మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -12

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -12 12-‘’చేయెత్తి జైకొట్టు తెలుగోడా మరియు అంచెలంచెలు లేని మోక్షము’’ ఫేం-స౦గీత దర్శకులు,కవి శ్రీ బి. గోపాలం శ్రీ వేములపల్లి శ్రీ కృష్ణ రచించిన ‘’చేయెత్తి జైకొట్టు తెలుగోడా –గతమెంతో ఘనకీర్తి కలవోడా ‘’పాటనుస్వరపరచి దేశమంతటా విస్తృతంగా పర్యటించి గానం చేసి ,మహా ఉత్సాహాన్ని నింపిన సంగీత జ్ఞుడు శ్రీ బి గోపాలం అంటే బొడ్డు గోపాలం .ఇంతటి ఉత్తేజకరమైన పాటను పాడిన ఈ గాయకుడే శ్రీ కృష్ణార్జున యుద్ధం సినిమాలో చినముని అయిన అల్లు రామలింగయ్యకు ‘’ అంచెలంచెలు లేని మోక్షము’’ చాలకష్టమే భామినీ ‘’పాటపాడారంటే ఆశ్చర్యమేస్తుంది .గుంటూరు జిల్లా తుళ్ళూరు గ్రామం లో 1927జనవరిలో శ్రీ బొడ్డురామదాసు దంపతులకు గోపాలం జన్మించారు తండ్రి సంగీత కళాకారుడు. హరికధలు చెప్పేవారు .ఆ జీన్స్ ఉన్న గోపాలం గారికి చిన్నప్పటి నుంచి సంగీతం పై మక్కువ ఉండటం గుర్తించిన తండ్రి బెజవాడలో సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు వారణాసి బ్రహ్మయ్య గారి వద్ద 1939లో చేర్చారు .గాత్రం తో పాటు వయోలిన్ కూడా నేర్చి నిష్ణాతులయ్యారు 1944లో గుంటూరు జిల్లా ప్రజా నాట్యమండలితో గోపాలం గారికి మంచి పరిచయం ఏర్పడింది .ఆ నాటి రాజకీయ ,సాంఘిక పరిస్థితులపై గొప్ప అవగాహన కల గోపాలం గారు పీడిత జనులపక్షాన నిలిచారు .ప్రజా నాట్యమండలిలో శ్రీ వేములపల్లి శ్రీ కృష్ణ ,బుర్రకథ వీరుడు షేక్ నాజర్, వేపూరి రామకోటి మొదలైన అభ్యుదయభావాలు కలవారితో గాఢ పరిచయమేర్పడింది .శ్రీ కృష్ణగారిని తెలుగు సంస్కృతిని ప్రతి బి౦బి౦ప జ ఒక పాట రాయమని గోపాలం గారు అడిగితె ఆవిర్భవించిన పాటే-చేయెత్తి జైకొట్టు తెలుగోడా ‘’. దీనికి గోపాలం గారే స్వరపరచి పాడారు .ఆనాటి ప్రజా నాట్యమండలి కార్యక్రమాలలో నాజర్ బుర్ర కథ,గోపాలంగారి ఈ పాట గొప్ప ఉత్తేజాన్ని కలిగించేవి .పూర్తిపాట ఇలా ఉంటుంది – చెయ్యేతి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తీ గలవోడా వీర రక్తపుదార వార వోసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్ తాండ్రపాపయ్య కూడ నీవోడోయ్ నాయకినాగమ్మ మల్లమాంబ మొల్ల మగువ మంచాల నీ తోడ బుట్టిన వోళ్ళే వీర వనితల కన్న తల్లేరా ధీరమాతల కన్నభూమేరా కల్లోల గౌతమీ వెల్లువలా కృష్ణమ్మ తుంగభద్రాతల్లి పొంగిపారిన చాలు ధాన్యరాశుల పండు దేశాన కూడు గుడ్డకు కొదువలేదోయి ముక్కోటి బలగామొక్కటై మనముంటే ఇరుగు పొరుగూలోనా ఊరుపేరుంటాది తల్లిఒకటే నీకు తెలుగోడా సవతి బిడ్డల పోరు మనకేలా పెనుగాలి వీచిందీ అణగారిపోయింది నట్టనడి సంద్రాన నావ నిలుచుండాది చుక్కాని బట్టారా తెలుగోడా ..నావ దరి చేర్చరా మొనగోడ అలాగే శ్రీ పులుపుల వెంకట శివయ్యగారి ‘’పలనాడు వెల లేని మాగాణిరా ‘’పాటనుకూడా గోపాలం గారే స్వరం కట్టి పాడేవారు ఈ రెండు పాటలతో అటు రాసిన వారికీ వీరికీ గొప్ప పేరొచ్చింది . శాతవాహన తెలుగు చక్రవర్తుల శౌర్య మిదెబ్రాహ్మ్య మిదెక్షాత్రమన్న గర్జా ఘోష పులకలే యెత్తించెరా పలనాట పౌరుషమ్మే పొంగెరా! తొలిసంజ దీక్షతో తెలుగు శిల్పుల చేతి పోగరలు మలచిన బుద్ధయుగ జీవితము నవశిల్ప రతనంబురా ,పలనాట నాగార్జునుడి కొండరా! బౌద్ధనాగార్జునిని బుద్ధవిజ్ఞాజ్యోతి వరమహా యానమై వసుమతిని ప్రవహింప హెచ్చుతగ్గులు సమసెరా పలనాట విజ్ఞాన ప్రభ వెలిగెరా! వర్ణధర్మాలన్న ఉక్కుచట్రము పగిలి మాల కన్నమదాసు మనసైన సుతుడుగా వీరవైష్ణవ మొచ్చెరా, పలనాట బ్రహ్మన్న కలిగీతలో! మగువ నాగమ్మతో మాయ యుద్ధము వచ్చి మగువ మాంచాల తా మగని రణమున కంప వీరవనితలు పుట్టిరీ ,పలనాట శౌర్యముగ్గులు పెట్టిరీ! బాలచంద్రుని కత్తి పదును మెరపులు మెరసి తరలి కారంపూడి ధర్మరణరంగాన వీరరక్తము చిందెరా,పలనాట నాగులేరై పారెరా! బాలచంద్రుని కదన కౌశలము కధలల్లి శ్రీనాధ కవిరాజు చంద్రవంకకు చెప్ప ఎదకరిగి ప్రవహించెరా ,పలనాట ఎత్తిపోతల దూకెరా! కృష్ణరాయల సభా కవిదిగ్గజాలలో ఘటికాశతగ్రంధ కరణధుర్యుండైన భట్టుమూర్తే వెలసెరా, పలనాట ప్రౌఢ శ్లేషలు పల్కెరా! కలిమి బలిమీ గల్గు కర్షకుల సీమలో కానికాలం వచ్చి కలహములు చెలరేగ కుంఫిణీ వాడొచ్చెరా, పలనాట ఖైదుకొట్టులు కట్టెరా! దాస్యమూ దోపిడీ దారిద్ర్యమూ హెచ్చి పాడిపంటల మేలి బంగారు నాతల్లి కరువుకాటకమొచ్చెరా, పలనాడు కంటనీరెట్టిందిరా! ఒక్క సుముహూర్తాన ఉప్పొంగి భరతోర్వి స్వాతంత్ర్య సమరాన సింహనాదం సేయ మేరువైనిలచిందిరా, పలనాడు ముందుండిపోరిందిరా! కన్నెగంటి హనుమంతు కోరమీసము త్రిప్పి పలనాటి ప్రజలచే పన్నులెగబెట్టించె బలియిచ్చె హనుమంతునూ, పలనాడు పరప్రభుత్వపు గుండ్లకూ! ఆనాటి పౌరుషాలానాటి విక్రమా లానాటి వైభవాలానాటి సంస్కృతుల్ ఈనాటికీ చరితలోనా, పలనాడు వెలయించె బంగారుతో! వెనుకతరములవారి వీరచరితల సిరులు నార్వోసి త్యాగంబు నీర్వెట్టి పెంచరా ! విరిసి సుఖములు పండురా, పలనాడు వెలలేని మాగాణిరా! రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో హిట్లర్ కీ అతడి నాజీ సైన్యానికి వ్యతిరేకంగా సోవియట్ ఎర్ర సైన్యానికి విజయం కలగాలని గోపాలం పాటలు రాసి పాడి ప్రచారం చేశారు –‘’స్టాలినో నీ ఎర్ర సైన్యం –ఫాసిజం వినాశ సైన్యం ‘’అనే ఆపాట విపరీతంగా జనాదరణ పొంది ఫాసిజం కు వ్యతిరేకత ఉవ్వెత్తున ఎగసి పడింది .హిందీ సినీ గాయక పితామహ సైగల్ మరణానికి చలించి గోపాలం రాసి పాడిన పాట కూడా బాగా ప్రాచుర్యం పొందింది .జిల్లా స్థాయి నుంచి వీరిపేరు రాష్ట్రస్తాయికి ఎదిగింది ప్రభుత్వ నిర్బందాలవల్ల ప్రజానాట్య మాండాలి కార్యక్రమాలు తెరమరుగయ్యాయి . వెంటనే విజయవాడ ఆకాశ వాణి కి దగ్గరై ,నండూరి వారి ఎంకి –నాయుడు బావ ,భక్తరామదాసు వంటి వాటితోపాటు దేవులపల్లి, విశ్వనాథ గార్ల సంగీత రూపకాలు ,గేయాలు ఆలపించి ప్రసిద్ధులయ్యారు .రేడియో కేంద్రం లోని గాయని రేణుక గారితో పరిచయమై వివాహం చేసుకొన్నారు . ప్రముఖ సినీ దర్శకులు శ్రీ తాతినేని ప్రకాశరావు గారి పిలుపు నందుకొని మద్రాస్ వెళ్లి 1952జనవరిలో ఘంట సాల వారి వద్ద సహాయకులుగా చేరారు .పల్లెటూరు ,బతుకు తెరువు,పరోపకారం సినిమాలకు సహాయమందించారు .మరో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ టివి రాజు గారి వద్ద తోడు దొంగలు జయ సింహ ,నిరుపేదలు సినిమాలకు పని చేశారు .ఈ మూడేళ్ళ సినీ అనుభవంతో గోపాలం గారు సంగీత దర్శకులయ్యారు .నలదమయంతి చిత్రానికి సంగీతః౦ కూర్చారు . ఆతర్వాత రక్తకన్నీరు నాగభూషణం గారి రక్తకన్నీరు ,కలికాలం ,పాపం పండింది ,నాటకాల రాయుడు నాటకాలకు సంగీతం అందించారు .మరో ప్రఖ్యాత సంగీత దర్శకులు శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారితో కలిసి రంగుల రాట్నం హిందీ ,కన్నడ తమిళ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు .వీటిలో కొన్నిటికి నేపధ్యగానమూ అందించారు .1972-84 కాలం లో పన్నెండేళ్ళు నాట్యాచార్య శ్రీ వెంపటి చిన సత్యం గారి ఆధ్వర్యం లో శ్రీనివాస కల్యాణం ,రుక్మిణీ కల్యాణం ,పారిజాతాపహరణం మొదలైన నృత్య రూపకాలకు సంగీతం ,నేపధ్యగానం అందించి దేశ విదేశాలలో పర్యటించారు . బికారిరాముడు ,నలదమయంతి సినిమాలతర్వాత కొన్ని కన్నడ సినిమాలకు మ్యూజిక్ కూర్చారు .మధ్యమధ్యలో డబ్బింగ్ సినిమాలూ చేశారు .ఆయన చేసిన ముఖ్యమైన తెలుగు సినిమాలు –అప్పగింతలు ,రౌడీ రంగడు ,పెద్దలుమారాలి ,మునసబు గారి అల్లుడు ,పుణ్య భూమీ కళ్ళు తెరు ,ఒక అమ్మాయి కథ ,కరుణామయుడు మొదలైనవి గోపాలం గారి భార్య రేణుకగారు 1982 డిసెంబర్ లో మరణించటం తో తీవ్ర దిగ్భ్రాంతి,,మానసిక అశాంతికి లోనయ్యారు .సంతానం కూడా లేక పోవటం తో జీవితం వెలితిగా తోచింది .నిరాడంబరం కల నిగర్వి అహంకారం శూన్యులు గోపాలంగారు .ఎవర్నీ విమర్శించే వారు కాదు అందర్నీ చక్కని చిరునవ్వుతో పలకరించటం వీరి నైజం .అసూయ ద్వేషం లేని మనస్తత్వం .దీనికి తగ్గట్టే తెల్లని దుస్తులు ధరించి వ్యక్తిత్వాన్ని చూపేవారు .గోపాలంగారి మరో ప్రత్యేకత ఏమిటంటే ఫిడేలు వాయిస్తూ సునాయాసంగా పాడటం .ఇదో అరుదైన విషయం .శాస్త్రీయ సంగీత నేపధ్యం లో అపారమైన గానమాదుర్యంతో ఫిడేలు వాయిస్తూ ,అద్భుతంగా గానం చేసి శ్రోతలను ఉర్రూతలూగిస్తూ మై మరపించే వారు . 1943లో బెజవాడ లో జరిగిన అఖిల భారత రైతు మహా సభలలో ఫిడేలు వాయిస్తూ ,’’స్టాలినో నీ ఎర్ర సైన్యం ‘’పాటను ఎంతో ఉద్రేకంగా పాడి ,లక్షలాది జనాన్ని ఉత్తేజితులను చేసి హర్ష ధ్వానాలు అందుకొన్నారు .తెలంగాణా పోరాట ఉద్యమకాలం లో ‘’ఖబడ్దార్ –ఖబడ్దార్ –నైజాం పాదుషా ‘’గీతం పాడి ప్రజలను ఉద్రేక ఉత్సాహ పూరితులను చేశారు .ముందే చెప్పినట్లు ‘’చేయెత్తి జైకొట్టు తెలుగోడా ,పలనాడు వెలలేని మాగాణి రా’’ గీతాలు గోపాలంగారి బాణీలకు తిరుగులేని సాఖ్యాలు మర్చిపోలేని తీపి గుర్తులు . శ్రీ బిఎన్ రెడ్డి గారి దర్శకత్వం లో వచ్చిన ‘’రంగుల రాట్నం ‘’చిత్రం లో రసాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం లో దాశరధి రాసిన ‘’నడి రేయి యే జాములో స్వామి నిను చేర దిగి వచ్చునో –తిరుమల శిఖరాలు దిగివచ్చునో ??పాట శ్రీ విజయ చందర్ కరుణా మయుడు సినిమాలో పాటలు గోపాలంగారి సంగీత సామర్ధ్యానికి గీటు రాళ్ళు .ఆస్తిపరులు ఇల్లాలు ,,శ్రీ దేవి ,పూలరంగడు సినిమాలో పాడారు .రంగుల రాట్నం సినిమాలో’’ వెన్నెల రేయి చందమామ వెచ్చ గా ఉన్నది మామ మనాసేదోలా గున్నది నాకేదోలాగా ఉన్నది’’పాటను శ్రీమతి జానకిగారితో కలిసి శ్రీ చంద్రమోహన్ కు పాడారు . మాధవ పెద్దిగారితో తకలిసి ‘’దేశభక్తులం మేమండీ-దేహి అంటూ’’ ‘’పాటనుకూడా పాడారు .బిఎన్ రెడ్డిగారికి రాజేశ్వరరావు గారే సంగీత దర్శకులుగా ఉండాలి .’’ ఆయన ఎప్పుడొస్తారో తెలీదు ఎప్పుడు రారో తెలీదు అందుకని ఒక అనుభావజ్ఞుడిని ఐడియాకోసం పెట్టుకొనే వాడిని ‘’ అని రెడ్డి గారే చెప్పారు .మల్లీశ్వరికి శ్రీ అద్దేపల్లి రామారావు ,రంగులరాట్నం ,బంగారు పంజరం సినిమాలకు శ్రీ బి గోపాలం గార్లను పెట్టుకొన్నారు .గోపాలం గారు గాయకులుగా సంగీత దర్శకులుగా నిలద్రొక్కుకున్నా ,చొరవ లేనికారణంగా ఎక్కువ సినిమాలకు చేయలేక పోయారు కొన్ని భక్తిగీతాల డిస్క్ లు ఆల్బం లకు సంగీతం అందించినా ,శోభన్ బాబు చలం హరనాథ్ ,కన్నడ హీరో రాజ్ కుమార్ లకు కొన్ని సినిమాలో పాడినా ,ఆడంబర జీవితం గడపలేదు గోపాలంగారు .సినీ పరిశ్రమలో వచ్చే మార్పులు వస్తూనే ఉన్నాయి .ఎవరినైనా అడిగితె అవకాశాలు ఇచ్చేవారేమో ?అడిగె స్వభావం ఈయనకు లేనేలేదు .చిత్ర సీమలో ఇమడలేక పోయి విసిగి వేసారారు . ఇంత సుదీర్ఘ సంగీత ప్రస్థానం లో బి గోపాలం గారు సంపాదించి మిగుల్చుకున్నది ఏమీ లేదు ఒక్క కీర్తి ప్రతిష్టలు తప్ప .1995లో మంగళ గిరి వెళ్లి సోదరి వద్దశేష జీవితం గడిపి 22-4-2004 న 77 ఏళ్ల వయసులో గుండెపోటు తో మరణించారు . చాలా రోజులవరకు ఆయన మరణం లోకానికి తెలియలేదు .ఆయనకున్న మొహమాటం అలా కూడా వదిలిపెట్టలేదు .ఆయన తీపిగుర్తుగా మిగిలిన పాట శ్రీ కృష్ణార్జున యుద్ధం సినిమాలో పింగళి వారి సాహిత్యానికి పెండ్యాలవారు స్వరపరచి గోపాలం గారు ,స్వర్ణలత గార్లతో అల్లు గారికి సురభి బాలసరస్వతి గారికి పాడించిన హాస్య శృంగార మధురగీతం – సోహం.. సోహం.. సోహం.. సోహం.. అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ కష్టమైనను ఇష్టమేనని కోరి నిలిచితి చినమునీ అయిన కుదురుగ ఎదుట కూర్చుని గాలి గట్టిగా పీల్చుమా స్వామీ స్వామీ… ఏమీ ఏమీ నేను పీల్చిన గాలి నిలువక అకటా మీపై విసిరెనేఅకట మీపై విసిరినే అందుకే మరి… అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ కష్టమైనను ఇష్టమేనని కోరి నిలిచితి చినమునీ కనులు మూసుకు చూపును ముక్కుకొనపై నిలుపుమా స్వామీ స్వామీ…ఈ మారేమీ అచట నిలువక చుపులన్నీ అయ్యో మీపై దూకెనేఅయ్యో మీపై దూకెనే అదే మరి… అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ కష్టమైనను ఇష్టమేనని కోరి నిలిచితి చినమునీ ‘’ సశేషం మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-1-22-ఉయ్యూరు •

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.