మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -24
24-సినీ హరి కథల మోపర్రు దాసు
ఎత్తుగా గిరజాల ఒత్తు జుట్టుతో ,ఆజానుబాహువుగా ,దబ్బపండు వంటి మై చాయతో ,చెవులకు కుండలాలతో ,నుదుట వెడల్పైన నిలువు కుంకుమ బొట్టుతో ,పంచె కట్టు ,సిల్క్ లాల్చీ తో మహా అందంగా కనిపించే వారు మోపర్రు దాసు .సంమోహ పరచే గాత్రం .స్పష్టమైన ఉచ్చారణ .ఉదయం చూస్తె కళ్ళు ఎర్రగా ఉండేవి .కృష్ణా జిల్లా పామర్రు దగ్గర మోపర్రు ఆయన స్వగ్రామం .ఘంటసాల మాష్టారికి చిరకాల ఆప్తమిత్రులాయన .అసలు పేరు బసవ లింగాచారి .సినిమాలో హరికథా గానం చేసేవారు .ఆంద్ర దేశం లో నంబర్ వన్ హరికథలుగా మంచి పేరు ఉండేది .
సముద్రాలవారు నిర్మించి దర్శకత్వం వహించిన ‘’వినాయకచవితి సినిమాలో మోపర్రు దాసు వినాయక చవితి కథను బోధించే సాధువు వేషం లో కనిపిస్తారు . వినాయక చవితి పాటల కంపోజింగ్ ఘంటసాల వారింటి లోనే జరిగేది.సముద్రాల రాఘవాచార్యులు గారితోపాటు ,అసోసియేట్ డైరెక్టర వి ఎం స్వామి ,నిర్మాత కే గోపాలరావు సోదరుడు,మేనేజర్ అయిన కే హనుమంతరావు గార్లు కూడా మాష్టారింటికే వచ్చి పాల్గొనేవారు . రోజులు మారాయి సినిమాలో డప్పుల వాడు గా కనిపిస్తారు .1950లో వచ్చిన షావుకారు సినిమాలో సముద్రాల రాసిన ‘’శ్రీలు చెలంగె భారతభూమి ‘’పాటకు మోపర్రు దాసుగారి వ్యాఖ్యానం అద్భుతంగా ఉంటుంది .విప్రనారాయణ ,మొదలైన సినిమాలు చాలా వాటిలో హరికథకులుగానో చిన్న చిన్న వేషాలలోనో కనిపిస్తారు .జయభేరి సినిమాలోనూ హరికథకులుగా నటించారు .దేశభక్తి గీతాలు పద్యాలు తప్పని సరిగా పాడి రక్తి కట్టించేవారు. ప్రేక్షకులు అడిగి మరీ పాడించే వారు .అప్పుడు ఆయన గాత్రానికి పట్టపగ్గాలు ఉండేదికాదు .ఆస్థాయికి అంతు ఉండేదికాదు .అందులో మనం లీనమవ్వాల్సిందే .మై మర్చి పోవాల్సిందే .
సినిమా షూటింగ్ లు ఉంటె మద్రాస్ వచ్చి ఘంటసాల మాష్టారి మేడ మీద గది లోనే బస చేసేవారు .బయట షూటింగు లు అయి, ఏ రాత్రికో గదికి చేరేవారు.మర్నాడు ఉదయం మిత్రులిద్దరూ చుట్టకాల్చుకొంటూ కారు షెడ్ దగ్గర కబుర్లు చెప్పుకొనేవారు .
సుమారు నలభై ఏళ్ల క్రితం మా ఉయ్యూరులో ధనుర్మాసం లో కాపులవీధి రామాలయం దగ్గర ,శివాలయం లో హరికథలు పోటా పోటీగా జరిగేవి .శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి,శ్రీ కడలి వీరయ్య ,శ్రీ పొడుగు పా౦డురంగదాసు ,శ్రీ పట్నాల మల్లేశ్వరరావు శ్రీ జగన్నాధ రావు ,చైనా రాకెట్ అనిపిలువబడే శ్రీమతిప్రభ మొదలైన వారంతా కమ్మని హరికథలు చెప్పి జనాలను ఉర్రూత లూగించేవారు .’’ఓం హరా శంకరా ‘’అని పాన్డురంగాదాసు గారుపాడుతుంటే ఒళ్ళు గగు ర్పొడిచేది
ఒకసారి మా బజారుకు అవతల తూర్పు వైపు ఊరవారి వీధి, విష్ణ్వాలయం వీధి క్రాస్ సెంటర్ లో ఆది రాజు వారి ఇళ్ళకు దగ్గరగా మోపర్రు దాసుగారు హరికథ చెప్పారు .నేను వెళ్లి చూశాను .అందులో ఆయన పాడిన దేశ భక్తీ గీతం చివర్లో అకస్మాత్తుగా కింద కూర్చుని బల్లలపై చేతితో శబ్దిస్తూ పాటకు ఫినిషింగ్ టచ్ ఇవ్వటం జీవితం లో మర్చిపోలేను .అది ఆయన ప్రత్యేకత .ఎక్కడైనా అలానే చేస్తారట .మన నరాలు ఉద్రేకం చెంది ఊగిపోవాల్సిందే. రోమాలు నిక్క బోడుచుకోవాల్సిందే. దటీజ్ మోపర్రు దాస్ .ఇంతకంటే ఆయన గురించి వివరాలు తెలియలేదు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-1-22-ఉయ్యూరు