ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు కుమారన్ ఆశాన్
మిగిలిన ఇద్దర్లో వల్లత్తోళ్ నారాయణ మీనన్ ,ఉల్ళూర్ పరమేశ్వర్ అయ్యర్ ఉన్నారు .జీవితతత్వం లో సమస్యలను ఎదుర్కోవటం లో కుమారన్ ఆశన్ లో అద్వితీయ ప్రాచ్యపాశ్చాత్య సమ్మేళనం కనిపిస్తుంది .మహాకవి ఆశాన్ గొప్ప వ్యవహార వేత్త ,వ్యవస్థా నిర్మాత. శ్రీ నారాయణ గురు ప్రియ శిష్యుడు కూడా .కేరళలో వెనుకబడిన ఈజర్ కుల ఉద్దారకుడు .ఎసెన్ డిపి యోగాన్ని వ్యవస్థీకరించి ఆ సంఘానికి 17ఏళ్ళు కార్యదర్శిగా సేవలందించాడు .దళితులలో పాతుకుపోయిన జడత్వాన్ని ,మాంద్యాన్ని నిర్మూలించి వారిలో గొప్ప సాంఘిక చైతన్యం కల్పించాడు .సాంఘిక సాహిత్య క్షేత్రాలలో విప్లవ బీజాలు నాటాడు .సృజనలో ఉన్నత శిఖరాలు అధిరోహించాడు . ఈ మహాకవిపై కే ఎం జార్జి మలయాళం లో రాసిన జీవిత చరిత్రకు శ్రీ డి రామలింగం తెలుగులోకి అనువదించగా ,సాహిత్య అకాడమి 1975లో ప్రచురించింది.వెల రెండున్నర రూపాయలు .ముఖ చిత్ర రచన సత్యజిత్ రే .
ప్రారంభ దశ
1892లో స్వామి వివేకానంద కేరళను సందర్శించి అక్కడి పరిస్థితులు పరిశీలించి ‘’కేరళ దేశం నిజం గా పిచ్చి ఆసుపత్రి ‘’లా ఉంది అని వ్యాఖ్యానించారు .నిజంగానే అప్పుడు కేరళలో సాంఘిక నిమ్నోత్తతాలు పరమ రోతగా ఉన్నాయి .బ్రాహ్మణ హరిజనులమధ్య అనేక కులాలు ,వాటిలో తెగలు ,శాఖలు ఉన్నాయి వెనుకబడిన కులాలు షెడ్యూల్ జాతులు షెడ్యూల్ తెగలు పెద్ద విభాగాలు .కేరళలో ఈజవ లేక తీయ అనే కులం ముఖ్యమైనది .దీన్ని వెనుక బడ్డ కులం లో చేర్చారు .గత నాలుగు శతాబ్దాలలో దాని బడుగుతనం అదృశ్యమైంది .వివేకానందుడు వచ్చినప్పుడు అది బాగా వెనుక బడిన కులం .కుమరన్ ఆశాన్ ఈ కులానికి చెందినవాడు .
తిరువనంత పురానికి ఉత్తరాన 30కిలోమీటర్లదూరం లో కాయిక్కర ఒక కుగ్రామం.దానికి ఒకవైపు సముద్రం మరో వైపు అంజు సరస్సు ఉన్నాయి .ఎటుచూసినా తెల్లని ఇసుక .లెక్కలేనన్ని కొబ్బరి చెట్లు .ఈజవ కులం ఉండే పల్లె అది .కుమారన్ ఇక్కడ జన్మించక పోయిఉంటే ఆ వూరి పేరు ఎవరికీతెలియకుండా పోయేది .ఇప్పుడు ఆమహాకవి స్మృతి చిహ్నంగా కేరాఫ్ అడ్రస్ గా ఉంది .కుమారన్ ఆశాన్ ఇక్కడే 12-4-1873న మళయాళ శకం లో మేషం (మేడం)1048చైత్ర పౌర్ణమినాడు జన్మించాడు .చాలా శుభప్రదమైన రోజు .తండ్రి నారాయణ్ కొబ్బరి నార, చిప్పల వ్యాపారి.సంగీతాభిమాని ,తమిళ ,మళయాలాలలో బాగానే ప్రవేశమున్నవాడు .గ్రామాభి వృద్ధిలో పాల్గొనేవాడు .ప్రాధమిక పాఠశాల ప్రారంభానికి ఆయనే కారకుడు .ఆశన్ తల్లి కాళియమ్మ .అందరూ కొచ్చుపెణ్ణు అని ఆత్మీయంగా పిలిచేవారు .చదువు లేదుకాని పురాణాలన్నీ తెలుసు .వాటిని పిల్లలకు చెప్పేది .తోమ్మన్ విళాకం వారి ఆడపడుచు .దైవభక్తి, దయాగుణం ఆమెకు సహజాతాలు .ఈ దంపతుల రెండవ కుమారుడే కుమారన్ ఆశాన్ .
తలిదండ్రులు చనిపోయాక అన్నగారే కుటుంబ బాధ్యత తీసుకొన్నాడు .తమ్ముడు జీవితాంతం బ్రహ్మ చారిగా ఉండిపోయాడు .మిగిలినసోదరులు గోవిందన్ శేఖరన్ ఉపాధ్యాయులు .కుడి ప్పడి కూళం అంటే వీధి బడిలోనే మొదటి చదువు .కొబ్బరాకులతో గుడి సెకట్టి అందులో బడిపెట్టేవారు .సుమారు 30 మంది పిల్లలకు ఒకడే పంతులు .రాయటం,చదవటం చిన్న చిన్న లెక్కలు చేయటం నేర్పేవారు .పలకా బలపాలు లేవు .పంతులుకు వెనక్కి ఆని కూర్చునే పీట ఉంటుంది .బెత్తం రాసే గంటం ,జాజి చెక్క పెట్టె ఉండేవి .తాటాకులపై అక్షరాలూ రాసేవారు .ముందు పోసిన ఇసుకపై చూపుడు వ్రేళ్ళతో పిల్లలు అక్షరాలూ దిద్దేవారు .మాటలు రాసేవారు .అక్షరాలూ మాటలు ,అంకెలు ఎక్కాలు నేర్చుకొనేవారు వీధిబడిలో . ఇలాంటి వీధిబడిలో ఏడవ ఏట కుమారన్ చేరాడు .చదువు చెప్పే పంతులుగారికి వైద్యం జ్యోతిషం మంత్ర విద్య వచ్చు .
ఒక ఏడాది వీధిబడిలో చదివి సంస్కృత పండితుడు ప్రఖ్యాత వైద్యుడు కొచ్చురామన్ వైద్యర్ కు శిష్యుడయ్యాడు ఆశాన్ .ఆయన వద్ద అమరకోశం ,సిద్ధరూపం శ్రీ రామోదంతం ,కృష్ణ విలాస ,రఘు వంశాలను చదువుకొన్నాడు మాఘకావ్యం లో కొంత నేర్చాడు .వైద్యం బాగా లాభించటం చేత గురువు ఉపాధ్యాయ వృత్తి మానేసి గొప్ప వైద్యుడుగా స్థిరపడ్డాడు .దీనితో ఈయన చదువు మూలబడింది ఒక ఏడాది .ఈయన తండ్రి ఇతర గ్రామపెద్దలతోకలిసి గ్రామం లో ఒక ప్రాధమిక పాఠశాల పెట్టటానికి అనుమతి సంపాదించారు .అందుకని కుమారన్ కుప్రభుత్వ బడిలో చదివే వీలు కలిగింది .మూడేళ్ళు చదివి 14వ ఏటమంచిమార్కులతో పాసయ్యాడు. అతడిని అక్కడే ఉపాధ్యాయుడిగా నియమించారు .కానీ 18 ఏళ్ళు వస్తేతప్ప ప్రభుత్వ పంతులుగా పనిచేయటానికి వీల్లేదు .అందుకని ఈ ఉద్యోగం తాత్కాలికమే అయింది .
కనుక ఒక టోకు వ్యాపారి వద్ద గుమాస్తాగా చేరాడు కుమారన్ .దృష్టి చదువు మీదే కనుక ఎక్కువకాలం పని చేయలేదు .పుస్తకాలు చదవటమే వ్యసనమై పోయింది .తండ్రి తనకు సాయ పడమనే వాడు .ఎదురుతిరిగి చెప్పకుండా ఇల్లువదిలి తాతగారింట్లో మకాం పెట్టాడు .తల్లి వెళ్లి బతిమాలినా రాలేదు .టోకు వ్యాపారే అతని తండ్రిని ఒప్పించి కొత్తగా పెట్టిన ‘’విజ్ఞాన సందాయినీ ‘’అనే సంస్కృత పాఠ శాలలో 16 వ ఏటచేర్పించాడు .ఇతనికున్నఆర్ధిక స్థితి అభిరుచి గుర్తి౦చి ఉపాధ్యాయుడు ఫీజు పుచ్చుకోలేదు .
కొంచెం పోట్టిగాబలంగా ఉండే కుమారన్ ఆకతాయికూడా .ఈతలో మేటి .చెరువులో సముద్రం లో సునాయాసంగా ఈదే వాడు .చేపలు పట్టటం హాబీ .సంస్కృత బడిలో శ్లోకాలు బాగా నేర్చాడు, రాసేవాడుకూడా .బహు గ్రంథకర్త కుంజీ కుట్టన్ తమ్బురాన్ కవి మొదట కవిభారతం రాసి కేరళ ముఖ్యకవులను మహాభారత పాత్రలుగా పరిచయం చేశాడు .కానీప్రసిద్ధి చెందిన చాలామంది ఈజవ కవులున్నా విస్మరించాడు .మహోన్నతకవి మూలూరు పద్మనాభ ఫనిక్కర్ ను కూడా వదిలేశాడు .ఈ అన్యాయం గమనించిన మనకవి ఆశాన్ ‘’కవి రామాయణం ‘’రాయాలని నిశ్చయించాడు .తాను రాయాల్సిన కవుల ఔన్నత్యాన్ని ప్రక టించటమే కాక ‘’ కే ఎం కుమారన్’’ కవి ప్రసక్తి కూడా చేర్చాడు .ఆ కవి వేరేవరోకాదు తానె .అప్పుడు ఆయన ఆపేరుతోనే వ్యవహిరి౦పబడే వాడు .తనను తానూ చెప్పుకొని ఆకవిని’’ గవయ ‘’ అనే వానర ప్రముఖుడి గా పేర్కొని వేళాకోళం చేశాడు .తనను తానె వేళాకోళం చేసుకొని నవ్వుకోగల ఆరోగ్య హాస్యాన్ని సృష్టించాడు .
విజ్ఞాన సందాయిని ని సుప్రసిద్ధ సంస్కృతకవి ఉపాధ్యాయుడు మనంపూర్ గోవిందన్ ఆశాన్ నడిపేవాడు .ఒక్క ఏడాదిలో మన ఆశాన్ మాఘం, నైషధం శాకుంతలం క్షుణ్ణంగా నేర్చాడు. కువలయానందం అనే అలంకార శాస్త్రాన్నీ మధించాడు .అక్కడ శ్లోక రచన నిత్యాభ్యాసంగా ఉండేది .గంటలో 20శ్లోకాలు రాసే వాడు కుమారన్ .ఇవే కాక వల్లీ వివాహం అనే జానపద కావ్యం ఉషాపరిణయం నాటకమూ రచించాడు .దీన్ని చాలాసార్లు ప్రదర్శించారు .ఇదంతా నూనూగు మీసాల నూత్న యవ్వనం లో చేసిన ఫీట్లు .రెండేళ్ళు చదువు చెప్పి గురువుగారు ఇక అతడు తన దగ్గర నేర్చుకోవాల్సింది ఏమీలేదని చెప్పగా ,నమస్కారం పెట్టి వచ్చేశాడు ఆశాన్ .వయసు 18మాత్రమె అప్పుడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-2-22-ఉయ్యూరు