,ఆపదకలుగుతాయి కనుక వద్దు అన్నారు .కన్యాదానం కంటే ‘’దీనులకు అన్నం పెట్టటం అధిక పుణ్యం అన్నారు కవి ..సత్యం పల్కితే కీర్తి పెరుగుతుంది సద్గతి సత్కీర్తి ,సకల సుఖాలు లభిస్తాయి .’’మురికియే వ్యాధులకు మూలము –మురికియే దారిద్ర్య దుఖమూలముధరలో –మురికియె గౌరవహీనము –మురికిని కలనైన నుంచ బోలదు పుత్రా ‘’ఇదే కరోనాలో మనకు గుణ పాఠమైంది .సర్వజీవులను ప్రేమిస్తే ఘనకీర్తి వస్తుంది .’’తన పేరు నిల్ప జాలిన తనయుం –డొక్క డైన జాలు తండ్రికి పెక్కం-డ్రెనయగ నీచులు గల్గిన –తన పేరును పాడు చేయు తధ్యము పుత్రా ‘’అని సాంఘిక నీతి చెప్పారు . శతకం చివరలో కవి తన గురించి చెప్పుకొన్నారు .తల్లిపేరు నాగమ్మ .మంగళం లో –జయజయ లోకా ధీశ్వర –జయజయపరమేశ ఈశజయ భవ నాశా –జయజయ శంకర యంచును –జయముగా బఠియించు చుందు సతతము పుత్రా ‘’’’మంగళమో విశ్వంభర -మంగళమో శ్రీ గిరీశ మాధవ మిత్రా –మంగళమో శశి ధర యన –మంగళములొసంగు మీ’’కుమాపతి ‘’పుత్రా ‘’అంటూ 113వ కందం తో శతకాన్ని ముగించారు కవి . పుత్ర శతకం భావ గర్భితం .నీతి,భక్తీ ,మర్యాద వినయ నడవడి సద్గుణ సౌశీల్య ,బోధకం సరళం సుందరం సురుచిరం .సుమతీ శతకం, కరుణశ్రీగారి తెలుగు బాలశతకం వంటి ఉత్తమజాతి శతకాలలో సమాన స్థాయి పొందదగినది .మా కృష్ణా జిల్లాలో, మా తొట్లవల్లూరు దగ్గర కాలువ వొడ్డున వున్న వల్లూరు పాలెం కు చెందిన కవిరత్న లక్కన మల్లికార్జున సత్కవి రాసిన గొప్ప శతకం .ప్రేరణ కలిగించేది .అత్యంత ఉపయుక్తమైనది .ముందు మాటలలో పెద్దలు చెప్పినట్లు ఈ శతకం ప్రాధమిక స్థాయిలో పాఠ్యాం శం గా పెట్టారోలేదో తెలీదు .పెట్టి ఉంటె అభినందనీయులే .ఈశతకం ,ఈ కవి గురించి కూడా ఎక్కడా మనవాళ్ళు ఉదాహరించిన దాఖలాలు కనపడ లేదు .ఈ కవినీ ,ఈ శతకాన్ని పరిచయం చేయటం నాకు అబ్బిన మహద్భాగ్యంగా భావిస్తున్నాను .మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -10-12-21-ఉయ్యూరు
వీక్షకులు
- 981,065 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- కళా విశ్వ నాథ దర్శనం -1
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.27 వ.భాగం.5.2.23.
- అరుణ మంత్రార్థం. 12వ.భాగం.5.2.23.
- ఉయ్యూరులో వీరమ్మతల్లి ఉత్సవాలు పది రోజుల సంబరాలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం -2
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -398
- గాంధీజీ కంటే ముందే అస్పృశ్యత ను వ్యతిరేకించి ఆచరించిన –తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ వెబ్ మహిళా మాస పత్రిక -ఫిబ్రవరి
- సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష. 25వ భాగం 3.2.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,925)
- సమీక్ష (1,280)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (308)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (838)
- సమీక్ష (25)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (362)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు