మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -15

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -15

15-బెట్టీ డేవిస్ లాంటి మహానటి –హేమలత

శాంత సౌజన్యాలు మూర్తీభవించిన అలనాటి మేటి నటి పి.హేమలత. రంగస్థల నటిగా జీవితాన్ని ప్రారంభించిన హేమలత అంచెలంచెలుగా సినిమా నటిగా ఎదిగారు . ఆమె యన్టీఆర్, ఏయన్నార్ వంటి అగ్రకథానాయకుల చిత్రాల్లో తల్లి పాత్రలు పోషిస్తూ వచ్చారు . ముఖ్యంగా యన్టీఆర్ నటించిన పలు చిత్రాల్లో ఆయనకు తల్లిగా నటించి అలరించారు అనేక చిత్రాల్లో సాధుమూర్తిగా నటించిన హేమలత ‘బలిపీఠం’ వంటి చిత్రాల్లో గయ్యాళి పాత్రలూ పోషించారు [1] 1960ల నుండీ వచ్చిన సినిమాలలో అమ్మ పాత్ర కొంచెం మారింది. తనను తాను యస్సెర్ట్‌ చేసుకోవడం నేర్చుకున్నారు . హేమలత వారసత్వం, పరువు -ప్రతిష్ట సినిమాలలో ఇంటి వ్యవహారాలలో తన పట్టు నిలుపుకుంటూనే సినిమా ఆసాంతం ఒక ప్రధాన పాత్రలా కనిపించారు .

జీవిత విశేషాలు
ఆమె స్వస్థలం కృష్ణా జిల్లాలోని గుడివాడ. ఆమె 1926లో జన్మించారు .. చిన్నప్పటి నుంచి నాటకాలంటే పెద్ద అభిలాష ఉండేది కాదు. అయితే ఆమె భర్త శేషగిరి రావు ప్రోత్సాహంతో నటిగా కెరీర్ ప్రారంభిం చారు . శేషగిరిరావు నాటక కళాభిమాని, రంగస్థల నటుడు కావడంతో ఆమెను నాటకాలలోకి ప్రవేశ పెట్టాలని అభిలషిస్తూ ఉండేవారు. ఏలూరు నాటక కళా పరిషత్తులో రావూరి గారు రచించిన “పరితాపం” అనే నాటకంలో ఆమె భర్త సహకారంతో నటించి,. తొలిసారిగా నటించినందుకు ఆమెకు బహుమతి కూడా వచ్చింది. మొదటి ప్రయత్నంలోనే ప్రత్యేక బహుమతి పొందిన ఆమెను పాలకొల్లు అదర్శ మండలి పినిశెట్టి శ్రీరామమూర్తి తమ నాటకం “పల్లె పడుచు” లో ఆమె చేత జమీందారిణి రమాదేవి పాత్రలో నటించే అవకాశం ఇచ్చాడు. ఈ నాటకం ఆంద్ర ప్రదేశ్ అంతా ప్రదర్శించబడి జమీందారిణి పాత్రలో అందరికీ సుపరితురాలయ్యారు .

వారికి మొదటి నుంచి గరికపాటి రాజారావు తోనూ, ప్రజా నాట్య మండలి తోనూ పరిచయాలుండేవి. ఈ పరిచయాల వల్ల సినిమాలలో అవకాశాలు లభించాయి. పీపుల్స్ ఆర్టు ప్రొడక్షన్స్ వారు “పల్లెటూరు” చిత్రాన్ని తిస్తున్నప్పుడు అందులో ప్లీడరు భార్య పాత్ర ధరించడానికి తగిన వ్యక్తి కావాల్సి వచ్చింది. ఆ సమయంలో చదలవాడ కుటుంబరావు, డైరక్టరు తాతినేని ప్రకాశరావు లు ఆమెను సిఫార్సు చేసారు. తాతినేని ప్రకాశరావు ఆమెను చూడనైనా చూడకుండా “అనసూయ” పాత్రను ఇచ్చారు. ఈ సమయంలో 10 నెలల వయసున్న ఆమె కుమారునికి జ్వరం వచ్చి మంచం పడినప్పటికీ హడావుడిగా మద్రాసు చేరుకన్నారు . అక్కడ కొందరు ఆమె “అనసూయ” పాత్రకు పనికిరాదన్నారు. కానీ ఆమె అధైర్యపడక సినిమాలో నటించారు

ఆ తర్వాత గుమస్తా (1953) లో నటించారు ఆత్రేయ గారి “ఎన్.జి.ఓ” నాటకం ఆధారంగా నిర్మించిన చిత్రం అది. దాని తర్వాత నవయుగ వారు శ్రీధర్ దర్శకత్వంలో నిర్మించిన “జ్యోతి”(1954)లో నటించే అవకాశం లభించింది. ఆ సినిమాలో కథానాయకుని తల్లిగా నటించారు .. తరువాత “అనుపమ” పతాకంపై నిర్మించిన చిత్రాల్లో చాలా పాత్రలను కె.బి.తిలక్ గారు ఇచ్చారు. అత్తా ఒకింటి కోడలే (1958) చిత్రంలో అత్త భూమిక మొత్తం పోషించారు

వద్దంటే డబ్బు సినిమాలో నటిస్తుండగా ఎన్.టి.రామారావు ఆమెలో నటనా పటిమను గుర్తించి తాను స్వంతంగా నిర్మిస్తున్న పిచ్చిపుల్లయ్య లో హీరో తల్లి పాత్ర ధరించడానికి అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత రామారావు గారు తోడు దొంగలు సినిమాలో అతని భార్య పాత్ర ఇచ్చాడు. ఆ చిత్రానికి కేంద్ర ప్రభుత్వ బహుమతి వచ్చింది.

ఆమె నట జీవితంలో గొప్ప మలుపు వాహినీ వారి బంగారు పాప (1954). వాహినీ సంస్థలో అవకాశం రావడమే గొప్పగా ఉండే రోజుల్లో ఆ సంస్థలో నటించడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.

బి.ఎన్.రెడ్డి నిర్మించిన బంగారు పాప సినిమాలో రౌడీ కోటయ్య (ఎస్.వి.రంగారావు) ను మాటలతో కట్టడి చేసే మంగమ్మ పాత్ర కోసం ఆమెను ఎంపిక చేసాడు. ఆ సినిమాలో “మంగమ్మ” పాత్ర ఆమెను చక్కటి ఆర్టిస్టుగా చలన చిత్ర రంగంలోనిలబెట్టింది. ఈ సినిమా అవార్డు సభలో బి.ఎన్.రెడ్డి మాట్లాడుతూ “బంగారు పాప లో మంగమ్మ పాత్ర ధరించిన హేమలత గారిలో నటనా కౌశలం మరుగున పడి ఉంది. మన నిర్మాతలందరూ అవకాశాలిస్తే అమెరికన్బె నటి” రూత్ ఎలిజబెత్ బెట్టీ డెవిస్ ”లాగ నటించి ప్రజానీకాన్ని మెప్పించగల సామర్థం గల వారని” ఆమెను మెచ్చుకున్నాడు.

ఆ తర్వాత దుక్కిపాటి మధుసూధనరావు, అక్కినేని నాగేశ్వరరావు లు అన్నపూర్ణా వారి దొంగరాముడు లో దొంగరాముడి తల్లి పాత్ర ధరించడానికి అవకాశమిచ్చారు.

ఆ చిత్రం తరువాత ఆమెకు మరికొన్ని సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. గురజాడ అప్పారావు రాసిన నాటకం కన్యాశుల్కం ను డి.ఎల్.నారాయణ తీస్తే అందులో విన్నకోట రామన్న పంతులు సరసన “వెంకమ్మ” పాత్రలో నటించారు తరువాత సి.ఎస్.ఆర్ గారితో నిత్య కళ్యాణం-పచ్చతోరణం (1960), విఠల్ ప్రొడక్షన్స్ వారి కన్యాదానం (1955)లో షావుకారు జానకికే తల్లి సీతమ్మ పాత్ర, ఘంటశాల గారి సొంత చిత్రం సొంతవూరు (1956) లో ఎన్.టి.రామారావు గారి తల్లి సుభధ్రమ్మ పాత్రను ధరించారు . భూకైలాస్ లో రావణుని తల్లి కైకసి పాత్ర హుందాగా పోషించారు తరువాత ఎన్నీ చారిత్రకాలు, పౌరాణికాలు, సాంఘికాలలో సుమారు 200 చిత్రాలలో నటించారు .

చాలా సినిమాలలో తల్లి పాత్రలే వేసినా అప్పుడప్పుడూ కొన్ని స్వభావానికి విరుద్ధమైన పాత్రలు కూడా వేసింది. ఇల్లరికం, తిరుపతమ్మ కథ, మల్లమ్మ కథ చిత్రాలలో గయ్యాళి పాత్రలను వేశారు . రాముడు భీముడు చిత్రంలో ఎన్.టి.రామారావుకు అమ్మమ్మ గా కూడా నటించారు . సంపూర్ణ రామాయణం సినిమాలో కౌసల్య పాత్ర వేశారు .

తన కుమారుడు ఉద్యోగంలో స్థిరపడిన తరువాత సినిమాలలో నుండి విరమించుకున్నారు . కానీ దేవీ వరప్రసాద్ అడిగితే కాదనలేక కథానాయకుని కథ (1975) లో నటించారు . ఆమె చివరి చిత్రం సీతమ్మ సంతానం (1976)

ఆమె సినిమాలు మానేసిన తర్వాత, దాదాపుగా 20 ఏళ్లు పాటు ఒక వృద్ధాశ్రమంలో (హైదరాబాదు) ఉన్నారు . ఆవిడ క్షేమంగానే ఉన్నా, చూడ్డానికి ఎవర్ని రానిచ్చేవారు కాదు. తన 93వ ఏట ఆమె మరణించారు . ఈ మరణవార్త ఎవరికీ తెలియలేదు. దత్తత తీసుకున్న కొడుకు పత్రికలకి చెప్పలేదు.[4]

తరువాత జీవితం
ఆమె సినీ రంగానికి దూరంగా మద్రాసులో నాగార్జుననగర్ లో ఉన్న పెద్ద భవంతిని అమ్మివేసి హైదరాబాదు చేరుకుని ప్రజాపిత బ్రహ్మకుమారి శాంతి మార్గంలో ప్రశాంతజీవితం గడిపారు

తెలుగు చలన చిత్ర రంగం లో కన్నాంబ ,ఋష్యే౦ద్ర మణి,హేమలత గార్లు నట త్రివేణీ సంగమం లాంటి వారు. ముగ్గురూ ముగ్గురే .మేటి మహా నటీ మణులు . వెండితెరకు తమ నటనా సొబగులద్ది అందం ఆనందం చేకూర్చారు .చిరస్మరణీయం చేశారు .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-1-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.