మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -14
14- రాజసం ఉట్టిపడేధీర గంభీర పాత్రలు, నారద ,కన్నగి పాత్రలు ధరించిన గాయని నటీమణి –ఋష్యేంద్ర మణి
విజయవాడలో జన్మించిన శ్రీమతి ఋష్యేంద్ర మణి,పెంపుడు తల్లి వెంకటరత్నమ్మ గారి పెంపకం లో పెరిగి ఏడవ ఏటనే వంశ పారంపర్య సంప్రదాయం ప్రకారం గజ్జ కట్టారు .అంటే చిన్న తనం లోనే సంగీత నృత్యాలను అభ్యసించారు .ఆకాలం లో నాటకరంగం మూడు పూలు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. ప్రతిభ ఉన్న వారికి అవకాశాలు వెతుక్కొంటూ వచ్చేవి .స్ఫురద్రూపం చక్కని అభినయం గంభీరమైన నటన ,మంచి గాత్ర ధర్మ ఉన్న ఆమె కొమ్మూరి పట్టాభి రామయ్య గారి ‘’లక్ష్మీ విలాస నాటక సభ ‘’చేరారు .అప్పటికే లబ్ధ ప్రతిష్టు లైన నటులు శ్రీ కపిలవాయి రామనాధ శాస్త్రి ,శ్రీమతి పువ్వుల రామ తిలకం గార్ల పర్యవేక్షణలో శిక్షణ పొంది ‘’చింతామణి ‘’,సావిత్రి నాటకాలలో ముఖ్య పాత్రలు ధరించారు
ఆరోజుల్లో సినీ నిర్మాత రాజారావు నాయుడు నిర్మించిన ‘’శ్రీ కృష్ణ తులాభారం ‘’ సినిమాలో సత్యభామ గా నటించి గొప్ప నటన ప్రదర్శించినా సినిమా అపజయం పాలైంది .మళ్ళీ నాటకాలలో నటించి ‘’ప్రహ్లాద ‘’,రాధా కృష్ణ ,చింతామణి ,తులాభారం మొదలైన నాటకాలలో ప్రముఖ పాత్రలను ప్రతిభా వంతంగా నటించి నాటకరంగ ఆశాజ్యోతి అనిపించుకొన్నారు .కాంట్రాక్ట్ నాటకాల ప్రభ ఉచ్చ స్థితి లో ఉన్న ఆకాలం లోశ్రీ కడారు నాగభూషణం ,శ్రీమతి పసుపు లేటి కన్నాంబ గార్ల ‘’రాజరాజేశ్వరీ నాట్య మండలి ‘’నటిస్తూ మూడేళ్ళు ఆంద్ర దేశమంతా పర్యటించి అసమాన నటిగా నిరూపించుకొన్నారు .ఏడాదిలో 11నెలలు నాటకాలలోనే పాత్రలు ధరించారు .రంగూన్ రౌడి ,లో ప్రభావతి ,సావిత్రిలో నారదుడు పాత్రలలో నటించి ప్రత్యేక ప్రశంసలు పొందారు .
ఋష్యేంద్ర మణి భర్త శ్రీ జవ్వాది రామ కృష్ణారావు గారు 1939లో తమిళ చిత్రం ‘’మాతృ భూమి ‘’ సినిమాకి సంగీతదర్శకత్వం వహించటానికి మద్రాస్ రావటం తో ఈమె కూడామద్రాస్ వచ్చారు .పాండు రంగ విఠల్అనే సినిమాలో దేవకన్యగా నటించారు .అప్పుడే గూడవల్లి రామ బ్రహ్మం గారు తమిళ పంచ మహా కావ్యాలలో ఒకటైన ‘’శిలప్పాది కారం ‘’ఆధారంగా నిర్మించిన ‘’కణ్ణగి’’సినిమాలో కణ్ణగి పాత్ర ధరించి జీవించారు .’కణ్ణగి భర్త కోవలన్ గా సుప్రసిద్ధ దర్శక నిర్మాత నటుడు కెఎస్ ప్రకాశరావు అనే శ్రీ కోవెలమూడి ప్రకాశరావు గారు నటించారు . ’కణ్ణగి పాత్రలో ఋష్యేంద్ర మణి అనితర సాధ్యమైన నటన ప్రదర్శి౦చి ఉజ్వల తారగా నిలిచారు .తర్వాత తమిళనాడు టాకీస్ వారి చెంచు లక్ష్మి చిత్రం లో ఆది లక్ష్మి పాత్ర పోషించి తన నటనా సామర్ధ్యాన్ని రుజువు చేశారు .ఈ రెండు సినిమాలు అద్భుత విజయాలను సాధించి నిర్మాత దర్శక నటీనటులకు చిరయశస్సునేకాక కనక వర్షాన్ని కూడా కురిపించాయి .
సీతారామ జననం లో కౌసల్యగా ,సేతు బంధన్ లో ఇంద్రాణి గా ,భక్త శిరియాళ లోకథానాయకిగా నటించి సరిరారు తనకెవ్వరూ అని పి౦చుకొన్నారు .ధర్మాంగద చిత్రం లో తల్లిపాత్ర ధరించారు .వీర ,రౌద్ర గంభీర రసాలను ఎంత గొప్పగా పోషిస్తారో,అంతే గొప్పగా కరుణ దుఃఖ రసాలనూ పోషించి మెప్పించారు .బిఎన్ రెడ్డిగారి మల్లీశ్వరిలో మల్లీశ్వరి తల్లి నాగమ్మ గా ,భానుమతిగారి విప్రనారాయణలో వేశ్య తల్లి శ్రీహరి గా ,మాయాబజార్ లో అభిమన్యుని తల్లి సుభద్రగా గొప్ప పాత్ర పోషణ చేశారు .అలాగే అగ్గిరాముడు ,కృష్ణ సత్య ,పాండు రంగ మహాత్మ్యం లో (లక్ష్మి) మొదలైన 150 చిత్రాలలో వైవిధ్యభరిత పాత్రలలో నటించి రికార్డ్ సృష్టించారు .
తన అసమాన నటనతో నాటకరంగానికి వెండి తెరకు విలువలు సాధించిన అసమాన నటీమణి,గాయని ఋష్యేంద్ర మణి 17-8-2002 న మద్రాస్ లో మరణించారు ..
ఆమె సినిమాలో నటించే కాలానికి పాటలు పాడటానికి సాంకేతిక అభివృద్ధి జరగలేదు .అందుకని ఆ నాటి నటీ నటులు లాగానే తన పాత్రలకు పాటలు ఆమె పాడే వారు .ఆమెది గంభీరమైన స్వరం కంచు ఘంట మోగినట్లు ఉండేది .ఏభావమైనా ఆగొంతులో ఒదిగి బయటకు వచ్చి సమ్మోహితం చేసేది .కనుక గాయనిగా గొప్ప పేరు పొందారు .మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుని ఆశ్రమానికి రధంలో దారకుడు అభిమన్యుని సుభద్రను తీసుకు వెడుతుంటే రాక్షసమాయకు కొడుకు మూర్చిల్లితే ఋష్యేంద్ర మణి గారుపాడిన’’అఖిల రాక్షస మంత్ర తంత్ర అతిశయము నెనచు శ్రీ కృష్ణు సోదరి నగుదు నేని –దివ్య శస్త్రాస్త్ర విద్యలతేజరిల్లు అనఘు అర్జునుపత్నినే యగుదు నేని –ఈ శరంబసురు గూల్చి సిద్ధి౦చుగాక –పాండవ కులలైక భూషణు ప్రాణ రక్ష ‘’ పద్యం ఇప్పటికీ చెవులలో రింగు మంటూనే ఉంటుంది .చంద్రహారం సినిమాలో –గౌరీ సవతితల్లి ,జాతకఫలం –రంగారావు భార్య ,సంఘం లో రత్నం , గంగాగౌరీ సంవాదం –రుద్రమ్మ ,దీపావళి లో అదితి,గులేబకావళిలో గుణవతి,ఆప్తమిత్రులో శాంతమ్మ ,శ్రీ కృష్ణార్జున యుద్ధం లో గయుని భార్య ,ఆడబ్రతుకు లో ఆయా ,శ్రీ కృష్ణావతారం లో కుంతీదేవి ,భాగ్య చక్రం లో విక్రం తల్లి ,సత్తెకాలపు సత్తెయ్యలో అమ్మమ్మ ,సిపాయి చిన్నయ్యలో బామ్మ ,సంపూర్ణ రామాయణం లో రావణుని తల్లి కైకసి ,గా నటించి వివిధపాత్రలు పోషించారు 1986 లో వచ్చిన శ్రీ షిర్డీ సాయి బాబా మహాత్మ్యం ఆమె చివరి సినిమా .
ఇంతకీ ఋష్యేంద్ర మణి అనే చక్కని మహిమాన్వితమైన పేరు ఆమెకు ఎవరు ఎలా ఎందుకు ఆలోచించి పెట్టారో తెలియదుకానీ చాలా అరుదైన పేరు .నాకు తెలిసిన దాన్ని బట్టి ఋష్య అంటే శ్రేష్టమైన ఇంద్ర మణి అని అనుకొంటున్నాను .నవరసాల నటీమణి ఋష్యేంద్ర మణి.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-1-22-ఉయ్యూరు