మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -30 నీకథా శివ బ్రహ్మం భారతీతీర్ధ ,శతావధాని –వెంపటి సదాశివ బ్రహ్మ౦

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -30

30-సినీకథా శివ బ్రహ్మం భారతీతీర్ధ ,శతావధాని –వెంపటి సదాశివ బ్రహ్మ౦

సినీగీత సుమసౌరభం సదాశివ బ్రహ్మం

 • ఓహో మేఘమాల…నీలాల మేఘమాల చల్లగ రావేలా, మెల్లగ రావేలా?… అని ఆ కలం పరిమళాలు సుతిమెత్తగా మన హృదయాలను స్పృశిస్తాయి.
 • మది ఉయ్యాల లూగి నవభావాలేవో… అని ప్రేమతో గగనవీథులలో భావాలు మనల్ని విహరింప జేస్తాయి.
 • అల్లదే ఆవల అదిగో నా ప్రియ కుటీర వాటిక… అని అక్షరాల గవాక్షాల్లోంచి వలపుల పర్ణశాలకు దారిచూపిస్తుంది.
  ఈ జన్మసరిపోదు గురుడా… అని తాత్త్వికంగా జీవితాన్ని చిత్రించినా -అది ఆ కవన బ్రెహ్మకే చెల్లింది!
  తెలుగు చలన చిత్రాలకు అందమైన కతలు అల్లి, ఆబాల గోపాలానికి చేరేలా మాటలు రాసి, అందరూ మెచ్చేలా పాటలను, పద్యాలను సృష్టించిన విశిష్టులు, ”భారతీతీర్థ ”శతావధాని” -కీ|| శే|| వెంపటి సదాశివబ్రహ్మం.
  పద్యంలో ఆశు కవిత ఘనమైతే, గద్యంలో జీవితం మీద అనర్గళంగా ఆశువుగా చెప్పగలడం వీరి ప్రజ్ఞ! ‘కథ’ అనగా చెప్పడం కాబట్టి, ఈ ‘చెప్పగలిగే కళ’ను సొంతం చేసుకొని ఎందరినో ఒప్పించి, మెప్పించగలిగిన కథామేటి -వెంపటి. తెలుగు సినిమా మలియుగం (1940 వ దశకం)లో కాలుపెట్టిన ఈ కలం యోధుడు సినిమా కథా కథన నాడీ వైద్యుడు.
  వెంపటి వంశం వారు హరితస గోత్రీకులు. అయితే కూచిపూడి నాట్యాచార్యులైన వెంపటి సత్యం ప్రభ్నతులకు, సదాశివ బ్రహ్మం వారికి ఇంటిపేరు మినహా, ఏ సంబంధ బాంధవ్యాలు లేవు.
  ఇహ మన ‘కథా’నాయకుడైన వెంపటి సదాశివబ్రహ్మం గారు, 1905 ఫిబ్రవరి 18 వ తేదీన తూర్పుగోదావరి జిల్లా, తుని గ్రామంలో వెంపటి బ్రహ్మయ్యశాస్త్రి, వెంకాయమ్మ దంపతులకు మూడవ కుమారుడిగా జన్మించారు.
  తునిలో కవన మాలికలు అల్లుతూ ‘కావ్యగాన వినోదేన, కాలోగచ్ఛతి’ అన్నట్లుగా వెంపటివారు పాటలు, పడుతూ నాటకాలు వేస్తూ తిరిగేవారు. వారు చదివింది ఎనిమిదవ తరగతి మాత్రమే! కానీ సరస్వతీ మాత వరపుత్రునిగా, పద్యస్ఫూర్తితో పదేళ్ల వయసులోనే పద్యాలు ఆశువుగా చెప్పేవారు. పాఠశాలకు వెళ్లడానికి ఇచ్ఛగించక స్వయంగా సంస్కృతాంధ్ర ఆంగ్ల భాషలు నేర్చుకొన్నారు. పంచకావ్యాలను, ఆంగ్లసాహిత్యాన్ని అధ్యయనం చేసారు. అనతి కాలంలోనే ఆ ప్రాంతంలో ‘బాలకవి’గా పేరు తెచ్చుకున్నారు. తిరుపతి వేంకటకవుల ప్రభావంతో అవధాన విద్యపై మొగ్గు చూపారు. తన ధారణాసామర్థ్యంతో, ఆశు కవితా ధారతో అవధానాలు చేస్తూ, శతావధాని”గా పేరు తెచ్చుకున్నారు.
  ఇన్‌సైడ్ స్టోరీఎప్పుడూ ఎక్కడా ఓ చోట కాలు నిలవని వెంపటివారికి పెళ్లి చేస్తేనైనా ఇంటిపట్టున వుంటాడని భావించి, 1928 లో వారి 23 వ ఏట శ్రీకాకుళానికి చెందిన జానకమ్మగారితో పెళ్లి జరిపించారు.
  అప్పటికావిడ వయస్సు ఎనిమిది సంవత్సరాలే! వివాహమయ్యాక ఆమెను తునిలో దించి, తాను మాత్రం స్వాతంత్య్రోద్యంలోకి దూకాడు. ముఖ్యంగా రంపచోడవరం మొదలగు ఏజెన్సీ ప్రాంతాలలో అల్లూరి సీతారామరాజు నిర్వహించిన పితూరీలలో పాల్గొన్నాడు. ఆ తరువాత కాంగ్రెసు పార్టీలో చేరారు. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్షను అనుభవించారు. జైల్లో దేశభక్తి పూరితమైన పద్యాలను, గేయాలను రాసి ఎలుగెత్తి ఆలపించేవారట. ఆనాటి కాంగ్రెసు సభల్లో పాల్గొని, హరికథ, ప్రక్రియలో ప్రబోధాత్మక కథాగానాలను ఆలపిస్తు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయటంలో తన వంతు పాత్రను నిర్వహించినారు.
  ఆ రోజుల్లో ఆంద్రపత్రిక, శారద, భారత, మొదలగు పత్రికలలో వీరి కథలు ప్రతిఫలించే విధంగా వీరి రచనలు సాగేవి. అయితే వీరి రచనలకన్నా హరికథా గానానికే ముగ్ధులైయ్యేవారు ప్రజలు.
  ప్రప్రథమ తెలుగుటాకీ నిర్మాత, దర్శకుడు, రోహిణీ సంస్థ అధినేత హెచ్‌.ఎం.రెడ్డి గారు, వెంపటి సదాశివబ్రహ్మం గారి హరికథను విని, వెంటనే తను నిర్మించే ‘తెనాలిరామకృష్ణ’ (1941) చిత్రానికి రచన చేయాల్సిందిగా ఆహ్వానించారు. 1941 వరకే తెలుగులో దాదాపు 75 చిత్రాలు విడుదలై ‘చిత్రవజ్రోత్సవాన్ని’ చేసుకొంది. దైతాగోపాలం, బలిజేపల్లి కాళ్లకూరి, చందాల కేశవదాసు మొదలగు నాటకరచయితలు, సముద్రాల, కొసరాజు ప్రభృతులు సినీ రచనను మెరుగులు పెట్టి, కొత్త మార్గం పట్టించారు. వెంపటి వారి ప్రవేశంతో స్క్రీన్‌ ప్లే విధానంలో మార్పు వచ్చింది. అలాగే పాత్రల స్వరూప స్వభావాలను మరింత స్పష్టపరచే విధంగా సంభాషణలు రాయడంలో కొత్త ఒరవడిని వెంపటి సదాశివబ్రహ్మం సృష్టించారు. అలా వారు తొలి చిత్రంతోనే రచయితగా విజయం సాధించారు. ‘తెనాలిరామకృష్ణ’కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసి, అందులో నటించిన ప్రముఖ దర్శక, నిర్మాత ఎల్‌.వి.ప్రసాద్‌ గారు అనంతర కాలంలో వెంపటిగారితో ఎన్నో రచనలు చేయించారు.
  1941 లోనే రాజాశాండో దర్శకత్వం వహించిన ‘చూడామణి’ చిత్రానికి వెంపటి వారు స్క్రీన్‌ ప్లే సమకూర్చారు. నటగాయని టి.జి.కమలాదేవికి ఇదే తొలిచిత్రం. పుష్ప వల్లి, నారాయణరావు, పి.ఎస్‌.ఆర్‌.సుందరమ్మ ప్రధానపాత్రలు పోషించిన ఈ చిత్రం విజయం సాధించింది. 1941 లో వచ్చినా 1950 దశకంలో రాబోతున్న సినిమాల తాలూకు ఛాయలన్ని అందులో పొడచూపాయి. అప్పటి వరకు వచ్చిన పౌరాణిక చిత్రాల మూసను వదిలిపెట్టి ‘చూడామణి’ కొత్త పుంతల్ని తొక్కింది.
  ప్రముఖ హాస్యనటి, గాయని టి. కనకం ‘దేశదిమ్మరి’ అనే చిత్రాన్ని వెంపటి వారితో ప్రారంభిచినారు. కాని చిత్రం తొలిదశలోనే ఆగిపోయింది. ఈ సినిమా కోసం రాసిన కథే 1957 లో ”స్వయంప్రభ” (1957 -సంగీతం -రమేశ్‌ నాయుడు) గా అవతరించింది.
  1942 లో రోహిణి బ్యానర్‌ కింద హెచ్‌.ఎం.రెడ్డి నిర్మించిన ‘ఘరాన దొంగ’ చిత్రాన్ని వెంపటి రచన చేశారు. ఈ చిత్రానికి ‘హేనెస్ట్‌ రోగ్‌’, ”సత్యమేవ జయం” అని మరి రెండు పేర్లు కూడా ఉపశీర్షికలుగా సూచించారు. ఇందులో ఎల్‌.వి.ప్రసాద్‌, దాసరి తిలకం హీరో హీరోయిన్లుగా నటించారు.
  1943 నుంచి 1945 వరకు, దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న కారణంగా చిత్రనిర్మాణం కుంటుపడింది. అప్పటికే మద్రాసులో మాంబళంలో క్రిసెంట్‌పార్కు వద్ద ఓ అద్దే ఇంటికి కుటుంబంతో సహా మకాం పెట్టిన వెంపటి వారు, చేతినిండా సినీరచనలు లేక మళ్లీ అవధానాలు, హరికథలు చెబుతూ కాలక్షేపం చేయసాగారు. ఈ కాలం వెలువడిన చిత్రాలకు ‘ఘోస్టురైటర్‌’గా పని చేశారు కూడా! గూడవల్లి రామబ్రహ్మం గారు నిర్మించి ‘పల్నాటి యుద్ధం’ (1947) చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే రాసింది వెంపటివారే (టైటిల్స్‌లో పేరు కనిపించదు) అలాగే కాళ్లకూరి సదాశివరావు దర్శకత్వంలో వచ్చిన ”రాధిక (1948) సువర్ణమాల చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే ‘అందించారు’.
  1948 లో దర్శక నిర్మాత సి.వి.రంగనాథ్‌ దాస్‌ సాధనా సంస్థను స్థాపించి ‘దాసి’ చిత్రాన్ని నిర్మిస్తూ వెంపటి సదాశివబ్రహ్మానికే కథ, మాటలు, పాటలు రాసే అవకాశం ఇచ్చారు. కానీ ఆ చిత్రం సగంలోనే ఆగిపోయింది. ఆ తరువాత, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్‌.టి.రామారావు, లక్ష్మీరాజ్యంలతో ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘సంసారం’ చిత్రానికి రచన చేశారు. ‘సంసారం’ ఘనవిజయం సాధించింది. మహానటి సావిత్రి ఈ సినిమాలో ఓ చిన్న పాత్రను ధరించింది. అక్కినేని గారి తొలి సాంఘిక చిత్రమిది.
  1948 సం|| లోనే ‘దాసి’ విడుదలై వుంటే సదాశివబ్రహ్మం గారి కథ మరికొంత ‘అడ్వాన్స్‌’ అయ్యేది. తెలుగు తొలిటాకీ చిత్రం నుండి (1931) స్వాతంత్య్రా నంతరకాలం వరకు (1948) వెలువడిన సినిమాల గురించి వెలువడిన పత్రిక ‘చిత్రకళ’ (1948) వెంపటి సదాశివబ్రహ్మం గారిని సృజనాత్మకతగల రచయితగా అభివర్ణిస్తూ హాస్యనటుడిగా (మదాలస చిత్రంలో టిట్టికుడి పాత్ర) కితాబు నిచ్చి, దర్శకత్వం నెరపే సత్తా పున్నవాడని ప్రశంసించింది.
  1950 దశకం సదాశివబ్రహ్మం గారికి స్వర్ణయుగం. ఈ కాలంలో సంసారం (1950), దాసి (19520, పెంపుడు కొడుకు (1953), కోడరికం (1953), వద్దంటె డబ్బు (1954), కన్యాశుల్కం (1955), చరణదాసి (1956), ఉమాసుందరి (1956), భలేరాముడు (1956), భలే అమ్మాయిలు (1957), సువర్ణ సుందరి (1957), చెంచులక్ష్మి (1958), దొంగల్లో దొర (1957), ఇంటిగుట్టు (1958), స్త్రీ శపథం (1959), శభాష్‌ రాముడా (1959), కృష్ణలీలలు (1959), అప్పుచేసి పప్పుకూడు (1958), శరద (1957) మొదలైన చిత్రాలకు కథ, మాటలు, కొన్ని పాటలు, పద్యాలు రాసి సినీ రచయితగా తారాపథంలో దూసుకెళ్లారు. ఈ చిత్రాలన్ని ఘనవిజయం సాధించినవే! ఇక ఇల్లరికం (1959) కథను అల్లిన వారు వెంపటి వారే!
  1960 లో ‘దేవాంతకుడు’, చిత్రానికి కత, మాటలు రాసింది వవెంపటిగారే. (ఈ సోషియే ఫాంటసీ చిత్లం లోని ‘గోగ్గో గోంగూర’ పాట జనాదరణ పొందింది) ఈ చిత్రమే మళ్లీ 1977 లో ‘యమగోల’గా నిర్మించినపుడు బాక్సాఫీసును బద్దలు చేసింది. ఆ తరువాత ‘యమలీల, యమదొంగ’ వంటి చిత్రాలకు ముల కథా బిందువుకు వెంపటివారి కలమే ఆధారం.
  1961 లో ‘ఉషా పరిణయం’, ‘కన్న కొడుకు’ ‘శభాష్‌ రాజా’ చిత్రాలకు కథ, మాటలు, కొన్ని పాటలు రాశారు. ‘చరణ దాసి’ చితరానికి రచన చేయించిన లలితా శివజ్యేతి అధినేత శంకరరెడ్డి, ‘లవకుశ’ (1963) చిత్రానికి కథ, మాటలు, కొన్ని పాటలు, పద్యాలు రచించి, ఓ అపురూప దృశ్యకావ్యంగా అందించిన ఘనత వెంపటి వారిదే! ఇందులో ‘రావణుని సంహరించి, ‘ఏ మహనీయ సాధ్వి, ఇంతకు బూనివచ్చి, ఇదేమన ఆశ్రమంబు, నవరత్నోజ్వల కాంతి’ పద్యాలను లక్ష్మణ -లవకుశలు, శ్రీరామ -లవకుశుల వాద సంవాద పద్యాలైన ‘తండ్రిపంపున, స్త్రీ బాలవృద్ధుల’ను రచించారు. సాధారణంగా జానపదధోరణిలో గాసే పాటలను కొసరాజు గారికే అప్పగిస్తారు. కానీ ‘లవకుశ’ లో ‘వెయ్యర దెబ్బ దరువెయ్య దెబ్బ’ ఒల్లనోరి మామా నీ పిల్లని, రామన్న రాముడు కోదండరాముడు పాటలను వెంపటి వారే రాసి జానపద కవి అనిపించుకున్నారు.
  1964 లో బి.ఎ. సుబ్బారావు నిర్మించి దర్శకత్వం వహించిన ‘మై రావణ’కు కథ, మాటలు, కొన్ని పాటలు రాశారు. ఇందులో రేలంగి ఆంజనేయునిగా, శోభన్‌బాబు లక్ష్మణునిగా, రాజనాల రావణునిగా, కాంతారావు రామునిగా, కృష్ణకుమారి చంద్రసేనగా నటించారు.
  గుత్తారామనీడు దర్శకత్వంలో వచ్చిన ‘పల్నాటి యుద్ధం’ చిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు వెంపటివారే సమకూర్చారు.
  1966లో సి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన పరమానందయ శిష్యుల కథ (ఎన్‌.టి.ఆర్‌, కె.ఆర్‌. విజయ) చిత్రానికి కథ మాటలు కొన్ని పాటలు పద్యాలు రాశారు. ”ఎనలేని ఆనంద మీరేయి’ (ఘంటసాల జానకి) ‘వనిత తనంతటి తావలచిన (లీల, సుశీల) పాటలు హిట్టయ్యాయి.
  లలితా శివజ్యోతి వారి ‘రహస్యం’ (1967) వీరి చివరి చిత్రం. ఈ చిత్రానికి కథను సుబ్రహ్మణ్యం పిళ్లె అందించారు. మాటలు, కొన్ని పాటలు పద్యాలు సదాశివబ్రహ్మం గారే రాశారు. ‘ఈ జన్మ సరిపోదు గురుడా’ అన్ని తత్త్వగీతంతో పాటు ”జలజతాసన’, మొదలు 15 పద్యాలు రాశారు.
  ‘వద్దంటే డబ్బు’ చిత్రం కోసం ”అల్లదే, నా ప్రియా! కుటీర వాటిక” (గానం. జిక్కి) పాట విలువలున్నదే. కథానాయిక తన చిరునామ చెబుతున్న వైనాన్ని సహజంగా వర్ణించాడు. మెలికలున్న కాలిబాట గుండా, లేమావి తోట దాటుతూ మెల్లిగా వస్తే అగుపించేదే తన కుటీరమని, ”కెమెరా కన్ను”తో అక్షరాల్లో దృశ్యాలను ఆవిష్కరించారు. టి.ఎ.కల్యాణం స్వరపరచిన ఆపాత మధురగీతమిది.
  ‘సంసారం’ చిత్రంలోని పాటలు, (టముకుల బండి లంఖణాల బండి, జోడెద్దుల బండి పాటతో సహా) సాహితీ విలువలున్నవే! ”అందాల చందమామ -నిన్ను వలచి అలలు లేసి ఎగసినాయే భామా!” అని కతానాయకిని శ్లేషగా వర్ణించే రొమాంటిక్‌ గీతం -ఈ పాటను చతురస్రగతిలో ప్రారంభించి, రెండో చరణాన్ని ఖండగతిలో (ఏ పాటి మనసైనదేమోనే) నడిపించటం వెంపటి కలం ‘నడకకు’ ఉదాహరణ. ఈ చిత్రంలోని ”దారుణమీ దరిద్రమ విధాత సృజించిన బాధలందునన్‌, రౌరప మాదిగా గల నిరంతర కష్టముల సాటియే, ఘోర దరిద్ర భారమున ఆ నలచక్రవర్తియే దారను వీడిపోయే గదా, ఇక అన్యులు లెక్క అవుదురే” అన్న పద్యం, హృద్యం!
  చందమామను ప్రతీకగా తీసుకొని పాటలు రాయడం పట్ల వెంపటి వారు మొగ్గుచూపే వారు. ‘ఉమా సుందరి’ (సంగీతం -అశ్వద్ధామ) లో ”ఎందుకో రేరాజ మా మీద దాడి! వెన్నెల్లో వేడి, పూవుల్ల వాడి” (ఘంటసాల, జిక్కి) గీతంలో నిందారోపణ చేస్తూ ప్రణయగీతంగా మలచినారు.
  ‘సంసారం’లో నాయికపరంగా చందమామను సంకేతంగా తీసుకొని రాసినట్లే ‘జయంమనదే’ చిత్రంలో ‘చుక్కకు చందమామ’కు జోడు కలిపి చక్కని పాట రాశారు. నాయిక ”అందాల చందమామా/ఆడదాననోయి/ఎందుకో నిన్ను చూస్తే ఎంతో సిగ్గవుతుందోయ్‌” (ఘంటసాల -లీల) అని ఎత్తుకొంటే ”చాడ చక్కని చుక్క” అని మురిపెంగా నాయకుడు చిటికె వేస్తూ మురిపెంగ పాడుకొంటాడు. ఘంటసాల స్వరపరచిన విధానం కూడా హుషారు కలిగిస్తుంది. ప్రతినాయక పాత్రధారి ఆర్‌. నాగేశ్వరరావునీ ఆటపట్టిస్తూ హీరో హీరోయిన్లు (ఎన్‌.టి.ఆర్‌, అంజలి) రకరకాల విన్యాసాలు చేస్తూ కనిపిస్తారు తెరపై. ఈ చిత్రానికి తాతినేని ప్రకాశరావు దర్శకులు. విక్టరీ మధుసూదన్‌రావు, కె.ప్రత్యగాత్మ సహాయదర్శకులు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ శబ్ద గ్రహణ దర్శకుడు!
  చందమామ పాటలే కాదు మేఘమాలికలపై సదాశివబ్రహ్మం ‘భలేరాముడు’ (అక్కినేని, సావిత్రి, దర్శకులు -వేదాంతం రాఘవయ్య) చిత్రం కోసం రాసిన ”ఓహో మేఘమాల!’ గీతం వారి పాటల పూతోటలో నిత్యం పరిమళించే పారిజాతం వంటిది.
  ఓహో మేఘమాల! మీలాల మేఘమాల
  చల్లగా రావేలా మెల్లగ రావేలా, వినీల మేఘమాల
  నిదురపోయే రామచిలక బెదిరిపోతుంది -కల చెదిరిపోతుది.
  (హీరోయిన్‌ సావిత్రికి నిద్రాభంగం అవుతుందని చల్లగ రావాలని అభ్యర్థన)
  ప్రేమసిమలలో చరించే బాటసారీ -ఆగవోయి
  పరవశంతో ప్రేమగీతం పాడబోకోయి!
  అని రిక్వెస్టు చేస్తాడు. ”ప్రేమసీమలలో.. అనే పంక్తితో ఒక్కసారి మనల్ని కాళిదాసు రచించిన ‘మేఘసందేశం’ కావ్యంలోని మేఘుని (రాయబారి) వరకు తీసికెళ్లారు వెంపటి. అదీ, వారి కావ్య పరిజ్ఞానం! సందర్భోచితంగా ధ్వనింప జేయడం వారి రసజ్ఞత…
  చమత్కారమేమిటంటే, నిద్రాభంగ చేయొద్దని మేఘాన్ని ప్రార్థించే నాయకుని గాత్రానికి, నాయిక నిద్దురలోంచి లేవనే లేస్తుంది.. ఆలాపనలో సల్లాపాలు చేస్తూ.
  ”మాయజేసి మనసు దోచి పారిపోతావా? దొంగా” అని మురిపొంగా ప్రశ్నిస్తుంది. సాలూరి రాజేశ్వర్రావు స్వరకల్పనా? లేదా ఘంటసాల లీల గాత్రమాధుర్యోమా? లేదా అక్కినేని, సావిత్రిలల అభినయమా లేదా వెండితెర వెన్నెల వెలుగుల ఛాయాగ్రహణమా? -అని ప్రేక్షకుడు పరి పరి, ప్రశ్నించుకొని -”అన్నీనూ” అని సమాధాన పరచుకొనే అంశం (సమష్టికృషి) ఈ ‘గీతామకరందం’లో నిక్షిప్తమై వుంది. ‘భలేరాముడు’ హిందీలో ‘కిస్మిత్‌’ చిత్రానికి రీమేక్‌.
  వెన్నెల రేయి ప్రస్తావన వచ్చింది కాబట్టి ‘శభాష రాముడు’ (1957) (హిందీలోని ‘బడాభాయి’ చిత్రానికి రీమేక్‌) లోని ”రేయి మించే నోయ్‌ రాజా” వెంపటి వారి సృజనలో మరో మంచిపాట. నాయకుడిని నిదురపుచ్చే పాటలలో (సడిసేయకో గాలి -దేవులపల్లి -రాజమకుటం మొ||) ఇది విలక్షణమైనది. ఘంటసాల స్వరకల్పన తీరు, సుశీల పాడిన రీతి ఆ పాత మధురం. ‘చీకటి వెంటా వెలుగే రాదా’ అని చెబుతూ ఈ లాలింపు పాటలో ఓదార్పును కూడా చేర్చారు. వెంపటి సదాశివబ్రహ్మం, భావగీతాలే కాదు, హాస్యగీతాలు విషాద గీతాలు, అభ్యుదయ గీతాలు, శాస్త్రీయ నృత్యగీతాలు, చిలిపిగీతాలు, తాత్త్విక గీతాలు కూడా ఆయా సన్నివేసాలకు అనుగుణంగా రాశారు.
  సదాశివబ్రహ్మం పేరు వినగానే సదా గుర్తుకొచ్చే పాట ‘చెంచులక్ష్మి’ చిత్రంలో సుశీల పాడింది. కమనీయం, రమణీయం అదే.
  పాలకడలి పై శేషతల్పమున
  పవళించేవా దేవా!
  బాలుని నను దయ పాలించుటకై
  కనుపించేవా మహాను భావా!
  ఎస్‌. రాజేశ్వర్రావు యమన్‌లో స్వరపరచిన ఈ పాటను, ప్రముఖ గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం తన చిన్నతనంలో ఎప్పుడు పాడుకొనేవారట. తన కంఠాన్ని తాను ఓ టేప్‌ రికార్డర్‌లో మొదటిసారిగా విన్నదీ ఈ పాటతోనేనని చెప్పుకున్నారు కూడా!
  వెంపటి వారు లలిత గీతాల శైలిలో కూడా ఎన్నో పాటలు రాశారు. తొలి నేపత్య గాయని శ్రీమతి రావు బాలసరస్వతీ దేవి పాడిన
  ”గోపాల కృష్ణుడు నల్లన
  గోకులములో పాలు తెల్లన
  కాళిందిలో నీళ్లు చల్లన
  పాట పాడెద నీ గుండె ఝల్లున” (రాధిక (చిత్రం) -సంగీతం సాలూరి హన్మంతరావు) ఆల్‌ టైమ్‌ హిట్‌ అని చెప్పవచ్చు. ఈ పాట స్ఫూర్తితోనే బహుశ: వేటూరి వారు ‘సప్తపది’ చిత్రంలో (ఏ కులము నీదంటె, గోవుల్లు నల్లన) పాటలు రాశారనిపిస్తుంది
  వెంపటి సదాశివబ్రహ్మం రాసిన పాటలు రాసిపరంగా తక్కువే! కానీ వాశిలో గుణుతించదగ్గవే! హిందీ చిత్రాలకు కూడా వీరు కథలు సమకూర్చారు. ప్రముఖ నటుడు, నిర్మాత గురుదత్‌ వీరిని అభిమానించేవారు. ‘తీన్‌ దేవియా’ (దేవానంద్‌, నందా మొ|| నటించినది) (1965), ససురాల్‌ (1961), ప్యార్‌మొహబ్బత్‌ (1966), ఘూంఘట్‌ (1964), శారద (1957) చిత్రాలకు పరోక్షంగా కథను అందించారు. తీన్‌దేవియా (1965) చిత్రం టైటిల్స్‌లో స్టోరీ -సదాశివబ్రహ్మం అని కనిపిస్తుంది. అలాగే కన్నడ సినీ గీత రచయిత ఉదయ్‌శంకర్‌ తండ్రి సదాశివయ్యగారికి వెంపటి కథలు అందించేవారు. తెలుగులో హిట్టైన చిత్రాలను తమిళంలో తీసినపుడు, (డబ్‌ చేసినపుడు) వెంపటి తమిళంలో కూడా రచన చేశారంటే, వారి బహుభాషా పాండితీ ప్రకర్ష, పట్టు అర్థమవుతుంది. కణవణ కణ్‌ కండ దైవమ్‌, మాదరుకుల మాణిక్యమ్‌, మాడివేటు మాప్పిళై మొదలగునవి ఉదాహరణలు మాత్రమే. మొత్తం కలిపి వెంపటి 75 చిత్రాలకు రచన చేసి 150 పాటల వరకు రాశారు.
  వెంపటి సదాశిబ్రహ్మం, జానకమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు (గిరిబాల, ఉషాబాల) ముగ్గురు కుమారులు బ్రహ్మయ్యశాస్త్రి ఆనందశర్మ, వాసుదేవ బ్రహ్మం) కలిగారు. వీరిలో గిరిబాల గారు అందరికన్నా పెద్ద. వాసుదేవబ్రహ్మం అందిరికన్నా చిన్నవాడు. గిరిబాల (1936) గాలికి తండ్రి సాహిత్య సంగీతాలు అబ్బినప్పటికీ, ఆ రంగంలో కృషిచేయలేదు. కానీ ఆమె మధురగాయని. గట్టిగా ప్రయత్నించి వుంటే సుశీల, జిక్కి స్థాయిలో గాయకురాలై వుండేది. ఇప్పటికీ ఆమె గాత్రంలో మాధుర్యం చెక్కు చెదరలేదు. ‘ఉమా సుందరి’ చిత్ర నిర్మాణ దశలో ఆమెకు బిడ్డ పుట్టినప్పుడు (1956) ఆమెకు ఉమాసుందరి’ అని వెంపటివారు పేరు పెట్టారట. ఆ అమ్మాయని తన రెండో తమ్ముడు ఆనందశర్మకిచ్చి పెళ్లి చేసింది. ఆనంద్‌ శర్మ ఆంధ్రాబ్యాంకు తదితర బ్యాంకులలో ఉన్నతాధికారిగా పనిచేసి ప్రస్తుతం నేషనల్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజి కన్సల్టెంట్‌గా, యూ.కె.కంపెనీ తరఫున ఇంటర్వ్యూ పానెల్‌ మెంబర్‌గా కూడా ఉంటున్నారు. వీరికిద్దరు అబ్బాయిలు. వెంపటి చిన్న కుమారుడు, వాసు దేవబ్రహ్మం చాలా కాలం సంగీత దర్శకుడు ఎం.రంగారావు వద్ద అసిస్టెంట్‌గా పనిచేసి చెన్నైలో స్థిరపడ్డారు. వెంపటివారి ధర్మపత్ని 1986 లో దివంగతులయ్యారు.
  కథా శివబ్రహ్మంగా పేరు గాంచినప్పటికీ, వెంపటి బహుముఖ ప్రజ్ఞాశీలి. ‘గుడ్‌మార్నింగ్‌’ గుడు ఈవినింగ్‌’ చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించాలనుకొన్నారు. కానీ 1968 జనవరి 8 వ తేదీన, గుండెపాటుతో ఆకస్మిక మృతి నొందారు. ఎల్‌.వి.ప్రసాద్‌, పి.బి.శ్రీనివాస్‌, పరాత్పరరావు, ప్రభృతులు వెంపటిని ఎంతో అభిమానంచేవారు. తెలుగు సినీ రచనకు కొత్త దిశను చూపించిన వెంపటి, నిజంగా సినీ రచనా సుమసౌరభం.

జీవితం (1949 సినిమా)..

తారాగణం:–
టి.ఆర్.రామచంద్రన్ (పతి),
సి.హెచ్.నారాయణరావు (మూర్తి),
వైజయంతిమాల (మోహిని),
యస్.వరలక్ష్మి (వరలక్ష్మి),
సి.యస్.ఆర్.ఆంజనేయులు,
కంచి నరసింహారావు
.
సంగీతం ఆర్.సుదర్శనం
నేపథ్య గానం యస్.వరలక్ష్మి, ఎమ్.ఎస్.రామారావు
గీతరచన వెంపటి సదాశివబ్రహ్మం
సంభాషణలు తోలేటి వెంకటరెడ్డి
నిర్మాణ సంస్థ ఎ.వి.యం.ప్రొడక్షన్స్

పాటలు……
మేలుకోండి తెల్లవారె తెల్లగా – ఎస్.వరలక్ష్మి
ప్రియమైన రాణీ మోహినీ
మన మనసూ మనసూ ఏకమై

ఇదేనా మా దేశం, ఇదా భారతదేశం – యం.ఎస్.రామారావు

 1. కదా శివ బ్రహ్మ ముళ్లపూడి వెంకటరమణ

తలా తోకా చటుక్కున పోల్చుకుందుకు
వీల్లేనివాటిలో నిత్యశంకితుని భావాలూ, నూలుపోగూ,
వానపామూ, రెండు జడలపిల్లా కొత్తకార్లూ వగైరా
చరాచర పదార్ధాలతోపాటు _ చెప్పుకోతగ్గ మరో
జడపదార్థం తెలుగు సినిమా కధ అంటారు. అలాగే
మిథ్యావాదాన్ని బలపరిచే ఉదాహరణలలో ప్రబంధ
నాయికల నడుమూ, ఎన్నికల వాగ్గానాలలో నిజాయితీ,
అవకాశవాది నిశ్చితాభిప్రాయం, తెలుగు సినిమాలో కధ చెప్పుకోతగ్గవంటారు.
ఇటువంటి తెలుగు సినిమా కధను
వెనకేసుకొచ్చి నిలబెట్టగల వారిలో, ఇదీ కథేను అని
కధగా చెప్పగల గొప్పగలవారిలో శ్రీ వెంపటి
సదాశివబ్రహ్మం ముఖ్యులు.
తెలుగు సినిమా చిన్నతనం రోజులలో (అవే గొప్పతనం
రోజులూను) (ప్రవేశించి నేటివరకూ, ‘ఇదిగో సినిమా
కొక కధ చెబుతా విను అని చెప్పి, ‘కథా రచయితగా”
(చాలామంది మాటల పాటల రచయితలే) నిలబడి నెగ్గుకొస్తున్న ఒకే ఒక్క వ్యక్తి
ఈయనే. కాలంనాడు హిందీలోనూ బెంగాలీలోనూ సినిమాకి గురి అయి చనిపోయిన కథల్ని తవ్వి తీసి బ్రతికించి తెలుగు ప్రాణం పోస్తాడని విమర్శించే గిట్టని వాళ్ళు
ఉన్నా నేటి సినిమాల కధల విలువ తెలిసినవారూ, ఆయన వాగ్థాటిని ఎరిగినవారూ
సగౌరవంగా ‘కథాశివ బ్రహ్మం) అంటారు.
సదాశివబ్రహ్మంగారు ఒక రకంగా ఆశుకవి. ఒకే ఒక కధావస్తువు దొరక బుచ్చుకుని ఒకరోజు పొద్దుటనుంచి సాయంకాలం లోపల పద్ధెనమండుగురు నిర్మాతలకు నలభయ్యేడు కథలు- చెప్పింది చెప్పకుండా చెప్పుకుపోగలడు. గుడ్లు తిప్పుకుంటూ, పొడుగుపాటి సిగరెట్లు పీల్చేస్తూ చేతు లెగరేస్తూ “విశాపట్నం’ యాసలో ‘ఆయనలాఘ కథ లల్లీసుకుపోతూ, వాటిలో సన్నివేశాలు కళ్ళకృట్టీలా, ఉద్వేగంతో ఉత్సాహంతో చెప్పుకుపోతూ ఉంటే నిర్మాతలు దర్శకులు కూడా ముగ్గులైపోయి వింటూ ఉండిపోతారు. అంతా విన్నాక వారు ఆ విన్నదేమిటో చెప్పుకోలేరన్నది వేరు విషయం. ఐంద్రజాలికుడు సదాశివబ్రహ్మం చెప్పినపుడు కళ్ళకృట్టినట్లు అద్భుతంగా కనిపించిన సన్నివేశాలు తీరా తెర కెక్ళాక తలా తోకా

తెలియకుండా తయారైతే అది ఆయన తప్పుకాదు. అసూర్యంపశ్యలలో అతిలోక
సొందర్యవతులున్నారని ఒప్పుకుంటే ప్రేక్షకుల దాకా సాగిరాని ప్రతిభగల వారిలో
(కధకీ తెరకీ మధ్య లక్షగందాలు) సదాశివబ్రహ్మం ఘనుడనే చెప్పుకోవాలి. పద్యంలో
ఆశుకవిత ఘనమైతే గద్యంలో జీవితం మీద అనర్గళంగా ఆశువు చెప్పగలగడం
ఈయన ప్రజ్ఞ (పద్యాలు కూడా బాగా చెప్పగలడు). ఎటొచ్చీ ఆశుకవులు ఒక
మూసలో వర్ణననే తిరగామరగావేసి రకరకాలుగా చెప్పినట్టు ఈ “ఆశుకధకుడు”
కూడా ఒకే కధను ఒక్కపూటలో ఇరవై నాలుగు మోస్తర్లలో అల్లుకుపోతాడు. మధ్యలో
అతుకులూ, టంకాలూ, పాత్రలూ, తీరులూ సవ్యంగా కుదరకపోయినా, అప్పుడు
తెలియవు. తెలిసేసరికి కాలాతీతం అయిపోతుంది. అందుకే సినిమాలైన ఆయన కధలు కొన్నిటిలో ఏనుగుతల పాముకీ, చీమతల ఏనుక్కీ దాని తోక పిచిక్కీ ఉన్నట్టు
కనబిడతాయి.
ఇరవయ్యేళ్ళ సినీ జీవితంలో సదాశివబ్రహ్మంగారి కథలతో సినిమాలై
కండపుష్టితో రూపొంది బ్రహ్మాండమైన విజయం సాధించిన చిత్రాలలో
ఘరానాదొంగ, సంసారం, చరణదాసి, భలేరాముడు, ఇంటిగుట్టు, ఇల్లరికం,
అన్నపూర్ణ మొదలైనవెన్నో ఉన్నాయి. వీటిలో కొన్నిటి కాయన మాటలు పాటలు
కూడా వ్రాశాడు. ఇవేకాక ఆ మధ్య నటనలోను దర్శకత్వంలోను కూడా తేలిగ్గా
చేయి కాల్చుకుని మళ్ళీ తన “కధాస్థలానికి వెళ్ళిపోయొచ్చేశాడు. ఇప్పటికీ చిన్న
నటులతో కొత్తవాళ్ళతో అద్భుతమైన చిత్రం తీసి స్టార్‌వాల్యూ అనేది అపోహ అని
నిరూపించాలని దర్శకుడుగా మంచి కధలు చిత్రించాలని ఆయనకు చాలా మోజు
ఉంది.

హెచ్‌.ఎం. రెడ్డిగారి “తెనాలిరామకృష్ణు నుంచి నేటివరకు సినిమా కథలతో
కలిసి అడుగులు వేస్తున్నవాడు కాబట్టి, తన అనుభవం, పలుకుబడి ఉపయోగించి
కథను కొత్తదారులు పట్టించడం బాధ్యతగా స్వీకరించగల హక్కు అధికారం
ఈయనకు ఉన్నవి, ప్రేక్షకుల తరపున నిర్మాతలకు మంచి కధలను, కొత్తవాటిని
సిఫార్సుచేసి ఒప్పించగల సామర్థ్యమూ ఉంది. మంచివాడన్న మంచి పేరూ ఉంది.
వీటన్నిటినీ మంచి లక్ష్యాలు సాధించడానికీ ప్రయోగించి సాధించిననాడు ఆయనకు
తెలుగు సినిమాకధ కథలో కథాశివబ్రహ్మం అన్న పేరు స్థిరవడితీరుతుంది.
(ఆం|ధ-వారప,తిక- 1959)

సదాశివబ్రహ్మం (1905-68) సదాశివబ్రహ్మం కెరియర్‌ చివరివరకూ ఉజ్జ్వలంగానే సాగింది. “లవకుశ “పరమానందయ్య శిష్యుల కధి, ‘భువనసుందరి కథి ‘భామావిజయంి రణభేరి – ఇలా అనేక హిట్‌ సినిమాలకు కధ అందించారు. ‘కణవన్‌ కన్‌కండ దైవం) (తమిళం) సినిమాకు కూడా కధ అయనదే! రాధిక (1947) సినిమాకు దర్శకత్వం వహించారు. అయన తలపెట్టిన గుడ్‌ మార్చింగు”, “గుడ్‌ ఈవెనింగు నిర్మాణదశలోనే ఆగిపోయాయి.లం

50వ దశకం
1950 దశకం సదాశివబ్రహ్మం సినిమా ప్రస్థానంలో స్వర్ణయుగం. ఈ కాలంలో సంసారం (1950), దాసి (19520, పెంపుడు కొడుకు (1953), కోడరికం (1953), వద్దంటె డబ్బు (1954), కన్యాశుల్కం (1955), చరణదాసి (1956), ఉమాసుందరి (1956), భలేరాముడు (1956), భలే అమ్మాయిలు (1957), సువర్ణ సుందరి (1957), చెంచులక్ష్మి (1958), దొంగల్లో దొర (1957), ఇంటిగుట్టు (1958), స్త్రీ శపథం (1959), శభాష్‌ రాముడా (1959), కృష్ణలీలలు (1959), అప్పుచేసి పప్పుకూడు (1958), శరద (1957) మొదలైన చిత్రాలకు కథ, మాటలు, కొన్ని పాటలు, పద్యాలు రాసి సినీ రచయితగా తారాపథంలో దూసుకెళ్లారు. ఈ చిత్రాలన్ని ఘనవిజయం సాధించినవే! ఇక ఇల్లరికం (1959) కథను అల్లిన వారు వెంపటి వారే!

60వ దశకం
1960 లో ‘దేవాంతకుడు’, చిత్రానికి కథ, మాటలు వ్రాసింది వెంపటే. (ఈ సోషియో ఫాంటసీ చిత్రంలోని ‘గోగ్గో గోంగూర’ పాట జనాదరణ పొందింది) ఈ చిత్రమే మళ్లీ 1977 లో ‘యమగోల’గా నిర్మించినపుడు బాక్సాఫీసును బద్దలు చేసింది. ఆ తరువాత ‘యమలీల, యమదొంగ’ వంటి చిత్రాలకు మూల బిందువు వెంపటి కథే. 1961 లో ‘ఉషా పరిణయం’, ‘కన్న కొడుకు’ ‘శభాష్‌ రాజా’ చిత్రాలకు కథ, మాటలు, కొన్ని పాటలు వ్రాశాడు. ‘లవకుశ’ (1963) చిత్రానికి కథ, మాటలు, కొన్ని పాటలు, పద్యాలు రచించి, ఓ అపురూప దృశ్యకావ్యంగా అందించిన ఘనత వెంపటిదే. 1964 లో బి.ఎ. సుబ్బారావు దర్శకత్వం వహించిన ‘మై రావణ’కు, గుత్తారామనీడు దర్శకత్వంలో వచ్చిన ‘పల్నాటి యుద్ధం’ చిత్రానికి కథ, మాటలు, కొన్ని పాటలు వ్రాశాడు. 1966లో సి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన పరమానందయ శిష్యుల కథ చిత్రానికి కథ మాటలు కొన్ని పాటలు పద్యాలు వ్రాశాడు. లలితా శివజ్యోతి వారి ‘రహస్యం’ (1967) ఈయన చివరి చిత్రం. ఈ చిత్రానికి కథను సుబ్రహ్మణ్యం పిళ్లె అందించాడు. మాటలు, కొన్ని పాటలు పద్యాలు సదాశివబ్రహ్మం వ్రాశాడు.

సదాశివబ్రహ్మం జనవరి 1, 1968 సంవత్సరంలో గుండెపోటుతో ఆకస్మికంగా చెన్నైలో పరమపదించారు.

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-1-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.