మన మరుపు మరుగు న వెండి తెరమహానుభావులు -32
32-కట్టబొమ్మన డైలాగ్ ఫేం- కెవిఎస్ శర్మ
సాధారణంగా శివాజీ గనేషన్ కు తెలుగు డబ్బింగ్ చెప్పాలంటే జగ్గయ్య కంచు కంఠమే సరైనది చాలాకాలం అనుకున్నాం కారణం ఆ గాంభీర్యం కంచు ఘంట లాంటి స్వరం అంతకు ముందు ఎవ్వరికీ లేదు .మనోహర సినిమాలో ఆయన శివాజీకి చెప్పిన డైలాగ్స్ రికార్డులు గా ప్రతి ఇంటా మారుమోగాయి .ఆయనకు దీటుగా కన్నాంబ డైలాగ్స్ అదిరిపోయాయి .కాని వీరపాండ్య కట్ట బొమ్మన సినిమాలో ఒక విలక్షణమైన అత్యంత ఉద్రేక పూరితమైన అన్ని రసాలను ఒలికించే కాంఠాన్ని తెలుగు డబ్బింగ్ సినిమాలో విని ఆశ్చర్యపోయాం అవాక్కైయ్యాం .అద్భుతః అనుకొన్నాం ఎవరిదీ స్వరం అని ఆలోచించి కేవీస్ శర్మగారిదని తెలిసి పులకిన్చాం నిండారా అభినందించాం.
స్ఫురద్రూపం కళ్ళల్లోనే అన్ని భావాలు పలికించే నేర్పు విలక్షణమైనమేనరిజం తో కోటేరు తీసినట్లుందడే ముక్కుతో కొద్దిగా వంగినట్లు ఉండే రూపం ,తో ప్రతి డైలాగ్ అత్యంత స్పష్టంగా చెప్పగలిగే నేర్పున్నవారు శర్మగారు .
కె.వి.ఎస్.శర్మ రంగస్థల, సినిమా నటుడు. గుంటూరులోని ఎ.సి.కాలేజిలో చదువుకున్నారు. ఇతడు ముక్కామల, ఎన్.టి.ఆర్, జగ్గయ్య, వల్లభజోస్యుల శివరాం మొదలైన వారితో కలిసి నవజ్యోతి సమితి అనే నాటక సంస్థ ద్వారా అనేక నాటకాలను ప్రదర్శించారు[1]. ఎన్.టి.ఆర్ స్థాపించిన నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థద్వారా “చేసినపాపం” వంటి ఎన్నో నాటకాలలో నటించారు[2].సాంఘిక జానపద పౌరాణికాలలో తనదైన ముద్రతో నటించిన డైలాగ్ కింగ్ శర్మాజీ .
1955లో వచ్చిన పాండురంగ మహాత్మ్యం లో సినీ రంగ ప్రవేశం చేసిన శర్మ ,అదే ఏడాది విడుదలైన దొంగల్లో దొర లో తాతాజీగా ,తర్వాత సువర్ణ సుందరి ,వీరకంకణం లో ముఖ్యపాత్ర ,అన్నాతమ్ముడు ,రాజ నందినిలో సదానందస్వామి గా ,శ్రీకృష్ణమాయ లో బ్రహ్మ దేవుడుగా ,అభిమానం లో చలం తండ్రి పిసినిగొట్టు సింగరాజు లింగారాజుగానటించారు ఇందులో ఆయనకూ చలానికి ఒకపాటలో మహా గొప్పగా నటించారు –‘’మదిని నిను నెరనమ్మితినే మాతా దయగను ధన లక్ష్మీ ఇదే తీరుగా ఖడే రావుగా నిలిచి ఉండవే ధనలక్ష్మీ ‘’పాట విని నవ్వుకొని వారుండరు . 1960లో వచ్చిన దేవా౦త కుడులో భద్రయ్యగా ,పినిశెట్టి డైరెక్షన్ లో నిత్యకళ్యాణం పచ్చతోరణం లో దాదా గా ,మహాకవి కాళిదాసు ,సీతారామకల్యాణం ,ఉషాపరిణయం ,అప్పగింతలు లో రామచంద్రయ్యగా ,గులేబకావళి ,చిట్టితమ్ముడు లో వింత పాత్రలో ,ఈడూ జోడూ లో ఆధ్యాత్మిక గురువు లక్ష్మీ పతిగా ,లక్షాధికారి , శకుంతలలో దుర్వాస మహర్షిగా ,1966లో శ్రీమతి సినిమాలో చివరిసారిగా శర్మ నటించారు .ప్రతిపాత్ర ఆయన చేతిలో పండింది .జీవించారు .ఆయన చెప్పిన ప్రతిడైలాగ్ వన్స్ మోర్ అనిపించేట్లుగా ఉంటుంది .ఇంతటి విలక్షణ విశిష్ట నటుడి గురించి పూర్తీ వివరాలు లభించకపోవటం శోచనీయం .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -21-1-22-ఉయ్యూరు