మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -17

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -17

17-వెండి తెర తొలి గ్లామర్ హీరో –సి.హెచ్. నారాయణ రావు

చదలవాడ నారాయణ రావు (సెప్టెంబరు 13, 1913 – ఫిబ్రవరి 14, 1984) 1940 నుంచి 1950 దాకా ఓ దశాబ్ద కాలం పాటు తెలుగు సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన సినిమా నటుడు. చిత్తూరు నాగయ్య, వేమూరి గగ్గయ్య, కన్నాంబ, ఋష్యేంద్రమణి, సురభి బాలసరస్వతి వంటి కళాకారులు సినిమా రంగంలో ప్రవేశించక ముందు నాటకరంగాన్ని పరిపుష్టం చేసినవారే. అందుకు భిన్నంగా ఎలాంటి నాటకానుభవం, సిఫారసు లేకుండా సినీరంగంలోకి ప్రవేశించి స్వయంకృషితో నటుడుగా పేరు తెచ్చుకొన్న వ్యక్తి సి.హెచ్‌.నారాయణరావు. వాహినీవారు భక్తి రసాత్మకమైన చిత్రం ‘భక్తపోతన’ (1944) ను విడుదల చేసారు. అందులో రెండు మూడు సార్లు శ్రీరాముడు ప్రత్యక్షమవుతాడు. ఆ శ్రీరాముడ్ని చూసి ప్రేక్షకులు తన్మయులైనారు. అంతకుముందు అంత అందమైన, ఆకర్షణీయమైన శ్రీరామచంద్రుడ్ణి చూడలేదు. ‘సాక్షాత్తు రాముడే’ అన్నారు ప్రజ, పోతన పక్షమై. ఆ శ్రీరామ పాత్రధారి చదలవాడ నారాయణరావు.

బాల్యం
సి.హెచ్. నారాయణ రావుగా పిలువబడే ఈయన 1913 సెప్టెంబరు 13న కర్నాటకలో బెంగుళూరు – హుబ్లీ మార్గంలో ఉన్న మధుగిరిలో జన్మించారు. నారాయణరావు తల్లి వైపు తాత, ముత్తాతలు, మేనమామలు అప్పట్లో మైసూరు దివాణంలో పనిచేసేవారు. నారాయణరావు తండ్రి చదలవాడ లక్ష్మీ నరసింహారావు రెవెన్యూ అధికారిగా ఉద్యోగం చేసేవారు. అనంత పద్మనాభ వ్రతం రోజున పుట్టిన బిడ్డ కావడంతో, ఆ దంపతులు పెట్టుకున్న పూర్తి పేరు చదలవాడ అనంత పద్మనాభ దత్తాత్రేయ సత్యనారాయణరావు. ఆ పేరే వెండితెరపై సంక్షిప్తంగా సిహెచ్‌. నారాయణరావు అయింది.

విద్యాభ్యాసం
నారాయణరావు బాల్యంలో చదువంతా ఏలూరులో సాగింది. ఆ తరువాత చాలాకాలం గుంటూరులో ఉన్నారు. సోషలిస్టు భావాలున్న ఆ తరువాతి కాలంలో ట్రేడ్‌ యూనియనిస్ట్‌గా పనిచేశారు. రైల్వే వర్కర్స్‌ యూనియన్‌కు కార్యదర్శిగా, రైల్వే వర్కర్స్‌ బెనిఫిట్‌ ఫండ్‌కు కార్యదర్శిగా వ్యవహరించారు.అప్పట్లోనే రైల్వే సమ్మెకు నాయకుడై, రాజకీయ నాయకుడు వి.వి.గిరి తదితరులతో కలసి ఉత్తర భారతమంతటా తిరిగారు.సినీ రంగంలోకి రాక ముందు ఏలూరు లోని ప్రసిద్ధ ‘వెంకట్రామా అండ్‌ కో’ లో పనిచేశారు. పుస్తకాలు ప్రచురించడం, ఇంజనీరింగ్‌ వర్క్ షాపులో పనిచేయడం లాంటివన్నీ చేశాక, తలవని తలంపుగా సినిమా అవకాశం ఆయన తలుపు తట్టింది.

సినీ రంగ ప్రవేశం
అసలు సినిమాల్లోకి వస్తానని కానీ, రావాలని కానీ ఆయన అనుకోలేదు. ఆయన సినీ రంగప్రవేశం చాలా తమాషాగా జరిగింది. ఓ రోజు రైలు ప్రయాణం చేస్తున్న సినీ దర్శకుడు ద్రోణంరాజు చిన కామేశ్వరరావు, నారాయణరావును చూశారు. అందం, మాటతీరు చూసి ముగ్ధుడైన కామేశ్వరరావు ఆయనను ఏకంగా హీరో పాత్రకు ఎంపిక చేశారు. అనుభవం లేదంటున్నా సినీ నటుణ్ణి చేశారు. అలా మీర్జాపురం రాజావారు జయా ఫిలిమ్స్‌ పతాకంపై తీస్తున్న ‘జీవనజ్యోతి’ (1940)లో హీరోయిన్‌ కృష్ణవేణి సరసన కథానాయకుడిగా సిహెచ్‌. నారాయణరావు సినీ రంగ ప్రవేశం జరిగింది. తొలి సినిమాతోనే మంచి నటుడిగా పేరు వచ్చింది.

కథానాయకుడిగ]
1940 లో వచ్చిన సాంఘికం ‘జీవనజ్యోతి’లో మాంచి పర్శనాలిటి గల హీరో ప్రవేశించాడు. నునుపైన, సహజమైన జుట్టు. సోగకళ్ళు, పొడుగైన ముక్కు, నవ్వితే నవరత్నాలు రాలినట్టు కనిపించే పెదవులు, పలువరసతోఅందర్నీ ఆకర్షించాడు. ఆ హీరో నారాయణరావు. నాగయ్య, సి.ఎస్‌.ఆర్‌., జి.వి.రావు., ఉమామహేశ్వరరావులు ముఖ్య పాత్రలు ధరిస్తున్నారు ఆ రోజుల్లో పర్సనాల్టీలో వీరికి భిన్నంగా కనిపిస్తూ నారాయణరావు రాగానే, ‘ హీరో అంటే ఇలా అందంగా ఉండాలన్న మాట… హీరోయిన్‌ లాగానే’ అనుకున్నారు ప్రేక్షకులు. రైల్వేలో ఉద్యోగం చేస్తున్న నారాయణరావూని చూసి, ద్రోణంరాజు చినకామేశ్వరరావు (‘జీవనజ్యోతి’ దర్శకుడు) చిత్రాల్లో ప్రవేశ పెట్టారు. కృష్ణవేణి ఆ చిత్రంలో కథనాయిక. నారాయణరావు నటన చాలా సహజంగా ఉంటుందని, అవలీలగ నటించేస్తాడనీ పత్రికలు రాసేవి.

అయితే ఆయన కేవలం హీరో పాత్రలే ధరించలేదు. హీరోగా ఎష్టాబ్లిష్‌ అయిన తర్వాత విలన్‌ పాత్రలు కూడా ధరించారు. తర్వాత కారెక్టర్‌ యాక్టర్‌. ‘చెంచులక్ష్మి’, ‘తాసిల్దార్‌ ’, ‘మొదటిరాత్రి ’, ‘ మనదేశం’, ‘ తిరుగుబాటు’, మొదలైన చిత్రాల్లో హీరో అయితే, ‘ జీవితం’లో విలన్‌. ‘దేవత’, ‘స్వర్గసీమ’ చిత్రాల్లో విలన్‌ కాదుగాని, అదో తరహా పాత్రలు. ‘ గంగ గౌరీ సంవాదం’లో శివుడు, సాంఘికాలు, పౌరాణికాలు, జానపదాలు… అన్నింటిలో కూడా నారాయణరావు నటించారు.

నాటకాలలో
ఎక్కువగా నాటకానుభవం లేకపోయినా, సినిమాలకి వచ్చిన తర్వాత నాటకాల్లో నటించారు. మల్లాది కృష్ణ శర్మ రాసిన ‘మిస్‌ ప్రేమ బి.ఏ.’ (తిమ్మరాజు శివరావు దర్శకత్వం) లో నారాయణరావు హీరోగా నటించి, చాలా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. పకడ్బందీగా, క్రమశిక్షణతో రిహార్సల్సు జరిపి ఆ నాటకంలో నటించారు. హరీంద్రనాథ్‌ ఛటోపాధ్యాయతో సాన్నిహిత్యమున్న ఆయన తరువాతి రోజుల్లో పాలగుమ్మి పద్మరాజు ‘పట్నవాసం’ లాంటి రేడియో నాటికల్లోనూ పాల్గొన్నారు.

సినీ జీవితం
1939 సంవత్సరంలో నారాయణరావు చిన్న ఉద్యోగం చేసుకుంటూ తరచు చెన్నపట్నం వెళ్ళి వస్తుండేవారు. ఒకసారి హోటల్‌లో ఆయన భోజనం చేస్తుండగా ప్రముఖ దర్శకుడు ద్రోణంరాజు కామేశ్వరరావు గారితో పరిచయం అయింది. మొదట ద్రోణంరాజు గారు నారాయణరావుని చూసి బెంగాలీ అనుకొన్నారట. తరువాత నారాయణరావు తెలుగువాడే అని తెలిసిన మీదట తన దర్శకత్వంలో శోభనాచల సంస్థ నిర్మించబోయే జీవన జ్యోతి అనే చిత్రానికి స్క్రీన్‌ టెస్ట్‌కు రమ్మని చెప్పారు. స్క్రీన్‌ టెస్ట్‌లో భాగంగా నారాయణరావుకు కొన్ని సంభాషణలు ఇచ్చి చిత్రీకరించారు. ఆ టెస్ట్‌ పీస్‌ను థియేటర్లో ప్రొజెక్ట్‌ చేసే తతంగం సాగర్‌ టాకీస్‌లో మొదలైంది. దర్శకుడు రాజు గారు, నిర్మాతలు, కెమెరామెన్‌ కొట్నీస్‌, సౌండ్‌ ఇంజనీర్‌ రంగయ్య తదితరులు ఈ సందర్భంగా హాజరయ్యారు. తరువాత ఆ సినిమా అసిస్టెంట్‌ కెమెరామెన్‌ వచ్చి నారాయణరావు జీవన జ్యోతి సినిమాకు హీరోగా నారాయణరావు ఎంపికయ్యారు అన్న వార్తను చేరవేశారు. ఈ సినిమాకోసం ఆయనకు ఇచ్చిన పారితోషికం అక్షరాలా వంద రూపాయలు. అప్పట్లో వంద రూపాయల జీతగాఢంటే ధనవంతుడుగా లెక్క. అలా సిఫారసు లేకుండా నటుడైన నారాయణ రావు మనదేశం, ముగ్గురు మరాఠీలు, లక్ష్మమ్మ, వీలునామా, రహస్యం వంటి 50కి పైగా చిత్రాల్లో హీరోగా, సహాయ నటుడుగా నటించారు.

నారాయణరావు శోభనాచల స్టూడియోకి దగ్గర్లోనే అళ్వారుపేటలో ఉండేవారు. సినిమాల్లో ప్రవేశిస్తూ మొదట ఏ ఇంట్లో ప్రవేశించారోస్టార్‌ అయిన తరువాత కూడా అదే ఇంట్లో ఉన్నారు. ఆయనకి ఆర్భాటం లేక పోయినా, ఆత్మాభిమానం హెచ్చు. ఒక దశలో ఆయనకి చిత్రాలు లేవు.

1953 లో వై.వి.రావు దర్శకత్వంలో వరుణ అండ్‌ మహాత్మా అనే కంపెనీ ‘మంజరి’ (జానపదం) నిర్మించింది. నారాయణరావు దాదాపు నిర్మాత. తను సంపాదించుకున్నది ఆ చిత్రానికి ధారపోసారు. చిత్రంవిజయవంతం కాలేదు. అప్పులు మిగిలాయి. అప్పట్నుంచి నారాయణరావు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. చిత్రాలూ లేవు. జరుగుబాటుకీ, పిల్లల చదువులకీ ఎదురీత మొదలైంది. అయినా, ఆయన గుండె నిబ్బరం తగ్గలేదు. చాలా మంది తారలు, కళాకారులు ఉచ్ఛస్థితికి వెళ్ళీ, కిందికి పడిపోవడం సామాన్యంగా చూస్తూనే ఉంటాం. అదే జరిగింది నారాయణరావు జీవితంలోనూ. ఎంతటి ప్రసిద్దుడికైనా, గొప్పవాడికైనా ఒక దశ దాటిన తరువాత పరిస్థితి, స్థితీ మారడం విధాత శాపం కాబోలు.

తెలుగు, తమిళం, కన్నడం, ఇంగ్లీషుతో పాటు మలయాళం, హిందీ భాషలు కూడా ఆయన ధారాళంగా మాట్లాడేవారు. కెరీర్‌ తొలి రోజుల్లోనే ‘దీనబంధు’ (1942) చిత్రంలో వకీలుగా కోర్టు సీనులో ఆయన అనర్గళంగా చెప్పిన ఇంగ్లీషు డైలాగులు పరిశ్రమ వర్గీయులనూ, ప్రేక్షకులనూ ఆశ్చర్యపరిచాయి. మంచి గాత్రమున్న నారాయణరావు ఆ సినిమాలో సొంత గొంతుకలోనే పాట పాడారు. ఇక, ఘంటసాల పాడిన తొలి సినీ గీతం ‘స్వర్గసీమ’ (1946)లో నారాయణరావు, భానుమతులపై చిత్రీకరించినదే! ‘దేవత’ (1941)లో భావకవిగా చిన్న పాత్ర పోషించారు. అందాల నటుడిగా పేరు తెచ్చుకొని, ‘చెంచులక్ష్మి’ (1944)లో సవతుల పోట్లాటలో చిక్కిన కథానాయకుడిగా, ‘తాసిల్దార్‌’ (1944)లో పాశ్చాత్య జీవనశైలీ వ్యామోహంలో పడే తాసిల్దార్‌గా, ‘స్వర్గసీమ’ (1946)లో నెగటివ్‌ ఛాయలున్న పాత్రలో – అందరినీ ఆకట్టుకున్నారు. ఓ పక్క హీరోగా చేస్తూనే మరో పక్క కీలకమైన పాత్ర అయితే, చిన్నదైనా సరే నటించడానికి ఆయన వెనుకాడకపోవడం విశేషం.

ప్రముఖులతో అనుబంధాలు
కృష్ణవేణి, కమలా కోట్నీస్‌, ఋష్యేంద్రమణి, భానుమతి, రుక్మిణి, జి. వరలక్ష్మి, శాంతకుమారి, ‘షావుకారు’ జానకి, కృష్ణకుమారి లాంటి అప్పటి తరం నాయికల సరసన ఈ అందాల నటుడు అభినయించారు. అప్పట్లో నారాయణరావుకు బోలెడంతమంది అభిమానులు ఉండేవారు. తెలుగులో సినిమా హీరోలకు అభిమాన సంఘాలు ఏర్పడడం ఆయనతోనే మొదలైందని చెబుతారు. అలాంటి పాపులారిటీ వల్ల 1949లో విజయ వాడలో ఆకాశవాణి కేంద్రం ప్రారంభోత్సవానికి కూడా ఆయన ప్రత్యేక ఆహ్వానితులయ్యారు. ఇక, 1951 ప్రాంతంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆయనను సత్కరించడం విశేషం. వి.వి. గిరి, ప్రకాశం పంతులు, పి.వి. రాజమన్నార్‌, బెజవాడ గోపాలరెడ్డి, మాడభూషి వెంకటాచారి లాంటి అప్పటి రాజకీయ నాయకులతో ఆయనకు అనుబంధాలు ఉండేవి.

అభిప్రాయాలు
ఆంగ్ల చిత్రాలు, ఆ స్థాయి, ఆ నటనా మనకీ రావాలని, మనది బాగా ఓవర్‌ యాక్టింగ్‌లా కనిపిస్తుందనీ నారాయణరావు చెప్పేవారు. ‘ఆ చిత్రాల్లోని నటులు ఎక్కువగా హావభావాలు చూపించరు. మామూలుగా, మాట్లాడుతున్నట్టుగా నటిస్తారు. సజీవమైన పాత్రలు అంటే అలాగే ఉంటాయి. నటించాలి కాబట్టి, మనం రెండాకులు ఎక్కువగా తగిలిస్తాం. పూర్వం రోజుల్లో నాటక నటన అయితే మరీ ఓవర్‌గా ఉండేది. మామూలుగా మనం ఎలా మాట్లాడతామో, ఎలా ప్రదర్శిస్తామో అలా… జీవితానికి దగ్గరగానే నటనా ఉండాలని నా ఉద్దేశం. ఎంతమంది నాతో ఏకీభవిస్తారో నాకు తెలియదు. అయితే చిత్రాల్లో నటిస్తున్నప్పుడు నేనోక్కడినే అలా నటిస్తే అతకదు. పైగా ఆ విధానాన్ని మన దర్శకులు అంగీకరించే స్థాయిలో లేరు. చిత్రంలోని పాత్రలన్నీ ఒకే రీతిలో నటించ గలగాలి’ అని నారాయణరవు చెప్పేవారు. అందుకే ఆయన నటనలో చేతులు ఎక్కువగా తిప్పడమూ, గట్టిగా అరవడమూ, కళ్ళూ కనుబొమలూ ఎగరవేయడమూ కనిపించేది కాదు. ఆయనదొక స్టడీ.

‘మనదేశం’ చిత్రం ఎన్‌.టి.రామారావు తొలి చిత్రం. అందులో నారాయణరావు హీరో, రామారావుది ఇన్స్పెక్టర్‌ పాత్ర. తనకి షూటింగులేని ఓ రోజున రామారావు తెల్లని పంచె, జుబ్బాతో కుడిచేత్తో పంచెకొంగుని పైకి పట్టుకుని నడుస్తూ వచ్చి, మేకప్పులో ఉన్న నారాయణరావుకు నమస్కరించి కూచున్నారు. ఆయన్ని చూడగానే ‘అరె..మీరా! ఇన్స్పెక్టర్‌ డ్రస్‌ లో చూసి, మాములుగా చూచేసరికి ఎవరో అనుకున్నాను. చాలా అందంగా ఉన్నారు. ఎప్పుడూ ఇలాగే వేసుకుంటారా డ్రెస్సు?’ అని అడిగారు నారాయణరావు.

వ్యక్తిత్వం
ఎంతమందిలో ఉన్నా నారాయణరావు మీదనే అందరి కళ్ళూ ఉండేవి. ఆ తరం ప్రేక్షకులకి నిరంతరం ఆయన బాగా గుర్తుంటారు. వ్యక్తిగా చూస్తే మృదువైన సంభాషణ. సౌమ్యుడు. ఆత్మాభిమానం గలవాడు. బాగా చదువుకున్నారు. ఆంగ్లభాషలో చక్కగా మాట్లాడేవారు. ఆంగ్లభాషలోని గొప్ప గొప్ప పుస్తకాలమీద నిత్యమూ మిత్రులతో చర్చించేవారు. తరచూ రేడియో నాటకాల్లో కూడా పాల్గొనేవారు.

‘నేను చిత్రాల్లో నటించడం మానేసానని ఎవరో అన్నారు. అలానెనేం చెప్పలేదు. నటుడిని నేను. ఎందుకు నటించను? అయితే నేనెవర్నీ వెళ్ళి అడగను. ఏభై చిత్రాల్లో నటించిన వాడిని… నన్నెరగరా ? అయినా నేను వెళ్ళి అడగడానికి ఆత్మాభిమానం అడ్డం వస్తుంది. అంతకంటెఅంతకంటె, ఇలా పుస్తకాలు చదువుకుంటూ, సిగరెట్లు కాల్చుకుంటూ, (ఆయన ఎక్కువగా సిగరెట్లు కాల్చేవారు) ఇంట్లో కూచోవడం నయం. ఈ మధ్య ఒక నిర్మాత వేషం వెయ్యమని అడిగారు. తప్పకుండా వేస్తానన్నాను. అయితే పారితోషికం చాలా తక్కువగా మాట్లాడాడు. ఎంచేతనంటే… నాకు సినిమాలు లేవుట. డిమాండ్‌ లేదుట.’ హీరో పాత్రధారణకి తీసుకున్నంత పారితోషికం అడగడం లేదు గాని, రీజనభాుల్‌గా ఇవ్వండి.‘ అన్నాను ప్రాధేయపడలేదు. మరీ నన్ను తక్కువగా అంచనా వెయ్యడం నాకు నచ్చలేదు. నాకు డబ్బు కావాలి…నిజమే. కాని, ఎంతో కొంతకి కక్కుర్తి పడి ఎలావెయ్యను? దానివల్ల నాకు అహంకారం అన్నారు. డిమాండ్‌ చేస్తాడన్నారు. అదేం కాదు…నా కున్న పేరునీ, ఒకనాటి నా అనిభవాన్నీ చవగ్గా వాడుకోవాలని చూస్తే సహించవలసిన అవసరంలేదు. ’అదీ ఆయన ధోరణి !

అందరికి అందుబాటులో ఉండే నటుడుగా గుర్తింపు పొందిన నారాయణరావు. 1984 ఫిబ్రవరి 14లో మరణించారు.[3]

చివరి రోజులు
చివరి రోజుల్లో ప్రోస్టేట్‌ గ్రంథి సమస్యతో, మూత్రపిండాల వ్యాధితో బాధపడిన ఆనాటి రొమాంటిక్‌ హీరో చివరకు తన 71వ ఏట 1984 ఫిబ్రవరి 14న మద్రాసులోని రాయపేటలో ఓ ప్రైవేటు నర్సింగ్‌హౌమ్‌లో కన్నుమూశారు. కనుమరుగై మూడు దశాబ్దాల కాలమవుతున్నా, ఇవాళ్టికీ సిహెచ్‌. నారాయణరావు పేరు చెప్పగానే పాతతరం వాళ్ళకు ‘మనదేశం’ (1949), కృష్ణవేణితో కలసి నటించిన శోభనాచల వారి ‘లక్ష్మమ్మ’ (1950), ఏ.వి.ఎం. వారి ‘జీవితం’ (1950), సేలంలోని మోడరన్‌ థియేటర్స్‌ వారి ‘ఆడజన్మ’ (1951) లాంటి చిత్రాలే గుర్తుకు వస్తాయి. హీరో నుంచి క్యారెక్టర్‌ యాక్టర్‌గా పూర్తిగా మారిపోయాక ఆయన నటించిన ‘బాల భారతం’, ‘కలెక్టర్‌ జానకి’, ‘శ్రీకృష్ణ తులా భారం’, ‘రహస్యం’, ‘దేశోద్ధారకుడు’, ‘రాణీ కాసుల రంగమ్మ’, ‘పులిబిడ్డ’ లాంటి చిత్రాలను చూసినప్పుడు పాత జ్ఞాపకాలు మెలిపెడతాయి.

నాటకాలలో నటిస్తూ గొంతెత్తి పాడుతున్న వారికే సినిమా చాన్స్ తగిలే రోజుల్లో అవేవీ లేకుండా డైరెక్ట్ గా మొదటి సారే హీరో అయిన గ్లామర్ కింగ్ నారాయణరావు గారు .ఓవర్ యాక్షన్ లేకుండా సాత్వికాభినయనానికి పెద్ద పీట వేసిన మార్గదర్శి .సృజనాత్మక శక్తితో సినీ హీరోలకు గ్లామర్ సంతరించిపెట్టిన తొలి తెలుగు హీరో నారాయణ రావు .సినీ కళాకారులకు ఏమాత్రం గౌరవం లేని రోజుల్లో నారాయణ రావు రంగప్రవేశం తో అవన్నీ కొట్టుకు పోయాయి .’’అందాల నటుడు ‘’అని పించుకోవటమే కాదు ‘’మహా నటుడు ‘’అని కూడా అని పించుకొన్నారు .ఆయనలోని సంస్కారాన్నీ ,నటనా కౌశలాన్ని సాధారణ ప్రేక్షకులే కాకుండా ,హిందీ దిగ్గజ మహానటులు బల్రాజ్ సహానీ ,పృధ్వీ రాజ్ కపూర్ ,భారత తోలి వైస్ ప్రెసిడెంట్ సర్వేపల్లి రాదాకృష్ణన్ ,ఆంధ్రా యూని వర్సిటి వైస్ చాన్సలర్ కట్టమంచి రామ లింగా రెడ్డి వంటి మేధావులు కొనియాడారు అంటే మామూలు విషయం కాదు .
సాంఘిక జానపద పౌరాణిక ,చారిత్రిక చిత్రాలు 50లో హీరోగా, కేరక్టర్ యాక్టర్ గా నటించిన తన ప్రతిభా వ్యుత్పత్తులు ప్రదర్శించిన మేటి నటులు నారాయణ రావు .తెలుగు సినిమా పుట్టిన పదేళ్లకు 1944లో సినీ రంగ ప్రవేశం చేసి ఒక దశాబ్దం పాటు తిరుగులేని హీరో గా వెలిగారు .అభిమాన సంఘాలు ఏర్పడిన మొట్టమొదటి హీరో నారాయణరావు .1951లో ఆంద్ర విశ్వ విశ్వవిద్యాలయం వీరి నటనా వైదుష్యాన్ని గుర్తించి సత్కరించింది .ఒక యూని వర్సిటి ఒక సినీ నటుడినిసత్కరించటం వీరితోనే ప్రారంభమైంది .నారాయణ రావు –కృష్ణ వేణి జంట ఆకాలం లో సక్సెస్ ఫుల్ పెయిర్ గా భావించారు .వీరిద్దరూ జంటగా నటించిన మనదేశం సినిమాలో రామారావు మొదటి సారి గా ఒక చిన్న పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర ధరించి సినీ రంగ ప్రవేశం చేశారు .శోభనాచల సంస్థ ఈ హిట్ పెయిర్ తో ‘’లక్షమ్మ సినిమా 1950లోనిర్మిస్తే ,ప్రతిభావారు అక్కినేని , అంజలి తో ‘’శ్రీ లక్ష్మమ కథ’’సినిమా తెశారు .నారాయణ రావు గారి సినిమానే ఘన విజయం సాధించి బాక్సా ఫీజు బద్దలు కొట్టింది .

1956లో ఎస్వి రంగారావు తో వీరు ఎదో పట్టింపు తో నటించను అని చెబితే ,లక్ష్మీ రాజ్యం గారితో హరిశ్చంద్ర లో నటించారని అంటారు ..గురజాడ కన్యా శుల్కం సినిమాలో ‘’గిరీశం పాత్ర నేనుకాకుండా సిహెచ్ నారాయణరావు గారు నటించి ఉంటె సినిమా ఘన విజయం సాధిచి కళా ఖండంగా మిగిలి పోయి ఉండేది ‘’అని ఎన్టి. రామారావు గారే స్వయం గా చెప్పారు .అలాగే స్వర్గ సీమ సినిమాలోసీనియర్ నటులు నాగయ్య గారు హీరో అయినా ,నారాయణరావు గారి చలాకీతనం తో కూడినకదలికలతో ,సంభాషణా చాతుర్యం తో ,అభినయ ప్రతిభతో ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించారని సినీ విశ్లేషకులు శ్రీ ఉడయవర్లు చెప్పారు .ఘంటసాల సినీ రంగ ప్రవేశం చేశాక పాడిన మొదటి ‘’హారే హా ,లే వెన్నెల ,చిరునవ్వులు విరజిమ్ము బఠానీ,నీ రాకకోరి నీ దారి కాచి యున్నానె పిల్లా ,వేచి యున్నానె ‘’పల్లవి గల పాట నారాయణ రావు గారికే స్వర్గ సీమ సినిమాలో పాడారు .వైజయ౦తీమాలతో జీవితం సినిమాలో ఒక ప్రత్యెక తతో నటించారు .జీవన జ్యోతి ,దేవత ,ప్రహ్లాద ,దీనబంధు ,చెంచు లక్ష్మి ,తాసిల్దారు ,ముగ్గురు మరాఠీలు ,ఆడ జన్మ ,మనదేశం వంటి చిత్రాలలో అపూర్వ నటన ప్రదర్శించారు నారాయణరావు గారు .

కలెక్టర్ జానకి,అర్ధరాత్రి ,రహస్యం ,వీలునామా ,గంగా గౌరీ సంవాదం లో శివుడు ,జంగమ దేవర ,జమ్పనవారి మేనరికం లో హీరోగా జి వరలక్ష్మితో ,వివి రావు డైరెక్షన్ లో మంజరిమానవతి సినిమాలలో జి వరలక్ష్మితో హీరోగా , ఆడజన్మ ,తిరుగుబాటు ,త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వం లో కృష్ణవేణి తో హీరోగా ,బిఎన్ రెడ్డి గారి స్వర్గ సీమలో నాగయ్య భానుమతి గార్లతో ,వైవి రావుడైరేక్షన్ లో తాసిల్దార్ లో తాసిల్దార్ నరసయ్యగా భానుమతి తో బిఎ సుబ్బారావు డైరెక్షన్ లో చెంచు లక్ష్మిలో ,రాజా సాండో నిర్మించి దర్శకత్వం చేసిన చూడామణి లో పుష్పవల్లి ,సి ఎస్ ఆర్ లతో హీరోగా ,బిఎన్ రెడ్డి గారి దేవత లో సుకుమార్ గా , మొత్తం మీద 50 సినిమాలలో సక్సెస్ ఫుల్ నటుడుగా నటించి చారిస్మాతో ఆంధ్ర ఆంధ్రేతర ప్రెక్శకులను ఆకర్షించారు హీరో చదలవాడ నారాయణరావు .

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -13-1-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.