త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-5

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-5
శ్రీ హనుమంతరావు గారు ‘’మోడరన్ రివ్యు ‘’పత్రిక తెప్పించి చదివేవారు .అందులో ఇండియానుంచి అమెరికా వెళ్లి ఎంతో కష్టపడి చదువుకొన్న వారి చరిత్రలు ఫోటోలతో సహా ప్రచురించేవారు .అందులో శ్రీ మాగంటి బాపినీడు గారి చరిత్ర చదివి ప్రేరితులై తానూ కూడా అమెరికావెళ్లి చదివి తిరిగివచ్చి దాదాపు 500ఎకరాల పొలం కొని టస్కజీ వంటి సంస్థ స్థాపించి హరిజన సేవ చేయాలని పించింది .అప్పుడు అమెరికా వెళ్ళాలంటే 2 వేలరూపాయలు కావాల్సి వచ్చేది అంత దమ్ము వీరి కుటుంబానికి లేదు .తెనాలి తాలూకా పెదపాలెం నుంచి గుంటూరు వెడుతూమధ్యలో మంగళగిరి మీదుగా వెళ్ళే ఇద్దరు భూస్వాములతో పరిచయం కలిగి తన మనసులోని కోరిక వారికి చెప్పగా వారు తప్పక సహాయం చేస్తామని మాటిచ్చారు .వారికోసం వారానికో సారి పెదపాలెం వెళ్ళేవారు .1916అంతా ఈ తిరుగుడు కే సరిపోయింది .ఈ తిరుగుడులోఆవూరిలోనే ఉన్న శ్రీ పుతు౦బాక శ్రీరాములు గారితో పరిచయం కలిగి ఆయన ఎందుకు ప్రతివారమూ వచ్చి వెడుతున్నారని అడగ్గా విషయం చెప్పగా వాళ్ళమాటలు ఎవరూ నమ్మరు .మీకెంత స్థలం ,డబ్బు కావాలి అని అడిగితె,కనీసం ఒక ఎకరమైనా కావాలి అన్నారు .
శ్రీరాములుగారు సద్గుణ సంపన్నులైన పండితకవులు.చదవని గ్రంథమే లేదు తమిళం లోనూ నిష్ణాతులై తిరుప్పావై ని తెలుగు పద్యకావ్యంగా రాశారు. ద్వైత అద్వైత విశిష్టాద్వైతాది మతలాను ఆకళించుకొన్నారు.దేశాభిమానం ఉన్న వారు .గ్రంథాలే ఉద్యమం రాకముందే ఆయన స్నేహితులతో కలిసి పెదపాలెంలో ‘’ఆర్యబాల ‘’అనే పౌరగ్రంథాలయం స్థాపించగా ఇప్పడు అది కొన్ని వేల గ్రంథాలతో వర్ధిల్లింది . సుందర రూపులు. బుద్ధి తేజోమయం. మేలిమి బంగారు చాయతో అపర నున్నగా గీసిన తలతో రామానుజులు లాగా కనిపించేవారు.అయిదు అడుగుల 7అంగుళాల పొడవైన సన్నని శరీరం , కోటేరు తీసినట్లు నాశిక .తామరరేకుల కనులు .తెల్లని ఖద్దరు పంచ తెల్ల ఉత్తరీయం,ఆకు చెప్పులతో మహా ఠీవిగా ఉండేవారు .శాంత స్వరూపులు వదాన్యులు .రావు గారు చెప్పిన హరిజనోద్ధరణ కార్యక్రమం ఆయనకు బాగా నచ్చింది .ఆయనకు నరసయ్యగారనే అన్న ,క్కృష్ణయ్యగారనే తమ్ముడు ఉన్నారు .తండ్రి చనిపోయాక కుటుంబ బాధ్యత నరసయ్యగారే వహించారు .కృష్ణయ్యగారు శ్రీరాములుగారిని అనుసరించేవారు .ముగ్గురూ వైష్ణమతాన్ని తీసుకొని చక్రాంకితాలు వేయించు కొని గురూపదేశం తో దివ్య జీవనం గడిపేవారు .వారిఇల్లు పరిసరాలు శుచి శుభ్రతకు ఆనవాళ్ళు .బందుగణ౦తో నిత్యం కలకలలాడుతూ ఉండే ఇల్లు .
శ్రీరాములుగారు అన్నను తమ్ముడిని సంప్రదించి రావు గారుకోరిన ఎకరం భూమి కొనివ్వటానికి సిద్ధపడి ,గ్రామానికి పడమర కృష్ణ కాలువ వెంబడి ఉన్న భూమిని కొన్నారు .ఆ రోజుల్లో అందరివద్దా డబ్బు పుష్కలంగా ఉండేది .స్త్రీలు విద్యావంతులు సంస్కార వంతులు .వీరి సాయంతో పోగైన సొమ్ముతో ఒకపాకను నిర్మించి రావుగారు హరిజన బాల,బాలికల కోసం ‘’1917లో ఒక చిన్న పాఠ శాల స్థాపించి ‘’శ్రీ కృష్ణాశ్రమం ‘’అని పేరుపెట్టారు .ఆకాలం లో హరిజనులు చదువుకోవాలంటే తప్పక క్రైస్తవమతం తీసుకొని వారి బోర్డింగ్ స్కూల్స్ లోనే చదవాలి .ఈపిల్లలకు భోజన వసతికూడాకలిపించాలని చందాలరూపంగా పది వేలరూపాయలు వసూలు చేసి ,1923లో పెద్ద భవనం ,కొన్నిపాకలు నిర్మించి 50మంది విద్యార్ధులకు భోజన వసతి కల్పించారు రావుగారు .ఎక్కువమంది మాలమాదిగ దాసుళ్ళ పిల్లలే చేరారు .దాసులు పౌరోహిత్యం ,వైద్యమూ చేసేవారు.చదువు వలన లాభమేమిటో గ్రహించారు .బోర్డింగ్ లో ఉన్నవారే కాక మరొక అరవై మంది రోజూ బడికి వచ్చి చదువుకొనేవారు .హాస్టల్ బాలురందరూ నున్నగా గొరిగిన తలలతో ఊర్ధ్వ పు౦డ్రాలతో ,ఉదయమే కాలువ స్నానంతో పవిత్రంగా ఉండేవారు .రామభజన చేసి జావతాగి తరగతులకు హాజరయ్యేవారు .కాలవగట్టున నడిచి వెళ్ళే బాటసారులు ఈ పిల్లలు అందరూ వైష్ణవులే అని భ్రమపడేవారు .దేశభక్త కొండా వెంకటప్పయ్యగారు ,ఆంధ్రకేసరి ప్రకాశంపంతులుగారు ఈ విద్యాలయాన్ని దర్శించి ఆనంద పరవశులయ్యారు .
మంగళగిరిలో ఉన్నప్పుడు రావుగారు పోస్ట్ మాస్టారి తో స్నేహం వలన ఎక్కువకాలం పోస్టాఫీస్ లోనే గడుపుతూ ఎవరికైనా ఉత్తరాలు రాసిపెట్టాలన్నా మనియార్డర్లు పూర్తీ చేయాలన్నీ ఉచితంగా చేసేవారు. వాళ్ళు డబ్బు ఇస్తామన్నా తీసుకొనే వారు కాదు. రావు గారికి 15-16ఏళ్ల వయసులో విపరీతంగా జబ్బుచేస్తే ఊరి పోస్టు మాష్టారి సలహాతో తొట్టి స్నానం చేసి ఆరోగ్యం పున్జుకొన్నారు అప్పటికి ఈస్నానం గురించి మనదేశం లో పెద్దగా ఎవరికీ తెలియదు .జర్మనీ డాక్టర్ కూనేదీనిపై గొప్ప పుస్తకం రాశాడు .మద్రాస్ లా కాలేజిలో చదివే శ్రీ గంధం కృష్ణారావు తెప్పించి చదివి ఆరోగ్యం పొందగా ఆ వైద్యం వ్యాపించింది .రావుగారుకూడా దాన్నిచదిడవి ఆకలింపు చెసుకొనిఎవరికి ఏజబ్బు చేసినా ప్రకృతి చికిత్సతొ ఈజీ గా నయం చేసేవారు ,
1916లో పెదపాలెం కమ్మవారిళ్ళల్లో ఘోషా పధ్ధతి ఉండేది .ప్రతి ఇంట్లో ఒక తెర ఉండేది. ఆ తెర వెనకనుంచి మాత్రమె స్త్రీలు పరపురుషులతో మాట్లాడేవారు.ముసలి స్త్రీలుకూడా పరపురుషుడు కనబడితే ప్రక్కలకు తప్పుకొని పోయేవారు లేదాసందులలోకి వెళ్ళేవారు ,దాక్కొనే వారు .ఈ పధ్ధతి సంస్కారం రావాలనుకొనే రావుగారికి వింతగా అనిపించేది.ఈయన్ను చూసి సందు గొందులలోకి తప్పుకొనే ముసలమ్మలను చూసి ‘’అమ్మా నేను మీ మనవడి లాంటి వాడిని .నన్నుచూసి దాక్కోటం ఎందుకమ్మా ?’’అంటే ముసిముసి నవ్వులు నవ్వుకోనేవారు .రావు గారు ఈ గ్రామం లో ప్రవేశించిన తర్వాత ఈ ఘోషా క్రమక్రమ౦గా తగ్గిపోయింది .తర్వాత ఘోషా పాటించటం మానేసి ‘’మీరు వచ్చాక మాకు కొంత స్వేచ్చ దొరికింది ‘’అని కృతజ్ఞత చెప్పి సంతోషించేవారు .
1917జనవరిలో ముక్కోటి ఏకాదశినాడు పుతు౦బాక శ్రీరాములుగారి ఇంటి స్త్రీలు బంధువులతో వచ్చి దేవాలయానికి ఉత్తరానున్న పెరకలపూడి సత్రం లో బసచేశారు .రావుగారు దేవాలయ గదిలోతాను స్థాపించిన గ్రంథాలయం లో నిద్రించి ఉదయం స్నానాదులు పూర్తీ చేసుకొని సత్రానికి వెడుతుంటే దారిలో ఒక బంగారు గొలుసుకనిపించి విచారించగా అది శ్రీరాములుగారి భార్యగారిదని తెలిసి వెళ్లి ఇచ్చేశారు .ఆమె ‘’అయ్యా రావు గారూ!గొలుసు మీకు దొరకబట్టి నాకు తిరిగి ఇచ్చేసి నా ప్రాణాలు కాపాడారు .లేక పొతే నాగతి ఏమయ్యేదో ?”’అన్నారు .పుతు౦బాకవారి కుటుంబం లోని ఆడా ,మగా రావు గార్ని తమస్వంత మనిషిగా భావించేవారు .ఆప్యాయతగా ఉండేవారు .శ్రీనరసయ్యగారు ఏదో పనిమీద వచ్చి రావుగారి నాయనగార్నికలిసి ‘’మేము ఇదివరకు ముగ్గురన్నదమ్ములం .ఇప్పుడు హనుమంతరావు గారితో కలిసి మేము నలుగురన్నదమ్ములం ‘’అన్నారట .వీరి తండ్రి ఆనంద పరవశులయ్యారట .
రావుగారి వివాహం 1919లొ తెనాలిదగ్గర శిరిపూడిలో మద్దాలివారి ఆడపడుచు కనక దుర్గాంబ గారితో జరిగింది .మామగారుపురుషోత్తమరావు గారు సంపన్నులు.నైజాం లోని జటప్రోలు సంస్థాన పోలీస్ ఇన్స్పెక్టర్ చేసి రిటైరయ్యారు అయిదుగురు బావామరుదులు . శ్రీనివాసశిరోమణి అనే కరణం శ్రీనివాసరావు ఈయనకు షడ్ధకుడు .రెండవ బావమరది జటప్రోలు రాణీ వద్ద పియే.మూడవ ఆయన్ను కృష్ణాశ్రమ లో గుమాస్తాగా తీసుకొన్నారు .అందరూ ప్రయోజకులే .అందరూ నరసరావు పేటలో స్థిరపడ్డారు .
1919లో గుంటూరు జిల్లా కలెక్టర్ హిల్ దొర హరిజన ఉద్ధరణకు పాటుబడే హిందూ సంస్థ ఉంటె మంగళగిరిదగ్గర కురుకల్లు గ్రామంలో సుమారు నాలుగు వందల ఎకరాలు పట్టా భూమి ఇస్తామని గుంటూరు ఆర్ డివోగుండూరావు గారికి తెలియజేయగా ,ఆయన రావుగారికి తెలియజేస్తే,అంగీకరించి ఇద్దరూ కలిసి వెళ్లి ఆ భూమిని చూసి వచ్చారు ఇంతలో 1920 అసహాయోద్యమం ఉద్ధృతంగా సాగుతూండగా రావుగారిలోని జాతీయభావాలుఆ భూమిని తీసుకోటానికింగీకరించక గుందూరావుగారికి తెలి య జేయగాఆయనకు విపరీతంగా కోపమొచ్చింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-12-21-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.