ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు కుమారన్ ఆశాన్ -4
రాలిన పువ్వు కావ్యం మొదట్లో కవి కుమారన్ ఆశన్ ‘’సుందరపుష్పమా !ఒకప్పుడు రాణీ లాగా మహోజ్వలంగా ప్రకాశించావు –ఇప్పుడు కాంతి విహీనమై ధూళి లో పొర్లుతున్నావ్ –ఈ లోకం లో భాగ్యం చపలమైంది –సౌందర్యం అశాశ్వతం ‘’అంటాడు. పువ్వు బాల్యాన్ని –‘’లత ప్రేమతో నిన్నుకన్నది –మృదువైన ఆకుల గుండెలో హత్తుకొని –ప్రియంగా పెంచి పెద్ద చేసింది –మందసమీరాలు నీకు జోలపాడాయి .’’యవ్వనం లోపువ్వు –‘’కొత్తగా పుట్టుకొచ్చిన చిరునవ్వు నీ బుగ్గలపై మెరుస్తోంది –ఎవరైనా సరే క్షణం నిల్చి నీ సోయగాన్ని ఆరాధిస్తారు ‘’మొదట్లో రాణి అని సంబోధించి ఇప్పుడు తరుణీ లలామగా భావన చేశాడు .ఈ లావణ్యవతికి ఎందఱో ప్రియులున్నారు .కానీ ముదురు నీలం రంగు కీటకాన్ని ఎంపిక చేసుకొని అతడితో ఆనందాబ్ది లో తేలియాడింది .ఈ ఆనందం ఎక్కువకాలం నిలవక పువ్వు రాలిపోయింది .ప్రియుడు దాని చుట్టూ తిరుగుతూ రోదిస్తున్నాడు .’’మృత్యువు నీపై నిర్దయహస్తాలు సాచి నీ పరిమళ భరిత శ్వాసను ఘనీభవింప జేసింది ‘’అని దుఃఖించాడు .’’నువ్వు రాలిపోవటం చూసి చిన్న చిన్న సాలీడులు నీకు మృదువైన పట్టుతో శవ వస్త్రం అల్లాయి –మంచు ముత్యాలతో దండ వేసింది –చుక్కలు మంచు బొట్లుగా కన్నీరు కార్చాయి –చెట్టుపై పిచ్చుకలు కిందికి దిగి నీ చుట్టూ ప్రదక్షిణాలు చేశాయి ‘’అని బాధపడ్డాడు .చివరికి ‘’మంచి వాళ్ళకే మృత్యువు త్వరగా ఆసన్నమౌతుందేమో ‘’అని వేదన చెందాడు .మరణం లేని ఆత్మ శరీరాన్ని ఆశ్రయిస్తుంది-అది ఆకారం దాల్చినా –అనంతమైన దైవ శక్తివల్లనే ‘’అని ముగిస్తాడు .
ప్రణయ కావ్యాలు
1-నళిని –అంటే తామరపువ్వుల సమూహం –ప్రతీకవాదం ఉన్నకావ్యం .మళయాళ సాహితీ వేత్తలు ఆశాన్ ను ‘’స్నేహ గాయకన్ ‘’అంటారు.ప్లేటోనిక్ లవ్ ఉంటుంది .మానవ జీవిత భావా వేశాలతో రాసినా ఆయనలో సాంస్క్రుతికత పోలేదు –దైవేచ్చ ఎవరికీ తెలీదు –జీవితం బుద్బుదప్రాయం ‘’
గృహస్తు
1911లో తల్లి చనిపోతే స్మ్రుతి గీతం రాశాడు .డా పల్పు మేనమామ కుమారు రైటర్ గారి కుటుంబం కూడా ఆశాన్ ను ఆత్మీయుడిగా చూసింది .రైటర్ భార్యకు ఇతనికవిత్వం చాలా ఇష్టం .వీరి అమ్మాయి ఒకప్పుడు ఈయన శిష్యురాలు భానుమతి. ఈయన 45వ ఏట 17 ఏళ్ళ ఆ అమ్మాయిని అనుకోకుండా పెళ్లి చేసుకొన్నాడు .ఈవిషయాన్ని కవిత్వపరంగా ‘’తరుణం వచ్చినప్పుడు –పాదులోనో చెట్టు పైననో -ఉన్న లతలుకూడా –ఒకరికోసం ఆగవు –వాటంతట అవే వికాసం పొందుతాయి ‘’అన్నాడు .వీరి వివాహం ప్రేమ వివాహం ఒకరిపై ఒకరికి వల్లమాలిన ఆపేక్ష ఆరాధనా ఉన్నాయి .నారాయణ గురు స్వామికి విషయం తెలిపిఆశీస్సులు కోరాడు సమాధానం రాలేదు .
కొత్తకాపురం సవ్యంగా సాగుతోంది .కానీ యోగం సభ్యులు ఈయనపై దుష్ప్రచారం చేశారు .దీనిపై ‘’గ్రామ వృక్షం పై కోకిల ‘’అనే ఖండ కావ్యం రాశాడు –‘’నీ పాటలు రోజూ వింటూ వృక్షం ఆకులు నిండిన కాండాలతో ఎంతో విస్తరించింది ‘’అంటూ ఈకవికోయిన 15ఏళ్ళు తనకుల వృక్షానికి చేసిన సేవలన్నీ రాశిగా పోశాడు కవిత్వం లో .యోగం 16వ వార్దికోత్సవం లో కార్యదర్శిగా తప్పుకొంటున్నానని ప్రకటించాడు .తప్పని సరై ఆమోదించారు .కాని కులం వారు వదలలేదు ఆయన్నే ఉండమన్నారు 17 వార్షికానికీ ఆయనే ఉన్నాడు .1917లో ఆయన పెన్షన్ 30రూపాయలు
ప్రరోదనం, సీత
దాంపత్య సౌఖ్యం అనుభవిస్తూ ,సంఘ కార్యదర్శిగా తప్పుకొని రెండు పెద్దకావ్యాలు –ప్రరోదనం ,అనే స్మ్రుతికావ్యం, సీత రాశాడు ఆశాన్ . ప్రరోదనం ను మనసారా అభినందించారు.ఇది మహాకవి ఎ ఆర్ రాజవర్మన్ కవి మరణం పై రాసిన ఎలిజీ .ఇతని నళిని కావ్యానికి వర్మరాసిన పరిచయ వాక్యాలు అమోఘమైనవి .రాజరాజ వర్మ పార్ధివ దేహం చితిపై కాలుతుంటే తిరువాన్కూర్ మలబార్ కొచ్చిన్ ప్రాంతాలు దేవతలై దిగి వస్తున్నట్లు మనకవి చిత్రించాడు .కైరళి అంటే కేరళభాషను ఓదార్చటానికి సరస్వతీదేవి కూడా వచ్చిందన్నాడు .తర్వాత ఇదంతా ఊహాగానం అని తెలుసుకొని జీవన్మరణాలగురించి చర్చించాడు .ఈ కావ్యం లో నియోక్లాసిక్ శబ్దాలంకారాలున్నాయి .మనోహర ఆత్మాశ్రయ కవిత్వం ఆవిర్భవించింది .మళయాళ సాహిత్య స్మృతి కావ్యాలలో ఇది మాణిక్యం వంటిది –‘’వాగ్దేవికింకితమైపోయాడు –అలసట ఎరుగని మేధావి –ఆయన బంగారు పాళీ ఎండిపోలేదు –ఎన్నో కాన్కలు భూషణాలు అమర్చాడు –సిద్ధాంతం లో ఆచరణలో అద్భుతాలు సాధించాడు –నిజంగా కవి రాజరాజ వర్మ ఆయన’’అన్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-2-22-ఉయ్యూరు