మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -25

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -25 25- నిష్కర్షగా ,కర్కశంగా మాట్లాడే విదూషక – వ్యంగర వెంకట సుబ్బయ్య (వంగర) మాయాబజార్ సినిమాలో ‘’శాస్త్రం నిష్కర్షగా కర్కశంగా చెబుతుంది .మనం సౌమ్యంగా సారాంశమే తీసుకోవాలి ‘’అని జాతక పరీక్షలో చాకచక్యంగా మాట్లాడిన వంగర నటన గుర్తు ఉండే ఉంటుంది .అసలు పేరు వంగర వెంకట సుబ్బయ్య .24-11-1897 న ప్రకాశం జిల్లా ఒ౦గోలు తాలూకా లో సంగం జాగర్ల మూడి లో జన్మించారు .ఇంగ్లీష్ చదువులపై దృష్టి పోనీకుండా ,సంస్కృతమే నేర్చుకొని పండితులయ్యారు .తెనాలిలో ఉంటూ స్థానం వారి శ్రీ కృష్ణ తులాభారం నాటకం లో వసంతకుడు వేసి కళాభిజ్ఞుల మన్ననలు పొందారు .విప్రనారాయణ ,సక్కూబాయి నాటకాలలో హాస్య పాత్రలు వేశారు 1936లో ఆరోరా ఫిలిమ్స్ వారి ‘’విప్రనారాయణ ‘’సినిమాలో శిష్యుడుగా నటించి ,సినీ ప్రేక్షకులను సంమోహ పరచారు .తర్వాత మోహన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్ కంబైన్స్ వారి ‘’బాలయోగిని ‘’ అనే మొదటి బాలల చిత్రం లో చిత్రం లో ముఖ్య పాత్ర పోషించారు .దీని దర్శక నిర్మాత కే సుబ్రహ్మణ్యం .ఆరణి సత్యనారాయణ ,కమలకుమారి ఇతర నటులు . తెలుగు సినిమా మాట నేర్చుకుని .. తడబడుతున్న అడుగులను సరిచేసుకుంటూ నడక నేర్చుకుంటున్న రోజులవి. అప్పటివరకూ నాటకాలే అందరికీ వినోదాన్ని కలిగిస్తూ ఉండేవి. ఆ కాలంలో నాటకాలలో అనుభవం ఉన్నవారిని మాత్రమే సినిమాల్లోకి తీసుకునేవారు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి మాట వాళ్లు మాట్లాడవలసిందే. ఎవరి పాటలను .. పద్యాలను వాళ్లు పాడుకోవలసిందే. అందువలన ప్రధానమైన పాత్రలను పోషించాలనుకువేవారికి రూపంతో పాటు నాటకానుభవం తప్పనిసరి. అలాగే మంచి గాత్రం ఉండటం అంతే అవసరం. ఇక ఇతర పాత్రలను చేయాలకునేవారికి నాటకానుభవం .. డైలాగ్ చెప్పడంలో స్పష్టత ఉంటే సరిపోతుంది. ఆ ధైర్యంతోనే వంగర వెంకట సుబ్బయ్య కూడా అప్పట్లో మద్రాసు బాట పట్టారు. అందరూ కూడా ఆయనను ‘వంగర’ అనే పిలుస్తుండేవారు. 1897 నవంబర్ 24వ తేదీన ఆయన ఒంగోలు తాలూక ‘సంగం జాగర్లమూడి’ గ్రామంలో జన్మించారు. ఊహతెలిసిన దగ్గర నుంచి ఆయనకి నాటకాల పట్ల ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఒక వయసు వచ్చిన తరువాత ఆయన నాటకలలో బిజీ అయ్యారు. మొదటి నుంచి కూడా తాను ఏ పాత్రలకి ఎక్కువగా పనికివస్తాననే విషయంపై ఆయనకి మంచి అవగాహన ఉండేది. అందువల్ల ఆ తరహా పాత్రలనే ఆయన చేస్తూ ఉండేవారు. అలా సాంఘిక .. జానపద .. పౌరాణిక పాత్రలను నాటకాలలో పోషించి ఆయన శభాష్ అనిపించుకున్నారు. అప్పట్లో ఆయన పోషించిన పాత్రలను చేయడానికి ఎవరూ కూడా సాహసించేవారు కాదు. అంతగా ఆయన ఆ పాత్రల ద్వారా పేరుప్రతిష్ఠలను తెచ్చుకున్నారు. ఆయన డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్ .. సహజమైన నటనను ప్రేక్షకులు మంత్రముగ్ధులై చూస్తుండిపోయేవారు. అలా ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాల్లో నాటకాల ద్వారా ఎంతో అనుభవాన్ని గడించిన ఆయన, ఆ తరువాత స్నేహితుల ప్రోత్సాహంతో సినిమాల్లో నటించడానికి ఆసక్తిని చూపించారు. 1936లో ‘బాలయోగిని’ సినిమా ద్వారా ఆయన తెలుగు తెరకి పరిచయమయ్యారు. స్టేజ్ పై నటించడానికి .. కెమెరా ముందు నటించడానికి మధ్య గల తేడా ఆయనను కాస్త ఇబ్బంది పెట్టింది. అయినా నిదానంగా పరిశీలన చేసి కొన్ని పట్లు పట్టేశారు. ఆ తరువాత ఇక కెమెరా ముందు కూడా విజృంభించారు. మాలపిల్ల .. రైతుబిడ్డ .. మనదేశం .. సినిమాల్లో వరుస అవకాశాలను అందుకుంటూ వెళ్లారు. ఈ ‘మనదేశం’ సినిమా ద్వారానే ఎన్టీ రామారావు పరిచయమైంది. ఇక ‘షావుకారు’ సినిమా గోవిందరాజుల సుబ్బారావు పోషించిన చెంగయ్య పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఆ పాత్రను సపోర్ట్ చేసే పంతులు పాత్రలో వంగర ఇమిడిపోయారు. ఆ సినిమాలో ‘అదంతేలే .. ‘ అనే అర్థంతో నోటితో చిత్రమైన సౌండ్ చేస్తూ చేయి ఎగరేస్తారు. అప్పట్లో ఆ మేనరిజం జనానికి బాగా నచ్చేసింది. ఆ తరువాత నుంచి ఆయన ఊరి పెద్ద మనుషులకు అనుకూలంగా ఉంటూ .. వాళ్ల దుర్మార్గాలలో పాలుపంచుకునే పాత్రలను ఎక్కువగా చేస్తూ వెళ్లారు. అలాంటి సినిమాల్లో ‘పెద్దమనుషులు’ ఒకటి. ఒకప్పటి గ్రామీణ జీవనవ్యవస్థకు ‘పెద్దమనుషులు’ సినిమా అద్దం పడుతుంది. ఆ సినిమాలో ఛైర్మన్ భజనపరుడైన సిద్ధాంతి పాత్రలో వంగర నటన చూసి తీరవలసిందే. గుడిలో ఉన్న నిధిని రహస్యంగా ఛైర్మన్ కి చెందేలా చేయాలనే స్వార్థంతో ఆయన ప్రాణాల మీదకి తీసుకుని రావడమే కాకుండా, తాను కూడా ప్రాణాలను పోగొట్టుకునే పాత్రలో ఆయన జీవించారు. ఇక ‘కన్యాశుల్కం’లో కరటక శాస్త్రిగా .. ‘తెనాలి రామకృష్ణ’లో తాతాచార్యులవారి శిష్యుడిగా ఆయన ప్రదర్శించిన నటన అలా గుర్తుండిపోతుందంతే. ఇక తెలుగు పౌరాణికాలలో మకుటాయమానమై నిలిచిన ‘మాయాబజార్’లోను వంగర చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ సినిమాలో అత్యంత కీలకమైన వివాహ వేడుకకి సంబంధించిన సన్నివేశాల్లో వంగర చాలా సేపు కనిపిస్తారు. తమకి మర్యాదలు జరగడం లేదంటూ అల్లూతో కలిసి రమణారెడ్డి బృందంపై అసహనాన్ని వ్యక్తం చేసే ‘శాస్త్రి’ పాత్రలో ఆయన ప్రేక్షకులను నవ్విస్తారు. ఆ తరువాత చెంచులక్ష్మి .. శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం .. మహాకవి కాళిదాసు .. నర్తన శాల .. పరమానందయ్య శిష్యుల కథ వంటి ఆణిముత్యాలు ఆయన జాబితాలో కనిపిస్తాయి. ఇలా వంగర తెలుగు సినిమా తొలినాళ్లలో ఓ మారుమూల గ్రామం నుంచి మద్రాసుకు వెళ్లి, అక్కడ సినిమాల్లో అవకాశాలను దక్కించుకుని, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. ఎస్వీఆర్ వంటి వారంతా ఆయన తరువాత ఇండస్ట్రీకి వచ్చి ఆయన కళ్లముందు ఎదిగినవారే. సీనియర్ ఆర్టిస్ట్ గా వాళ్ల నుంచి ఆయన గౌరవాన్ని పొందినవారే. సహజమైన నటనకు చిరునామాగా ఆయన.. పాత సినిమాలంటే ఇష్టపడేవారికి వంగర వెంకట సుబ్బయ్య గారిని ప్రత్యేకంగా పరిచయం చెయ్యనక్కరలేదు. ఆయన నటుడే కాదు. వేద వేదాంగాలు అథ్యయనం చేసిన పండితుడు. సంగీతం, చిత్రలేఖనం, జ్యోతిష్యం వగైరాలన్నీ క్షుణ్ణంగా నేర్చుకున్నారు. ఆయనకు గురువు ఆయన తండ్రి గారే! ఆయన తండ్రి గారు నేర్పిన మరో విషయం భోజన సమయంలో మొదటి ముద్ద నోటిలో పెట్టుకునే ముందు మన ప్రాణాన్ని నిలిపే ఆహారాన్ని మనకు అందిస్తున్న ఆ శ్రీమన్నారాయణుని స్మరించుకోవాలని. ఆయన ఎట్టి పరిస్థితులలోనూ తప్పకుండా ఆ నియమాన్ని పాటించేవారు. ఒకసారి ఆయన షూటింగ్ నిమిత్తం అమరావతి వెళ్ళారు. అక్కడ ఆయనతో బాటు ఆ గదిలో సి. యస్. ఆర్. కూడా వున్నారు. ఈయన న్యూస్ పేపర్ చదువుకుంటుంటే వంగర గారు బాత్రూంలో స్నానం చేస్తున్నారు. ఉన్నట్టుండి బాత్రూంలో నుంచి ‘ భోజన కాలస్మరణే గోవిందా… గోవిందా… ‘ అని వంగర గారి గొంతు వినబడింది. సి. యస్. ఆర్. గారు ఆశ్చర్యపోయారు. ఆయనకేమీ అర్థం కాలేదు. అప్పుడే బాత్రూం లోనుంచి బయిటకు వచ్చిన వంగర గారిని ” భోజనానికి ముందు గోవింద స్మరణ చేసే అలవాటు మీకు వుందని తెలుసు. కానీ బాత్రూం లో ఈ విష్ణు సంకీర్తన ఏమిటయ్యా ? ” అనడిగారు. దానికి వంగర వెంకట సుబ్బయ్య గారు ” ఏం చెప్పమంటారు ? ఇందాక స్నానం చేస్తూ సబ్బుతో ముఖం తోముకుంటుంటే, ఆ పిడికెడు సబ్బు ముక్క కాస్తా గొంతులోకి జారిపోయింది. ఈరోజుకి ఇదే మొదటి ముద్ద కదా ! అందుకే గోవింద కొట్టాను ” అన్నారు ఏడ్పుముఖంతో . మరోసంగతి –ఒక మలయాళం సినిమాలో ఒకపాత్ర వంగర లాగా ఉంటె ,ఆయన్నీ పిల్చి ఆ పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పమన్నారు .వంగారగారి గొంతులో పచ్చి వెలక్కాయ పది నట్లయింది మాట పెగలటం లేదు .దీన్ని గురించి ఆయనే ‘’బొమ్మ చూస్తూ నేను మాట అందుకొనే సరికి బొమ్మ వెళ్ళిపోతోంది .పోనీ ముందే అందుకుందామంటే బొమ్మ లోని వాడు స్లోఅవుతున్నాడు .దీనికీ మనకీ కుదరదు అని చెప్పేసి పారిపోయాను ‘’అన్నారు నవ్వుతూ .రమణారెడ్డి గార్ని చెప్పమంటే ‘’నేను చెప్పేది చెబ్తా మీరు సర్దుకోగలిగితే సర్దుకొండి.’’అని ఆయనా తప్పుకున్నారట . ‘’ఇంతకీ వంగర వారి ఆహార్య విలాసం ఎలా ఉంటుందో తెలుసా –మొకాళ్ళపైకి పంచ ,పైన జుబ్బా ,ఆపైన అన్గోస్త్రం ,,చంకలో ముడిచిన గొడుగు .పెద్దపెద్ద అంగలు వేస్తూ నడక .ఎప్పుడైనా బస్సు ఎక్కే వారేమోకాని దాదాపుగా నడకే ఎక్కడికైనా’’ అన్నారు రావి కొండలరావు .1936లో వచ్చిన విప్రనారాయణ నుంచి 76లో వచ్చిన రహస్యం సినిమా వరకు 30 సంవత్సరాలలో 300కు పైగా సినిమాలో నటించి మెప్పించారు .హాస్య నటులుగా ముద్ర పడినా ,వివిధ పాత్రలు నటించిన మేటి నటులు .తాను హాస్యం చెయ్యకుండా సంభాషణ ద్వారా హాస్యం పుట్టిస్తారు .పండితులు, సంస్కృత ఆంధ్రాలు క్షుణ్ణంగా నేర్చిన విద్వాంసులు .వేదం పఠించిన వేదపండితులుకూడా’’ వ్యంగ్యర వెంకట సుబ్బయ్య ‘’గారు .శోభనాచాలవారి లక్ష్మమ్మ ,,భారత లక్ష్మీవారి ప్రియురాలు,రాజరాజేశ్వరి వారి ‘’లక్ష్మి ‘’కృష్ణ తులాభారం ,సక్కుబాయి .భరణీవారి చక్రపాణి ,శ్యామలా వారి గీతాంజలి ,జ్ఞానంబికా వారిమంత్రదండం ,విజయలక్ష్మీ వారి పేరంటాలు వినోదావారి శాంతిమొదలైన సినిమాలో నటించారు వంగర గారు స్థానం వారిపై రాసిన వ్యాసం 12 వ తరగతి తెలుగు పుస్తకం లో పాఠ్య అంశంగా ఉంది అంటే ఆశ్చర్యమేస్తుంది .ఆ వ్యాసంలోని విశేషాలు –‘’నేను స్థానం వారి రామవిలాస సభలో చాలాకాలం ఉన్నాను .అంతకు ముందు తెనాలిలో ఫస్ట్ కంపెని లో ఉన్నాను .1925లో రామవిలాస సభలో చేరాను .అప్పుడు వజ్హ బాబూరావు గారు మేనేజర్ ,భాగవతుల రాజగోపాలం గారు వ్యవస్థాపకులు .త్రిపురారిభట్ల వీరరాఘవయ్య గారు కండక్టర్ . నాకు నాటకానికి మూడు రూపాయలిచ్చేవారు .అయితేనేం నెలకు సుమారు 20 నాటకాలు ఆడే వాళ్ళం .అది మాంచి జీతమ కిందే లెక్క .తర్వాత నాటకానికి 5రూపాయలు ఇవ్వటం తో నాపని బాగుంది . స్థానం వారు మహా ప్రజ్ఞావంతులు వలపులు గ్రుమ్మరించే పాత్రలు అభినయించటం లో మొనగాడు .మొదట్లో రోహిణీ రుక్మా౦గధర నాటకం వేశారు మోహిని నిజంగానే ప్రేక్షకులను మోహింప జేసింది .రుక్మా౦గదుని సంగతి చెప్పాలా ?ఆ నాటకం చాలాభాగం స్థానం వారే రాశారు .తర్వాత అనేక నాటకాలలో నటించారు .రోషనార ఆయనకు ఎంతో పేరు తెచ్చింది .మద్రాస్ రాష్ట్రం లో దాన్ని నిషేధించారు .ఆసమయం లో మేము హైదరాబాద్ లో ప్రదర్శనలిచ్చాం . స్థానంవారి వేషాలు రంగస్థలానికి అల౦కారాలుగా మారాయి .ఒకమామూలు వ్యక్తీ రంగస్థలం మీద వన్నెల రామ చిలుకగా మారటం మాకే ఆశ్చర్యాన్ని కలిగించేది .కొన్ని కంపెనీల వాళ్ళు ఎంతో అందమైన ఆడవాళ్ళ చేత వేషాలు వేయించి చూశారు .కానీ రంగస్థలం మీదకు రాగానే ఆ అందం ఎందుకూ పనికి రాకుండా పోయేది .అభినయం ఎక్కడినుంచి వస్తుంది ? మా సమాజం రంగూన్ లో నాటక ప్రదర్శనల నిచ్చింది.రంగూన్ లోని సీతారామ దేవాలయానికి స్థానం వారు మూడు వేల రూపాయలు విరాళం అందించారు .అక్కడి ఆంధ్రులు స్థానం వారికి బంగారు కిరీటం తొడిగి అత్యంత గొప్పగా సత్కరించారు .ఒక తెలుగు నాటకనటుడు సముద్రాలు దాటి ఘన సత్కారం పొందటం స్థానం వారికే దక్కిన అదృష్టం . స్థానం వారు అప్పుడప్పుడు సహాయ నాటక ప్రదర్శనలు కూడా ఇచ్చారు .ఒకసారి తెనాలిలో గృహదహనాలు జరిగితే ,అధికారులతో ఉచిత ప్రదర్శన ఇస్తామని చెప్పి,నాటకం ప్రదర్శించివచ్చిన డబ్బు 5వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు .ఇలాంటివి ఎన్నో చేశారు .వారి కళాభిలాషకు వదాన్యత గీటు రాయిగా ఉండేది . ఒకసారి కలకత్తాలో చంద్ర గుప్త నాటకం ప్రదర్శించాం .అది డి ఎల్ రాయ్ గారి బెంగాలీ నాటకానికి అనువాదం .స్థానం వారు చంద్ర గుప్తుని తల్లి ముర పాత్ర ధరించారు .మూడు సీన్లలో మురపాత్ర లో గంభీరత గోచరించేది .ఒక బెంగాలీ ప్రొఫెసర్ నాటకాన్ని చూసి స్థానం వారి నటనా వైదుష్యానికి ముగ్ధుడై ,పులకి౦చి పోయాడు .’’మా రాయ్ నాటకానికి న్యాయం చేకూర్చింది ఈ తెలుగు నాటకం ‘’అని పరవశించి చెప్పాడు .స్టేజి మీదకు వచ్చి ఆయన ‘’చంద్రగుప్త నాటకం మా బెంగాలీ రచయిత సృష్టించాడు ఈ నాటకాన్నఈ తెలుగు నాటక సంఘం వచ్చి ప్రదర్శిస్తే ఆనందిస్తున్నాం .ముఖ్యంగా ముర పాత్రనిర్వహణ చూసిముగ్దులమై పోయాం .నేను ముఖ్యంగా స్థానం వారి నటన చూసి పులకి౦చి పోయాను .మా రాయ్ నాటకానికి న్యాయం చేకూర్చింది ఈ తెలుగు నాటక సంఘం ‘’అని పరవశంతో చెప్పాడు . కన్నడ దేశం లో కృష్ణ తులాభారం నాటకం అంటే ఎంతో ఇష్టం .బెంగుళూరులో ఈప్రదర్శనలు ఎన్ని ఇచ్చామో చెప్పలేను .ఒకే నెలలో 27ప్రదర్శనలిచ్చాం .మరో రాష్ట్రం లో తెలుగు సమాజం ఇలాంటి ఖ్యాతి గడించింది అంటే ఎంతో గర్వించాల్సిన విషయం ..మైసూరు రాజమాత ప్రత్యేకి౦చితులాభారం చూశారు .తర్వాత కుమారుడైన మహారాజా వారితో చెప్పి ,ఆయన్నికూడచూడమన్నారు .వారూ చూసి పొంగిపోయిస్థానం వారిని ఘనంగా సత్కరించారు . ఇక్కడ ఒక ఉదంతం జ్ఞాపకం వస్తోంది .స్థానం వారు నాటకం అయిన మర్నాడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం అయిదు వరకు మౌన వ్రతం లో ఉంటారు .మేము బెంగుళూరులో ఉన్నాం .ఒకరోజు మామూలుప్రకారం స్థానం వారు మౌనం లో ఉన్నారు .ఇంతలో ఎవరో వారికోసం వచ్చారు .మౌనవ్రతం లో ఉన్నారు అయిదు తర్వాత వస్తే మాట్లాడుతారు అని చెప్పాం .ఆయన వాకిట్లో పచార్లు చేస్తున్నాడు .ఆ ఇంటి యజమానురాలు పరిగెత్తుకొచ్చి ‘’ఇదేం అన్యాయం మహా రాజావారిదర్బారు బక్షీ ఇలా వాకిట్లో పచార్లు చేస్తుంటే చూస్తూ ఊరు కున్నారేమిటి .ఎంత అపరాధం ?క్షమాపణ చెప్పి లోపలి ఆహ్వానించండి ‘’అని చెప్పింది మేము వెళ్లి ఆయన్ను లోపలి ఆహ్వానించాం.మహారాజావారికి వినోద విజ్ఞానకార్యక్రమాలు ఏర్పాటు చేసే ఉద్యోగి ఆయన .అప్పటికి ఇంకా స్థానం వారి మౌనం పూర్తీ కావటానికి పది హీను నిముషాలు ఉంది .ఆయన అప్పాతిదాకా ఉండి,స్థానం వారితోమాట్లాది ప్రోగ్రాం ఫిక్స్ చేసుకొని వెళ్ళాడు .దీన్నిబట్టి స్థానం వారి గౌరవ ప్రతిఅపత్తులు అర్ధం చేసుకోవచ్చు . స్థానం వారిలో చెప్పుకోదగిన మరో ముఖ్యవిషయం కంఠాన్ని క్రమ శిక్షణలో ఉంచుకోవటం .మొదటి వరుసలో ఉన్నవారికీ చివరి వరుసలో వారికీ ఒకే రీతిగా వినబదేట్లు మాట్లాడేవారు .ఆనాడు మైకులు లేవు .నటుడి ప్రతిభ కంఠ స్వరం మీదే ఆధార పడి ఉండేది .భావ ప్రకటన తోపాటు ,సంభాషణల చాతుర్యం తోనూ ఆయన స్ఫుటమైన కంఠ ధ్వని వారికి ఎక్కువ తోడ్పడేది . స్థానం వారు మరపురాని మహానటులు .వారితో కలిసి నాటకాలు వేయటమనే మహా భాగ్యం నాకు కలిగింది .ఆంద్ర నాటక రంగానికి ఆయన ఎంతో ప్రతిష్ట సంపాదించారు .ఆయన ఆంద్ర రంగస్థల ప్రతిష్ట కోసం అవతరించిన కళాదేవత ‘’ అని వంగారగారు రాశారు . ఒక తెలుగు నాటకనటుడు వంగర మరొక ప్రఖ్యాత నాటకమహా నటుడు స్థానం నరసింహారావు గారిపై రాసిన వ్యాసం తెలుగు పాఠ్యా౦శం గా ఉండటం ఈ ఇద్దరికీ దక్కిన అరుదైన గౌరవం .హాట్సాఫ్ వంగర అండ్ స్థానం . స్వచ్చమైన వాక్కు ,వికార చేష్టలకు లోనుకాని హాస్యం వంగరను అసమాన నటునిగా చేశాయి .1975లో జరిగిన ప్రపంచ తెలుగుమహా సభలలో వంగర వారిని సముచితంగా సత్కరించింది ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం .స్థిర విదూషకుడుగా వెలుగొందిన వంగర వెంకట సుబ్బయ్య గారు ఒక నాటకం లో పాల్గొనటానికి తెనాలి వెళ్లి అక్కడే 6-3-1976న 79వ ఏట పరమపదించారు. సశేషం మీ-గబ్బిట దుర్గాప్రసాద్-17-1-22-ఉయ్యూరు , , •

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.