మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -28
28-సినీ వరూధిని,గానకోకిల –రామతిలకం
6-6-1905న శ్రీమతి దాసరి రామతిలకం విజయవాడలో జన్మించారు .దైవ దత్త మైన కోకిల క౦ఠం తో ,స్వయం కృషితో చిన్నప్పటి నుంచి సంగీతం లో సాధన చేసి ,తన సంగీత సామర్ధ్యానికి నాటకరంగం దోహదం చేస్తుందని కాళ్ళకూరి నారాయణ రావు గారి ‘’ చింతామణి ‘’నాటకం లో చింతామణి గా సాక్షాత్కరించి కళాభిజ్ఞుల హర్షధ్వానాలు పొందారు. శ్రీ కృష్ణ తులాభారం, సతీ సక్కుబాయి, శ్రీకృష్ణ లీలు నాటకాలలో కథానాయికగా నటించి రాణించారు .
గానకోకిలగా కీర్తి పొందిన రామ తిలకం తండ్రి పువ్వుల వెంకటరత్నం నాయుడు ఆంధ్రదేశం లో గొప్ప మృదంగ విద్వాంసునిగా గుర్తింపు పొందారు .పువ్వుల నారాయణరావు గారి వద్ద తిలకం సంగీతం అభ్యసింఛి కచేరీలు చేసే సామర్ధ్యం సాధింఛి పదకొండు కచేరీలు చేశారు .అందమైన ముఖం ,నొక్కులజుట్టు ,విశాల నేత్రాలు ,దివ్యమైన స్వరం ,గొప్ప అభినయం ,చలాకీతనం ,వయ్యారం వొలకబోస్తూ ఉండటం తో ఆమెను ఆ కాలం లో ‘’వరూధిని గా ‘’భావించేవారు .సంస్కారవంతమైన భాష ఉచ్చారణ ఆమె సొత్తు .కొమ్మూరు లక్ష్మీ నారాయణరావు గారు స్థాపించిన మైలవరం లోని లక్ష్మీ విలాస సభలో ,తర్వాత కపిలవాయి రామనాథ శాస్త్రిగారి బాలభారతి నాట్యమండలి లో చింతామణి, చిత్రాంగి ,సత్యభామ, అహల్య, సావిత్రి వేషాలు ధరించి ప్రేక్షక నీరాజనాలందుకొన్న మేటి నటీతిలకం రామ తిలకం .
1982లో కలకత్తా ఈస్ట్ ఇండియా ఫలిం కంపెనీ వారి సావిత్రి సినిమాలో సావిత్రి పాత్ర పోషించి అఖండ కీర్తి గౌరవాలు పొందారు .ఆమె అభినయానికి ముగ్ధులై ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు తండోప తండాలుగా ,తీర్ధ ప్రజలాగా వచ్చేవారు . 1933లో మదన్ దియేటర్స్ వారు కలకత్తాలో కాళ్ళకూరి సదాశివ రావు దర్శకత్వం లో నిర్మించిన ‘’చింతామణి ‘’చిత్రం లో చింతామణి గా నటించి సినీ రంగాప్రావేశం చేశారు .తర్వాత ఈస్ట్ ఇండియా కంపెని వారి సావిత్రిలో ,సరస్వతీ టాకీస్ వారి ద్రౌపదీ వస్త్రాపహరణం లో ,నేషనల్ మువి టోన్ వారిచిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం లో వేమూరి గగ్గయ్య ,పులిపాటి వెంకటేశ్వర్లు ,కృష్ణ వేణి మొదలైన వారు నటించిన ‘’మోహినీ రుక్మాంగద ‘’లో వేల్ పిక్చర్స్ వారి ‘’శ్రీ కృష్ణ లీలలు ‘’ లో నటించారు ఈ కృష్ణలీలలు లో యశోదగా నటించి కంఠం ఎత్తి ‘’కలయో వైష్ణవ మాయయో ‘’పద్యాన్ని పాడితే ఆంద్ర ప్రేక్షకలోకం తన్మయత్వ౦ తో పరవశించి పోయింది .రామతికం ను ‘’గానకోకిల ‘’గా ఆంధ్రప్రేక్షకలోకం ఆరాధించింది . .తిలకం పాడిన పాటలన్నీ హెచ్ ఎం వి గ్రామ ఫోన్ రికార్డ్ లుగా విడుదలై ఇంటింటా ప్రతిధ్వనించాయి . ఈస్ట్ ఇండియా వారి రామదాసు లోనూ ,కృష్ణా ఫిలిమ్స్ వారి రామదాసులోను తిలకం నటించటం విశేషం .బాలయోగిని ,తెనాలి రామకృష్ణ ,ఆనేస్ట్ రోగ్లలో కూడా నటించారు . అల్లసాని పెద్దనకవి రచించిన ‘’మను చరిత్ర ‘’ప్రబంధం ఆధారంగా ,బివి రామానందం డైరెక్షన్ లో ,తాండ్ర సుబ్రహ్మణ్య శాస్త్రి కదా రచన చేయగా విశ్వనాధ మాటలు పాటలు రాసి ఎస్వి రంగారావు ప్రవరాఖ్యుడుగా వచ్చిన వరూధిని సినిమాలో వరూధిని పాత్ర పోషించారు రామ తిలకం .సినిమా అట్టర్ ఫ్లాప్ . క్రమంగా సినిమాలలో నేపధ్యగానానికి ప్రాధాన్యత పెరుగుతూ ఉండటం తో సంగీతం క్షుణ్ణం తెలిసిన రామతిలకం వెండి తెరకు దూరమయ్యారు .ప్రముఖ హాస్యనటి గిరిజ రామతిలకం కుమార్తె .
14-3-1952న 48వ ఏటనే సినీ వరూధిని రామ తిలకం అమరలోకం చేరారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-1-22-ఉయ్యూరు