మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -8
8-లాలిత్య కోమలత్వాలతో తెలుగు సినీ పాటను సంపన్నం చేసిన- అశ్వత్ధామ
తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు శ్రీ గుడిమెట్ల అశ్వత్థామ 21-8-1927న పగోజి నరసాపురం లో వరదాచారి రుక్మిణి దంపతులకు జన్మించారు . తండ్రి వరదాచారి జలియన్‌వాలాబాగ్ సమరంలో మిలటరీ కమాండర్‌గా పనిచేశాడు. ఇతని తండ్రి సైన్యం వదిలి సన్యాసులలో కలిసి పోవడంతో ఇతని తల్లి తన పిల్లలను తీసుకుని మద్రాసులోని ఆమె తమ్ముని ఇంట చేరింది. బాల్య జీవితం చాలా కష్టంగా గడిచింది. కుటుంబ పోషణ కోసం ఏవేవో చిన్నచిన్న పనులు చేసి డబ్బులు సంపాదించేవారు. చిన్నతనం నుండే సంగీతంపట్ల మక్కువ ఉండేది. దెందులూరి శివరామయ్య, మహావాది వెంకటప్పయ్య, టైగర్ వరదాచారి, ద్వారం వేంకటస్వామినాయుడుల వద్ద సంగీతం క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. మల్లాది రామకృష్ణశాస్త్రి, సముద్రాల రాఘవాచార్య మొదలైనవారు ఆదరించారు
1951లో కమలను వివాహం చేసుకున్నారు. ఈమె వీణావాదనలో డిప్లొమా చేసింది. ఈమె కొంతకాలం మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో కళాకారిణిగా పనిచేసింది. వీరికి విజయరాఘవన్ అనే ఒక కొడుకు, గాయత్రి, శ్యామల అనే ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. ఇతని కుమార్తెలు ఇరువురు కూడా ప్రముఖ వీణా విద్వాంసురాళ్ళు. గాయత్రి తమిళనాడు సంగీత, లలిత కళల యూనివర్శిటీ ఉపకులపతిగా పనిచేస్తున్నది.
ఈయన 50కిపైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన దేవత చిత్రంలో బాలనటుడిగా చిత్రరంగ ప్రవేశం చేశారు. భాగ్యలక్ష్మి, త్యాగయ్య సినిమాలలో చిన్న పాత్రలను ధరించారు .తరువాత సంగీత దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేసి సంగీత దర్శకుడిగా ఎదిగారు.తెలుగుతో పాటు తమిళ మళయాళ సినిమాలకూ సంగీత దర్శకత్వం వహించారు
చిన్నవయసు 48ఏళ్లకే 21-5-1975 న మద్రాస్ లో మరణి౦చారు .లాలిత్య కొమలత్వాలను సినీ గీతాలకు అద్ది అజరామరం చేశారు అశ్వత్ధామ . సినీ సంగీతంలో ఐరావతంఆయన .
మిలటరీ కమాండర్ గారి అబ్బాయి కనుక ‘సరిగమపదని’ స్వరాల్ని సరిగ పదమని ఆదేశించే ప్రజ్ఞా ‘పాట’వం అతనికుండేది.తండ్రిపేరు మరో గురువుపేరు కూడా వరదా చారి కావటం విశేషం .నాగయ్యగారి త్యాగయ్యసినిమాలో బాల శ్రీరాముడు వేషం వేసింది అశ్వత్ధామ యే.
అశ్వత్ధామ సంగీతం అంటే నాకు మహా గొప్ప ఫాసినేషన్ .ఆయన గురించి ఎంతో చెప్పాలని ఉంది .కానీ నాకంటే ముందే 2013లో డా.తాతిరాజు వేణుగోపాల్ గారు అద్భుత మైన విశ్లేషణ చేశారు దీన్ని మా అబ్బాయి శర్మ వెతికి నాకు పంపాడు దాన్ని యధాతధంగా మీకు అందిస్తున్నాను అంతకు మించి ఏమైనా ఉంటె నేను రాస్తాను బహుశా ఉండక పోచ్చు
–డావతాతిరాజు వేణుగోపాల్, 19 మే 2013 గారు రాసిన అద్భుత విశేషాలు –
అశ్వత్ధామ పాతి కేళ్ళుమాత్రమే సంగీత దర్శకత్వం చేసినా అది మూడు దశలలో సాగింది . 1950 నుంచి 1959 వరకు తొలిదశ, 1960 నుంచి 1967 వరకు మధ్య దశ, 1970 నుంచి 1973 వరకు తుది దశ! డబ్భయిల నాటి స్కూల్ పిల్లందరికి ఆ నాలుగేళ్ల పాటు అశ్వత్థామ ట్యూన్స్ అన్నీకంఠస్థమే. ముఖ్యంగా అప్పట్లో ఎల్లారీశ్వరి ఎల్లరి ప్రియతమ గాయని కదా. ముక్కు చూడు ముక్కందం చూడు(మానవుడు దానవుడు), కంచెకాడ మంచెకాడ, నీ సన్నిధే నా పెన్నిధి (ప్రేమపక్షులు), అందుకో కలకల కిలకిల జిలిబిలి నగవులు నూరేళ్ళు(బాలుతో-పసిడి మనసులు) – అశ్వత్థామ మలచిన జానపద, పాశ్చాత్య కలగలుపుల్లో ఇవి కొన్ని మాత్రమే. ఏసుదాస్ గొంతు నుంచి ‘తెల్లరేదాక నువ్వు తలుపు మూసి తొంగుంటే తగువెట్టా తీరేదే తలుపు తీయవే భామా(ప్రేమ పక్షులు)’ పాట రావడం, అదీ రేడియో శ్రీలంక నుంచి సాయంత్రం ప్రసారం కావడం అదో అందమైన జ్ఞాపకం ఆ రోజుల్లో.
సుశీలమ్మ పాడిన కానడా నడక – శ్రీగౌరి శ్రీగౌరియే శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసినా (విచిత్ర దాంపత్యం)–స్టేజి మీద కదిలితే పాడే అమ్మాయికి, నాట్యమాడే అమ్మాయిలకి ఆ రోజుల్లో మొదటి బహుమతి తప్పని సరిగా వచ్చేసేది.
పచ్చని మనకాపురం పాల వెలుగై మణి దీపాల వెలుగై (మానవుడు దానవుడు), కనులు మాటలాడునని మనసు పాట పాడునని కవితలల్లితి ఇన్నాళ్ళు (మాయని మమత), నా మనసే వీణియగా పాడనీ (విచిత్ర దాంపత్యం)….వంటి కళ్యాణ రాగ గీతికలు వినిపించని ఇల్లే ఉండేది కాదు.
చిన్నారి నీ చిరునవ్వు విరిసిన మల్లెపువ్వు పొన్నారి నీ అందం పూచిన పూడెందం (పసిడి మనసులు) అని పగలు పాడుకుంటూ మురిసి పోయిన యువకుడు రానిక నీకోసం సఖీ రాదిక వసంత మాసం (మాయని మమత) – పాట పాడుతూ కుమిలిపోని రాత్రి ఉండేది కాదు.
అమ్మా లాంటి చల్లనిది లోకామొకటి ఉందిలే (మానవుడు దానవుడు) – అని ఏ తల్లి పాడినా పిల్లలు హాయిగా ఆకలి మరచిపోయి నిదరోయేవారు. అణువు అణువునా వెలసిన దేవా కను వెలుగై మము నడిపింప రావా(మానవుడు దానవుడు) – చంద్ర కౌ(జ్ రాగ లాలిత్యం ఎందరో డాక్టర్లని దేశభక్తులుగా మార్చింది.
‘ఎవరికోసం ఎంతకాలం ఈ జాజిపూలు రోజు రోజు పూసి పూలు పూచేది ఎవరికోసం’ (విచిత్ర దాంపత్యం) –శివరంజని రాగంలో ఈ పాట ఆయన స్వర పరచి ఎంత కాలమో కంట తడి పెట్టించారు.
ఈయనెవరో బలే ఇస్తున్నాడు పాటలు – అని పొందుతున్న ఆ ఆనందం అట్టే కాలం నిలవ లేదు. 1975 మే నెల రానే వచ్చింది. అశ్వత్థామ శాశ్వతంగా విశ్వ శయ్యపైన మేను వాల్చారు. అశ్వశక్తి ఉన్న అశ్వత్థామ సంగీతం ఒక చరిత్ర అయిపోయింది.
మధ్య దశలో ఎన్నెన్ని మాణిక్యాలు మలిచారూ… కవీశ్వరులు మల్లాది రచనలే అసామాన్యం అనుకుంటే వాటికి ఈయన అందించిన స్వర రచన అసాధారణం! ఈ సంగీత సాహిత్య దిగ్గజాల (అందులో ఒకరి పేరే అచ్చంగా అశ్వత్థామ) మధ్య ఏమిటీ ‘అన్యోన్యం?’. ఇప్పటికీ అది ‘unknown’యం!
‘ధర్మమే జయం’ లో కొన్ని పాటలు ఈయనవే. ఆ సినిమానే వెతుక్కోవడం ఇప్పుడు కష్టం. అందులో ఈయన చేసిన మూడు పాటలేవన్నది చెప్పడం మరీ కష్టం.
పద్మశ్రీ వారి ‘జగన్నాటకం’ అనే సినిమా ఒకటుందని ఎందరికి తెలుసు? అందులో మల్లాది వారి ఇష్ట పదాలైన మగరాయ, మరుమల్లె మరో దశకంలోనూ వికసించాయి. ‘జగన్నాటకం’ చిత్రం తోనే ఒక మెయిన్ గాయనిగా ఎల్లారీశ్వరి నలుగురికీ తెలిసింది.
మంజీరా వారి ‘చివరకు మిగిలేది’ – సినిమా పేరు అదేమీ చిత్రమో కాని (ఆ సినిమాలోని ప్రధాన భూమిక పోషించిన) నటీమణి సావిత్రికి నిజ జీవితంలో చివరకు మిగిలిందేమిటీ అని బాధపడని తెలుగువాడు ఉండడు. ఒక్కటి నిజం – అప్పటికీ ఇప్పటికీ అనే కాదు ఎప్పటికీ ‘చివరకు మిగిలేది’ మల్లాది వారి పద సంపదా, అశ్వత్థామ వారి స్వర సంపద మాత్రమే. ఇందులోనే జమునారాణి ఆలపించిన ‘అందానికి అందం నేనే – జీవన మకరందం నేనే’ అనే పాట ఉంది. ఆ పాటలో స్వాతిశయం ఉంది. అహంకారం కాదు. దాన్ని అంతే అందంగా అంటే ఒక మోహన గీతంగా మలచిన అశ్వత్థామ గారికి జోహారు.
అందానికి అందం – అని మల్లాది వారు చల్లిన విత్తనం తరువాతి కాలంలో అందానికి అందానివై (దత్తపుత్రుడు –దాశరథి), అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ (సిరిసిరిమువ్వ – వేటూరి) వంటి మరో రెండు గీతాలకి జన్మ నిచ్చింది. అయితే వీటి స్వర కర్తలు – చలపతి రావు గానీ, మహదేవన్ గానీ అశ్వత్థామ స్వర రచన అనుసరించక పోవడమే విశేషం. ఎందుకంటే అశ్వత్థామ స్వర నడక ‘రూటే’ వేరు!
మల్లాది గురువుగారు పాటలకి అచ్చ తెనుగు జిలుగులద్దితే వాటికి తెలుగు జాతీయాల సొగసు చూపించింది శిష్యుడు ఆరుద్ర గారే. ఒక్కసారి పింగళి వారి రుచికర సాహిత్యం (వివాహ భోజనంబు) గుర్తొచ్చి ఆయన రాయకుండా వదిలేసిన గోంగూరను చేరదీశారు ఆరుద్ర. దేవాంతకుడు రాకెన్ రోల్ వరసలో ‘మనసారా’ ‘మనసా రా’ అంటూ పాడిన ‘గో గో గో గోంగూర’ అశ్వత్థామ స్వర వంటకమే. గోగోగో—అంటే క్విట్ ఆంధ్రా అని కాదిక్కడ. అందుకే జై ఆంధ్రా అన్నారు ఆరుద్ర. ఇదిగో ఇదిగో ఇదిగో అనేదానికి సంక్షిప్త రూపం అనుకుందాం. గోంగూర పులుపో కాదో తెలియదు కానీ ఆ పాట మనసారా కోరుకున్నది ఆ చిత్ర దర్శకులు ‘పుల్లయ్య’ గారే.
చంద్రికా వారి శ్రీకృష్ణ రాయబారం లో మళ్ళీ కృష్ణుడు ‘దైవరాయ’ అని అనిపించుకున్నాడు మల్లాది వారి దయ వల్ల. అశ్వత్థామ స్వర కర్త. మళ్ళీ – అని అనడం ఎందుకంటే అంతకు ముందు ‘తెల్లవార వచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా ….దైవరాయ నిదుర లేరా’ (చిరంజీవులు) అని అందుబాటులో ఉన్న జానపదానికి తనవైన ‘దైవరాయ’ సొగసులద్ది ఇచ్చినది మల్లాది వారే. ఆ చిరంజీవులు చిత్ర స్వర కర్త ఘంటసాల. మల్లాదివారి దృష్టిలో ఘంటసాల,అశ్వత్థామ ఇద్దరూ చిరంజీవులే. ఆయు:ప్రమాణ దృష్ట్యా చూస్తే అశ్వత్థామ, ఘంటసాల, మల్లాది వారు శ్రీకృష్ణ రాయబారమో ఏమో భగవత్ గీతా లోకానికి తొందరగా తరలిపోయిన ధన్య జీవులు. నిజానికి అశ్వత్థామకి తెలిసిన దైవరాయడు నాగయ్య గారే. తొలినాళ్ళలో ఈ అపర ‘త్యాగయ్య’ కి సహాయకుడిగా ఉండేవారు. అటువంటి నాగయ్య ‘భక్త రామదాసు’ చిత్రం తలపెట్టి, తీసిన సినిమాని ఆర్ధిక వనరులు కుదరక అవతల పెట్ట వలసి వస్తుంటే తలా ముందుకొచ్చి సాయపడ్డారు. అలా ఆ రామభక్త చిత్రానికి సంగీత దర్శకుడైన నాగయ్య గారికి సంగీత సహకార మందించిన వారు – సినీ సంగీతానికి ఆద్యుడైన ప్రభాకరశాస్త్రి, నాలుగవ పేరుగా చెప్పుకునే ఓగిరాల రామచంద్రరావు లైతే ఉడతా భక్తిగా అశ్వత్థామ కూడా నిలబడ్డారు. అందులో మహమ్మద్ రఫీ ఆలపించిన కబీరు తత్వాలు ఈయన స్వర పరచినవే.
నవశక్తి వారికి అశ్వత్థామ గారి అశ్వ శక్తి మీద ఎంత నమ్మకమో. తెలుగు సినీ గీతాల సిలబస్ అంటూ ఒకటుంటే తప్పక అందులో మొదటివిగా చెప్పుకోదగ్గ పాటలు వారి ‘కలిమి లేములు’ సినిమా ద్వారా వినిపించారు. అవి మల్లాది వారి రచనలే అని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ‘కొమ్మల మీద కోతికొమ్మచ్చు లాడింది తెల్లా తెల్లని ఓ బుల్లి ఎండ’(పిల్లల భాషలో వచ్చిన ఏకైక పిల్లల పాట), ‘అయ్యారే ..చూడ చక్కని చక్కనయ్య ఓర చూపులే చూశేవు’ (అచ్చమైన కోలాటం పాట), గాలిలో తేలే పూల డోలలో …చిననాటి ఆనందసీమలో (అమలిన స్నేహ బాంధవ్య గీతం) – మూడు పాటలు చాలు తెలుగు కీర్తి బావుటా ఎగరడానికి. కలిమికీ,లేమికీ తప్పనిసరి అయిన గంగిగోవుపాలు అందించిన కామధేనువు అశ్వత్థామ సంగీతం..
‘గాలిలో తేలే’ పాట ఒక రకంగా గజల్ లా సాగుతుంది. ఆ సంప్రదాయం అశ్వత్థామ గారికి ఎంత ఇష్టమో చివరకు మిగిలేది లోని కొన్ని పాటల ద్వారా తెలుసుకున్నాం. అని నీవన్నది విన్నానోయి….అటువంటిదే. అంతగా తెలియని ముక్కామల సునంద గారి నోట ఆ పాట రావడం, అందానికి అందం నేనే – పాట జమునారాణి గారు పాడడం, కవి కోకిల – పాటని సుశీలమ్మ చేత పాడించడం, తత్వాన్ని ఎమ్మెస్ రామారావు గారికివ్వడం, సిస్టర్ – అని తాగుబోతు ప్రేలాపన మధ్య ఆవేదన జొప్పించి పాడే చేవ ఉన్న ఘంటసాల వారిని ఎంచుకోవడం – సంగీత దర్శకుడిగా అశ్వత్థామలో అంతర్గతంగా ఉన్న ప్రతిభని చూపిస్తున్నాయి. ఒక్కొక్క భావం ఒక్కొక్క గళంలో అనుకున్న దానికన్నా ఎక్కువగా రాణిస్తుంది. అలా గల నిర్ణయం చెయ్యడంలోనే స్వరకర్త గొప్పతనం తెలిసేది, అంతేకాని నిర్మాత ప్రమేయం ఎంత మాత్రమూ కాదు. స్వేఛ్చ ఉంటే స్వర కర్త హృదయం పెడతాడు – అని నిరూపించిన వారు అశ్వత్థామ!
వీలునామా’ సినిమాకి ఈయనే స్వరకర్త. ఒక్క పాటైనా వినే వీలు కలుగుతుందా, ప్రయత్నించాలి. మణులు ఊరికే దొరకవు. వెతుక్కోమంటాయి.
అప్పటికే మాస్టర్ వేణు వరవడి గా ప్రవేశపెట్టిన వలజి రాగానికి ముగ్దుడైపోయి అశ్వత్థామ ‘మా ఇలవేలుపు నీవేనయ్యా మము కాపాడే రామయ్యా …రాం రాం సీతారాం’ పాట చేసి ‘మా వదిన’ కిచ్చారు, కలలు కనే వేళ ఇదే కన్నయ్యా – పహాడీ లో అమ్మ ఆలపిస్తే ఆ అమ్మ ఒడి అనే లోయలో హాయిగా పవళించే భాగ్యం ఆ కాలం చంటి పిల్లలది. ‘సిసలైన చిన్నావాళ్ళం’ – అని ఈ సినిమాలోని పాట పాడుతూ కాస్త పెద్ద పిల్లలు ఇళ్ళలో హడావుడి చేస్తే ‘ఉండండ్రా’ అని అమ్మమ్మలు కేకలు వేసిన కాలమది.