మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -21
21-చిరుబొజ్జతో వినాయకుడిగా నటించిన హాస్యాంబుధి-బొడ్డపాటి
బొడ్డపాటి ఇంటిపెరుతోనే ప్రసిద్ధులైన హాస్య బొడ్డపాటి
బొడ్డపాటి కృష్ణారావు .మచిలీబందరు వారు. .వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయుడైన ఈయన స్వస్థలం మచిలీపట్టణం. విలక్షణమైన ఆకారం గల కృష్ణారావు గారు రంగస్థలం మీద ‘ సుబ్బిశెట్టి ‘ లాంటి వేషాలు వేసి చెళ్ళపిళ్ళ వారి వంటి ఉద్దండ పండితుల చేత ‘ హాస్యాంబుధి ‘ అనే బిరుదు పొందారు.
1954 లో ఆదుర్తి సుబ్బారావు గారి ‘ అమర సందేశం ‘ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. సినిమాల్లో వేషాలు వేస్తూనే ట్యూషన్లు కూడా చెప్పేవారు. నందమూరి తారక రామారావు గారి పిల్లలకి ఆయనే పాఠాలు చెప్పారు. సరిగా చదవకపోతే పిల్లలను దండించడంలో రామారావు గారు కృష్ణారావు గారికి పూర్తి స్వేచ్చనిచ్చారు.
ఒకసారి కృష్ణారావు గారు అందరికీ తాను ఒక చిత్రంలో హీరోగా చేస్తున్నట్లు చెప్పారు. ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఆయన చాలా నమ్మకంగా చెప్పడంతో విచారించగా ‘ వినాయక చవితి ‘ చిత్రంలో వినాయకుడిగా నటిస్తున్నట్లు తెలిసింది. తొండం, చాటంత చెవులు వగైరాలతో ముఖం కనిపించకుండా పోవడంతో ఆయనకి బాధ కలిగింది. ఆ మాటే దర్శక నిర్మాతలతో చెబితే అదే చిత్రంలో యదువీరుడి వేషం కూడా ఇచ్చారు. దాంతో కృష్ణారావు గారు గర్వంగా అందరికీ తాను ఆ చిత్రంలో ద్విపాత్రాభినయం కూడా చేస్తున్నట్లు చెప్పుకున్నారట.
తానూ రాజనాల ,గుమ్మడి ,ముక్కామల లాగా ఇంటిపేరు బొడ్డపాటి తోనే చెలామణి అయ్యాను అని గర్వంగా చెప్పుకొనేవారు .వేదాలు ,సంస్కృత గ్రంధాలు క్షుణ్ణంగా చదివి పాండిత్యం సంపాదించిన ప్రతిభ బొడ్డపాటి వారిది .పండితులు ,సంస్కారి ,చమత్కారి కూడా .నందమూరి పిల్లలకు ట్యూషన్ చెబుతూ నెల నేలా జీతం అడగటానికి మొహమాతపదేవారు అడిగితె సినిమాలలో వేషం ఇవ్వరేమో అనే భయం కూడా ఉండేది .’’అప్పుడప్పుడు ‘’వేషం ‘’అంటూ గొణుగుతూ గుర్తు చేసేవాడిని. ఆయన ఎదో చిన్నో చితకో వేషమిచ్చి నటి౦పజేసేవారు .ఇలా ద్విపాత్రాభినయం చేసేవాడిని ‘’అని చెప్పేవారు బొడ్డపాటి .
మాయాబజార్ లో ముహూర్తాలుపెట్టే శంఖు తీర్ధులు వేషం వేశారు బొడ్డపాటి .ఆయన ప్రక్కనే మరో ఆయన తలూపుతూ కూచుంటాడు డైలాగ్ ఉండదు ఆయనపేరు సివివి పంతులు .తమిళ పెళ్లి చేసి చూడు సినిమాలో రామారావు తండ్రిగా బొడ్డపాటి తెలుగు వెర్షన్ లో డా శివరామ కృష్ణయ్య నటించారు ,తమిళ మాయాబజార్ లో శంఖు తీర్ధులు శివరామ కృష్ణయ్య గారు అయితే ఆయన పక్కన మాట్లాడకుండా ఉండే మరో పండితుడు బొడ్డపాటి .
ఆయన ఎన్ని సినిమాలో నటించారో ఆయన తలిదంద్రులెవరో పుట్టిన, ,మరణించిన తేదీలు ఎక్కడా దొరకలేదు .ఎవరికీ పట్టకపోవటం ఆశ్చర్యమే .నాకు దొరికిన విషయాలు మీ ముందు ఉంచాను .
సశేషం
సంక్రాంతి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-1-22-ఉయ్యూరు