నిన్ననే తెలిసిన రేలంగి ఉదారత్వం
రేలంగి అంటే నవ్వుల అంగీ తొడుక్కున్నాయనో ,ధర్మం చేయి బాబూ,కానీ ధర్మం చేయిబాబు అని పాడే దేవయ్య అనో ,వట్టి బద్రయ్య అనో అనుకుంటాం కానీ ఆయన గొప్ప ఆలోచనాపరుడు ,ఉదార హృదయుడు తనింట్లో లక్ష్మీ దేవులు లాగా ఆడపిల్లలు తిరుగుతూ ఉండాలని కోరుకున్నవాడు ,ఇంట్లో కాని బయట బంధువుల ఆడపిల్లల పెళ్ళిళ్ళను ఘనంగా చేసి కనీసం వందకాసుల బంగారైనా పెట్టి సంతోషించే వారు రేలంగి దంపతులు .మొదటి సారిగా ఆడపిల్ల పుడితే అప్పుడు రేలంగి మలేషియా తెలుగు సభలలో పాల్గొనటానికి వెడితే వార్త
తెలిసి పరవశం చెందాడు ‘’మా ఇంట్లో లక్ష్మి పుట్టింది’’అని అక్కడ సందడేకాదు డాన్స్ కూడా చేసినవాడు .అక్కడినుంచి తాడేపల్లి గూడె౦ స్వంత ఇంటికి వస్తూ పిల్లకు ఊయలగా ‘’బంగారు ఉయ్యాల ‘’తెచ్చాడు .బంగారు పల్లకిలో ఊపకూడదని పురోహితుడు చెబితే కొద్దిగా చిన్న బుచ్చుకొన్నా సాంప్రదాయాన్ని గౌరవి౦చిన వాడు. మాంచి నగిషీ ఉన్న టేకు ఉయ్యాల చేయించి ,ఆఉత్సవం ఘనం గా చేయించాడు .
మద్రాస్ లో ఇప్పుడున్న విజయా గార్డెన్ రేలంగిదే .ఈ విషయం మనకు దాదాపు తెలియనే తెలియదు .తనకు సినిమాలో వచ్చిన డబ్బును మొదటసారిగా పొలం మీద పెట్టి 23 ఎకరాల సుక్షేత్రమైన మాగాణి కొన్నాడు .దాన్లో పండిన ధాన్యంతో లంకంత కొంపలో దాదాపు రోజూ వందమందికి తక్కువకాకుండా భోజనం చేసే వారికోసం వినియోగించి మహా సంతృప్తి చెందేవాడు .తన తండ్రి పొలం కొనే స్తోమతు లేనివాడు. తాను అలాకాకుండా భూవసతి ఏర్పాటు చేసుకొని దాని ఫలసాయాన్ని పదిమందికి పంచి సంతృప్తి పొందాలన్న ఆరాటం ఆయనది .అందుకే మద్రాస్ లో ఆ పొలం కొన్నాడు .దాన్ని యజమానులు ముస్లిం లు ఇతరరాష్ట్రాలలో ఉన్నవారు వారందర్నీ ఒప్పించి కొన్న భూమి అది .రేలంగి విజయా నాగిరెడ్డి కుటుంబం చాలా అన్యోన్యంగా ఉండేవారు ఒకరినొకరు బావ బావా అని ఆప్యాయంగా పిల్చుకోనేవారు .వాహినీ కూడా విజయాలో భాగమే .ఇన్ కం టాక్స్ ఇబ్బందులవలన వాహినీ, విజయా వేరు చేసుకొన్నారు .విజయా నాగిరెడ్డి కొడుకులు రేలంగి ఒక్కగానొక్క కొడుకు సత్యనారాయణ బాబు మంచి స్నేహితులు .నాగిరెడ్డికి రేలంగి పొలం లో స్టూడియో కట్టాలని ఉండేది .ఆమాట కొడుకులద్వారా బాబు కు చెప్పించారు .బాబు తండ్రికి చెప్పటానికి ఇబ్బంది పడ్డాడు .ఆ పొలం లో ఫలసాయం తన కుటుంబంలోని వాళ్ళు తరతరాలుగా అనుభవించాలన్న ఏకైక లక్ష్యం తో కొన్న పొలం అది .రేలంగి ఇష్టపడలేదు .’’బ్రహ్మయ్య అండ్ కో ఆడిటర్స్’’ ఇరు వైపులా మధ్యవర్తిత్వం చేసి రేలంగి పొలం అమ్మకుండా ,ఆ పొలాన్ని లీజుకు 20ఏళ్ళు విజయావారికి ఇచ్చేట్లు ప్రతినెలా రేలంగిబాబు కు 500 రూపాయలు అద్దె కింద ఇచ్చేట్లు ఆ కుటుంబం లో పుట్టి బతికిన వారందరికీ భవిష్యత్తులో అందులో హక్కు ఉండేట్లు ఎవ్వరికీ అమ్మే హక్కు లేకుండా అనుభవించటానికి మాత్రమె హక్కు ఉండేట్లు పకడ్బందీ గా ఆలోచించి ఆడపిల్లలకు కూడా తన ఆస్తిలో హక్కు 1956లోనే ఏ చట్టం రాకముందే కల్పించిన విశాల హృదయుడు రేలంగి .కొడుక్కి నెలనెలా అయిదు వందలు వచ్చేట్లు అతనికి న్యాయం చేకూర్చాడు .ఇదంతా కార్యరూపం దాల్చాటానికి ఆరునెలలు పట్టింది రేలంగి బిజీ షెడ్యూల్ ,ఎప్పటికప్పుడు కొత్త విషయాలు చేర్చటం వలన .
నాగిరెడ్డిచేతికి రాగానే విజయా స్టూడియో కట్టాడు బయట నుంచి లోపలి ఎంట్రన్స్ వద్ద ‘’రేలంగి భూమి ‘’అని ఇప్పటికి ఒక బోర్డ్ ఉంటుంది .లోపల స్టూడియోవద్ద నాగి రెడ్డి పేరు ఉంటుంది .20ఏళ్ల లీజుయిపోతే, పరస్పరం అంగీకారం తో మళ్ళీ 10ఏళ్ళు లీజు పెంచారు .రేలంగి చనిపోయాడు ,నాగి రెడ్డీ పోయాడు. కొడుకులూ ఒకరిద్దరు పోయారు .కానీ ఖాళీ చేసి రేలంగి వారసుడైన బాబుకు అప్పగించలేదు .బాబుఅల్లుడు శ్రీ పులి శంకరరావు ది కృష్ణాజిల్లా కూచిపూడి ని ఆనుకొన్న పెదపూడి.ఈయన ఇంజనీర్ .బందరులో కొనకళ్ళ గణపతి గారు ఈయన మాతామహుడు. ఇప్పటి ఎంపి శ్రీ కొనకళ్ళ నారాయణరావు మేనమామ .శంకర్ తనమామ గారు బాబుకు నచ్చ చేప్పి ఒకటి రెండుసార్లు నాగి రెడ్డికొడుకులతో మాట్లాడినా ప్రయోజనం లేక ఆఖరి సారి వెడితే ,ఎవరో కొత్త వారిని చూసినట్లు ప్రవర్తిస్తే గత్యంతం లేక ఆభూమిపై హక్కుకై కోర్టుకు వెళ్ళారు .వాయిదాలు నడుస్తున్నాయి .ఆఆఆఆఆఇదే రేలంగి వ్యవసాయక్షేత్రం లో ఉన్న విజయా గార్డెన్స్ కదా కమామీషు.
మద్రాస్ లో ఒక ధియేటర్ కట్టి, కొడుకు బాబుకు ఇవ్వాలని రేలంగి ఎంత ప్రయత్నించినా బేరాలు కుదరక ,విసిగి చివరికి ఎక్కడో ఎందుకు తమ తాడేపల్లి గూడెం లోనే కడదామని 50ఎకరాల స్థలం కొని,అందులో రేలంగి చిత్రమందిర్ నిర్మించి కోరిక తీర్చుకొన్నాడు రేలంగి .కొడుకు బాబు దాని వ్యవహారాలు చూసేవాడు .ఒకప్పుడు రేలంగి కుటుంబం నిరుపేద స్థితిలో ఉన్నా ,మామగారు గొప్ప స్థితితిపరులైనా పిల్లనిచ్చి రేలంగికి పెళ్లి చేశారు .ఆ కృతజ్ఞత తో ఆతర్వాత మామగారి కుటుంబం ఆర్ధికంగా చితికి పోయి తమ కుటుంబం బాగా ఉన్నత స్థితిలోకి వచ్చినా ,బావమరది కూతురు తో తనకొడుకు పెళ్లి చేసి తన కృతజ్ఞత చూపాడు .ఈ పెళ్ళికి మద్రాస్ చీఫ్ మినిస్టర్ కామరాజ నాడార్ కూడా రావటం రేలంగిపై ఉన్న అభిమానం .గొప్ప విశేషం .ఇప్పుడు ఈ సినిమా హాల్ స్థలం లో ఆధునిక వసతులతో రెండు దియేటర్లు 50 షాపింగ్ మాల్స్ ఒక కళ్యాణ మ౦డపం తో నిర్మించి రేలంగి ఆస్తికి సార్ధకత తెచ్చారు .
మద్రాస్ పొలం అలా విజయావారి స్టూడియోకి దక్కితే, తనకు భూమి మీద పంట మీద ఉన్న ఆపేక్షతో రావులపాలెం రావిపాడు మధ్య 89ఎకరాల దివ్యమైన మాగాణి భూమి యకరం 3వేలకు కొని, తన కులంవారికే కౌలుకు ఇచ్చి ఫలసాయం పొందేవాడు రేలంగి. కొన్నేళ్ళ తర్వాత రైతులు సరిగ్గా ఫలసాయం అప్పగించకపోతే ,విసుగు చెంది వాళ్ళకే యకరం వెయ్యి రూపాయల వంతున అమ్మేసి సంతోషించాడు .కొంతమంది డబ్బులు చెల్లించకుండా భూమిని అనుభవిస్తున్న వారూ ఉన్నారు .వారిపై ఎ చర్య తీసుకోలేదు .
ఆకాలం లో అక్కినేని నందమూరి లకు సినిమాకు కనీసం 30వేలు ఇస్తే రేలంగికీ అలాగే ఇస్తామంటే ‘’వాళ్ళు హీరోలు .వాళ్ళు లేకపోతె సినిమాలు ఉండవు .కనుక నాకు వాళ్ళకన్నా ఒక వెయ్యో రెండు వేలో తగ్గించి ఇవ్వండి ‘’అని నిర్మాతలకు నచ్చచెప్పి తీసుకొన్న ఔదార్యం రేలంగిది .తిరుపతి వెంకటేశ్వర యూని వర్సిటికి 4లక్షల విరాళం ,కేరళ యూనివర్సిటికి 2లక్షల విరాళం ఇచ్చిన ఉదారుడు రేలంగి .తిరుపతి కి వెళ్ళిన యాత్రీకులు ఆకాలం లో మద్రాస్ వచ్చి నాగేశ్వరరావు రామా రావు లను చూసి భోజనం మాత్రం రేలంగి ఇంట్లో చేసి వెళ్ళేవారు. ఎంతమంది వచ్చినా అక్కడ గొప్పమర్యాదగా భోజనాలు కల్పించేవాడు .స్వంత పొలం లో పండిన వడ్లను అక్కడే మర పట్టించి రైలు లుద్వారా మద్రాస్ కు తెప్పించుకొని స్వంత బియ్యం వండించి భోజనం పెడుతున్న గొప్ప సంతృప్తిపొందేవాడు . వచ్చిన వారిని వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారా లేదో అడిగి తెలుసుకొనేవారు ఆర్ధిక ఇబ్బండులలౌన్నామని వారు చెబితే , వెంటనే వెయ్యి లేక రెండు వేలు చేతిలోపెట్టి బాగా చదివి౦చమని ప్రోత్సహించేవారు .ఆడపిల్లలకు పెళ్లిళ్లకు ధన సాయం చేసేవారు .అందరిఇళ్ళు పిల్లా జెల్లా తో కళా,కా౦తులతో ,ఆనంద ఉత్సాహాలతో సంతృప్తి వెల్లి విరియాలని రేలంగి గోప్పమనసు ఆరాట పడేది. .మద్రాస్ లోఎమ్జి రామచంద్రన్ రేలంగిని ఏనుగు పై ఊరేగించి తాను తాడుపట్టుకొని దానిముందు నడుస్తూ మహా గొప్ప గౌరవం కల్పించాడు .య౦గ్ మెన్స్ హాపీక్లబ్ లో రేలంగి అంజలి భర్త ఆదినారాయణరావు ఎస్వి రంగారావు మొదలైన వారంతా మెంబర్స్ .అందర్లో రేలంగి అందరితో చనువు మంచి మాటకారితనం ఉండటం తో ఏ నిర్మాత, డైరెక్టర్ అయినా రేలంగికి చెబితే తగినవారిని ఆయన ఒప్పించి నటి౦ప జేసేవాడు .ఇలా ఎందరికో జీవిక కల్పించిన మహాదారుడు రేలంగి .
ఈ విషయాలన్నీ నిన్న’’ లయన్ న్యూస్ చానల్’’ లో శ్రీ పులి శ౦కరరావు అంటే రేలంగి మనవరాలిభర్త అంటే కొడుకుబాబు కూతురి భర్త ఇంటర్వ్యు లో చెప్పిన సంగతులు ఆసక్తిగా చూసి మీకోసం అందించాను .
2022నూతన సంవత్సర శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-12-21-ఉయ్యూరు