అక్తర్ నవాజ్ దర్శకత్వం లో ఆర్ సి ఎ ఫోటోఫోన్ శబ్దగ్రాహక యంత్రం పై తయారు చేయబడి 1933లో విడుదలైన తెలుగు సినిమా’’ రామ దాసు ‘’శ్రీమాన్ బళ్ళారి ధర్మవర౦ రాజ గోపాలాచార్యుల నాటకం ఆధారం గా తీయడి౦దని,ఫోటో గ్రాఫర్ కృష్ణ గోపాల్ అనీ ,శబ్ద గ్రాహకులు ఆర్ సి విల్మన్ ,సిఎల్ నిగం అనీ ,రామదాసుగా శ్రీ ఆరణి సత్యనారాయణ ,కబీరు గా శ్రీ ఘంటసాల రాధా కృష్ణయ్య ,తానీషాగా శ్రీ నెల్లూరు నాగరాజారావు ,ధర్మకర్త శ్రీ కే శ్రీనివాసాచారి ,ఆహమక్ గా శ్రీ వెంకట సుబ్బయ్య ,రాముడుగా శ్రీ ఘంటసాల శేషయ్య ,లక్ష్మణుడుగా శ్రీ ఎం.ఎస్.రంగారావు కమలా౦బగా శ్రీమతి సరస్వతి, సితారా బేగం గా శ్రీమతి రామ్ పాప నటించారని నాకు ఇప్పటిదాకా తెలీదు ఇప్పుడే తెలిసి మీతో పంచుకొంటున్నాను. అందుకే దీన్ని ‘’పాతబంగారం’’ అన్నాను .కథ మనకు తెలిసిన భక్త రామదాసు అనే కంచర్ల గోపన్న గారి పాత కథే ,కనుక ఆ వివరం లోకి వెళ్ళటం లేదు .కానీ ఇందులోని కొన్ని కొత్త విషయాలు మాత్రం చెబుతాను .
మహమ్మదీయ మతస్తుడు సూఫీ సిద్ధాంతకర్త భక్తకబీర్ భద్రాద్రి శ్రీరామనవమి ఉత్సవాలు చూడటానికి హరి భక్తులతోకలిసి వెళ్ళాడు .ధర్మకర్త మొదలైన వారు నవమి ఉత్సవం జరుపుతుంటే ,మనసును శ్రీరామునిపై లగ్నం చేసి కబీర్ పాటపాడుకొంటూ కొండ శిఖరం చేరతాడు .కబీరు పాటవిన్న ధర్మకర్త ముస్లిం హిందూ దేవుడి పేరు ఉచ్చరించటానికి అనర్హుడని ,దేవాలయ ప్రవేశానికి అడ్డు చెప్పాడు .కబీరు ఏకాగ్ర చిత్తం తో రాముడినే ధ్యానిస్తున్నాడు .ఆయనను, అను చరులను గెంటి వేసే ప్రయత్నం చేశారు గోపన్న గారు అడ్డు పడి,ఆయన మహా భక్తుడని చెప్పి ‘’నేను కబీరు గారి దగ్గరే ఉంటాను .మీరు వెళ్లి ఉత్సవం చేసుకోండి ‘’అన్నాడు .కబీరు వద్ద రామ తారక మంత్రోపదేశం పొంది శిష్యుడయ్యాడు .కబీరు కొండ దిగి వెడుతుండగా ,శిఖరం పై ఉన్న ధర్మకర్త పూజారులకు సీతారామ లక్షణ విగ్రహాలు కనపడక గగ్గోలు పడుతుంటే ,గోపన్న గారి హితవుతో ఆ విగ్రహాలు ధర్మకర్త మొండివైఖరికి కినిసి కబీరు హృదయం లో లీనమవటం గమనించారు .అందరు వచ్చి కబీరు పాదాలపై పడి క్షమాపణ కోరితే ,ఆయన అనుగ్రహం తో విగ్రహాలు మళ్ళీ యధా స్థానం చేరాయి.
భద్రాద్రి తాసీల్దార్ గా తానీషా చే నియమింపబడి గోపన్న భద్రాద్రి రాగా ,అక్కడి జనం తప్పతాగి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించటం చూసి ,సురాపానం పాపమని బోధించి మంచి మార్గం లో పెట్టి భద్రగిరిపై రామాలయం నిర్మించే ప్రయత్న౦ లో వారి సహాయ సహకారాలు పొందాడు .మిగతా దంతా మనకు తెలిసిందే .
కొన్ని పాటలు రుచి చూద్దాం –1-కమలాంబ మాండ్ రాగం ఆది తాళం లో పాడిన పాట-శ్రీ రమణ మృదు చరణ-స్మరమణా-పరమ పురుష శ్రీరామ –శ్రీ –
2-కాఫీ రాగం ఆది తాళం లో బ్రాహ్మణులు-‘’దానవ మర్దన దశరధ నందన –తామస భంజన ధర్మ గుణా-
తాప విదారణ తత్వ సిచారణ తాపస జనస్తుతి పారాయణా-జానకీ నాయక ,సత్య విధాయక ,జ్ఞాన ప్రదీపక ,శ్రీపదకా-సజ్జన రక్షక ,సౌఖ్య ప్రదాయక ,సామజ పతి పరిపాలకా .’’
3-శంకరాభరణ రాగం లో రామదాసు –‘’భద్రాద్రి రఘురాము భజనకు జను చుండ –బంధు మిత్రుల యాజ్ఞ బడయ నేల ?
జీవాత్మ భరియింప శ్రీ వత్స ధరు డుండ –దనువుపై మనకి౦త తమక మేల?
హరినామకీర్త నాహార పానము లుండ –నాకలి దప్పుల కడల నేల ?
సాయుజ్యమును జెందసాధన తతులుండ-సంసార వహ్నిలో సమయ నేల ?
భక్తీ మీర కీర్తింపు డీ భద్ర వాసు –జేతులర బూజింపుడీశ్రీనివాసు
జిత్తమార సేవింపు డీ చిద్విలాసు –రాణ యోప్పార జేయుడీ రామ భజన ‘’
4-శంకరాభరణం ఆది తాళం లో అందరూ –
‘’రామరామ రఘురామ పరాత్పర –రావణ సంహార రణ ధీరా – రధాంగధరఘన పత౦గ వాహన – రమారమణ నారాయణ
సార శీలసురలోల నిరంజన ,సత్వ పరాయణసువిధానా – సరొజ లోల నిరంజన –సత్వ పరాయణసువిధానా – సరోజ లోచన సురేశపాలన,శరణ్య ముని బృందావనా ‘’
5-నాదనామ క్రియరాగం –మిశ్ర చాపు తాళం లో రెడ్లు పాడిన పాట
‘’స్వామి సేవ చేయబోదము -నేడు సీతారాముల సేవ చేయ బోదము
ఐదు జోళ్ళ తలల వాని –నట్టే నేల గూల్చె నన్న –ఆది మూర్తి బ్రహ్మమన్నా –అందమైన దేవుడన్నా —-
6-దాసరి పాట
‘’ఏడుకొండల వాడ వెంకట రమణ –ఏడు కొండలమధ్య వెలగరా గురుడా అమ్మబోసిన నూనె అయ్యకర్పితము –అయ్య బోసిన నూనె అమ్మ కర్పితము
శ్రీరంగం మన ఓబుళం ఓబుళం
నీ ప్రాదములు గంటిరారామ నీ ప్రాదములు గంటిరా –కుడి భోగమున సీత ఎడమ భోగమున రామ –వైభోగమున లక్ష్మణా —-
7-హిందూ స్థానీ సురట రాగం లోకబీరు
‘’కహో కాతిర్సే హృదయం రాం రాం రాం –నహీ రహీన్గే కాయం జహాన్ మే హం ‘’—
8-భీం పలాస్ ఆదితాళం లో కబీరు
‘’అఖల్ తేరి హుఈ గుంగురు యారో –కాహేకో గడబిడ కర్తా హై బాబా ‘’—
‘’9-కబీరు- ‘’మై గులాం మై గులాం మై గులాం తేరా –మై గులాం తేరా తూ హై సాహెబా మేరా ‘’—
10-కబీరు
‘’దర్శన్ దేవ్ రామా –తేరే సాథ్ హైహం –దాశరధే తేరా చరణకమలకే –జానకీ నాధా దయా కరో హం పర్-మనో హమారా భజన్ –‘’
11-యాద్ కరో అల్లా అల్లా యాద్ కరో అల్లా యాద కరో తుమే –ధ్యాన కరో జపాకరో రే –రాం రహీం కా భేద న పాయా –దోరోజీ కీ దునియా ఝూటీ హై’’—
12-వరాలిరాగం ఆదితాళం రామదాసు
‘’ఏడనున్నాడో భద్రాద్రి వాసు డేడనున్నాడో –నా పాలి రాము డేడ నున్నాడో—‘’
13-ధన్యాసి రాగం లో దాసు –‘’నాకున్ లేదొకగవ్వ నిధి –యా సీతామనో నాధుడే
14-శ్రీ రాగం లో దాసు-‘’ యమపాశంబును ఖండ ఖండములుగా నామూల భిన్నంబులుగా –సమయం జేయుచు దివ్య మోక్ష పదవిన్ సంధింప గల్ప ద్రువై
విమలంబౌ రఘునామ నామము మదిన్ వేడ్కార నే వేళయున్-తమకం బేచిభజించు వారి తను వీ త్రాళ్లి౦క బంధించునా ‘’
15- జల్సా పాట-‘’వహ్వా సారాయి వడుపైన సారాయి –బువ్వోద్దుపెదబాబు బుడ్డి ఏక్ రూపాయ్ –సప్త సముద్రాలు సారాయికావాల –పిల్లకాల్వలన్ని కల్లునీళ్ళు కావాల-దీన్కి తాగి చూడు –దీన్కి మజా చూడు –దీన్కి తాగితే బలే హుశారి కల్గుతాది
16-నాదనామ క్రియ ఆదితాళం –
ఏ తీరున నను దయ బ్రోచెదవో ిన వంశోత్తమ రామా —
17-కాంభోజి ఆదితాళం –‘’ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా బలుకవె రామ చంద్రా –‘’
18-జయతు జయతు మంత్రం –జన్మ సాఫల్యమంత్రం –జనన మరణ భీతి కలేశ ‘’విచ్ఛేదమంత్రం –సకల నిగమమంత్రం సర్వ శాస్త్రైక మంత్రం –రఘుపతి నిజమంత్రం –రామరామేతి మంత్రం ‘’
మొత్తం మీద 24 పద్యాలు, పాటలు ఉన్నఅడుగడుగునా భక్తీ చిప్పిలే భక్తి ప్రధాన చిత్రం పాతబంగారం ‘’రామదాసు ‘’.
నటీ నటులు మనకు తెలీదు ,ఎలా చేశారో కూడామనకు తెలియదు .అయినా అన్ని హంగులు ఉన్నట్లు కనబడుతోంది .
మీ గబ్బిట దుర్గాప్రసాద్ -6-1-22-ఉయ్యూరు