మోపూరు కాలభైరవుడు-2(చివరి భాగం )
ప్రస్తుత క్రీడాభి రామం లో లేని ,పెద్దపాటి జగన్నాధకవి ప్రబంధ రత్నాకరం లో ఉన్న వల్లభ రాయుని వీధి నాటకం క్రీడాభి రామం లో ఉన్న పద్యాన్ని బట్టి మోపూరు కు పూర్వపు నామం ములికినాడు .ఇక్కడ మోహన శైలం ,మోహన గిరి ,మోహనాచలం ,మోపూరు తిప్ప ,మోపూరు కొండ అనే ఎత్తైన ప్రదేశం ఉంది .కొండమోపున మోపూరు గ్రామం ఉంది .అక్కడ కాలభైరవుడున్నాడు .
ఈ కాలభైరవుడు స్వయంభు .13అడుగుల ఎత్తు ,10అడుగుల వెడల్పు శిలా విగ్రహం దీని చుట్టూ దేవాలయ నిర్మాణం జరిగింది .ఎత్తైన విగ్రహం కనుకాలయాన్ని రెండు అంతస్తులుగా నిర్మించారు .స్వామి భూమి పుట్టినప్పుడు పుట్టాడుకనుక కాల నిర్ణయం లేదు .ఇక్కడే భస్మాసు రుడు మోహినీ అవతార విష్ణువు ను కామిస్తే స్నానం చేసి రమ్మంటే ,కిందున్న నదిలో స్నానంచేస్తూ పొరబాటున తనతలపై తానె హస్తం పెట్టుకొని భస్మమైపోయాడు .అందుకే మోహన గిరి అనిపేరు .
ఈ ప్రాంతాన్ని కాకతీయ ,విజయనగర రాజులు పాలించి నట్లు శాసనాలున్నాయి.ఇక్కడ శవ, కేశవ కుమారస్వామి మహిషాసుర మర్దిని విగ్రహాలు ఉండటం వలన సర్వమత సమాదర్శనమూ వర్ధిల్లింది .ఇక్కడ అయ్య పరసు అనే రాజు పాలించి నట్లు కవి గాయక నటులను ఆదరించినట్లు ,దేవ విద్వజ్జనులు ,రస సిద్ధులు,జ్ఞానులు ,ఋషులు ఉన్నట్లు తెలుస్తోంది ఇక్కడి యోగులే జోగులు పేరిట పీఠాధిపత్యం వహించేవారు .ఈ తంబళ్ళ వారు కూడా ఆలయాభి వృద్ధికి తోడ్పడ్డారు .ఈ ఆలయానికి రాజులు గ్రామాలు భూములు వరహాలు ,సువర్ణాభరణాలు దానమిచ్చినట్లు శాసనాలున్నాయి .వైశాఖ పౌర్ణమికి తిరుణాల జరుగుతుంది .
కొండపై ఒక చివర ఏటవాలుగా ఉన్న ప్రదేశం లో నిలువుగా ఉన్న గుండును చూసి ,ఏటవాలు ప్రదేశాన్ని చదును చేసి ,మట్టి కొట్టుకు పోకుండా రాతి కట్టడం కట్టి ,మళ్ళీ చదును చేసి రెండవ రాతి కట్టడం కట్టి దానిపై ఆలయ ప్రాకారం నిర్మించారు .నల్ల బండ రాళ్ళు ఎక్కువగా ఉండగా శ్రావణాలతో చీల్చి ప్రాకారం మధ్యలో ఆలయం కట్టారు .కొండ మోపున ఖాళీస్థలం లో మోపూరు అనే గ్రామం జోగులు అనే తంబళ్ళ పూజార్లకోసం ఏర్పరచారు .ఇక్కడే పూజారులు వాయిద్యకారులు నృత్యకారులు భటులు ఉండేవారు .అన్నికులాల వారు మోపూరు ఇంటిపేరుతో ఉన్నారు .ఈఊరు సుమారు 150ఏళ్ల క్రితం ఏర్పడింది .క్రమంగా రాజపోషణ ,ఆహార సదుపాయం లేక జనం వలస పోయినందున శిధిలంగా ఉంది .ఇప్పటికీ వెంకటయ్య తోటలు ,జోగొని తోటలు ,శాస్త్రాల తోటలు అని అక్కడి భూముల్ని పిలుస్తారు .
రెండు వేల ఏళ్లక్రితం ఉజ్జయిని విక్రమాదిత్య మహారాజు రాజ్య పతనం తర్వాత ,భోజమహారాజు సైన్యం తో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక జొన్న చేనులో మంచ పై ఒక పిల్ల కావలి కాస్తూ సైనుకులను జొన్న కంకులను కోసి ‘’పిసుకుల్ల’’ను తినమని చెప్పింది .వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తింటుంటే కిందికి వచ్చి తాము బీద వారమని చేను పాడు చేయద్దని బతిమాలగా వెళ్ళిపోయారు .మళ్ళీ మంచ ఎక్కి తినమని ఆహ్వానించింది .వాళ్ళు తింటుంటే మళ్ళీ పాతపాటే పాడగా భోజునకు విచిత్రమనిపించి ,ఆ మంచాకింద ఏదో మహాత్మ్యం ఉంటుందని త్రవ్విస్తే అక్కడ విక్రమార్కుని ద్వాత్రి౦శ సాల భంజికలసి౦హాసనం బయట పడింది .దాని దారానగరానికి తీసుకు వెళ్లి సింహాసనం ఎక్కుతుంటే ఒక్కో మెట్టు ఒక్కో కథ చెప్పిన సంగతి మనకు తెలుసు .
ఈమోహన శైలంలో మునులు తపస్వులు మహాత్ములు ఉన్నట్లు చెప్పుకొన్నాం వారు ఇప్పటికీ కొందరు పుణ్యాత్ములకు కనిపిస్తారని అంటారు .ఈ జోగులు మొదలైన వాళ్ళంతా కొండపైకి వెళ్లి నపుడు దేవాలయం అభి వృద్ధికిఏవెవొ చర్చించి కొండ దిగగానే మర్చే పోయేవారు. అందుకే ‘’మోపూరు జోగుల వాటం ‘’అనే సామెత పుట్టింది .మనం –‘’గుడిపూడి జ౦గాలలాగా’’అనేసాఎత వాడుతాం
ఆలయ నిర్మాణం
రస సిద్దులైన మునులు ఇక్కడి బండలను తాకితే అవి తేలికైపైకి ఎత్తటానికి వీలుగా ఉండి,ఆలయ నిర్మాణానికి తోడ్పడేవి .దీనికి ఉదాహరణ –లోపలి ధ్వజ స్తంభాన్ని ప్రతిష్టించే టప్పుడు ,దాన్ని పైకి లేపటానికి ఎంతోశ్రమపడాల్సి వచ్చినా లేవకపోతే ‘’జై భైరవా ‘’అని అందరూ భక్తిగా ,ఆర్తిగా గట్టిగా అంటే యిట్టె లేచి పీఠం లో కూర్చుందిట .గర్భ గుడి నిర్మాణం 2వేల ఏళ్లకు ముందే జరిగింది .శాలి వాహన శకం 1347 విశ్వావసు ఆశ్వయుజబహుళ అష్టమి నాడు విజయనగర వీర కుమార దేవరాయలు భ్రుత్యుడు కవితా మండలి గండ బిరుదాంకితుడు బొప్ప దేవుని విరూపన్న గారి కుమారుడు తిరుమల రాయడు తమ తల్లి తిమ్మాయమ్మ ,అక్కగారు నాగాయమ౦బా గారికోసం మోపూరు భైరవ దేవాలయ పశ్చిమ గోపురం కట్టించిన శాసనం ఉంది .ఇతడే కుమార కంపరాయలు .
1272నందన చైత్రం లో వీర శ్రీ సావణవొడయల పాలనలో తిప్పరాజు మోపూరు భైరవేశ్వరునిఅంగరంగ విభాగాలకు పులి వెందులలో సాగులో ఉన్న ముల్కినాటి భూమిలోని చెరువు కింద రెండవ మడి ధారా దత్తం చేశాడు .1231నందన మాఘ బహుళ సప్తమినాడు ముఖ మండపాన్ని బోగలదేవి బ్రహ్మ దేవుని మనవడు కట్టించాడు .1452లో వికృతి వైశాఖ శుద్ధ తదియ నాడు విజయనగర రాజు అచ్యుత దేవరాయలకాలం లో భారద్వాజస గోత్రీకులు ఆశ్వలాయన సూత్రం రుక్కు శాఖాధ్యాయులు రాయసం కొండ మరుసయ్య గారికుమారుడు అయ్యపరుసు గారు 235వరహాలు అందించినట్లు శాసనం ఉంది .
1466లో సదాశివరాయల కాలం లో తిమ్మయ దేవ రాజు నిత్యభోగాలకు రధోత్సవాలకు గండికోట భూములు దానం చేసినట్లు శాసనం ఉంది .
మోపూరు కొండ దిగువన పెద్ద ఏరు, చిన్న ఏరు ,ఉద్దండ వాగు కలిసి త్రివేణీ సంగమ౦గా మారి,అక్కడి నుంచి సంగమేశ్వరం చేరి శ్రీ గండి ఆంజనేయస్వామి దగ్గర ప్రవహించే పాపాఘ్ని నదిలోకలిసి ,తర్వాత కుందు ,పెన్నా చెయ్యేరు లతో కలిసిపోతుంది.
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-1-22-ఉయ్యూరు