మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -29
29-‘’స్వాతంత్ర్యమే మా జన్మహక్కని చాటండి’’ గీతరచయిత ,శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం సినిమా ఫేం-తోలేటి
1954లో గుబ్బి కర్నాటక వారి శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం సినిమాకు మాటలు ,పాటలు రాసి ఆంధ్రలోకం లో ఆ భక్తిసినిమాను బంగారు ఉయ్యాలలో ఊగించిన రచయిత శ్రీ తోలేటి వెంకట శాస్త్రి అనే వెంకట రెడ్డి .ఇందులో కన్నడ రాజకుమార్ భక్తకన్నప్పగా గొప్ప గా అద్భుతంగా నటించారు .కుమారి ,మాలతి ఋష్యేంద్రమణి,పద్మనాభం ,రామచంద్ర శాస్త్రి రాజసులోచన ,లింగమూర్తి నటించి తమ నట జీవితం సార్ధకం చేసుకొన్నారు .ఆర్ సుదర్శనం మహా గొప్ప సంగీతం అందించిన ఈ సినిమా దర్శకుడు హెచ్ ఎం ఎల్ సింహా .జయజయ మహా దేవా శంభో ,పాహీ శంకరా మాం పాహీ శంకరా ,మహేశా పాపవినాశా కైలాస వాసా ఈశా ,మధురం శివమంత్రం ,మాయ జాలమున మునిగేవు నరుడా ,స్వామీ చంచలమైన ‘’మొదలైన పాటలన్నీ భక్తీ బంధురంగా తోలేటి రాస్తే అంతే గొప్పగా ఘంటసాల మాస్టారు గానం చేశారు .ఇంతమంది మహామహుల వలన ఆసినిమా ఆల్ టైం క్లాసిక్ గా నిలిచింది ఆ సినిమాపేరు చెబితే చాలు పరవశమే కలుగుతుంది నాకు .
ఘంటసాల గారు విజయనగరం లో సంగీతం అభ్యసిస్తున్న సమయం లో తోలేటి పరిచయమై చివరిదాకా మిత్రులుగా ఉన్నారు .విజయనగరం లో జన్మించిన తోలేటి ఇంటర్ వరకు మాత్రమె చదువుకొన్నారు. తర్వాత మద్రాస్ వచ్చి కొలంబియా ,హెచ్ ఎం వి గ్రామఫోన్ కంపెనీలకు పాటలు రాశారు .కాళహస్తీశ్వర మహాత్మ్యం(1954) కాకుండా ఎవిఎమ్ . వారి జీవితం(1950) ,మొదటిరాత్రి ఆడజన్మ ,నవ్వితే నవ రత్నాలు అత్తి౦టికాపురం(డైలాగ్స్ ,పాటలు )సంఘం –డైలాగ్స్ ,పాటలు ,కాంచన , సవతిపోరు వదిన ,ఆలీబాబా నలభై దొంగలు ,సదారమ సినిమాలకు రచన చేశారు .
జీవితం లో ‘’,’’ఇదేనా మా దేశం భారత దేశం ‘’ మనమనసు మనసు ఏకమై , ’టిప్పు టిప్పు టప్పు నాది
- సంఘం లో – నమ్మరాదురా ఆడదాని నమ్మరాదురా – మాధవపెద్ది బృందం పెళ్ళి పెళ్ళి పెళ్ళి పెళ్ళి ఈడైన దానితో జోడిగా హాయిగా – పిఠాపురం
- భారత వీరకుమారిని నేనే నారి రతనము నేనే – పి.సుశీల
- సుందరాంగ మరువగలేనోయ్ రావేలా నా అందచందములు – పి.సుశీల, టి.ఎస్.భగవతి
మొదలైన హిట్ సాంగ్స్ రాశారు తోలేటి
తోలేటి సినిమా గీత రచయిత గానే కాకుండా స్వాతంత్ర్యోద్యమ గీత రచయితగా గొప్ప పేరు పొందారు .ఆయన రాసిన ఆణిముత్యాల వంటి పాటలు
1-స్వాతంత్ర్యమే మా జన్మ హక్కని చాటండి –నిరంకుశంబు లైన శక్తులేగిరినా నిర్భయముగా ఎదిరించండి
2-అమ్మాసరోజినీదేవీ –స్త్రీ జాతి శిరోమణి వమ్మా
3-కనవోయి వసంతరేయి
4-వలపుపూలబాల
5-ఆనందమే లేదా
సుమారు 12 సినిమాలకు రచన చేసిన తోలేటి వెంకట శాస్త్రి (రెడ్డి )41వ ఏటనే 6-6-1951 న మద్రాస్ లో తల్లి ,భార్య ఆరుగురు సంతానం ను వదిలి మరణించారు .
స్వాతంత్య్రమె నా జన్మహక్కని చాటండి
నిరంకుశంబగు శక్తులెగిరినా
నిర్భయముగ నెదిరించండి
పరుల దాస్యమున బాధలు పొంది
బ్రతికిన చచ్చిన భేదమె లేదు॥
కవోష్ణ రుధిర జ్వాలల తోటి
స్వతంత్ర సమరం నెరపండి
ఎంతకాలమిటు సహించియున్న
దోపిడి మూకకు దయ రాదన్న॥
సంఘములోను ఐక్యత వేగమె
సంఘటపరుపుము శాంతిపథాన
స్వర్గతుల్యవౌ స్వతంత్ర జ్యోతికి
మాంగల్యపు హారతులిమ్మా॥
‘ఆ మొగల్ రణధీరులు’ అనే పద్యాన్ని ఒక్కసారి మోహన రాగంలో సమ్మోహనంగా పాడేసి అందుకున్న ఈ పాట ‘భీంపలాస్’లో మొక్కుబడిగా ఈ పాట ఏదో మీ కోసమో నా కోసమో పాడలేదు. మనసా, వాచా, ఆర్తితో దేశం కోసమే పాడినట్లుగా అనిపిస్తుంది.
కడుపులో లేని ప్రేమ కౌగిలించుకుంటే వస్తుందా? దేశభకె్తైనా సహజంగానే స్వతస్సిద్ధంగానే పుట్టాలి. నేను, నా దేశం, నా ప్రజలు అంటూ జెండా మోసి, జైలు జీవితం కూడా గడిపిన ఘంటసాల జీవితానుభవమంతా ఈ పాటలో ప్రతిధ్వనించిందేమో అనిపిస్తుంది.
అందుకే అంటారు. అంతరాత్మను మించిన గురువు లేడు. లోకాన్ని మించిన పెద్ద గ్రంథం లేదని. నేను రేడియోలో పని చేసిన రోజుల్లో వెనకటి తరంలోని ప్రసిద్ధ గాయనీ గాయకుల రికార్డులు వెదికేవాణ్ణి.
ఆలిండియా రేడియోలో లలిత సంగీతం ప్రసారానికి అంకురార్పణ జరిగిన తొలి రోజుల్లో వెలువడిన పాటల్లో ఇదొకటి.
కేవలం 3 నిమిషాల 20 సెకన్లలో తిరిగే గ్రామఫోన్ రికార్డులతో (78 ఆర్పిఎం) లభ్యమైన పాటలు అసంఖ్యాకంగా ఆ రోజుల్లో విడుదలయ్యేవి.
క్రమక్రమంగా ఘంటసాల కంఠాన్ని అమితంగా ఇష్టపడిన వారి కోసం తయారైన ఆ పాటలన్నీ ఒక ఎల్పి రికార్డ్‌గా వేశారు. తోలేటి రాసిన పాటల్లో చాలా ప్రసిద్ధమైన గీతం ‘స్వాతంత్య్రమె నా జన్మహక్కు’. ఘంటసాల విజయనగరంలో వున్న రోజుల్లో పరిచయమైన తోలేటి క్రమంగా సన్నిహితుడై స్నేహితుడయ్యాడు. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం, జీవితం, సంఘం, వదిన లాంటి కొన్ని సినిమాలక్కూడా పాటలు రాశాడు.
తోలేటి వెంకటరెడ్డిగా పేరు మార్చినా, అసలు పేరు తోలేటి వెంకటశాస్ర్తీ. ముత్యాల్లాంటి మాటలకు సర్వాంగసుందరమైన రాగాన్ని జోడించి గమక సౌందర్యాన్ని ఆవిష్కరించిన ఘంటసాల ఎంత నాద సుఖం అనుభవించాడో?
పాటలో ప్రతి మాట, ప్రతి అక్షరం నాదాన్ని నింపుకుని చెవికి సోకితే కలిగే ఆనందం వంద మందిలో ఏ ఒకరిద్దరికో మాత్రమే లభిస్తుంది. మిగిలిన వారూ వింటారు. కానీ అర్థమై అనుభవించేది మాత్రం ఆ ఇద్దరే. పాట చెవికి వినబడితే చాలదు. అంతరంగాన్ని చైతన్యపరచాలి. తివాసీ పరిచినట్లు పచ్చని పొలాల్లో బారులు తీరి వాలే కొంగల్ని చూస్తూంటే కలిగే అనుభూతి, పాట వింటే కలగాలి. అదీ పాటంటే – కబుర్లు చెప్తూ, కాలక్షేపం కోసం వినే మిగిలినవన్నీ ఇలా వింటే, అలా మరిచిపోయేవే. కాలచక్రంలో కనిపించకుండా పోయేవే.- మల్లాది సూరిబాబు
ఆరుద్ర
తన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకోకుండా 1948లో శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ వారికి పరిచయమై ఎన్నడూ ఆశించని సినీరంగ జీవితాన్ని ప్రారంభించినట్టే- డబ్బింగ్ చిత్ర రచయితగా స్థిరపడే ఉద్దేశం లేకపోయినా మోడరన్ థియేటర్స్ వారి ‘ఆలీబాబా- 40 దొంగలు’ అనువాద చిత్రానికి దాని రచయిత అయిన తోలేటి వెంకటరెడ్డి ఆకస్మిక మరణం వల్ల ఆపద్ధర్మంగా పూర్తి చెయ్యవలసి వచ్చింది. దాంతో అనువాద చిత్ర రచన కూడా కొనసాగించారు. దానికి ముందే ‘ప్రేమలేఖలు’ (1953)కి మాటలు, పాటలు రాస్తే అది ట్రాక్ ఛేంజ్ చిత్రమే అయినా ఆ సినిమాను పరిశ్రమలో డబ్బింగ్ చిత్రంగా పరిగణించడం వల్ల అప్పటికే ఆరుద్రకు అనువాద రచయితగా కూడా ముద్రపడింది.
కాళహస్తీశ్వర మహాత్మ్యం లో తోలేటి పాటలు మూడు మచ్చుకి
1-జయజయ మహాదేవ శంభో హరా శంకరా సత్యశివసుందరా నిత్య గంగాధరా ……
బ్రహ్మ విష్ణుల్ సురల్ తాపసుల్ నిన్ను వర్ణించలేరన్న నేనెంతవాడన్ …… దయాసాగరా ……
భీకారారణ్య మధ్యంబునన్ బోయనై పుట్టి పశుపక్షిసంతానముల్ కూల్చి భక్షించు పాపాత్ముడన్ ……
దివ్య జపహోమతపమంత్ర కృషి లేని జ్ఞానాంధుడన్ ……
దేవుడే లేడు లేడంచు దూషించు దుష్టాత్ముడన్ …… దుష్టాత్ముడన్ ……
విశ్వరూపా …… మహా మేరుచాపా …… జగత్సృష్టి సంరక్ష సంహార కార్యత్కలాపా ……
మహిన్ పంచభూతాత్మవీవే కదా …… దేవ దేవా …… శివా ……
పృధ్వి జలవాయురాకాశ తేజోవిలాసా …… మహేశా …… ప్రభో ……
2-రంగుబంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురాధీశ విశ్వేశ్వరా …… కాశీపురాధీశ విశ్వేశ్వరా ……
నీలి మేఘాల కేళీ వినోదాలలో తేలు శ్రీశైల మల్లేశ్వరా ….. శ్రీశైల మల్లేశ్వరా …..
కోటి నదులందు సుస్నానముల్ చేయు ఫలమిచ్చు క్షేత్రాన వసియించు శ్రీరామలింగేశ్వరా …… శ్రీరామలింగేశ్వరా ……
నిత్య గోదావరీ నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమావాస భీమేశ్వరా …… భీమేశ్వరా ……
దివ్యఫలపుష్పసందోహ బృందార్చితానంద భూలోక కైలాస శైలాన వసియించు శ్రీకాళహస్తీశ్వరా …… శ్రీకాళహస్తీశ్వరా …… దేవ దేవా ……
నమస్తే నమస్తే నమస్తే నమ: ……
3-శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి: మా పూజలే తల్లి గౌరీ శంకరీ గౌరీ శంకరీ: (పాట)
శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి 1954లో విడుదలైన కాళహస్తి మహాత్యం చిత్రంలోని పేరుపొందిన పాటలలో ఒకటి. ఇది భక్తిగీతం. దీనిని పి.సుశీల అలనాటి నటి కుమారి కోసం ఆలాపించారు. తోలేటి వెంకటరెడ్డి సాహిత్యం అందించగా, ఆర్.సుదర్శనం సంగీతం అందించారు.
ఈ పాట పి.సుశీల మొదటి పాటలలో ఒకటి, నటి కుమారికి చివరి పాట, ఈ చిత్రం ఆవిడ చివరి చిత్రం కూడా. తోలేటి పార్వతీదేవిని కీర్తిస్తూ ఎంతో అందంగా రాయగా, ఆర్.సుదర్శనం కోమలమైన సంగీతం అందించిన ఈ పాటను సుశీల ఎంతో శ్రావ్యంగా పాడగా, కుమారి అద్భుతంగా అభినయించారు. ఈ పాట చివరిలో నటుడు లింగమూర్తి కూడా వస్తారు. ఈ పాట ద్వారా కుమారి పాత్ర అయిన ‘గౌరి’ కథలోకి ప్రవేశిస్తుంది. ఈ పాటను వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలన్నంత అద్భుతంగా ఉంటుంది.
ప్రాపు నీవె పాపహారి పద్మపత్రనేత్రి
కాపాడరావమ్మా కాత్యాయినీ
కాపాడరావమ్మా కాత్యాయినీ
శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి
మా పూజలే తల్లి గౌరీ శంకరీ
గౌరీ శంకరీ
నిన్ను నమ్మినాను తల్లి అన్నపూర్ణదేవీ
నిన్ను నమ్మినాను తల్లి అన్నపూర్ణదేవీ
పాలించరావమ్మా పరమేశ్వరీ
పాలించరావమ్మా పరమేశ్వరీ
శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి
మా పూజలే తల్లి గౌరీ శంకరీ
గౌరీ శంకరీ.-
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-1-22-ఉయ్యూరు