మన వెండితెర మహానుభావులు -4

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -4

4-ఆంధ్రా గ్రేటా గార్బో –కాంచనమాల

అ తరం గ్లామర్ క్వీన్ కాంచనమాల 5-3-1917న గుంటూరు జిల్లా ఆంధ్రా పారిస్ అయిన తెనాలిలో జన్మించారు ..వయోలిన్ విద్వాంసు డైన చిన్నాన్న వీరాస్వామి గారి దగ్గర పెరిగారు.కొంత సంగీత జ్ఞానం ఆయనవలన పొందారు . చదువు అయిదవ తరగతి తో ఆగిపోయినా ,స్వశక్తితో తెలుగు సంస్కృతం హిందీ భాషలలో ప్రశంసార్హమైన పరిచయం సాధించారు .ఏ గురువు దగ్గర నేర్చుకోకపోయినా సంగీత నాట్యాలలో ప్రజ్ఞ సాధించారు .కలువ రేకుల్లాంటి విశాలమైన కనులు ,కలస్వన మాధుర్యాన్ని చిందే గాత్రం ,రూప లావణ్యం మెచ్చి దర్శకుడుశ్రీ  సి.పుల్లయ్య 1935లోకాశీ ఫిలిమ్స్ వారి ‘’శ్రీ కృష్ణ తులాభారం ‘’సినిమాలో మిత్ర వింద భూమికను ఇచ్చారు .డైరెక్టర్ వైవి రావు .ఆ చిత్రం విజయం పొందకపోయినా ,కాంచనమాల రూపు రేఖలు ,నటనా సామర్ధ్యం చిత్ర నిర్మాతలను విపరీత౦ గా ఆకర్షించాయి .అందరి చూపు తనవైపు ఆకర్షించేట్లు చేశారామే . అంబాలా పటేల్ హిందీలో తీసిన అభిమన్యు ఆధారంగా తెలుగులో తీసిన వీరాభి మన్యులో ఈమెను వెతికి పట్టుకొని హీరోయిన్ చేశారు .  

 1936 లో వీరాభిమన్యులో నాయకి పాత్ర,1937విప్రనారాయణ ,లో దేవ దేవిగా  తన అందాలు వొంపు సొంపులతో విప్రనారాయణ ను మాత్రమే కాక యావదాంధ్ర ప్రేక్షకలోకాన్నీ మైమరపించి నటించారు .

అభ్యుదయ భావాలున్న శ్రీ గూడవల్లి రామ బ్రహ్మ౦ గారు1938లో సారధీ పతాకం క్రింద తాను  తీసిన ‘’మాలపిల్ల ‘’సినిమాలో హీరోయిన్ చాన్స్ ఇచ్చారు .ఈ సినిమా అన్నిటా విజయం సాధించటం తో కాంచనమాల ఒక తారగా స్థిర పడ్డారు .ఈ సినిమాలో ఆమె కట్టినచీర ,గాజులు జాకెట్లు ‘’కాంచనమాల చీర జాకెట్ గాజులుగా  ‘’గా ప్రఖ్యాతిపొంది  వ్యాపారులు అలాంటి బ్రాండ్ పేరుతొ   హాట్ కేకుల్లా అమ్మి విపరీతమైన లాభాలు గడించారు .’’మాలపిల్ల ఇంత అందంగా ఉంటె ఎవరు పెళ్లి చేసుకోరు ‘’అని ఎందరి చేతనో అనిపించుకున్నారు కాంచనమాల. కులాంతర వివాహాల ఉద్యమం కాలం లో ఈ సినిమా తీయటం అందులో అంతటి గ్లామర్ క్వీన్ నటించటం సాహసమే .సినిమా సెకండ్ హాఫ్ లో ఆమెను  విద్యావంతురాలుగా తీర్చి దిద్దారు .ఒక సీన్ లో స్లీవ్ లెస్ జాకెట్ తో  చిరునవ్వుతో కాఫీ తాగే స్టిల్  వేలాది కాలెండర్ లపై  ప్రింట్ అయి,విపరీతంగా అమ్ముడయ్యాయి .అదే సమయంలో గృహ లక్ష్మి సినిమాలో వాంప్ పాత్రలో కనిపిస్తే విమర్శలు ,ప్రశంసలూ కూడా వచ్చాయి   .  ఆ నాటి మేటి హీరో చిత్తూరు నాగయ్యగారి రెండవ సినిమా వందేమాతరం లో ఆయన  సరసన  దీటుగా నటించారు  .ఈ సినిమా ఇద్దరికీ చాలా పేరు తెచ్చింది. తర్వాత 1939లో వచ్చిన మళ్ళీ పెళ్లి చిత్రం లో వితంతువుగా నటించినా బహు అందంగా కనిపించారు ,1940లో  మైరావణ లో నటించినా,బాక్సాఫీస్ దగ్గర ఫట్ అయింది .ఇల్లాలు ,మైరావణ , లలో గుర్తింపు తెచ్చే పాత్రలు పోషించారు .1942లో జెమినీ వారి ‘’బాలనాగమ్మ ‘’మెయిన్ కారెక్టర్ బాలనాగమ్మ గా నటించి నటనలో  హిమాలయ శృంగం గా నిలిచారు .అప్పటికే ఆమెను ‘’ఆంధ్రా గ్రేటా గార్బో’’ఉంప్ గరల్ అని గొప్ప పేరు పొందారు .గ్రేటా స్వీడిష్ –అమెరికన్ గ్లామర్ హీరోయిన్ ..ఎందఱో నిర్మాతలు ఆమె ఇంటి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్న గోల్డెన్ పీరియడ్ అది  ,జెమినీ అధినేత వాసన్ తో  జెమినీ చిత్రాలలోనే నటిస్తానని పొరబాటున అగ్రిమెంట్ రాసివ్వటం తో కాంచనమాల బంగారు భవిష్యత్తు దెబ్బతిన్నది .ఈ అగ్రిమెంట్ వలన వచ్చిన ఆఫర్లను తిరస్కరించాల్సి వచ్చింది .పోనీ వాసన్ కూడా కొత్త సినిమాలు తీసే ఆలోచనలోనూ లేడు.ఆమెను ఇబ్బంది పెట్టె పరిస్థితి కల్పించాడు .ఈ సినీ మాయాజాలం ఆమెకు తెలీదు .అగ్రిమెంట్ రద్దు చెయ్యమని వాసన్ తో మర్యాదగా చెప్పింది. ఆయన కుదరదుపొమ్మన్నాడు .మాటామాటా పెరిగి కాంచనమాల ‘’నీదిక్కున్న చోట చెప్పుకో .కొటీశ్వరుడవైతే నాకేంటి ?’’అని ధైర్యంగా పలికింది మాయలమారి ఆయిన వాసన్ ఈ మాటలు చాటుగా రికార్డ్ చేయించి ఆమెకే వినిపిస్తే అవాక్కై౦ది .ఈ టేపుతో కోర్టుకెక్కి ఆమె అంతు చూస్తానన్నాడు వాసన్ .ఇది ఆమెకు ఊహించని షాక్ .అదే సమయం లో ఆమె నటించిన బాలనాగమ్మ రిలీజ్ అయి అఖండ విజయం తో కనకవర్షం కురిసి వాసన్ అప్పులన్నీ తీరి  బయట పడ్డాడు.బాలనాగమ్మ పాత్ర కాంచనమాల నటనకు గీటురాయిగా నిలిచింది .హీరోయిన్ గా అదే ఆమె ఆఖరి చిత్రం అయింది .ఆంద్ర ప్రేక్షకుల నయనాలన్నీ తనవైపుకే తిప్పుకొన్న ఆమె కళ్ళు ఆ షాక్ తో శూన్యం లోకి చూడటం మొదలు పెట్టాయి ,ఇంట్లో నుంచి బయటికి చాలాకాలం రాలేదు .హిందీ సినిమాలో కుప్పలు తెప్పలుగా అవకాశాలు వచ్చినా ,తిరస్కరించి,తెలుగు మీద మమకారం తో తెలుగు సినిమాలలోనే అంకితభావంతో నటించిన అందాల నటికి ఇంతటి దుస్థితి రావటం అత్యంత విచారకరం దారుణం .ఒకరకం గా మతి స్థిమితం కోల్పోయింది .ఇలా ఉండగానే ఆమె భర్త గాలి వెంకయ్య గారు క్షయవ్యాధితో మరణించటం గోరు చుట్టుపై రోకటి పోటై ఆమెనుమరింత కుంగదీసింది .కోలుకునే ప్రయత్నం కూడా చేయలేదు .

 కాంచనమాల స్నేహితురాలు లక్ష్మీ రాజ్యం గారి బలవంతం మీద వారు 1963లో నిర్మించిన ‘’నర్తన శాల ‘’సినిమాలో ఒక చిన్న పాత్రలో చివరిసారిగా కాంచనమాల నటించారు  .ఆమె నటిస్తోందన్న వార్త విపరీతంగా వ్యాపించి వేలాది అభిమానులు ఆమెను చూడటానికి వస్తే  ఎవరినీఆమె గుర్తు పట్టక పోవటంతో తీవ్ర నిరాశ చెందితిరిగి వెళ్ళిపోయారు .దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమాకోసం మేకప్ వేసుకొన్నా ,ఆమెలో ఏమాత్రం ఆనందం కనిపించలేదు

   కాంచనమాల నటించిన ఇల్లాలు సినిమా గొప్పగా విజయం సాధించకపోయినా ,ఆంద్ర పత్రిక ఫిలిం బాలెట్ లో ఉత్తమ నటిగా ఎంపికయ్యారు .లవ్ మారేజ్ ,జింబో హిందీ సినిమాలో కూడా కాంచనమాల నటించిమెప్పించారు .కేవలం 12 సినిమాలో  మాత్రమె నటించినా  ఆమె పేరు చిరస్థాయిగా నిలిచింది .

  స్వంతవూరు తెనాలిలో ఆమె  ఎంతో ఇష్టంగా కట్టించుకొన్న స్వంత ఇల్లు  ‘’శాంతి భవనం ‘’లో ఉంటున్నా పక్కింటి వారికి ఆమె ఎవరో తెలీకుండా గడిపారు .కాంచనమాల నటనతో స్పూర్తి పొందిన నటీమణులలో  శ్రీమతి జి వరలక్ష్మి ఒకరు తొలితరం నటీమణి కృష్ణవేణి గారు తీసిన ‘’దాంపత్యం ‘’సినిమా సెట్ లో కా౦చన మాలపై ఉన్న అభిమానంతో ఆమె ఫోటో ను సెట్ లో పెట్టిఅరుదైన  గొప్ప గౌరవం కల్పించారు . వడ్లబస్తా కేవలం 3రూపాయలు అమ్మే ఆ కాలం లో కాంచనమాల సినిమలో పారితోషికంగా 10వేల రూపాయలు తీసుకొనే వారు .1975లో హైదరాబాద్ లో జరిగిన ‘’ప్రపంచ తెలుగు మహా సభలు ‘’లో కా౦చన మాలకు ఘన సత్కారం చేసినా ,ఆమె కళ్ళు శూన్యాన్ని తప్ప మరి దేనినీ చూడలేదు మహాకవి శ్రీశ్రీ ఆమె పై రెండు కవితలు అల్లి ఆరాధన తెలియ బర్చాడు .అందాలనటి కాంచనమాల జీవితం ఒక విషాద గాధ గా మిగిలి మనసులకు బాధ కలిగించింది .

  24-1-1981 న అందానికే భాష్యం చెప్పిన  అందాలరాణి నిజంగా వెండి  తెర వేలుపు కాంచనమాల అందరానంత దూరం వెళ్లి పోయారు .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-12-21-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు, సినిమా. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.