మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -10

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -10 10- –మొట్ట మొదటి డైలాగ్ కింగ్,స్టేజి స్టార్ -శ్రీ వేమూరి గగ్గయ్య వేమూరి గగ్గయ్య (1895 ఆగష్టు 15 – 1955 డిసెంబర్ 30) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా నటుడు. ప్రతినాయక పాత్రల్లో నటనకు వేమూరి గగ్గయ్య పేరుపొందారు. సినిమాలలో రాక ముందు ప్రసిద్ధి చెందిన రంగస్థల నటుడైన గగ్గయ్య క్రూర పాత్రలకు పెట్టింది పేరు[1]. సావిత్రి (1933) సినిమాతో రంగప్రవేశం చేసి శ్రీకృష్ణలీలలు, ద్రౌపదీ వస్త్రాపహరణం తదితర సినిమాల్లో ప్రతినాయక పాత్రలు ధరించి ప్రసిద్ధి పొందారు. గగ్గయ్య కంఠం, ప్రతినాయక పాత్రల్లో నటన తెలుగు ప్రేక్షకులపై గాఢమైన ముద్రవేసింది. బాల్యం, నాటక రంగం ఇతను 15 ఆగష్టు 1895 తేదీన గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. చిన్నతనంలో సంగీత సాధనతో మొదలైన కళాభిమానం – నటనవైపు తిరిగింది. తానుగా నటనను అభ్యసించి, ధాటిగా పెద్దశ్రుతితో పద్యాలు ఆలపించడంలో దిట్ట అనిపించుకుని సురభివారి నాటకాల్లో పాత్రలు ధరించడంతో నటజీవితం ఆరంభించారు గగ్గయ్య. నాటకాలతో ఊళ్లూ, దేశాలూ తిరిగాడు. ఒక్క రంగూన్‌లోనే పదిమాసాలపాటు ఉండి నాటకాలు ప్రదర్శించారు. తర్వాత తెనాలి వచ్చి ఫస్టుకంపెనీ అనే నాటక సంస్థలో చేరి పాత్రధారణ చేశారు. మైలవరం కంపెనీ మహానందరెడ్డి బృందం గగ్గయ్య నటనాశక్తిని గుర్తించి బాగా వినియోగించుకున్నాయి. నాటకాల్లో నటిస్తున్నా సాధన మానలేదు. కంఠానికి పదునుపట్టి, తారాస్థాయిలో పద్యం చదవడం అలవాటు చేసుకున్నారు. మైకులూ, స్పీకర్లూ అన్నవి ఎరగని రోజులు గనక, పాత్రధారులందరూ గట్టిగా పద్యాలు చదవడం, సంభాషణలు చెప్పడం ఉండేది. అటువంటి రోజుల్లోనూ నటులందరిలోనూ గగ్గయ్య గాత్రం మాత్రం ఎంత దూరానికో వినిపించేది. ప్రతినాయక పాత్ర అభినయించడం ఆరంభించిన దగ్గర్నుంచి ఆ పాత్రధారణకు అతనే సాటి అన్న పేరు తెచ్చుకున్నారు. యముడుగానో, కంసుడుగానో, అతను రంగప్రవేశం చెయ్యడంతోటే ప్రేక్షకులు కరతాళధ్వనులు చేసేవారు. ఖంగుమనే కంఠంతో, ప్రతి అక్షరాన్నీ సుస్పష్టంగా పలుకుతూ, రాగ భావ యుక్తంగా పాడి వన్స్‌మోర్‌లు కొట్టించుకునేవాడు గగ్గయ్య. అతనిది పెద్ద శరీరం కాదు, కాని పాత్రలో గంభీరాకృతితో ‘పర్వతప్రమాణం’లో కనిపించేవారు. కళ్లు పెద్దవి, పాత్రలో కణకణలాడుతున్న చింతనిప్పుల్లా కనిపించేవి. అందుకనే అందరూ ముందు వరుసల్లో కూర్చుని గగ్గయ్య నాటకాలు చూడాలని చెప్పుకునేవారు. నాటకంలో ఎవరున్నా లేకపోయినా, గగ్గయ్య వున్నాడని తెలిస్తే చాలు గ్రామాలనుంచి ప్రజలు బళ్లమీద తరలివచ్చేవారనీ, నాటకాల్లో నటిస్తున్నప్పుడే అతనికి ‘స్టేజిస్టార్‌’గా గుర్తింపు వుండేదనీ చెబుతారు. సినీ జీవిత సావిత్రి సినిమాలో వేమూరి గగ్గయ్య ఈస్టిండియావారి సావిత్రి (1933)లో యమధర్మరాజు పాత్రతో గగ్గయ్య సినిమారంగప్రవేశం జరిగింది. అతను సావిత్రి నాటకంలో యముడి పాత్ర సమర్థంగా పోషించడంతో సినిమాల్లోకి తీసుకున్నారు. ఆ చిత్రంలోని “పో బాల పొమ్మికన్‌, ఈ మృగారణ్యమున రావలదు, రా తగదు, రాచనదు పో బాల పొమ్మికన్‌” అని లయబద్ధంగా మాటలు విరుస్తూ విసుర్తూ తీవ్ర కంఠంతో సావిత్రి పాత్రని ఉద్దేశిస్తూ పాడిన పాటకి – ప్రేక్షకులు లయబద్ధంగా చప్పట్లు కొట్టి వెర్రెత్తిపోయారు. అది సినిమా అని తెలిసినా, ఆయన చదివిన పద్యాలకి ‘వన్స్‌మోర్‌’లు కొట్టారు. ఆ చిత్రం తొలి తెలుగు చిత్రం భక్తప్రహ్లాద (1931) కంటే విజయవంతం అయింది. శ్రీకృష్ణలీలలు (1935)లో కంసుడి పాత్ర ఇంకా ఆకర్షించింది. “ధిక్కారమును సైతునా కుటిలజనధిక్కారము సైతునా” అని కంసుడి క్రోధకంఠంతో పాడిన పాటను ప్రజలు పాడుకునేవారు. ద్రౌపదీ వస్త్రాపహరణం (1936)లో శిశుపాలుడుగా ఆయన “స్నానంబు సలుపు లేజవరాండ్ర చీరెలు కాజేసినందుకా” అని చదివిన పద్యాలూ, చెప్పిన సంభాషణలూ ఆ సినిమాలు చూసినవారందరికీ గుర్తుండిపోయాయి. సతీ తులసి (1936)లో జలంధరుడు, భక్త మార్కండేయ (1936)లో యముడు, జరాసంధ (1938)లో జరాసంధుడు, మైరావణ (1940)లో మైరావణుడు, దక్షయజ్ఞం (1941)లో దక్షుడు, భక్తప్రహ్లాద (1942) లో హిరణ్యకశిపుడు వంటి పాత్రల్లో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా తొలిచిత్రం సీతారామ జననం (1944)లో గగ్గయ్య రెండు పాత్రలు ధరించారు – రావణుడూ, పరశురాముడూ. నాటకాల్లో నటిస్తున్నప్పుడే ఆయన పద్యాల్నీ, పదాల్నీ గ్రామఫోను కంపెనీలు రికార్డు చేసి, విరివిగా అమ్మి విపరీతంగా సొమ్ముచేసుకున్నాయి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా – అవే సినిమా పాటలు మళ్లీ రికార్డులుగా వస్తే అవీ అలాగే ఆకర్షించాయి. మొదట్లో ఆయన హరికథలు కూడా చెప్పేవారు, సినిమా నటుడైన తర్వాత కూడా చెప్పడం కొనసాగించారు. స్వభావం అంతటి ప్రతినాయక పాత్రధారి బయట మాత్రం సౌమ్యుడు. మామూలు మాట అతి సరళం. ఇతని కుమారుడు వేమూరి రామయ్య కూడా ప్రసిద్ధుడైన రంగస్థల నటుడు.[2] ఇతను మహారథి కర్ణ నాటకంలో చాలా కాలం కర్ణ పాత్రధారిగా నటించారు. కొన్ని చిత్రాల్లో కూడా నటించారు. ధరించిన పాత్రలకీ, ఇతని గుణగణాలకీ ఏమీ సంబంధం లేదనీ, ఎన్నో గుప్తదానాలు చేశాడనీ, ఎందరో పేదవారి పిల్లలకి చదువు చెప్పించాడనీ రామయ్య చెబుతూ ఉంటాడు. విశేషంగా కనిపించేది ఏమిటంటే – ఎక్కువగా దైవదూషణ చేసే పాత్రలే ధరించినా, గగ్గయ్య గొప్ప దైవభక్తుడు. దైవకార్యాలమీద అమిత శ్రద్ధాభక్తులుండేవి. దైవకార్యాల నిమిత్తం ఎవరొచ్చి ఏమి అడిగినా సంతోషంగా సహాయం చేసేవారు. ఆ రోజుల్లో ఎవరైనా గట్టిగా మాట్లాడితే వారిది “గగ్గయ్య కంఠం” అనేవారు. కోపిష్టి గురించి చెప్పడంలో “ఆయనా? కోపంలో గగ్గయ్యే!” అనేవారు. అలా కోపానికీ, గంభీరకంఠానికీ గగ్గయ్య మారుపేరుగా కీర్తిపొందాడు. పెద్దగా చదువుకోలేదు. కాని, నాటకాలకు జీవితాన్ని మళ్లించుకున్న తర్వాత, కావ్యాలూ, ప్రబంధాలూ, పురాణాలూ చదివి భాషనీ, భావాన్నీ క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు.అంగిక చలనం తో పాటు ,సాత్విక చలనమూ ప్రస్ఫుటమయ్యేది .భవానీ శంకరుడి పాత్రలో ‘తాతలనాటి క్షేత్రములనెల్ల ‘’పద్యం బాగా క్లోఇక్ అయింది .ఆది శంకరాచార్య విరచిత ‘’భజ గోవిందం ‘’శ్లోకాలు గగ్గయ్య స్వరం లో అమృతాలు జాలువారి నట్లు తాత్విక ప్రభ విన్చినట్లు గానం చేశారు . తమిళ నాటకాల్లో క్రూరపాత్రధారుల్లో మేటి అనిపించుకున్న ఆర్‌.యస్‌.మనోహర్‌ “తనకి తెలుగు రాకపోయినా గగ్గయ్య నాటకాలు చూసే తాను ప్రభావితుడినయ్యాననీ – తన రౌద్రపాత్రధారణకు ఆయనే స్ఫూర్తి” అనీ చెప్పాడు. మరణ౦ తెలుగు చలన చిత్ర రంగం లో ‘’మొదటి డైలాగ్ కింగ్ ‘’ గా ప్రసిద్ధుడైన వేమూరి గగ్గయ్య 1955 డిసెంబర్ 30న కేన్సర్ వ్యాధితోమరణం పొందారు.గగ్గయ్య పేరు వింటేనే ఆరోజుల్లో పసిపిల్లలు కాళ్ళ వెంబడి కార్చుకోనేవారని చెబుతారు .ఆ కంఠ ధ్వనివంటే చాలు పరవశించి వచ్చి నాటకం ,సినిమా చూసి మనసారా మెచ్చుకొనేవారు నటించిన సినిమాలు 1. భక్త శిరియాళ (1948) 2. గరుడ గర్వభంగం (1943) 3. భక్త ప్రహ్లాద (1942) —> హిరణ్యకశిపుడు 4. సీతారామ జననం(1942) —> రావణాసురుడు[,పరశురాముడు 5. దక్షయజ్ఞం(1941) —> దక్షుడు 6. చండిక (1940) —> గిరిరాజు 7. మైరావణ (1940) —> మైరావణుడు 8. జరాసంధ (1938) 9. మార్కండేయ (1938) —> యముడు 10. మోహినీరుక్మాంగద (1937) 11. ద్రౌపదీ వస్త్రాపహరణం (1936) —> శిశుపాలుడు 12. సతీ తులసి (1936) 13. శ్రీకృష్ణ లీలలు (1935) —> కంసుడు 14. సీతా కల్యాణం (1934) 15. సావిత్రి (1933) —> యముడు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.