త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-2
హనుమంతరావు గారి తాతగారు సుబ్బరాజు గారు తమ మాతామహస్థానమైన మంగళగిరి వద్ద నౌలూరుకు కుటుంబాన్ని తరలించి సంతానం లేనందున దౌహిత్రుని కరణీకం అప్పగించారు .అతి వృష్టి అనావృష్టి ,కృష్ణ వరదలతో జీవితాలు అస్తవ్యస్తమై ఉండేవి .కొడుకులు నరసింహం ,రామదాసు గార్లు పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించారు .మంగళగిరి నరసింహస్వామిని దర్శించటానికి ఉత్తరాది నుండి భక్తులు విశేషంగా వచ్చేవారు .ఎంతపానకం పోసినా సగంమాత్రమే స్వీకరింఛి భొళుక్కు మని సంతృప్తి ధ్వని వినిపించే పానకాలస్వామి పై భక్తులకు బాగా విశ్వాసం .పుట్లకు పుట్ల బెల్లం కలిపి పానకం పోస్తున్నా, కొండమీద ఒక్క చీమ కూడా కనపడక పోవటం విచిత్రం .ఇది గంధక పొరలున్న కొండ అని అంటారు .మధ్యాహ్నం 12కు ఆరాధన పూర్తి చేసి అర్చకులు కొండదిగి వెళ్ళిపోతారు .మళ్ళీ మర్నాడు ఉదయమే దర్శనాదులు .కొండ దిగువ నరసింహాలయం వద్ద దక్షిణ భారత దేశం లోనే అతి పెద్దదైన గాలి గోపురం విశేష ఆకర్షణ .ఏడాది పొడుగునా ఎదో ఒక ఉత్సవం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది .మానసిక వ్యాధులను కూడా స్వామి మటు మాయం చేస్తాడని పేరు. చైతన్య ప్రభువు, నారాయణ తీర్ధులు దర్శించిన క్షేత్రం .ఫాల్గుణ పౌర్ణమికి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి .దీనికి తొట్లవల్లూరు జమీందార్ శ్రీ బొమ్మ దేవర నాగన్న నాయుడు చతురంగ బలాలతో తప్పక వచ్చి,నౌలూరులో విడిది చేసి పాల్గొని దర్శించి వెళ్ళేవారు .అప్పుడు జరిగే తిరుణనాళ్ళకు విశేష ఆకర్షణ ఉంది . సుబ్బరాజుగారు ఆ ఏర్పాట్లన్నీ స్వయం గా చూసేవారు .వీరి సాయానికి మెచ్చి నౌలూరులో ఒక పెంకు టిల్లు కట్టించి ఇచ్చారు .ఒకసారి ఆయన ఇక్కడ విడిది చేసినప్పుడు అడవి పందివచ్చి పంటలను ,ప్రజలను బాధించటం చూసి గుర్రమెక్కి వెంబడిస్తే తోతాద్రి చుట్టూ అది తిరిగితే మూడు సార్లు కొండ చుట్టూ తిరిగి దాన్ని చంపి రక్షణ కల్పించారట .
హనుమంతరావు గారి చిన్నతనం లో మంగళగిరిలో చదువు ప్రైమరీ వరకే ఉండేది .ఆతర్వాత 40ఏళ్లక్రితం చింతక్రింది కనకయ్యగారు అనే సాలె వర్తక శిఖామణి తనపేర ఒక హైస్కూల్ కట్టించారు .అది బాగా అభివృద్ధి చెందింది .తర్వాత మునిసిపాలిటి అయింది . చేబ్రోలు దగ్గర కోవెలమూడి వాస్తవ్యులు శ్రీ చెన్నా ప్రగడ బలరామ దాసు గారు మంగళగిరి వచ్చినిరతాన్న దాత కైవారం బాలాంబ గారింట్లో ఉంటూ ,దేశమంతా తిరిగి చందాలు వసూలు చేసి ఆ డబ్బుతో కిందనుండి పానకాలస్వామి గుడివరకు మెట్లు కట్టించారు .కైవారం బాలాంబ గారు నిరతాన్న దాత ,మహా భక్తురాలు .అతిధుల యోగ క్షేమాలు కనుక్కొంటూ చక్కగా వండిన పదార్ధాలను ‘’అన్నం కాస్త తిను నాయనా ఆకూర బాగుంటుంది తిను అమ్మా ‘’అని బలవంతం చేసి కడుపు నిండా భోజనం చేసి తృప్తి చెందించి తానూ సంతోషించేది .ఎవరొచ్చినా అక్కడ ఉచిత భోజన ప్రసాదం తిని వెళ్ళాల్సిందే .50ఏళ్ల క్రితం నూతక్కి వాసి మల్లాది సుబ్బదాసు గారు గాలిగోపురానికి కిందినుంచి పైదాకా మరమ్మత్తులు చేయించారు .1864లో వచ్చిన బందరు తుఫానుకు రెండు శిఖరాలు పడిపోగా ,మిగిలిన తొమ్మిది శిఖరాలను కూడా క్రిందికి ది౦పించి,మేలిమి బంగారు పూత పూయించి మళ్ళీ ప్రతిష్టించారని హనుమంతరావు గారు జ్ఞాపకంచేసుకొన్నారు .మంగళ గిరి బావులలో నీరు పాతాళం లో ఉన్నట్లు ఉంటాయి .ఒక బొక్కెన నీరుతోడటానికి ఒంట్లో ఉన్న శక్తి అంతా ధారపోయాలి .చాంతాడు కూడా చాలా పెద్దది కావాలి .అందుకే ఏదైనా పొడుగ్గా ఉంది అని చెప్పటానికి ‘’మంగళగిరి చాంతాడంత పొడుగ్గా ఉంది ‘’అనే లోకోక్తి వచ్చింది .
నౌలూరులో యాదవ ,మహమ్మదీయ సాలీల ,కమ్మ కుటుంబాలు కూడా ఉండేవి .అన్నీ మెట్ట పొలాలే.తూర్పున పోతరాజు చెరువు దక్షిణాన గంగానమ్మ చెరువు ఉన్నాయి .కొండలపై కురిసిన వర్షం నీటితో ఇవి నిండుతాయి .వీటి కింది కొద్దిగా మాగాణి సాగు ఉంటుంది .కృష్ణానదికి కరకట్ట పోయకముందు ప్రతి ఏడాదీ వరద భీభత్సమే .బీద గ్రామం .ఇక్కడి నాగేశ్వరస్వామి దేవాలయానికి రావు గారి వ౦శీకులే ధర్మకర్తలు .రుషి తుల్యుడైన పానకాలయ్య గారు అర్చకులు .ఆయన ఆగమం, సంగీతం లో నిపుణుడు .వీరిద్దరి కుటుంబాలు చాలా అన్యోన్యంగా ఉండేవి . రావు గారి తండ్రి నరసింహం గారు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గా కృష్ణా జిల్లా తిరువూరులో పని చేస్తున్నప్పుడు 1893లో హనుమంతరావు గారు పుట్టినట్లు తల్లి రాజమ్మ గారు చెప్పేది .ఈయనకు ఒక అక్క ,చెల్లి ఉన్నారు .మూడేళ్ళ వయసులోనే తల్లి చనిపోగా ,నాయనమ్మ గారు నౌలూరు వచ్చారు .ఈ ముగ్గుర్నిఅమ్మమ్మ చేతిలో పెట్టి అప్పగించి రాజమ్మగారు కనుమూశారు .తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ..రావు గారి నాయనమ్మ నూరేళ్ళు జీవించింది మంగళగిరి గాలి గోపురం కట్టటం ఆమెకు బాగా గుర్తు . అమరావతి ప్రభువు శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కట్టించిన ఈ గోపురాన్ని ఆయనే వచ్చి ప్రారంభించారు .అంత ఎత్తు గాలి గోపురమూ ఎక్కి, పై అంతస్తు నుంచి రూపాయలు వెదజల్లారట .అందులో ఒక రూపాయి వీరి తాతగారి తలపాగాలో పడిందని మామ్మగారు చెప్పారట .
ఒక్కడే కొడుకు అవటం తో రావు గారు గారాబంగా పెరిగారు. తప్పు చేస్తే తండ్రి తోలు తీసే వారట .చదువుకోసం రావు గారి తండ్రిమంగళగిరికి మకాం మార్చారు .ప్రైమరీ పరీక్ష గవర్నమెంట్ నిర్వహించేది అది రాసి పాసైనారు .చిలిపి పనులు చేయటం,తండ్రికి తెలిసి వొళ్ళు చీరేయటం మామూలే . గుంటూరు లో ఎ.యి. ఎల్. ఎం .కాలేజి హైస్కూల్ లో చేరి ఎస్. ఎస్. ఎల్సి. చదివి పాసయ్యారు .లెక్కలు బుర్రకు పట్టకపోవటంతో చదువు ఆపేశారు .1901నుంచి -06వరకు గుంటూరులో ఆయన చదువు సాగింది .అప్పుడు ఫస్ట్ ఫారం ఫీజు నెలకు రూపాయి పావలా.పూటకూళ్ళమ్మ నెలకు నాలుగు రూపాయలిస్తే కమ్మని నెయ్యి గడ్డపెరుగు,కంది పప్పు ,నాణ్యమైన కూరలు పచ్చళ్ళతో కమకమ్మని భోజనం మూడు పూటలా పెట్టేది .మిషన్ కాలేజిలో హరిజనులతో కలిసి చదువుకొన్నారు .అదేమీ ఇబ్బంది గా ఉండేదికాదు వాళ్ళ బోర్డింగ్ లకు వెళ్లి పరిశీలించి వచ్చేవారు . 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ ను విభజించగా ,నిరసనగా బెంగాలీలు వందే మాతరం ఉద్యమం చేబట్టారు .అన్ని రాష్ట్రాలో వందేమాతరం ప్రతిధ్వనించింది .స్వదేశీ వస్తువాడకం, జాతీయ విద్యాలయాలో చదువు ,ప్రభుత్వ ఉద్యోగాలు చేయరాదు ,చేతిపనులకు ప్రోత్సాహం ఆఉద్యమ ముఖ్యోద్దేశాలు .రాజా రామ మోహన రాయ్ బ్రహ్మ సమాజ ఉద్యమం ,వీరేశలింగం గారి వితంతు పునర్వివాహ ఉద్యమం వలన ప్రజలలో సంస్కారం మీద ధ్యాస పెరిగింది .మాలపల్లి నవలా రచయిత శ్రీ ఉన్నావా లక్ష్మీ నారాయణ పంతులు గారు అప్పుడు ఆదర్శ పురుషులు గా గౌరవం పొందేవారు .ఆంద్ర పత్రిక ,ముట్నూరి వారి కృష్ణా పత్రిక ,వివిధ ఉపయుక్త గ్రంథాలు చదివి రావు గారు ప్రభావితులయ్యారు .అబ్రహాం లింకన్ ,బంకి౦ చంద్రుని ఆనందమఠం నవలలతో ప్రేరణ పొంది భారత స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొనాలని హనుమ౦తరావు గారు ఉవ్విళ్ళూరారు .
సశేషం
మీ గబ్బిట దుర్గాప్రసాద్ -22-12-21-ఉయ్యూరు