అచ్చి వచ్చిన ‘’హామ్ రేడియో ‘’ తో జాతీయ స్థాయికి ఎదిగిన ‘’ఉయ్యూరు సన్ ఆఫ్ ది సాయిల్ ‘’సూరి బుచ్చిరాం
నవంబర్ 14ఆదివారం ఉయ్యూరు జిల్లాపరిషత్ హైస్కూల్ 1976-77 బాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్ధుల సమావేశం లో సూరి బుచ్చిరాం ను చూసేదాకా ,అతడు నా శిష్యుడు అని గ్రహించలేకపోయాను .ఈ సమావేశ రూపశిల్పి, స్టీరింగ్ హెడ్,ఆల్ అండ్ ఆల్ బుచ్చిరాం అని గ్రహించాను . ఎంతసేపటికీ నా స్నేహితుడు సూరి నరసింహం అన్నగారి అబ్బాయనీ ,మరో మిత్రుడు,ఇండియాలో హాం రేడియో స్థాపకుడు సూరి శ్రీరామమూర్తి టీం లో పని చేసిన వాడు, అతని అన్నగారబ్బాయి అనే అనుకొన్నాను .ఆరోజు తెలిసింది అతడి విశ్వరూపం .వినయం ,కార్యశూరత్వం ,పాదాభివందనం చేసిన గురుభక్తి మూర్తీభవించిన నా’’ అపూర్వ పూర్వ విద్యార్ధి ‘’అని తెలిసి ఆనంద భరితుడనయ్యాను .అతడికి సరసభారతి పుస్తకాలు అంద జేయగా అతడు నాకు ‘’ఎస్. బి .రాం –ది సోషల్ సోల్జర్ ‘’అనే తన జీవిత ప్రస్థానాన్ని తెలియజేసే కలర్ఫుల్ కలర్ పుస్తకం ఇచ్చాడు దీన్ని ఇవాల్టి వరకు నేను చూడనే లేదు .ఇవాళ లైబ్రరీకి ఇస్తే అందరూ చదివి స్పూర్తి ,ప్రేరణా పొందుతారని పించింది,. అరే.ఇంత ఆత్మీయంగా భక్తిగా పుస్తకం ఇస్తే చదవకుండా లైబ్రరీకిస్తే ఏం బాగుంటుందని పించి చదివాను .చదివాక అతని గురిచి రాయకపోవటం భావ్యం కాదనిపించి శీర్షిక కోసం ఆలోచిస్తే పై శీర్షిక తట్టి వెంటనే రాయటానికి అంటే అతన్ని మీ అందరికి పరిచయం చేయటానికి ఉపక్రమిస్తున్నాను .
ఎస్బి రాం అనే సూరి బుచ్చిరాం (తాతగారిపేరు )21-6-1961 న ఉయ్యూరులో సూరి రామకృష్ణ ,సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు .ఉయ్యూరు హైస్కూల్ లో టెన్త్ పాసై ,ఆంధ్రా యూని వర్సిటి నుంచి 1982 లో గ్రాడ్యుయేట్ అయ్యాడు .భారత ప్రభుత్వ౦ లో భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు సైంటిఫిక్ అడ్వైజర్ అయిన డా సూరి భగవంతంగారికి అతిసమీప బంధువు.ఒక రకంగా మనవడి వరుస .గోవా వీరుడు సూరి సీతారం ఇతని కజిన్ బ్రదర్ కుమారుడే కనుక ఇతనికి కజిన్ .సీతారం గోవా విమోచన ఉద్యమం లో పాల్గొని 15-8-1955న పోలీస్ కాల్పులలో మరణించి అమరుడైన సంగతి మనకు తెలిసిందే .
బుచ్చి రాం శ్రీ మతి శాంతిని1987లో వివాహం చేసుకొని ఇద్దరమ్మాయిలకు ఒక కుమారుడికి తండ్రి అయ్యాడు .వీరందరికీ వివాహాదులు జరిగి ముచ్చటైన ముగ్గురు మనవళ్ళతో ఆనందిస్తున్నాడు .భారత ప్రభుత్వ ,ఆంద్ర ప్రభుత్వాలకు చెందినఎన్. జి .వో .కు అంటే నేషనల్ ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో-హైదరాబాద్ కు వ్యవస్థాపక సభ్యుడు .ఈ సంస్థ కు పూర్తి సహకారమందించిన వారు స్వయంగా ఎమెచ్యూర్ రేడియో ఆపరేటర్ కూడా అయిన భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ .ఈ సంస్థలో తన పినతండ్రి ‘’హాం సూరి ‘’గా పిలువబడే సూరి శ్రీరామ మూర్తి వద్ద 22ఏళ్ళ వయసు నుంచి 46 వ ఏడు వచ్చేదాకా 24 సంవత్సరాలు దాని అభి వృద్ధిలో భాగస్వామి అయి గొప్ప అనుభవం తో పాటు పేరు ప్రఖ్యాతులు పొందాడు .హాం రేడియో ద్వారా దేశం లో జరిగిన అన్ని రకాల ప్రకృతి విపత్తులలో ఎమెర్జెన్సి కమ్యూని కేషన్ లను అత్యంత సమర్ధ వంతంగా నిర్వహించి ,ప్రజా సేవలో ధన్యుడయ్యాడు .గుజరాత్ లోని భుజ్ ప్రాంతం లో వచ్చిన భూకంపం ,,ఒరిస్సాను వణికించిన సూపర్ సైక్లోన్ ,గుజరాత్ భూకంపం, అండమాన్ ,నికోబార్ దీవులలో సంభవించిన సునామీ ,అనేక తుఫాన్లలో ,ఆంద్ర ప్రదేశ్ ను ముంచి అల్లకల్లోలం చేసి ప్రజా జీవితాలను ఛిద్రం చేసిన అనేక తీవ్రమైన వరదల నుంచి ప్రాణ నష్టం జరగకుండా ,ముందు జాగ్రతలు తీసుకోవటానికి ప్రజలను హాం రేడియో సేవలద్వారా ప్రభుత్వాలకంటే ముందే హెచ్చరికలు చేసి ,ఆతర్వాత నిర్వాసితులైన వారికి పునరావాసం కల్పించటం లో మానవ సేవయే మాధవ సేవగా చేసిన శ్రీరామ మూర్తి బుచ్చిరాం వాళ్ళ హాం రేడియో సేవలు నిరుపమానమైనవి ,ప్రభుత్వాల గుర్తింపు పొంది ఘనమైన ప్రశంసలు అందుకొన్నాయి .సునామీ సమయం లో చేసిన సేవలకు ఈ బృందాన్ని నాటి రాష్ట్రపతి డా.అబ్దుల్ కలాం గారు రాష్ట్ర పతి భవనానికి ఆహ్వానించి గౌరవించటం చిరస్మరణీయం .ప్రధాని డా మన్మోహన్ సింగ్ గారుకూడా ఆహ్వానించి ఈ టీం చేసిన సేవలను ప్రస్తుతించి సత్కరించటం,హామ్ రేడియోకు , మానవ సేవకు దక్కిన అపూర్వ గౌరవం .
మన బుచ్చి అమెరికా ,జర్మని ,కెనడా ,ఢాకా లలో జరిగిన అనేక జాతీయ అంతర్జాతీయ సేమినార్లలకు హాజరయ్యాడు.పారిస్, ఆమ్ ష్టర్ డాం , బెర్లిన్, శ్రీలంక లను సందర్శించాడు .అండమాన్ నికోబార్ ఐలాండ్స్ తో సహా భారత దేశమంతా తిరిగి సేవలు అందించిన అనుభవం అతడిది .నేపాల్ లో వచ్చిన భారీ భూకంపసమయం లో ఈ టీం ద్వారా హైదరాబాద్ లో ‘’నేషనల్ ఎర్త్ కేక్ రిలీఫ్ కాంప్ ‘’ఏర్పరచి దుప్పట్లు ,అత్యవసర మైన మందులు ,ఆహారం సేకరించి నేపాల్ కు పంపి ఆదుకొన్నాడు .
24ఏళ్ళు సుదీర్ఘ సేవలు ఎమేచ్యూర్ రేడియో సంస్థకు అందించిన బుచ్చిరాం 2007లో అక్కడి తన ఉద్యోగానికి రాజీ నామా చేసి ,స్వంతంగా ‘’స్పందన బిజినెస్ సొల్యూషన్స్ ‘’అనే కన్సల్టన్సి సంస్థను స్థాపించి ఆర్ధిక ,ఇన్సూరెన్స్ సర్వీసెస్ లను 5 వేలమంది కి పైగా కష్టమర్ లకు అందించి వారి సంతృప్తికి కారణ మయ్యాడు .భారత దేశ ఎల్. ఐ. సి. హైదరాబాద్ డివిజన్ కు కి అత్యున్నత చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ లలో ఒకడుగా ఉన్నాడు .’’మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ ‘’కు నాలుగు సార్లు క్వాలిఫై అయిన ఘనత బుచ్చిది.2010లో ఈ సంస్థ సమావేశం కెనడాలోని వాంకూవర్ లో జరిగితే హాజరై గుర్తింపు పొందాడు .ఇన్సూరెన్స్ ఇండష్ట్రి లో అనేక మైలు రాళ్ళను దాటి ,చాలా మంది చేత ప్రశంసలు ,సర్టిఫికెట్లు అందుకొన్న ‘’సాంఘిక సైనికుడు ‘’.ఇతని అనితర సాధ్యమైన సేవను గుర్తించి ఇటీవలే’’ హైదరాబాద్ ఆణి ముత్యం ‘’బిరుదు ప్రదానం చేశారు .
బుచ్చిరాం సెవలు ఏదోఒకటి రెండు సంస్థలకే పరిమితం కాలేదు .హైదరాబాద్ లోని రామకృష్ణా మఠం నిర్వహించే వివిధ కార్యక్రమాలకు తనవంతు సేవలందిస్తున్నాడు .హైదరాబాద్ లోని వెనుక బడిన విద్యార్దులకు నిత్యాన్నదానం పధకంలో భాగస్వామి .అమృత గంగ ప్రాజెక్ట్ క్రింద రంగారెడ్డి జిల్లా అదలపు గ్రామం లో పెద్ద బావి త్రవ్వించి గ్రామస్తులకు మంచి నీటి వసతి కల్పించాడు .దీన్ని స్వామి శ్రీ సువివరానంద జీ మహారాజ్ 10-6-16న ప్రారంభించారు .శంకరపల్లి దగ్గర గాజులపల్లి లో ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మించ రక్షిత మంచి నీటి సరఫరా చేయిస్తున్నాడు .ప్రభుత్వ స్కూళ్ళలోని వందలాది వెనుకబడిన విద్యార్ధులకు పుస్తకాలు, సూల్ బాగ్స్ ఉచితంగా అందిస్తున్నాడు .వెనుకబడిన బాలికా విద్యార్ధులు గ్రూప్ , సివిల్స్ పరీక్షలకు తయారవటానికి ‘’సిస్టర్ నివేదిత రీడింగ్ రూమ్ ‘’ ను అశోకే నగర్ లో ఏర్పాటు చేశాడు .
ఇన్ని రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న బుచ్చిరాం కు తగిన గుర్తింపు ,పురస్కారాలు అందుకొన్నాడు .సాంఘిక సేవలో 30 సంవత్సరాలు సుదీర్ఘ సేవ చేసినందుకు కళా నిలయం సోషల్ కల్చరల్ ఆర్గనైజేషన్ ‘’ఎన్.టి. ఆర్ .ఎక్స్ లెన్సి అవార్డ్ ‘’అందించి సత్కరించింది .హైదరాబాద్ రామ కృష్ణ మఠం ,మిషన్ జనరల్ సెక్రెటరి శ్రీస్వామి సువిరానంద మహా రాజ్ బుచ్చి రాం చేబట్టిన అమృత గంగ ప్రాజెక్ట్ సందర్భంగా గౌరవించి సత్కరించారు .హైదరాబాద్ లోని జియోరిసోర్సేస్ టెక్నాలజీస్ కన్సల్టెన్స్ తరఫున ఏర్పాటైన ‘’Fullerence’’ ప్రాజెక్ట్ కు ఆనరరి పిఆర్ వో గా సేవ లందించాడు .హైదరాబాద్ లోని ‘’సనాతన ఎంటర్ప్యూనర్స్అసోసియేషన్ ‘’కు జాతీయ ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తూ సనాన ధర్మాన్ని కాపాడుతున్నాడు .
బాబాయి సూరి శ్రీరామమూర్తి కాంగ్రెస్ పార్టీ లో చేరి ఇందిరాగాంధీ ,రాజీవ్ గాంధీ మొదలైన ప్రధానులతో ,రాష్ట్ర పతులతో ,ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ టి.అంజయ్య గార్లతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాడు .అలాగే అబ్బాయ్ బుచ్చిరాం మాజీ ప్రధాని శ్రీ నరసింహారావు గారితోనే కాక , ఇప్పుడు బిజెపి లో చేరి ,ఆ పార్టీ కి చెందిన రాష్ట్ర ,జాతీయ నాయకులతో సంబంధాలను కలిగిజాతీయ స్థాయిలో ఇంకా ఎత్తుకు ఎదుగుతున్నాడు .’’ఉయ్యూరు సన్ ఆఫ్ ది సాయిల్’’ బుచ్చిరాం ఇంకా అభి వృద్ధి చెంది ,దేశ సేవలో తరిస్తూ ,తను పుట్టిన ఉయ్యూరు అభి వృద్ధిలోనూ ప్రత్యెక శ్రద్ధ కనబరచాలని కోరుతూ ,ఇలాంటి సేవా పరాయణుడైన వ్యక్తి నాకు శిష్యుడైనందుకు గర్వపడుతూ నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-12-21-ఉయ్యూరు