మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -13
13-పులకించని మది పులకింప జేసే గాయని -జిక్కి కృష్ణవేణి
తెలుగు పాటల తోటలో ఆమె ఒక కోకిల .అన్ని తరహా పాటలను ఎంతో వైవిధ్యం వైశిష్ట్యం తో మంత్ర ముగ్ధుల్ని చేస్తూ మనోహరంగా ఆరు తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ సింహళం భాషలలో పాడి ఉర్రూతలూగించిన గాయని ఆమె పి.జిక్కి కృష్ణ వేణి .కానీ జిక్కి అంటే శృంగారం ,జానపదాలపాటలే గుర్తుకు వస్తాయి .3-11-1938 న చిత్తూరు జిల్లా చంద్రగిరిలోశ్రీ పిల్లవాలు గజపతి నాయుడు ,రాజకా౦తమ్మ దంపతులకు కృష్ణ వేణి జన్మించారు .ఇంట్లో అందరూ ముద్దుగా జిక్కి అని పిలవటం తో అదే అందరికి అలవాటయింది .
1943లో వచ్చిన గూడవల్లి రామ బ్రహ్మం గారి పంతులమ్మ చిత్రం లో హీరోయిన్ లక్ష్మీ రాజ్యంగారికి శిష్యురాలిగా మొదట నటించారు జిక్కి .ఇందులో ‘’ఈ తీరున నన్నెరిగి పలుకగా నా తరమా జగదేకకారణ ‘’అనే పాటను కూడా పాడి గాయనిగా అరంగేట్రం చేశారు .తర్వాతమంగళ సూత్రం పల్లె టూరి పిల్లగా నటించటమేకాదు ‘’అందగాడే బలే సోకోడే ‘’పాట కూడా పాడారు .ఆ తర్వాత నాగయ్య గారి త్యాగయ్య లో బొమ్మల పెళ్లి ఘట్టం లో పెళ్లి కొడుకు తల్లి వేషం వేసి ‘’రారే పిల్లల్లారా బొమ్మల పెళ్ళీ చేదాము ‘’పాట పాడారు కూడ .పిమ్మట గొల్లభామ సినిమాలో వేషమూ వేశారు పాటనూ పాడారు అందంగా బొద్దుగా చలాకీ గా ఉండటం చక్కని స్వరం ఉండటం తో ఆమెనే అవకాశాలు వెతుక్కొని వచ్చాయి .
తర్వాత నటన కంటే పాటపై మోజు పెరగటం తో నటనకు స్వస్తి చెప్పి నేపధ్యగాయని గా స్థిర పడ్డారు .జిక్కి గాత్రం లో .జిగి బిగి పెరిగి ఆమెకు అనేక సినిమాలో పాడే అవకాశాలు కోకొల్లలుగా వచ్చాయి ,అనార్కలి సినిమాలో ‘’రాజ శేఖరా నీపై మోజు తీర లేదురా ‘’’’జీవితమే సఫలము ‘’,అర్ధాంగి చిత్రం లో ‘’వద్దురా కన్నయ్యా ‘’’’రాకరాక వ్చావు చందమామ ‘’గీతాలు మరచిపోలేనివి .తెలుగు డబ్బింగ్ సినిమా ‘’ప్రేమ లేఖలు ‘’లో ఏకాంతం సాయంతం ,’’పందిట్లో పెళ్లవుతున్నదీ’’,నీ పేరు విన్నా నీ రూపు కన్నా ‘’,ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల సంగీతం ‘’పాటలు ఆకాలం లో పాడని యువతీ యువకులు లేరు ఆ గ్రామఫోన్ పాటలు వినిపించని పెండ్లి పందిళ్ళు ఉండేవికావు అంత పాప్యులర్ అయ్యాయి ఆమె స్వరంలో వాటికి ప్రాణం పోసి పాడారు జిక్కి .దొంగ రాముడు సినిమాలో పాడింది ఒక్కటే పాట’’అంద చందాల సొగసరి వాడు ‘’సావిత్రి నటన పెండ్యాల స్వర రచన జిక్కి గాత్రం ఏదో లోకాలో విహరింప జేసింది .పెంకి పెళ్ళాం చిత్రం లో కుర్రకారుకు కిక్కెక్కించే ఆరుద్ర పాట’’పడుచు దనం రైలు బండి పోతున్నదీ పడుచు వారిక౦దులో చోటున్నది ‘’ఒక ఊపు ఊపేసింది .
పౌరాణిక చిత్రం చెంచు లక్ష్మి లో ‘’చెట్టు లెక్క గలవా ఓ నరహరి ‘’అని అక్కినేనిని ఆటపట్టిస్తూ అంజలి పాడే పాట,’’చిలకా గోరింక పలుకే పకాపకా ‘’గీతం జిక్కి గొంతులో అమృతపు సోనలే కురిపించాయి .అభిమానం సినిమాలో కృష్ణకుమారి తన వొదిన సావిత్రిని సరదాగా ఆటపట్టించే ‘’ఓహో బస్తీ దొరసాని ‘’ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు .ఇక సువర్ణ సుందరి సినిమాలో అంజలి అందాలు నటన ,జిక్కి గాత్రం త్రివేణీ సంగమమై ‘’పిలువకురా ,అలుగకురా ‘’పాటగా ప్రవహించింది ఆదినారాయణ రావు గారి సంగీతం దివి భువులను ఏకం చేసింది .ఇంతటి క్లాసికల్ సాంగ్ పాడిన జిక్కి రోజులు మారాయి సాంఘిక క్లాసిక్ లో ‘’ఏరు వాకా సాగారో రన్నో చిన్నన్నా’’పాట తో సాంఘిక చైతన్యం కల్పించి అందరి నోటా పాడుకొనేట్లు చేసింది ఈ పాట వినిపించని పల్లె , పట్నం ఉండేవే కావు అంతటి ప్రభావం కలిగించింది .వేణు సంగీతం కొసరాజు రచన,జిక్కి గానం పాటను అమరం చేశాయి .ఇవన్నీ మచ్చు తునకలు మెచ్చు చెణుకులు అని శ్లాఘించారు శ్రీ టి.ఉడయవర్లు .
నిజానికి జిక్కి ఎవరివద్దా సంగీతం నేర్చుకోకపోయినా వినికిడి వలన సంగీతం జ్ఞానం పొంది పండిత పామరులను ఆకర్షించే ట్లు తన గాత్రం తో పాడింది మెప్పించింది గుర్తింపు పొందింది .చదివింది రెండవ తరగతి అంటే ఆశ్చర్యపోతాం .తెలుగు చదవటం రాదు .ఏ పాటైనా, స్వరమైన నేర్చుకొని తిరుగు లేకుండా పాడటం ఆమె ప్రజ్ఞ.ఒక రోల్ మోడల్ .మరుపు అంటూ ఆమె జీవితం లో లేనే లేదు .రికార్డింగ్ కోసం పాత పాటలు ఎలాపాడారో ,సంగీత కచేరీలలోనూ అలానే అలవోకగా పాడేవారు .అదే జిక్కి ప్రత్యేకత .
సువర్ణ సుందరి సినిమాలో అయిదు రాగాలలోఆదినారాయణ రావు గారు సముద్రాల సాహిత్యానికి చేసిన ‘’హాయి హాయిగా ఆమని సాగే ‘’ను హిందుస్తానీ ,కర్నాటక శాస్త్రీయ సంగీతం లో ఏ మాత్రమూ ప్రవేశం లేని జిక్కి పాడి స్వరదర్శకునితో సహా వీక్షకులను అవాక్కయేట్లు చేశారు .ఘంటసాల మాష్టారు జిక్కి పోటాటీగా గానం చేసి మనల్ని మధురోహలలో ముంచెత్తారు .అపూర్వంగా నిలిచి పోయిన క్లాసికల్ సాంగ్ అది .ఇదేపాటను హిందీ లతా మంగేష్కర్ ‘’కుహూ కుహూ కోయలియా ‘’ గా పాడారు .
గాయనిగా జిక్కి బాగా దూసుకుపోతూ మాంచి డిమాండ్ గా ఉన్న కాలం లో శ్రీ మేముల మునిస్వామి రాజా అంటే ఎ.ఎం. రాజా చిత్ర రంగ ప్రవేశం చేసి ‘’మంత్రికుమారి ‘’చిత్రం లో జిక్కి తో యుగళ గీతం పాడారు. ఎమ్‌జి ఆర్ కు రాజా ,మాధవీ దేవికి జిక్కి నేపధ్యగానం చేశారు .ఈపాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి .హిందీ లో వచ్చిన ప్రేమలేఖలు లో రాజకపూర్కు రాజా ,నర్గీస్ కు జిక్కి పాడారు .ఇవీ పిచ్చగా పాప్యులర్ అవటం తో రాజా ,జిక్కి జోడి హిట్ పెయిర్ అని పించుకొన్నది .దీన్ని నిజజీవితం లోనూ చేసుకోవాలనుకొని ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారు .ఈ జంటకు నలుగురమ్మాయిలు ఇద్దరబ్బాయిలు .వీళ్ళందరి ఆలనాపాలనా కుటుంబ బాధ్యతా లతో జిక్కి నేపధ్యగానానికి దూరమయ్యారు .
1. రాజా పెళ్ళికానుక మొదలైన సినిమాలకు సంగీత దర్శకులయ్యారు .దురదృష్టవశాత్తు రైలుప్రమాదం లో రాజా చనిపోయారు .పిల్లలు పెరగటం ఆర్ధికంగా కలిసి వస్తుందని జిక్కి మళ్ళీ తన గాత్ర మాధుర్యాన్ని తెలుగు ప్రజలకు చూపించారు .ఆదిత్య 369లో ‘’జాణవులే నెర జాణవులే కిలికి౦న్చి తాలలో జిక్కి పాట సూపర్ డూపర్ హిట్ కొట్టింది .ఆతర్వాత ఆరో ప్రాణం, నిన్నే పెళ్ళాడుతా ,ఆహ్వానం అమ్మకొడుకు ,మురారి సీతారామయ్యగారి మనవరాలు ,శ్రీ కృష్ణ పాండవీయంలో’’ఛాంగ్‌రే బంగారు రాజా ఛాంగ్ ఛాంగ్రె బంగారు రాజా మజ్జారే – పాటను సినారె రాయగా హిడింబి కి పాడి చిరస్మరణీయం చేశారు
మొత్తం మీద 10వేల పాటలకు పైగా పాడారు .సెకండ్ రన్ బాగా ఉంది అనుకొన్న సమయం లో జిక్కికి 2001లో బ్రెస్ట్ కేన్సర్ వ్యాధి వచ్చి ,తమిళనాడు, ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వాలు అందించిన ఆర్ధిక సాయం తో ఆపరేషన్ చేయి౦చు కొని కేన్సర్ ను జయించి మామూలు మనిషయ్యారు .మద్రాస్ లో ఉంటూ దేశ విదేశాలలో సంగీత కచేరీలు చేస్తూ సినీసంగీతాభిమానుల మన్ననలు పొందారు ..
మళ్ళీ కాలేయ కాన్సర్ పాలై జిక్కి16-8-2004న 66వ ఏట మరణించారు .
1. సంపూర్ణ రామాయణ౦ లో సుశీలమ్మతో కలిసి
వానజల్లు కురిసింది లేరా లేరా ఒళ్ళు ఝల్లుఝల్లుంది రారా – పాడారు .లవ కుశ లో ‘’వల్లనోరి మామా నీ పిల్లని ‘’పాట ఘంటసాల ,రాణి ,రాఘవులు తో కలిసిపాడారు .బాటసారి లో ‘’కనులను దోచీ చేతి కందనీ ఎండమావులున్నాయ్ ‘’పాట వేణు స్వరపరచగా సముద్రాలరాయగా భానుమతి గారితో కలిసిపాడారు .ఎఎం రాజా మ్యూజిక్ డైరెక్షన్ లో పెళ్ళికానుక సినిమాలో ‘’పులకించనిమది పులకించు ‘’గానం తో సంమోహ పరచారు జిక్కి .అందులో రెండు చరణాలు -పులకించని మది పులకించు… వినిపించని కథ వినిపించు
అనిపించని ఆశల వించు… మనసునే మరపించు గానం
పులకించని మది పులకించు… వినిపించని కథ వినిపించు
అనిపించని ఆశల వించు… మనసునే మరపించు గానం
మనసునే మరపించు..
చరణం : 1
రాగమందనురాగ మొలికి రక్తి నొసగును గానం
రాగమందనురాగ మొలికి రక్తి నొసగును గానం
రేపు రేపను తీపి కలలకు రూపమిచ్చును గానం
చెదరిపోయే భావములను చేర్చికూర్చును గానం
జీవమొసగును గానం మది చింతబాపును గానం
శాంతినివాసం లో ఘంటసాల డైరెక్షన్ లో –ఆశలు తీర్చవే ఓ జనని ఆడరమున్చావే జాలిగొని ‘’అంటూ ఆర్తిగా పాడారు .’’రాధ రావే రాణీ రావే రాధ నీవే కృష్ణుడు నేనే ‘’పాటలో ప్రేమ రసం ఒలకబోశారు
1959లో వచ్చిన కృష్ణ లీలలు ఆరుద్ర రాసిన –ఇంత చల్లని రేయి ఇంత చక్కని హాయి అంతయు తిలకించి ‘’పాటనుఅంత చల్లగా అంత చక్కగానూ పాడారు సుసర్లవారి సంగీత దర్శకత్వం లో .రాజమకుటం లో ‘’ఏటిఒడ్డునా మా వూరు ఎవ్వరు లేరు మా వారు ఏరు దాటి వచ్చారంటే ఎనక్కి పోలేరు ‘’పాటను అంత గడుసుగా గడుగ్గాయిగా పాడారు . రాజేశ్వరరావు గారు సంగీతం కూర్చిన చెంచు లక్ష్మి సినిమాలో విష్ణువు లక్ష్మీ దేవి గార్లకు ఆరుద్ర రాసిన యుగళగీతం –‘’ఆనందమాయే అలి నీల వేణీ,అరుదెంచినావా అందాల దేవి ‘’ పాటను ఘంటసాల మాస్టారి తో అంత ఉన్నతంగా పవిత్రంగా పాడి నిండు తనం తెచ్చారు .’’కానగారావా ఓ శ్రీహరి రావా ‘’లో ఆవేదన అంతా కురిపించారు .పాండు రంగ మహాత్మ్యం లో –‘’పెదవులరాగం ‘’పాట,’’సారంగధర లో –కలలు కరగిపోవునా ‘’,సాగెను బాలా ఈ సంధ్యవేళ ‘’పాటలు ,తోడికోడళ్ళు లో’’నీ సోకు చూడ రమణయ్యమావో ‘’అంటూ సూర్యకా౦తమ్మగారికి ,చిరంజీవులు లో –‘’తినే౦దుకున్నాయిరా ,కోనే౦దుకున్నాయిరా’’సరదాపాట ,భలే రాముడు లో ‘’నాడేమైన పచ్చబొట్టు పొడిపించుకోవా నే పొడవా మన్నావా ‘’,ఎన్దున్నావో మాధవా నందకుమారా కేశవా ‘’కొమలతో కోమలంగా ,రేచుక్కలో ‘’-ఆ సోగసేమో ఆ మనసేమో గారాము అది మారాము ‘’పాటను గారాముగా మారాములొలకబోస్తూ ,తోడు దొంగలు లో –‘’రాయేనా వయారం రాయే నా వలపు దుమారం ‘’కొమలతో వయారం వలపు దుమారం రేపారు .బ్రతుకు తెరువు సినిమాలో –దారీ తెన్నూ కానగారానీ లోకానా ,వరదాయీ నీవే నిర్మల జ్యోతి ‘’అంటూ ఆర్తిగా ,’’వచ్చెనమ్మా వచ్చే ఉగాది పండగ వచ్చే ‘’సరోజినితో ఉగాది సరదా తీరేట్లు ,దేవదాసులో ‘’ఓ దేవాదా చదువూ ఇదేనా ‘’ అంటూ ఎద్దేవా చేస్తూ ఘంటసాల గారితో ,పాతాళ భైరవిలో ‘’-‘’వగలోయ్ వగలు తళుకు బెళుకు వగలు ‘’పింగళి పాటకు ఘంటసాలగారితో వగలు కురిపించారు .షావుకారు లో –‘’వలపుల వలరాజా తామసమిక చాలురా ‘’పిఠాపురంగారితో,, విరహ వ్యధ మార్చు కథ తెలుపవే జాబిల్లీ ‘’అని ఆయనతోనే కలిసి విరహ గాథ వినిపించారు .సంసారం సినిమాలో ‘’కలనిజమాయేగా కోరికా తీరెగా సాటి లేని రీతిగా మదినెంతొతో హాయిగా ‘’పాట సుసర్ల వారి సంగీతం లో 1950 దశకం అంతా ఊపేసింది యువతను .మనదేశం సినిమాలో ఎం ఎస్ రామారావు గారితోకలిసి సముద్రాలరాసిన –‘’ఏమిటో ఈ సంబంధం ఎందుకో ఈ అనుబంధం ‘’అలాగే ఘంటసాల తో –‘’కళ్ళ నిన్ను చూసినానే పిల్లా ఒళ్ళు ఝల్లన్నదే ‘’ను నిజంగానే ఒళ్ళు ఝల్లుమనేట్లు పాడారుజిక్కి. అలాగే ఘంటసాలగారితో ‘’జయజయనీ పరమ పావనీ జయజయ భారత జననీ ‘’దేశభక్తి తోనూ ,’’పంచదార వంటి పోలీ సెంకటసామి మరవలేనురా నిన్నూ మరవ లేనురా ‘’,మామా న౦దయ మామా అందుకో నన్నందుకో ‘’ ఘంటసాలవారితో ‘’మాటా మర్మము నేర్చిన వారు ‘’పాట పాడారు కృష్ణవేణి జిక్కి .’’తకతక ఝనతా ,తకదిమి చిడతా ఎంట ఎంట తిరుగుతున్న జంట సోకు చూడరే ‘’అనే పాట భలే అమ్మాయిలు సినిమాలో నందమూరి సావిత్రి లపై జిక్కి మనసు దోచేట్లు పాడారు .బాగా పాప్యులర్ అయిన సాంగ్ అది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-1-22-ఉయ్యూరు