23-ఛాందస పద ప్రయోగ హాస్యం
పామరులకున్నట్లుగానే ,పరమ ఛాందసులకూ ఒక ప్రత్యెక భాష ఉండి,పరిహాస ,ప్రహ్లాద జనకంగా ఉంటుంది .ఉదాహరణ –‘’అస్సే సూస్తి వషె బలే చౌక షె,విన్నావషె,కాదషే విస్సావజ్జల వారి బుర్రినష మన విస్సాయి కిస్తారషె’’.ఇలాఉండేది పూర్వపు చాందస వైదీకుల భాష అన్నారు మునిమాణిక్యం మాస్టారు .ఒక పండితుడు ఒక ముసలావిడతో మాట్లాడుతూ ‘’ప్రాడ్వివాకుడు ‘’అనే మాట వాడితే ఆవిడ దాని అర్ధం ఏమిటని అడగితే ఆయన చెప్పగా ‘’అదా దర్జీ అనకూడదూ హాయిగా ‘’అందట .గోదా రంగేశుల కళ్యాణ సమయం లో భోజనానికి సిద్ధమైన బ్రాహ్మణుల మధ్య జరిగిన సంభాషణ –‘’సుబ్బం భోట్లూ !విన్నావషరా !చూడి కోడ్త పెళ్లషరా.అబ్బాయినీ ,అచ్చయ్యను ,మన అవధాన్లనూ కేకేయ్యరా .సంతర్పణ లష.సంతస మొదవగగొంతు వరకు తిందాం .ముంత మామిడి పప్పు మిషాయష .పద పోదాం ‘’దీన్ని ఆచార్య బిరుదురాజు రామ రాజుగారు సేకరించారని మాష్టారన్నారు .
అనుకరణ పద ప్రయోగ హాస్యం –ప్రసిద్ధ కవుల పద్యాలను రచనలను అనుకరించి రాస్తే నవ్వు తన్నుకొస్తుంది .ఆ మార్పుల్లో వేరొక అర్దాంతరం కూడా రావచ్చు .ఇది ఎక్కువగా ఇంగ్లీష్ సాహిత్యం లో ఉంది .దీనినే పేరడీ అంటున్నారు ..తెలుగులోనూ పేరడీ రచనలున్నాయి .పోతనగారి గజేంద్ర మోక్షం లోని ‘’లావొక్కింతయు లేదు ధైర్యము విలోలం బయ్యె ‘’ప్రసిద్ధ పద్యానికి ఒక కవి శృంగార రసాత్మకంగా పారడీ పద్యం చెప్పాడు చూడండి –‘’పూవిల్కాని సరోజ బాణముల నమ్భోజారిమై చాయలన్ ,భావంబెంతయు డస్సె ,మేను బడలెన్ ,తాపంబు రెట్టించే –నే నీవాడన్ ,మధురారసం బొసగవే –నిక్కంబు నన్నేలవే –రావే మానిని కావవే తరుణీ సంరక్షించు చంద్రాననా ‘’.ఇందులో పద్యం మాత్రమె అనుకరణ భావం వేరే .
మరొక ప్రసిద్ధ –‘’కరయుగమునుచరణ౦బులు ‘’పద్యానికి ఒక పేరడీ కవి -‘’కరయుగము ను చరణంబులు ,ఉదరము,లలాట స్థల౦బు ,ఉన్నత భుజముల్ –సరి ధరణి మోపి మ్రొక్కిరి మరి మరి నీ శత్రులెల్ల మల్కిభ రామా ‘’అని రాశాడు .నాయని సుబ్బారావు గారి ‘’ఎవ్వడా క్రూర కర్ముడేవారు –నీల జలజ నిర్ముక్త శై శిర శర్వరీ ప్రశాంత –మలవాటు పడిన నిశాన్తమందు –అకట నట్టింట దీపంబు నార్పి నాడు ‘’అన్న దానికి ఒకకవి అన్ని పంక్తులూ అలానే ఉంచి చివర పాదంమాత్రం ‘’అకటా నీల్ కాల్ సిరా బుడ్డి తన్నేసినాడు ‘’అని మార్చి నవ్వు తెప్పించాడు .నాయనిగారిదే ‘’ఎవ్వడే నీ గళ మ్మునందు దిరవు కొనక నేను విసిరిన ప్రేమ ప్రసూన మాల నడుమ –నీవు చూడగ బట్టినలిపి వైచి ,నీ కనుల యందు నెత్తురుల్ నింపినాడు ‘’పద్యానికి ఒక తు౦టరికవి -‘’ఎవ్వడా తుంటరి నీవు చదువుకొనగ -నేను రచించు చున్న ప్రేమ కావ్యమును ఫర్రున చించి వైచి ,పైపెచ్చు నలిపి వైచె –నా కనులయందు నెత్తురుల్ నింపినాడు ‘’అనగా నవ్వక చస్తామా .
బిరుదు రాజు వారు జానపదం లో ఒక పేరడీ ని చూపించారని మునిమాణిక్యం అన్నారు .’’చిక్కుడు చెట్టుకూ తీగ లందమ్ము –శ్రీ కృష్ణుడి తమ్మూడికీ తిరుమణ౦ దమ్ము –పడతికి పది నెలల బాలు డందమ్ము –కాకర తీగకు కాయల౦దమ్ము-కన్న తల్లెట్టిన సొమ్ము లందమ్ము’’అనే జానపద గీతానికి హాస్యాను కరణ గా దంపుళ్ళ పాట శైలిలో ఒక కవి –‘’సువ్వి సువ్వన్నా సొగసు వల్లన్నా –బీరపాదుకు పిందేల౦దమ్ము –మా వారి ముక్కుకూ పక్కు లందమ్ము –పొట్ల పాదుకూ పూవు లందమ్ము-కాట్లకుక్కా మొగుడు కాంత కందమ్ము –మా వారి పొగ చుట్ట నాకు అందమ్ము ‘’. పేరడీ అంటే మనకు గుర్తొచ్చే మొదటికవి జరుక్ శాస్త్రి . మిగిలిన విషయాలు రేపు’’ రేవు పెడదాం ‘’..
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -10-12-21-ఉయ్యూరు