మల్లికార్జున శతకం
మల్లికార్జున శతకం
కవి రత్న శ్రీ లక్కెన మల్లికార్జునకవి రాసిన ‘’మల్లికార్జున శతకం ‘’15-3-1936 న పుత్రశతకం కంటే ముందే ప్రచురించాడు .మకుటం ‘’మల్లికార్జునా ‘’.
మొదటి పద్యం –‘’శ్రీ జలజోద్భవా౦డజముల జెన్నలరారు త్వదీయ శక్తియే –యా జలజాప్తుగా బరగి ,యాదరమొప్ప మదీయ చిత్త వాం
ఛా జల౦బు లన్నిటికి సత్ఫలమియ్య బతిత్వ మంది నన్- భూజన వంద్యు జేయగదదెభోగి విభూషణ మల్లికార్జునా !’’అని ప్రారంభించి ‘’అక్షయ దుష్ట శిక్షణ యజాండ నివాస త్రిలోకపాలనా –ధ్యక్ష ,మునీశ రక్ష,నిగమాంత విహార రమేశ మిత్ర రా
గక్షయ దీనపక్ష ,సురకమితడాయి శశాంక మౌళి దు-ర్దక్ష మదాపహార యని ధ్యానమొనర్చెద మల్లికార్జునా ‘’అంటూ క్షకార ప్రాసతో సునాయాసంగా పద్యం నడిపాడు .కొండ నివాసం కొండ చాపం ,కొండ మామ ,కొండకూతురే సతి ,కు౦భజులు భక్తులు ,భూమి రధం ,అయిన ‘’నీ దండికి జాలి నట్టి ఘన దైవము లేడు’’అన్నాడు .’’తిట్టియు గొట్టిమొట్టినను నిను బాధ బెట్టినన్ –చుట్టమె యక్కిరీటి ?’’కాదు సొంపుగా కాచావు ‘’అన్నాడు దిట్ట తనంగా .జూదం వద్దు సత్యం పలుకు ,తండ్రిమాట విను ,కోపం నాశనకారణం , మూర్ఖ స్నేహం వద్దు అనిహితవు చెప్పాడు .ప్రతిభ ఉంటె దేనినైనా జయించ వచ్చు .దొడ్డ గుణాలున్నవాడి దగ్గరకు దుర్భర శత్రువు వచ్చినా, కీడు ఒడ్డక కోరికలు తీర్చి పంపుతాడు ఎలాగంటే దుడ్డుతో మోది బంధం వేసి పాలు తీసే దుష్టుడికైనా దొడ్డగ ధేనువు పాలిచ్చినట్లు అని దొడ్డ సూత్రాన్నే చెప్పాడు .రౌద్ర సత్తక్క ,సిరియాలుడు ,భల్లాణ రాజు ,కన్నప్ప ల లాగా రాళ్ళతో కొట్టటం తెడ్డుతో బాదటం బాలుడినికోసి వండి భోజనం పెట్టటం కనులు పీకి అమర్చటం చేయలేని అసమర్దుడిని కనుక నాపై కటాక్షం చూపు అని ఎనేక్డోట్స్ లను బాగా ఉపయోగించాడు .ఇలాంటి పద్యాలు శైవ సాహిత్యం లో కోకొల్లలే .
భక్తిలేని ప్రవిమలజ్ఞానం ,మంచి ధ్యానం ,ఉప్పులేని వంటకంరుచి నివ్వనట్లు ముక్తినివ్వదు.సిరిబాగా ఉంటె బంధు జనం కుప్పలు తెప్పలుగా వచ్చి వాల్తారు ,సిరి పొతే కనీసం పలకరించటానికి కూడా ఎవరూ రారు అనే కఠోర సత్యం చాటాడు .జననం కర్మ బద్ధం .సంపదలు ఎండమావులు .దారాపుత్రాదులు రుణానుబంధాలు.సంసారం చెరసాల .కనుక మనుషుడికి శాంతి ఎక్కడ ?అని ప్రశ్నించాడు ..’కృపగనగా వలెన్ దానను గీర్తమ జేసిన వాని నెట్లోకీ-డపరమితంబుగా నొసగునట్టి దురాత్మకు నేని దొల్లి క్రూ
ర ఫణచయంబునన్ ,గరువరా విదిలించి ,పదాన ద్రోక్కినన్ –గృప గనుమన్న కాళియుని కృష్ణుడు కావడె మల్లికార్జునా ?’’అని కాళీయమర్దనం లో శ్రీ కృష్ణ దయామృతాన్ని చూపించాడుకవి .దుష్టుడు అని తెలిసినా కొడుకును సమర్ధిస్తే వంశనాశనమేజరుగుతుంది .గుడ్డిరాజు చూపిన పుత్రా వ్యామోహం కురువంశ నాశనానికి కారణమైనట్లు అని సందర్భ శుద్ధిగాచేప్పాడు .సభలో ఎందరున్నా ,గుణ సంపద ఉన్న పండితుడు లేకపోతె రంజకం కాదు .ఆకాశం లో తారలెన్నిఉన్నా ,చంద్రుడులేకపోతే శోభ లేనట్లుగా .ఘనుడైన వాడి గౌరవాన్ని భంగపరిస్తే –నవనందులు ధనగర్వం తో చాణక్యుని అవమానించి నంద వంశ నిర్మూలనం చేజేతులా తెచ్చుకొన్నట్లు సర్వ నాశనమౌతారు .’’మాతకు మ్రొక్కటం,తండ్రిని గౌరవించటం తాతకు సేవ చేయటం తాపస వర్యులను చేరి కొలవటం ,భూత దయ చూపటం సజ్జనులకు సహజ సిద్ధమైన లక్షణాలు .
‘’బొట్టు విభూతి భూషణము భోగి ,సఖుండు కుబేరుడాలియౌ-గట్టుల రేని బిడ్డ ,నిజకార్ముకమాహరి ,తేరుభూమినీ
పెట్టెడి పువ్వు చంద్రుడును ,పెక్కులు నిట్టివి గల్గి యుండగా –గట్టిగ భిక్ష మెత్తుటకు కారణమేమిర మల్లికార్జునా ?’’ ,అంటూ వ్యాజ స్తుతి చేశాడు .
‘’ప్రవిమల జ్ఞాన వహ్నిని యవారణ వృక్షరాజముల్ –దవిలి దహించి భస్మమును దాల్చి త్వదీయస్వరూప లింగమున్ –భవముల బాసి కంఠమునభక్తిని గట్టెద భక్తులన్దరిన్ –భువిని దలంచి కొల్చెదను బ్రోవర శ్రీగిరి మల్లికార్జునా ‘’అని తన నిశ్చయాన్ని తెల్పాడు .ఏ మతం లో ధర్మలో ఉంటూ ,శాంత౦గా నియమం తోజపిస్తారో ,కామాన్ని జయించి దీక్షతో విద్య నేర్చే వారుంటారో,ఆ మతం భూమిపై పూజ్యత పొందుతుంది అన్నాడుకవి .
చివరగా ‘’జయజయ భక్త దీనజన సాదు మునీంద్రాసురాలిరక్షణా –జయజయ వీరశైవమతసంతత వర్ధితమూల కారణా
జయజయ మంగళ ప్రద నిశాకర శేఖర పాప నాశనా –జయజయ స్రష్ట శౌరి నుత సంపద శ్రీ గిరి మల్లికార్జునా ‘’అని జయం పలికి
‘’మంగళహారతుల్ గొనియు ,మామక కర్మము ద్రుంచి ప్రేమతో –మంగళముల్ జెలంగపరమార్ధ మొసంగుచు బ్రోవవే వెసన్
అ౦గజభంగలింగ ,నగజాధిప క౦జభవాండ రక్షశ్రీ –రంగనుత ప్రదీపముని రంజిత శ్రీగిరి మల్లికార్జునా ‘’అని మంగళం 102వ పద్యం తో పాడి శతకం ముగించాడు కవి .వీర శైవం బాగా జీర్ణించుకొన్న ఈ కవి రత్న శ్రీ లక్కెన మల్లికార్జునకవి.ధారాపాతంగా భక్తిభావ కవిత్వాన్ని ప్రవహింపజేసి తన ప్రతిభా వ్యుత్పత్తులను ప్రదర్శింప జేశాడు .ఈ శతకం వీర శైవ సాహిత్యం లో ప్రముఖమై విరాజిల్లి ఉండాలి .మన వారెవరూ ఉదాహరించినట్లు కనిపించదు .రసగుళికలే పద్యాలన్నీ .నిన్న ఈకవి పుత్ర శతకాన్ని, ఇవాళ శ్రీ మల్లికార్జున శతకాన్ని పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-12-21-ఉయ్యూరు