25-భావాశ్రయ హాస్యం  

25-భావాశ్రయ హాస్యం  

ఒక వైపరీత్యం ,అసంగత్వం ,అసహజత్వం ,క్రమభంగం ఉంటె అలాంటి భావం వలన హాస్యం పుడితే భావాశ్రయ హాస్యం అంటారు .అల్ప విషయాలను అద్భుతాలుగా ,అద్భుతాలను అల్పాలుగా, ఉదాత్త విషయాలను అనుదాత్త విషయాలుగా భావించటం లో భావ వక్రత ఉంది అంటారు మునిమాణిక్యం మాష్టారు .తెలివి తక్కువదాన్ని తెలివైనదిగా, అసహజత్వాన్ని సహజం ,,అన్యాయాన్ని న్యాయంగా గా వర్ణించటం భావ హాస్య కల్పన తో ఉన్నపనులు అన్నారు మాష్టారు .మిధ్యాభిమానం, స్వార్ధం ,అసూయ మొదలైన వాటినే సుగుణాలుగా చెప్పటం భావవక్రతే .వీటికి భావనా శక్తి ముఖ్యం .అందుకే ‘’ఇమాజినేటివ్ హ్యూమర్ ‘’అన్నారు దీన్ని .గంభీరాన్ని పేలవంగా ,పేలవమైన దాన్ని అతి గంభీరంగా చెప్పటమూ వికృత భావ ప్రదర్శనమే అంటారు మునిమాణిక్యం .భావశ్రయంఅంతతరిగానికి సంబంధించింది .శబ్దాశ్రయ హాస్యం లో చమత్కారం భాషలో ఉంటె ,దీనిలో చమత్కారం భావం లో ఉంటుంది అని నిర్వచించారు మాష్టారు .’’Humour  lies in what is suggested to the imagination and not in what is perceived ‘’.శాబ్దిక హాస్యం పువ్వు రూపాన్ని మాత్రమె చూసి ఆనందించటం వంటిది .భావాశ్రయ హాస్యం పువ్వు పరిమళాన్ని ఆస్వాదించటం వంటిది అని వివరించారు .శబ్దాశ్రయ హాస్యం వస్తురూపం లో వికృతిని చూపిస్తే ,భావాశ్రయహాస్యం వస్తు ధర్మం లో వికృతిని చూపిస్తుంది .అర్దాశ్రయ హాస్యం మాత్రం వికృతితో ప్రమేయం లేకుండా అర్ధ వైభవాన్ని కలిగి ఉంటుంది అని మాష్టారు వివరణ ఇచ్చారు .ఈ భావాశ్రయ హాస్యం అనేక విదానులుగా సాధించవచ్చు .

 1-రసాభాసం

వీరా భాసం -అల్ప జీవుల్ని చంపటంషౌరుషం కాదు. దీన్ని శౌర్యంగా చెబితే భావ వక్రత ఏర్పడి వీర రసాభాసం అవుతుంది .ఉదాహరణ –ఈగలు పక్కమీద వాలితే ఒకడు తువ్వాలు తో వాటిని ఒక్కొక్కటీ చంపటానికి పూనుకొంటే అదెదొఅద్భుత౦ గా , ‘’వైరి వీర సంహారం చేస్తున్నట్లు వర్ణిస్తే వీరరసం అభాసం అయి హాస్యం పుడుతుంది . అనవసర పౌరుష ప్రదర్శన ,అసంగత శౌర్య ధైర్యాదుల ప్రశంస చేస్తే హాస్యం పుట్టి వీరాభాసం అవుతుంది .అధమ పాత్ర ద్వారా వీరం చూపించటం వీరాభాసం .భారత విరాట పర్వం లో ఉత్తరకుమారుడు కౌరవులపై దాడికి వెళ్ళటం లో ఈ రకమైన హాస్యం కనపడుతుంది .అప్పటికే దక్షిణ గోగ్రహణం జరిగి మహారాజుమొదలైన పెద్దలూ , సైన్యం రక్షణకు వెళ్ళారు .ఇప్పుడు ఉత్తర గోగ్రహణమూ జరిగిందని వార్త వస్తే రక్షించటానికి ఉత్తరుడు తప్ప ఎవ్వరూ మిగలలేదు .అతడు చిన్నవాడు పెద్దగా పౌరుషమున్న వాడూ కాదు .అయినా అతడు  ‘’ కౌరవుల పొగరు అణచటానికి ఎవరూ లేరనుకోన్నారా ?నేనొక్కడినే వెళ్లి శత్రువుల్ని  వేటుకుకు ఒక్కడిగా నరికి గోవుల్ని మళ్ళించుకు రాగలను .ఐతే పట్టణం లో ఒక్క రధసారదికూడా లేడు .అంతా నాన్నగారితో వెళ్ళారు .ఒక్క సారధిదొరికితే చాలు శత్రువుల అంతు చూసే వాడిని ‘’అంటాడు అక్కడే ఉన్న ఉత్తర ,సైరన్ధ్రీ ‘’బృహన్నల మంచి సారధ్యం చేస్తాడు .అతనిని తీసుకు వెళ్ళండి ‘’అని ప్రోత్సహిస్తే ‘’పేడిమూతి వాడి సారధ్యం నాకు పనికి రాదు ‘’అని బింకాలు పోతాడు. చచ్చిచెడి చివరికి అతడే గతి అయ్యాడు .గురూ గారుమాత్రం ‘బృహన్నలా !తీరా యుద్ధభూమి చూసి భయపడి పారిపోవు కదా ‘’అని చెణికాడు.తీరా యుద్ధభూమి చేరాక ‘’అబ్బో ఇంతమంది యోధాను యోధులతో నేను పోరాడగలనా ?వద్దు బాబూ వద్దు .వెనక్కితిప్పు. నే చస్తే మా అమ్మ ఏడుస్తుంది ‘’అని బతిమాలాడు .

  ఉత్తర కుమారుని మాటలు పట్టి౦చు కోకుండా రధాన్ని పోనిస్తున్న బృహన్నలతో ‘’నాకు భయమేస్తోందయ్యా బాబూ నేనిక్కడ ఉండలేను మా మ్మకు నేనొక్కడినే కొడుకుని. తెలియకుండా వచ్చాను .నన్ను ఇంటి దగ్గర దిగబెట్టు లేకపోతె కి౦దికి దూకుతాను ‘’అన్నాడాప్రగల్భాల ఉత్త కుమార ప్రబుద్ధుడు .అందుకే అతడి మాటలన్నీ లోకం లో ‘’ఉత్తర కుమార ప్రజ్ఞలు గా చెలామణి అయ్యాయి .ఇలాలోపల సరుకు లేకపోయినా పైకి బీరాలు పలికితే వీరరసాభాసమే అవుతుంది అన్నారు మునిమాణిక్యం గారు .

 మరో ఉదాహరణ –‘’భళి భళీ మా తాత బల్లెంబు చేబూని పుల్లాకు తూటుగా పొడిచినాడు .ఎద్దుచ్చ పోయంగా ఏరులై పారంగ  లంఘించి  లంఘించి దాటినాడు .కలుగులోన కప్ప గురుగుర్రు మనంగ కఠారి తీసుకొని గదిమినాడు .నాగలాపురికాడ నక్క తర్ముకు రాగ ,తిరువళూరు దాకా తరిమినాడు .ఎలుక ఎదురుగ రాగ ఈటె చేబూని ఏడారు బారులు ఎగిరినాడు .ఔరా ! వీని పరాక్రమ౦ బద్భుతంబు ‘’అని  నడిచే ఒకపద్యం లో వీరాభాసమే ఉన్నది అంటారు మాష్టారు.

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-1-22-ఉయ్యూరు  .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.