మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -6
6-మూడున్నర దశాబ్దాలు వెండి తెరను ఏలిన ముక్కుమాటల విలన్ ముక్కామల
ముక్కామలగా ప్రసిద్ధి చెందిన నటబ్రహ్మ ముక్కామల కృష్ణమూర్తి (ఫిబ్రవరి 28, 1920 – జనవరి 10, 1987) తెలుగు చలన చిత్ర నటుడు, దర్శకుడు. యన డాక్టర్ సుబ్బారావు, సీతారావమ్మ దంపతులకు గుంటూరు జిల్లా గురజాలలో జన్మించారు. తల్లిదండ్రులు భార్య భారతి. కుమారుడు సుబ్బారావు. ముగ్గురు కుమార్తెలు సీతారాజ్యలక్ష్మి, పద్మావతి, శేషమ్మ.
సినీరంగం
ముక్కామల సోదరుడు కూడా శ్రీమతి లాంటి చిత్రాలలో చిన్న పాత్రలలో నటించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ముక్కామల విద్యార్థిదశ నుండే రంగస్థల నటునిగా పేరుతెచ్చుకున్నారు. ఈయన పోషించిన పాత్రలలో కెల్లా బొబ్బిలి యుద్ధం నాటకంలో బుస్సీ పాత్రను అద్భుతంగా పండించేవారు. బహుశాఆనాటకం లోనే ఎంటి ఆర్ ఎమోషన్ తో ముక్కామలను కత్తితో నిజంగానే పొడిస్తే అదృష్టవశాత్తు లోపలి దిగలేదు దీనితో వారిద్దరి మధ్య మాటలు చాలాకాలం లేవు .తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యారు .ఆ తరువాత సినీరంగములో ప్రవేశించి అనేక పాత్రలు పోషించారు. ముక్కామల ఎ.సి.కాలేజీలో డిగ్రీ కోర్సు చేస్తూ రంగస్థల నటుడుగానూ, టెన్నిస్ ఆటగాడుగాను గుర్తింపు పొందారు. తొలుత షేక్‌స్పియర్ రచించిన నాటకాలను ఆంగ్లంలో ప్రదర్శిస్తుంటే వాటిలో నటించేవారు ముక్కామల కృష్ణమూర్తి. కె.వి.ఎస్.శర్మ ఎన్టీఆర్, జగ్గయ్య లను చేర్చుకొని తాను స్థాపించిన నవజ్యోతి సమితి సంస్థద్వారా తెలుగు నాటకాలు ప్రదర్శించారు. తను స్వయంగా భక్త కబీర్, నాటకం రాసి ప్రదర్శించారు. డిగ్రీ పూర్తయ్యాక లా చదువుదామని మద్రాసు చేరుకుని, పి. పుల్లయ్య వద్ద అసిస్టెంట్ డైరక్టర్‌గా చేరి, ‘ మాయా మచ్ఛీంద్ర’ చిత్రంలో గోరఖ్‌నాథ్‌గా సినీ నటన ప్రారంభించారు. అసిస్టెంట్ డైరక్టర్గా కూడా ఉన్నారు .1949లో భరణీ పిక్చర్స్ పేరిట భానుమతి నిర్మించిన ‘లైలా మజ్ను’లో భానుమతి తండ్రిగా నటించారుమంచి రూపం తో చాలా కర్కశంగా మాట్లాడి పాత్ర క్రూరత్వానికి ప్రాణం పోశారు . అరబ్ షేక్ గా లూజు దుస్తులతో అద్భుతమైన గెటప్ తో మాటల మాయాజాలం తో ప్రేక్షకాదరణ పొందారు. తమిళ, కన్నడ, చిత్రాల్లోను పలు పాత్రలు పోషించారు. ‘మరదలుపెళ్ళీ,’ఋష్యశృంగ’ చిత్రాలకు దర్శకత్వం వహించారు.కథలు రాయడం, ఫొటోలు తీయడం, పెయింటింగ్ వేయడం ముక్కామల హాబీలు.
భక్త కబీరు నాటకం ఆయనే రాసి ప్రదర్శించి గొప్ప పేరుపొందారు .షేక్స్ పియర్ ఒదేల్లో మెక్బెత్ ఆంగ్ల నాటకాలలో నటించిగుర్తింపు పొందారు .లా చదవటానికి గుంటూరు నుంచి మద్రాస్ వెళ్ళారు .అక్కడ నటనపై మరీ మోజు పెరిగింది
ముక్కామల లాయర్ నటుడైనారు .చాలా విజయవంతమైన నటుడుగా గుర్తి౦పు మ్పుపొందారు .1945లో వచ్చిన మాయ మచ్చీన్ద్ర బాక్సాఫీస్ వద్ద బోర్లాపడినా లో గోరక్ నాథ్ గా అయన చేసిన నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి .పుల్లయ్య గారిదగ్గరే ఉంటూ దర్శకత్వ శాఖలో పని చేశారు .తెలుగు చలన చిత్ర పిత శ్రీ హెచ్ ఎం రెడ్డి ఈయనలో ఉన్న నటనకు ఆకర్షితుడై ,అప్పటిదాకా విలన్ గా దూసుకుపోతున్న ముక్కామలకు నిర్దోషి చిత్రం లోహీరో లాయర్ పాత్ర ఇవ్వగా భేషుగ్గా నటించి సత్తా చూపి తనముద్ర చూపించారు .జానపద పౌరాణిక సాంఘికాలు ఏవైనా ఆయన తన నట విశ్వ రూపాన్ని ప్రదర్శించారు శ్రీ కృష్ణార్జున యుద్ధం ,సీతాకల్యాణం కురుక్షేత్రం మొదలైన సినిమాలలో అగ్రశ్రేణి నటులతో అగ్రశ్రేణి బానర్స్ లో దర్శకులతో పని చేశారు .దాదాపు ఆయననటించిన సినిమాలు విడుదలైన థియేటర్ల బయట ఎప్పుడూ ‘’హౌస్ ఫుల్’’ బోర్డ్ ఉండటం విశేషం .గురువును మించిన శిష్యుడు సినిమాలో ముక్కామల పాత్ర చిరస్మరణీయం .
1950లో వచ్చిన స్వప్న సుందరి మాంత్రికుని పాత్ర ధరించి విలన్ గా స్థిరపడ్డారు 1953లో పరోపకారం లో హీరో పాత్ర వచ్చినా ప్రజామోదం పొందలేదు .ఏదిపాపం ,పాప పరిహారం సినిమాలలో హీరో వేషమూ జనానికి పట్టలేదు .
స్వయంగా చిత్రాలు నిర్మించి దర్శకత్వమూ చేశారు .1952లో’’మరదలు పెళ్లి చిత్రానికి నిర్మాత దర్శకుడు ముక్కామలగారే .’’హిచ్ కాక్’’ శైలిలో ఉందని ప్రశంసలు వచ్చినా ,ప్రేక్షకులు ఎక్కలేదు ..1961లో హరనాథ్ ను రుష్యశృంగునిగా ఋష్యశృంగ చిత్రాన్ని నిర్మించి ,డైరెక్షన్ చేసినా మెప్పించ లేకపోయారు ..సంపాదించిన డబ్బు అంతా సినిమాలు తీయటం లో ఖర్చై జీవితం చివర్లో ఆర్ధిక బాధలు అనుభవించారు .టినగర్లో ఉన్న పెద్ద బంగాళా ఇంటిని అమ్ముకొని చిన్న అద్దె ఇంటిలో ఉండాల్సి వచ్చింది కుటుంబ పోషణ కోసం .ఎవరినీ డబ్బు సాయం చేయమని అడగని మొహమాటస్తుడు .నటిస్తూనే మరణించారు . ముఖాన చిరునవ్వు ,చేతిలో సిగరెట్ ఆయన ఆభరణాలు .వ్యక్తిగతంగా చాలా నెమ్మదస్తులు .నాటకాలు వేసే తీరిక లేకపోవటం తో ఎక్కడైనా నాటక ప్రదర్శన ఉంటె వెళ్లి చూసి ఆనందించేవారు
1972లో అప్నా దేశ్ ,1986లో ప్యార్ కా సిందూర్ హిందీ చిత్రాలలో ముక్కామల నటించారు .బాపూగారి సీతాకల్యాణం ,శ్రీరామాంజనేయ యద్ధం ,లలో విశ్వామిత్రమహర్షి ,సీతాస్వయం వరం లో వశిష్టమహర్షి గా మంచి పేరొచ్చింది బాపుగారి ముత్యాలముగ్గులో కామరాజుగా విలక్షణ పాత్ర పోషించారు .హలం డాన్స్ కు స్టెప్పులేయటం కడుపుబ్బా నవ్విస్తుంది .నందమూరి విరాట్ పోతులూరి లో సయ్యద్ మేనమామ ,భక్తకన్నప్ప లో పెద వేమారెడ్డి ,శ్రీ కృష్ణావతారం లో కంసుడుగా జీవించారు .మర్యాదరామన్న లో మహారాజు ,పరమానందయ్య శిష్యులులో మంత్రి శివానందం ,నాటకాలలో బుస్సీ గా రాణించి బొబ్బిలి యుద్ధం సినిమాలోకూడా బుస్సీ గా నటించటం అదృష్టం .నర్తనశాలలో బామ్మర్ది కీచకుడి దయవలన రాజ్యపాలన చేస్తున్న విరాటరాజుగా ,శ్రీ కృష్ణార్జున యుద్ధం లో దుర్యోధనుడుగా ,జగదేక వీరుని కథలో మహారాజుగా ,జయభేరిలో ధర్మాధికారిగా ,తెనాలి రామకృష్ణలో తాతాచార్యులుగా శృంగారాన్ని, రాయల గురువుగా ,గురుత్వాన్ని ,పేరున్నకవులపై అసూయ ఉన్నవాడిగా గొప్పగా పోషించారు .ధర్మ దేవతలో రఘునాథవర్మ గా నిండుగా నటించారు .అప్పు చేసిపప్పు కూడులో అప్పులు చేయటం లో దిట్ట అయినకొడుకు సి.ఎస్ .ఆర్. నుఅదుపు చేయలేక కొడుకు చేత గదిలో బందీ గా ఉంటూ మనవడు జగ్గయ్య ను తండ్రికి బుద్ధి చెప్పమని ప్రేరేపణ చేసే పాత్రలో తండ్రిగా ముక్కామల చక్కగా నటించారు .1954లో ఎస్ ఎం శ్రీరాములు నాయుడు దర్శకత్వం లో భానుమతి నందమూరి నటించన అగ్గి రాముడు సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్ గా ముక్కామల ,హెడ్ గా రేలంగి కడుపుబ్బా నవ్విస్తారు . 1966లో ఎస్ డి లాల్ దర్శకత్వం లో వచ్చిన భీమాంజనేయ యుద్ధం లో కుబేరుడు గా, దండమూడి రాజగోపాలరావు భీముడుగా కామినేని ఈశ్వరరావు ఆ౦జ నేయుడుగా ,చలం మొదటిసారి చివరిసారిగా నారడుడుగా చేశారు.శోభన్ బాబు ద్విపాత్రాభినయం చేసి పి. చంద్ర శేఖరరెడ్డి దర్శకత్వం వహించిన మానవుడు –దానవుడు సినిమాలో శోభన్ బాబు ను, అక్క కృష్ణకుమారిని తీర్చిదిద్దిన ‘’దాదా’’ పాత్రలో ముక్కామల చిరస్మరణీయ నటన ప్రదర్శించారు .జగపతివారి అన్నపూర్ణలోసీరియస్ విలన్ ‘నారయ్యగా-నరహరి గా గంభీరమైన నటన చూపించారు .ఉషాపరిణయం లో బాణాసురుని రాజగురువు గా బాగా నటించారు ,మహామంత్రి తిమ్మరుసులో ప్రతాపరుద్ర గజపతి పాత్రలోజీవం నింపారు .గులేబకావళి లో చంద్ర సేన రాజుగా ,బభ్రువాహనలో నాగరాజు మంత్రి ధృత రాష్ట్రుడుగా రాజధర్మం సమర్ధవంతంగా నిర్వహించే గా౦భీర్యమైన నటన ప్రదర్శించారు .పాండవవనవాసం లో దుర్వాస మహర్షి గా తనదైన సహజ కోపాన్ని గొప్పగా ప్రదర్శించారు . ఇలా ఎన్ని పాత్రలని చెప్పగలం ?అన్ని పాత్రలను అత్యంత సమర్ధంగా నటించి ప్రాణం పోసి చిత్ర విజయాలకు కారకు లయ్యారు .
పాలిష్డ్ విలనిజానికి నేనే ఆద్యుడ ను అని ముక్కామల అంటే కాదు నేనే అని రాజనాల వాదులాడిన సందర్భం ఉంది. నిజంగా విలన్ పాత్రకు ఒక రూపు ,చూపు డైలాగు గాంభీర్యం ఇచ్చిన మొదటినటుడు ముక్కామల అనటం లో అనుమానం లేదు .అందుకే హీరో గా ఆయన్ను ఆక్సెప్ట్ చేయకుండా విలన్ గా ,కేరక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులు ఆరాధించి నీరాజనాలు పలికారు .
మాంచి భారీ పర్సనాలిటి , కోటేరు ముక్కు ,ముక్కుమాట ,చూపుల్లో గాంభీర్యం ఉన్న విలక్షణ నటుడు విలన్ రచయత ,నిర్మాత ,దర్శకుడు శ్రీ ముక్కామల కృష్ణమూర్తి 67వ ఏట మద్రాస్ లో మరణించారు .ఒక నట ధ్రువతార రాలింది .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-12-21-ఉయ్యూరు