మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -51

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -51 • 51-స్వాతంత్ర్య సమరయోధులు ,కవి , అవధాని ,కవితా కళానిధి ,నటుడు ‘’హరిశ్చంద్ర నాటక ఫేం’’,పుంభావ సరస్వతి –బలిజే పల్లి • బలిజేపల్లి లక్ష్మీకాంతం లేదా లక్ష్మీకాంత కవి (డిసెంబరు 23, 1881 – జూన్ 30, 1953) స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల, సినిమా నటులు. వీరు రచించిన నాటకాలలో హరిశ్చంద్ర చాలా ప్రసిద్ధిచెందినది. జీవిత సంగ్రహం వీరు గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా ఇటికంపాడులో 23 డిసెంబర్, 1881 సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు నరసింహశాస్త్రి, ఆదిలక్ష్మమ్మ. వీరు తన మేనమామ భాగవతుల చెన్నకృష్ణయ్య వద్ద విద్యాభ్యాసం, మేనత్త సరస్వతమ్మ వద్ద భారత భాగవత రామాయణాలు అధ్యయనం చేశారు. చిన్నతనంలోనే సంస్కృతాంధ్ర భాషలను చదివి, కవిత్వం చెప్పడం నేర్చుకున్నారు. కర్నూలులో మెట్రిక్యులేషన్ చదివిన తర్వాత సబ్ రిజిస్టార్ ఆఫీసులో గుమస్తా గాను, కొంతకాలం గుంటూరు హిందూ కళాశాలలో ప్రధానాంధ్ర ఉపాధ్యాయులుగా పనిచేశారు. తర్వాత అవధానాదులలో ప్రజ్ఞాపాటవాలు సంపాదించి తెలుగు దేశంలోని సంస్థానాలను సందర్శించి అవధానాలు ప్రదర్శించారు. చల్లపల్లి రాజావారి సాయంతో 1922లో గుంటూరులో చంద్రికా ముద్రణాలయం స్థాపించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవిస్తున్న కాలంలో సత్య హరిశ్చంద్రీయ నాటకం రచించారు. 1926 లో గుంటూరులో ఫస్టు కంపెనీ అనే నాటక సమాజాన్ని స్థాపించి వీరు సత్యహరిశ్చంద్రీయ, ఉత్తర రాఘవాది నాటకాలు పలుమార్లు ప్రదర్శించారు. వాటిలో వేషాలు ధరించి పేరుప్రఖ్యాతులు సంపాదించారు. వీటిలో నక్షత్రకుడు పాత్ర వీరికిష్టమైనది. 1932లో రంగూన్ ఆంధ్రుల ఆహ్వానం పై వెళ్లి కక్కడ కళాశాలలో విద్య ను గురించి ఉపన్యశించి ‘’సత్య హరిశ్చంద్రీయ నాటకం ‘’ప్రదర్శించారు .అక్కడ ‘’కవితా కళానిధి ‘’బిరుదునిచ్చి ఘనంగా సత్కరించారు తర్వాత కాలంలో చిత్తజల్లు పుల్లయ్య గారి ప్రోత్సాహంతో చిత్ర పరిశ్రమలో ప్రవేశించి అనేక చిత్రాలకు కథలు, సంభాషణలు, పాటలు రాసి, కొన్ని పాత్రలు ధరించి ప్రఖ్యాతులయ్యారు. 1942లోచలన చిత్ర సంఘం అతిఘనంగా సన్మానించి ‘’పుంభావ సరస్వతి ‘’బిరుదు నిచ్చి గౌర వించింది వీరు 30 జూన్, 1953 సంవత్సరం కాళహస్తిలో పరమపదించారు బలిజేపల్లి రచనలు • శివానందలహరి శతకం (శంకరుని కృతికి ఆంధ్రీకరణం) • స్వరాజ్య సమస్య (పద్య కృతి) • బ్రహ్మరథం (నవల) • మణి మంజూష (నవల) • బుద్ధిమతీ విలాసము (నాటకము)[1] : శివ భక్తాగ్రేసరుల్లో ఒకరిగా పేరొందిన శిరియాళుని కథను ఇతివృత్తంగా స్వీకరించి ఈ నాటకాన్ని రచించారు. • సత్యహరిశ్చంద్రీయము (నాటకము)[2] • ఉత్తర గోగ్రహణము (నాటకము) • సాత్రాజితీ పరిణయము (నాటకము) • ఉత్తర రాఘవము (భవభూతి రచించిన నాటకానికి ఆంధ్రీకరణం)[3] చిత్ర సమాహారం 1. లవకుశ (1934) (మాటలు, పాటల రచయిత) 2. హరిశ్చంద్ర (1935) (రచయిత) 3. అనసూయ (1936) (రచయిత) 4. మళ్ళీ పెళ్ళి (1939) (నటుడు, మాటల రచయిత) 5. వర విక్రయం (1939) (నటుడు, మాటల రచయిత) 6. భూకైలాస్ (1940) (మాటల రచయిత) 7. విశ్వమోహిని (1940) (మాటల చయిత) 8. బాలనాగమ్మ (1942) (నటుడు, రచయిత) 9. తాసిల్దార్ (1944) (నటుడు, మాటల రచయిత) 10. సీతారామ జననం (1944) (విశ్వామిత్ర)[4] 11. రక్షరేఖ (1949) (నటుడు, కథ, మాటల రచయిత) 12. బ్రహ్మరథం (1947) (నటుడు, కథ, పాటల రచయిత) 13. భీష్మ (1944) (నటుడు) 14. నా చెల్లెలు (1953) 15. మంజరి (1953) (నటుడు, మాటల రచయిత) 16. జీవిత నౌక (1951) (మాటలు, పాటల రచయిత)[5] సత్య హరిశ్చంద్ర ఈ నాటకము వీరి అత్యంత ప్రసిద్ధమైన రచన. ఇప్పటికీ రంగస్థలం మీద ప్రదర్శింపబడుతున్నది. ఉదాహరణకు కొన్ని పద్యాలు: మాయామేయ జగంబే నిత్యమని సంభావించి మోహంబునన్ నా యిల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక నెం తో యల్లాడిన యీ శరీర మిపుడిందున్ గట్టెలన్ గాలుచో నా యిల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్. బలిజే పల్లి వారి గురించి శ్రీ దేవులపల్లి రామానుజరావు గారు చెప్పిన విషయం • • దేవులపల్లి రామానుజరావు • • నాటక సంఘాలు, నాటక ప్రదర్శనాలు ఆ రోజులలో యీ రెండు ప్రాంతాల మధ్య స్నేహసంబంధాలు వర్ధిల్లచేసినవి. మైలవరం కంపెనీ, సురభి కంపెనీ మొదలైన నాటక సంఘాలు తెలంగాణ ప్రాంతములోని ముఖ్యపట్టణాలలో నాటక ప్రదర్శనాలు చేస్తుండేవి. సతీసావిత్రి, కృష్ణతులాభారం, సారంగధర, చిత్రనళలీయము మొదలైన నాటకప్రదర్శనాలు జరుగుతుండేవి. చిలకమర్తివారి గయోపాఖ్యానం”, ధర్మవరం కృష్ణమాచార్యులవారి నాటకాలు చాలా ప్రచారంలో ఉండేవి. ప్రతి పల్లెటూల్లో కొందరైనా యీ నాటకాలు చూచిన వారుండేవారు. కపిలవాయి రామనాథశాస్తి, వేమూరి గగ్గయ్య, ఉప్పులూరి సంజీవరావు ప్రభృతులైన నటకుల పేర్లు తెలంగాణలో చదువుకున్న వారందరికి బాగా తెలిసినవే. బలిజేపల్లి లక్ష్మీకాంతంగారు సికిందరాబాదుకు వచ్చి సత్యహరిశ్చంద్ర నాటకం వేసినప్పుడు నేను స్వయంగా చూచినాను. లక్ష్మీకాంతంగారి వద్యవఠన మనోరంజకంగా ఉండేది. ఆయన ఒకటి రెండు సాహిత్యసభలలో ప్రసంగించినట్లు నాకు జ్ఞాపకం. మేము కొంతమంది విద్యార్థులము బలిజేపల్లి లక్ష్మీకాంతంగారిని సికిందరాబాదులో కలుసుకున్నప్పుడు వారు తమ ఉత్తరరామచరిత్రములోని కొన్ని భాగాలు మాకు వినిపించి, తాము అందులో అనువదించిన పద్యాలు మూలంతోపాటు మనోజ్ఞంగా చదివినప్పుడు నా హృదయం కదిలిపోయింది. తరువాత లక్ష్మీకాంతం గారి ‘ఉత్తరరామ చరిత్ర నాటకాన్ని కొని చదివి ఆనందించినాను. నాకు యీ నాటికి భవభూతి ఉత్తరరామ చరిత్ర మూలం చాలా యిష్టమైన రచన. ఇందుకు కారణం ఒకవిధంగా బలిజేపల్లి లక్ష్మీకాంతంగారే అని చెప్పవచ్చును. హైదరాబాదు నేను తొలిసారి 1934 సంవత్సరంలో వచ్చినాను. నిజాం కళాశాలలో నాల్గు సంవత్సరాల విద్యాభ్యాసము – ఈ దశలో ఆంధ్రప్రాంతం నుండి వచ్చిన కొందరు కవిపండితులను సందర్శించే భాగ్యం కలిగినది. ఆ రోజులలో తెలుగు నాటకాలు సికిందరాబాదులో అప్పుడప్పుడు ఆడుతుండేవారు, సత్యహరిశ్చంద్ర నాటక ప్రదర్శనం 1985-36లో కాబోలు జరిగినది. నాటకాన్ని వ్రాసిన బలిజేపల్లి లక్ష్మీకాంతంగారే స్వయంగా అందులో ఒక పాత్రధారి. హాస్టల్‌లోని విద్యార్థులం కొందరం ఆ నాటకాన్ని సికిందరాబాదువెళ్ళి చూచినాము. మరునాడు ఆయనను కళాశాలకు ఆహ్వానించినాము. ఆయన చక్కని ఉపన్యాసము చేసినారు. ఆయన కంఠము ముఖ్యంగా పద్యాన్ని పఠించే పద్ధతి నావంటి వారిని ఎందరినో ఆకర్షించినది. ఆ తరువాత కొన్ని రోజులకు కాబోలు పానుగంటి లక్ష్మీనరసింహారావుగారు సికిందరాబాదుకు వచ్చినారు. అప్పుడు వారు ఏవో కొన్ని చిక్కులలో ఉండినారని అందుచేత మనస్సు కొంచెం వికలమై ఉండినదని మేము విన్నాము. అయినప్పటికి ఆయనను వెళ్ళి ఆహ్వానించగానే కళాశాలకు వచ్చి మహోపన్యాసం చేసినారు. అంతకుముందు పత్రికలో సాక్షి ఉపన్యాసాలు చదివిన మాకు ఆయన ఆనాడు “నాయనలారా! అని మొదలుపెట్టి ఉపన్యసించగా సరిగా జంఘాలశాస్రి వలెనే ప్రసంగించినట్లు తోచినది. ఆయన కాషాయరంగు ధోవతి, అదే రంగు షర్టు, పూర్తిగా నెరసిన తెల్లని మీసాలు, తెల్లటి క్రాఫు, కొంచెం దుర్చలంగా ఉండే శరీరంతో వేదికమీద నిలిచినారు. మాట్లాడినంతసేపు సభ నిశ్శబ్దంగా ఉండినది. మా ఆచార్యులందరూ వారికి చేయెత్తి నమస్మరించినారు. ఈ దృశ్యాన్ని నేను ఎన్నడూ మరువలేను. తిరుపతి వెంకటకవులను గూర్చి మేము వింటూ ఉండేవారము. ఆయన కుమారులు మరొకరితో కలిసి సత్యదుర్గేశ్వర కవులుగా హైదరాబాదుకు వచ్చి మా కళాశాలలో అవధానం చేసినారు. మనోరంజకంగా అవధానం జరిగినది. ఆ సభకు రాయప్రోలు సుబ్బారావుగారు అధ్యక్షులు. ఆనాడే మొదటిసారి నేను ఆయనను చూడడం జరిగింది. అధ్యక్షోపన్యాసం ఒక పద్యంతో ఆయన ఆరంభించినారు. ఇట్లు ఆరంభించడం ఆయనకు అలవాటు. ఆ పద్యం యింకా నాకు జ్ఞాపకమున్నది. • • పుంభావ సరస్వతి ‘బలిజేపల్లి’ • ఆయన పేరు విన్నంతనే స్ఫురించేది `సత్య హరిశ్చంద్రీయం`. దాని పేరు తలచినంతనే గుర్తుకు వచ్చేది బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు. ఆ రెండు పేర్లు అంతలా మిళతమయ్యాయి. కందుకూరి వీరేశలింగం పంతులు నుంచి బలిజేపల్లి లక్ష్మీకాంతం వరకు పద్దెనిమిది మంది `హరిశ్చంద్ర` నాటకాలు రాసినా, బలిజేపల్లి వారి `సత్యహరిశ్చంద్రీయం` ప్రసిద్ధి పొందింది. 1912లో రాసిన ఈ నాటకం అయనకు అపారమైన కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది. తిరుపతి వేంకటకవుల `పాండవో ద్యోగం`, చిలకమర్తి లక్ష్మీనరసింహం `గయోపాఖ్యానం` సరసన నిలిచిన నాటకం ఇది. గయోపాఖ్యానం మాదిరిగానే హరిశ్చంద్రీయం నాటకం ఆ రోజుల్లోనే లక్ష ప్రతులు అమ్ముడయ్యాయట. • జానపదులను ఆకర్షించిన నాటకం • నాగరీకులనే కాకుండా జానపదులను కూడా బాగా ఆకర్షించిన నాటకంగా దీనిని చెబుతారు. సన్నివేశ కల్పనలో దానికి అదే సాటి అని, సంభాషణల్లో దానికి మించిన నాటకంలేదని విమర్శకులు అంటారు. ఈ నాటకం ప్రదర్శించని పల్లెకానీ, పట్నం కానీలేదు. కొన్ని సందర్భాలలో ఆయా నాటకాలను పూర్తిగా ప్రదర్శించలేకపోయినప్పటికీ `పాండవోద్యోగం`లో శ్రీకృష్ణ మందిరంలో పడక దృశ్యం, హరిశ్చంద్రుడు కాటికాపరిగా మారిన దృశ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. భక్తసిరియాళుడి కథా ఇతివృత్తంగా రాసిన `బుద్దిమతీ విలాసం`బలిజేపల్లి వారి తొలి నాటకం.సంస్కృతంలో భవభూతి రచించిన `ఉత్తర రామచరిత` ఆధారంగా రాసిన `ఉత్తరరాఘవం` రెండవ నాటకం. `సాత్రాజితీయం` ఆయన రాసిన మరో నాటకం. అయితే ఇది`సత్యాకృష్ణుల కల్యాణం`గానే ప్రదదర్శితమైంది • నటుడిగా… • బలిజేపల్లి మంచి ఉత్తమ నాటక కర్తే కాక ఉత్తమ నటుడు కూడా. తాను రాసిన నాటకాలలోని కథానాయకుడి పాత్రలను ఆయనే పోషించేవారు. హరిశ్చంద్ర పాత్రను ఎంతో హుందాగా పోషించేవారు. అనంతర నట ప్రముఖులు డీవీ సుబ్బారావు, మల్లాది సూర్యనారాయణ లాంటి వారు ఈ పాత్ర పోషణలో ఆయననే వరవడిగా తీసుకునేవారని చెబుతారు. రంగస్థల మహానటుడు మల్లాది బలిజేపల్లి వారి పద్యాలతో పాటే జాషువా పద్యాలను కలిపి హరిశ్చంద్ర నాటకాన్ని మరింత రక్తింకట్టించేవారు. • కృష్ణపాత్రలో మనోహరం • అలాగే `సాత్రాజితీయం`లోని కృష్ణ పాత్రలో బలిజేపల్లి మనోహరంగా కనిపించే వారట. ఆయన ఎన్ని పాత్రలు ధరించినా `సత్యహరిశ్చంద్ర`లోని నక్షత్రకుడిగా మాత్రం అనితర సాధ్యంగా నటించేవారట. ఆ పాత్రలో ఆయన నిరుపమానంగా ప్రకాశించి చిరకీర్తిని ఆర్జించారు. ఆయన రంగస్థల ప్రదర్శన ఇస్తుంటే ఎంతటి జడివాన కురిసినా ప్రేక్షకులు కదలేవారు కాదు. 1930లో రంగూన్ లో ప్రదర్శితమైన హరిశ్చంద్ర నాటకం అందుకు ఉదాహరణ. • నక్షత్రకుడిలో పరిణామం • హరిశ్చంద్రుడు కాటికాపరిగా వీరబాహువుకు అమ్ముడైపోయిన తరువాత ఆ ధనాన్ని విశ్వామిత్రునికి అందచేయాలని కోరినప్పుడు, అప్పటి వరకు అయిన దానికి కానిదానికి వేధిస్తూ వచ్చిన నక్షత్రకునిలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. సర్వం సహా చక్రవర్తి హరిశ్చంద్రుడు తాను ఇచ్చిన మాటకు కట్టుబడి హీనమైన దాస్యవృత్తికి అంగీకరించి అమ్ముడుపోయిన సన్నివేశంలో నక్షత్రకుడిలో మానవత్వం మేల్కొంటుంది. ఆయనలోని అసలు మనిషి వెలికి వస్తాడు. ఆయనలోని కాఠిన్యం కరిగిపోతుంది. సత్యధర్మరక్షణ కోసం జీవితాన్నే త్యాగం చేసిన హరిశ్చంద్రుడు తన తన గురువు విశ్వామిత్రుడి కంటే ఉన్నతుడనే భావన కలుగుతుంది.ఎంతో విలపిస్తూ హరిశ్చంద్రుడికి వీడ్కోలు పలుకుతున్న నక్షత్రకుడిగా బలిజేపల్లి ప్రదర్శించిన నటన అనన్యసామాన్యం. మహోన్నమైన ఆ దృశ్యాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులంతా కన్నీరు మున్నీరయ్యారు. మబ్బులు కమ్మి చినుకులు మొదలై, కుంభవృష్టిగ మారినా ప్రేక్షకులు కదలలేదట. వారి ఉత్సాహాన్ని చూస్తూ వర్షంలోనే నాటకం చివరికంటా సాగింది. • సినీనటుడుగా…. • తెలుగు సినీరంగం ఆయన అఖండ ప్రతిభకు స్వాగతం పలికింది. ప్రముఖ దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య ప్రోత్సాహంతో చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. నటనతో పాటు కొన్ని చిత్రాలకు కథలు, మాటలు, పాటలు అందించారు. హరిశ్చంద్ర,అనసూయ,మళ్లీపెళ్లి,జరాసంధ,భూకైలాస్, వరవిక్రయం, విశ్వమోహిని, బాలనాగమ్మ,తసిల్దార్, బ్రహ్మరథం, రక్షరేఖ, సీతారామజననం, భీష్మ, నా చెల్లెలు, మంజరి, జీవితనౌక లాంటి చిత్రాలు ఆయన బహుముఖ ప్రతిభకు నిదర్శనాలు. `వరవిక్రయం`లో ఆయన పోషించిన సింగరాజు లింగరాజు పాత్ర చిరస్మరణీయం. • దేశభక్తుడు • బలిజేపల్లి దేశభక్తుడు,స్యరాజ్య సమరయోధుడు. గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. దేశభక్తి గీతాలతో ఉద్యమాన్ని తేజోవంతం చేసినందుకుఆంగ్లేయుల ప్రభుత్వం రెండేళ్లు జైలు శిక్ష విధించింది. అంతకుముందు 1922లో చల్లపల్లి రాజావారి సహకారంతో గుంటూరులో `చంద్రిక ముద్రణాలయం` నెలకొల్పారు. • జీవిత విశేషాలు • గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని ఇటిపంపాడులో 1881 డిసెంబర్ 23న జన్మించిన లక్ష్మీకాంతం మేనమామ భాగవతుల చెన్నకృష్ణయ్య ఇంటపెరిగారు. మేనత్త సరస్వతమ్మ వద్ద భాగవత రామాయణాలు అధ్యయనం చేశారు. భారత భాగవత రామాయణాల్లో ఆమెకు విశేష పాండిత్యం. మేనల్లుడిని ఒడిలో కూర్చోపెట్టుకొని ఎన్నెన్నో కథలు, గాథలు,పురాణ రహస్యాలను బోధించి, భావి కాలంలో ఓ గొప్ప కవి. నటుడి ఆవిర్భావానికి సహకరించారు. అటు అమ్మా నాన్నలు, ఇటు మేనత్త శిక్షణతో బలిజేపల్లి చిన్నతం నుంచే సంస్కృతాంధ్రాలలో కవిత్వం చెప్పసాగారు. కర్నూలులో మెట్రిక్యులేషన్ పూర్త చేసి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగం పొందారు. • అధ్యాపకుడిగా ఉద్యోగం • కానీ నచ్చక దానిని వదిలేసి గుంటూరు హిందూ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా కొంతకాలం పనిచేసి అదీ నచ్చక దానినీ వదిలేశారు. ఆయన వైఖరిని చూసి` స్థిరత్వం లేనివాడని, చంచల స్వభావుడని ` బంధువులు, అయినవారు అంటుండేవారు. కానీ ఆయనలో కళాతృష్ణ నాటకరంగవైపునకు నడిపించింది. అర్థరూపాయి ప్రయోజనం లేక పోయినా అరవై మైళ్లు వెళ్లి నాటకం వేయాలన్న సామెత లాంటిది ఆయనలో నాటుకుపోయింది. బలిజేపల్లి పుట్టినప్పుడే అటుఇటుగా ఏర్పాటైన `హిందూ నాటక సమాజం` ఆయనను ఆదరించింది. • ఆచార్య కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి • ప్రముఖ కవి ఆచార్య కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి ఈ నాటక సమాజాన్ని స్థాపించారు. సుప్రసిద్ధ నటులు హరి ప్రసాదరావు,కోపెల్ల హనుమంతరావు లాంటి వారు ఈ సంస్థ ద్వారా ఎన్నో పాత్రల్లో నటించారు. స్వరాజ్య సమరంలో గాంధీజీకి ఎంతో ప్రేమాస్పదుడైన దేశభక్తి కొండా వెంకటప్పయ్య ఈ సమాజంలో స్త్రీల పాత్రలు ధరించేవారు. అలాంటి నాటక సమాజం బలిజేపల్లి రాకతో సహస్ర ప్రభల సూర్య బింబంలా మెరిసిపోయిందని నాటక విమర్శకులు చెబుతారు. • ఫస్టు కంపెనీ నాటక సమాజం • అటు తరువాత గుంటూరులో ఫస్టు కంపెనీ అనే నాటక సమాజాన్ని స్థాపించి సత్యహరిశ్చంద్రీయం , ఉత్తర రాఘవాది నాటకాలు అనేకసార్లు ప్రదర్శించారు. రంగూన్ తెలుగువారు ఆయనను `కవితా కళానిధి` బిరుదుతో ఘనంగా సన్మానించుకున్నారు. మద్రాస్ నాట్య కళాపరిషత్ ఆయనకు షష్టిపూర్తి మహోత్సవాన్ని నిర్వహించింది. ఆయనకు వారసుడిగా హరిశ్చంద్ర పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేసిన డీవీ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లక్ష్మీకాంత కవిని `పుంభావ సరస్వతి` బిరుదుతో ఘనంగా సత్కరించారు. • ఆధ్యాత్మిక చింతన, ఆశ్రమ నివాసం • ఆయనలో అంతర్లీనంగా ఉన్న ఆధ్యాత్మిక చింతన జీవితం చివరి ధశలో ఉవ్వెత్తున వెలుగు చూసింది. భౌతిక సుఖాలకు దూరంగా శ్రీకాళహస్తిలో చిన్న ఆశ్రమం లాంటి ఇంటలోగడిపారు.బఐదు వేల పైచిలుకు పద్యాలతో `సుందరకాండ` కావ్యాన్ని రచించారు. కళారంగంలో పరిశ్రమించి, ప్రతి దశలోనూ త్రికరణశుద్ధిగా జీవించిన మహాకవి, నటుడు 72వ ఏట శివైక్యం చెందారు. తెలుగుభాష ఉన్నంత కాలం `హరిశ్చంద్ర` నాటకం, అది ఉన్నంత వరకు బలిజేపల్లి జీవించే ఉంటారు. (ఒంగోలులో బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి 138వ జయంతి సభ తెలుగు నాటక సౌధానికి తలమానికంగా నిలిచిన బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి 138వ జయంతి సభ 23-12-19, సోమవారం సాయంత్రం ఒంగోలులోని సి.వి.యన్ రీడింగ్ రూం లో ‘శ్రీ నాగినేని నరసింహరావు మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ ‘ ఆధ్వర్యంలో జరిగింది. సభకు సంస్థ అధ్యక్షులు మిడసల మల్లికార్జునరావు అధ్యక్షత వహించారు.ఈసందర్భంగా నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షులు డా.నాగభైరవ ఆదినారాయణ మాట్లాడుతూ బలిజేపల్లి వారు 1881డిసెంబర్ 23వ తేదీన గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా లోని ఇటికంపాడులో ఆదిలక్ష్మమ్మ, నరసింహ శాస్త్రి దంపతులకు జన్మించారని,ఆయన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకెళ్ళి అక్కడే ఈసందేశాత్మకమైన నాటకం “సత్య హరిశ్చంద్ర” ను రచించారని అన్నారు.అనంతరం రంగస్థల నటులు కనమాల రాఘవులు మాట్లాడుతూ ఈనాటకాన్ని శతాధికకవులు నాటకంగా రాసినప్పటికీ బలిజేపల్లి వారి నాటకమే అజరామరంగా నిలిచిందని పేర్కొన్నారు.కవితాశక్తితో పాటు దేశభక్తి కూడా ఆయనకు ఎక్కువగా ఉందని,ఆయన పద్యాలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని డా.నూనె అంకమ్మరావు,కుర్రా ప్రసాద్ బాబులు తెలుపగా,బలిజేపల్లి వారి పద్యాలను రాగయుక్తంగా భువనగిరిబలిజేపల్లి లక్ష్మీకాంత కవి అందించిన హరిశ్చంద్ర నాటకం తెలుగు నేల నాలుగు చెరగులా నాటక సమాజాలకు ప్రేరణ. రంగస్థల కళాకారులు, పద్య, గద్య రచయితలు బలిజేపల్లి పేరును మరిచిపోలేరు. నిత్య సత్యవంతుడు హరిశ్చంద్రుడు, భార్య చంద్రమతి కథ ఆధారంగా బలిజేపల్లి 1912లో ‘హరిశ్చంద్రీయము’ నాటకం తన 31వ యేట రాశారు. ఈ నాటకంలో హరిశ్చంద్రుడు, నక్షత్రకుడు పాత్రలను లక్ష్మీకాంతమే పోషించారు. ఇందలి పద్య రచన ఒక జలపాతం. పండిత, పామరుల్ని అలరింప జేశాయి. పంటచేలల్లో పనులు చేసుకునే వారి నాలుకలపై సైతం నర్తించాయి. బలిజేపల్లి వారు చిత్తజల్లు పుల్లయ్య ప్రోత్సాహంతో చిత్ర సీమలోకీ అడుగు పెట్టారు. అనసూయ (1936), జరాసంధ (1938), వరవిక్రయం (1939), భూకైలాస్‌ (1941), బాల నాగమ్మ (1944) వంటి పదికి పైబడిన సినిమాలలో మాటలు, పాటలు, సంభాషణలు వంటివి రాశారు. కొన్ని సినిమాల్లో పాత్రలు వేశారు. శివానందలహరి శతకం, స్వరాజ్య సమస్య పద్య కృతి, బ్రహ్మ రధం, మణి మంజూష నవలలు, బుద్థిమతి విలాసం, ఉత్తర రాఘవీయం నాటకాలు రాశారు. 1923లో చల్లపల్లి రాజా సహకారంతో గుంటూరులో చంద్రిక ముద్రణాలయాన్ని స్థాపించారు. 1926లో ఫస్ట్‌ కంపెనీ పేరిట నాటక సమాజాన్ని ఏర్పాటు చేశారు. 1930లో రంగూన్‌ తెలుగువారు ‘కవితా కళానిధి’ బిరుదుతో సత్కరించారు. 1942లో చలనచిత్ర రంగం ‘పుంభావ సరస్వతి’ బిరుదుతో సన్మానించింది. శేష జీవితాన్ని కాళహస్తిలో గడిపి 1953లో కన్నుమూశారు. మాజీగావర్నార్ బహుభాషా కోవిదుడు డా బూర్గుల రామకృష్ణారావు గారు బలిజే పల్లి గురించి బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి విరచిత ప్రఖ్యాత నాటకం సత్యహరిశ్చంద్రీయము. సత్యనిష్ఠకు నిలిచి దారాసుతులను తనకు తాను అమ్ముడై నిలిచి సత్యహరిశ్చంద్రునిగా పేరు గాంచిన అయోధ్య చక్రవర్తి ఇనవంశోద్భవుడు హరిశ్చంద్రుని కథను నాటకం గా హృద్యంగా మలిచారు బలిజేపల్లి వారు. . ఈ నాటకాన్ని బలిజేపల్లివారు 1930 సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహం సమయంలో కారాగారవాస సమయంలో రచించాడు.ఈ నాటకంలో పద్యాలన్నీ అనర్ఘ రత్నాలు. అన్నీ జనాదరణ పొందినవి. అందరి నోటిలో నానేవి. వాటిలో కొన్నిటినే ఎన్నకొనడం తలకి మించిన పని. నాటకంలో కొన్ని పద్యాలను క్రింద పొందుపరచడమైనది. . హరిశ్చంద్రుడు మాతంగ కన్యలను వివాహమాడడానికి నిరకారిస్తూ మత్తేభం అరయన్ వంశము నిల్పనేగద వివాహంబట్టి వైవాహిక స్పురణంబిప్పటికెన్నడోజరిగెసత్పుత్రుండుపుట్టెన్ వయః పరిపాకంబునుదప్పుచున్నయది యీ ప్రాయంబునన్ వర్ణసం కరపుంబెండిలి యేల చుట్టెదవు నాకఠంబునన్ గౌశికా . రాజ్యాన్ని విశ్వామిత్రునికి దానమిస్తూ శార్ధూలం దేవ బ్రాహ్మణమాన్యముల్విడిచిభక్తిన్ సప్తపోధోదివే లావిభ్రాజదఖండభూవలయమెల్లన్ మీకు దానంబుగా భావంబందొకశంకలేకొసగితిన్ బ్రహ్మార్పణంబంచుదే వా విశ్రాంతిగా నేలుకొమ్మింకను నీవాచంద్రతారార్కమున్ . కాశీనగర వర్ణన తేటగీతి భక్తయోగపదన్యాసి వారణాసి – భవదురితశాత్రవఖరాసి వారణాసి స్వర్ణదీతటసంఖాసివారణాసి – పావనక్షేత్రములవాసి వారణాసి . చంద్రమతిని విక్రయింప చూచుచూ సీ || జవదాటియెఱుగదీయువలీలామంబుపతిమాటరతనాలపైడిమూట అడుగుదప్పియెఱుగదత్తమామలయాజ్ఞకసమానభక్తిదివ్యానురక్తి అణుమాత్రమైనబొంకనుమాటయెఱుగదీకలుషవిహీననవ్వులనైన కోపందెఱుంగదీగుణవితానవితాంతయెఱులంతనిదూఱుచున్నసుంత తేటగీతి || ఈలతాంగిసమస్తభుపాలమకుట – భవ్యమణికాంతిశబలితపాదుడైన సార్వభౌమునిశ్రీహరిశ్చంద్రుభార్య – దాసిగానీపెగొనరయ్యధన్యులార . కొన్ని పద్యాలలో హరిశ్చంద్రుడు వేదాంతం, కాదు జీవన సత్యాలు మనముందు ఆవిష్కరిస్తాడు. అటువంటి పద్యాలు కొన్ని మత్తేభం తిరమై సంపదలెల్ల వెంటనొకరీతిన్ సాగిరావేరికే సరికేపాటు విధించినో విధి యవశ్యప్రాప్తమద్దానినె వ్వరు దప్పించెదరున్నవాడననిగర్వంబేరికిన్ గాదుకిం కరుడే రాజగు రాజే కింకరుడగున్ గాలానుకూలంబుగన్’ . శార్ధూలం మాయామేయజగంబెనిత్యమనిసంభావించిమోహంబునన్ నాయిల్లాలనినాకుమారుడనిప్రాణంబుండునందాకనెం తోయల్లాడిన యీశరీరమిపుడిందుగట్టెలంగాలుచో నాయిల్లాలునురాదుపుత్రుండును దోడైరాడు తప్పింపగన్ . చీకట రాత్రి వర్ణన సీ || కలవారి ఇండ్ల లోపలి నిధానమునెత్తనరుగుదొంగలకు సిధ్దాంజనంబు మగల గూరుకనిచ్చి తెగి యంటుగాండ్రకైతారాడుకులటలతార్పుగత్తె అలవోకనలతి పిట్టలబట్టివేటాడుపాడుఘూకములకుబాడిపంట మననంబులోనవింపెసలారుశాకినీఢాకినీసతులచుట్టాలసురభి తేటగీతి || రేలతాంగికినల్లని మేలిముసుగు – కమలజాండంబునకునెల్లగన్నుమూత సత్యవిద్రోహిదుర్యశశ్చవికిదోడు – కటికచీకచియలమెదిక్తటములందు కవితా కళానిధి బలిజే పల్లి –శ్రీ సంగనభట్ల కృష్ణయ్య కాలం ఏదైనా, ప్రజల వినోదం కోసం అత్యధికంగా ఆదరింపబడిన కళా నాటకం. 20 వ దశకం ఆరంభంలో ఒకరు నాటకీకరించిన కథనే స్వీకరించి పలువురు అనువదించడం, ఆ కథనే నాటకాలుగా రాయడం జరిగింది. నాటకాలలో పద్యాలకు, పాటలకు ప్రాదాన్యత అధికంగా ఇచ్చిన కాలమది. ఈ విధంగా పలువురు రచయితలు అత్యధికంగా రాసి ప్రదర్శనలకు అవకాశం కల్పించిన నాటకం సత్య హరిశ్చంద్ర. అందునా బలిజేపల్లి లక్ష్మీకాంత కవి హరిశ్చంద్ర నాటకం మిక్కిలి ప్రజాదరణ పొందింది. సత్యహరిశ్చంద్ర నాటకంలోని కమనీయమైన పద్యరత్నాలు ఎందరో నాటక రచయిత లకు సినిమా నిర్మాత దర్శకులకు స్ఫూర్తిని కలిగించిన బలిజేపల్లి లక్ష్మీకాంతం లేదా లక్ష్మీకాంత కవి (డిసెంబరు 23, 1881 – జూన్ 30, 1953) స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల, సినిమా నటులు. “తిరమై సంపదలెల్ల వెంటనొకరీతిన్”…‘మాయామేయ జగంబె నిత్యమని సంభావించి’… ‘చతురంభోధి పరీత భూధరణీ రక్షాదక్ష’ … సాగిరావు ఏరికిన్ ఏసరికి యేపాటు విధించెనో… “దళమౌ పయ్యేదలో నడంగియు…లాంటి హరిశ్చంద్ర నాటకంలోని పద్యాల మాధుర్యాన్ని ఒకసారైనా ఆస్వాదించని తెలుగు నాటక అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఇవి అన్నీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి విరచిత ‘సత్య హరిశ్చంద్రీయము’ నాటకం లోనివే. హరిశ్చంద్ర చిత్రానికి మాటలూ, పద్యాలూ భార‌తీయ భాషల్లో ‘హరి‌శ్చంద్ర’ నాట‌కా‌నికి ఒక ప్రత్యేక స్థాన‌ముంది.‌ మూకీ యుగంలో నాలుగు సార్లు, టాకీ యుగంలో ఇరవై సార్లు వెండి‌తె‌ర‌ కె‌క్కిన ఒకే ఒక కథ ఇది.‌ 1913లో చల‌న‌చిత్ర పితా‌మ‌హుడు దాదా సాహెబ్‌ ఫాల్కే ‘రాజా హరి‌శ్చంద్ర’ సిని‌మాను పూర్తి‌స్థాయి మూకీ చిత్రంగా మరా‌ఠీలో నిర్మించిన తరవాత అదే కథను ‘సత్య‌వాది రాజా హరి‌శ్చంద్ర’ పేరుతో మరా‌ఠీ‌లోనే 1917లో లఘు‌చి‌త్రంగా నిర్మించారు. ఇదే మూల కథను ‘సత్య‌వాది రాజా హరి‌శ్చంద్ర’ పేరు‌తోనే రుస్తుంజీ ధోతీ‌వాలా కూడా బెంగాలీ భాషలో నిర్మించాడు.‌ తెలు‌గులో 1935లో ఒక‌సారి 1956లో మరొకసారి 1965లో చివ‌రి‌సారి హరి‌శ్చంద్ర సినిమా వచ్చింది.‌ ఇన్ని‌సార్లు ఇదే కథను సిని‌మాగా మల‌చ‌డా‌నికి కారణం ఆ నాటికే ఆ నాటకం ప్రేక్ష‌కుల గుండెల్లో చెర‌గని ముద్ర వేయ‌డమే.‌ ఆ నాటక కర్త కవితా కళానిధి బలిజేపల్లి కావడం తెలుగు వాళ్లకు గర్వకారణం. ఆ నాటకంలోని పద్యాలు, సంభాషణలు నాడు వెలుగు వారి నోళ్లలో నిరంతరం నానుతూనే ఉండేవి. అనేక చిత్రాలకు మార్గదర్శి 1935లో తెలుగు తొలిటాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’ నిర్మించిన స్టార్‌ ఫిలిం కార్పొ‌రే‌షన్‌ సంస్థ ‘హరి‌శ్చంద్ర’ సినిమాను తెలుగులో నిర్మించినప్పుడు బలి‌జే‌పల్లి నాట‌కాన్ని స్పూర్తిగా తీసుకోవడం గమనార్హం. ఆ చిత్రానికి మాటలు, పాటలు, పద్యాలు బలిజేపల్లి కవే సమకూర్చడం విశేషం. 1936లో అదే ఈస్ట్ ఇండియా కంపెనీ వారు సి. పుల్లయ్య దర్శకత్వంలో ‘సతీ అనసూయ’, ‘ధృవ విజయము’ జంట సినిమాలను నిర్మించారు. ఈ చిత్రాల నిర్మాణం కలకత్తాలోనే జరిగింది. ఈ చిత్రాలకు కథ, మాటలు, పాటలు, పద్యాలు రాసేందుకు బలిజేపల్లిని చిత్తజల్లు పుల్లయ్య కలకత్తాకు ఆహ్వానించారు. తెలుగులో వచ్చిన తొలిబాలల చిత్రం ‘ధృవ విజయం’ కావడం విశేషం. సాంఘిక చిత్రాలకూ మాటలు, స్క్రిప్టు 1938లో జయా ఫిలిమ్స్ సంస్థ చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో తొలిచిత్రంగా ‘కృష్ణ జరాసంధ’ సినిమాను నిర్మించింది. వేలూరి శివరామశాస్త్రి రచించిన కథకు బలిజేపల్లి పాటలు, పద్యాలు సమకూర్చారు. 1939లో జగదీశ్ ఫిలిమ్స్, అధినేత వై.వి.రావు (యరగుడిపాటి వరదరావు)దర్శకత్వంలో ‘మళ్ళీపెళ్లి’ అనే సాంఘిక చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు బలిజేపల్లి రాశారు. 1921-23 ప్రాంతాల్లో కాళ్ళకూరి నారాయణరావు వరకట్న పిశాచిని నిరసిస్తూ ‘వరవిక్రయం’ అనే నాటకాన్ని రచించారు. ఆ నాటకానికి బలిజేపల్లి మాటలతోబాటు అందుకు అవసరమైన పాటలు కూడా రచించి మంచి స్క్రిప్టును తయారు చేశారు. పుల్లయ్య కోరికమీద అందులో బలిజేపల్లి పిసినిగొట్టు భూస్వామి ’సింగరాజు లింగరాజు’ పాత్రను పోషించారు. మాటలూ, పాటలూ, కథలు 1940లో బలిజేపల్లి ఎ.వి.ఎం వారు నిర్మించిన ‘భూకైలాస్’, న్యూటన్ స్టూడియో తరఫున వై.వి.రావు నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వమోహిని’ సినిమాలకు సంభాషణలు సమకూర్చారు. శ్రీజగదీశ్ సంస్థ బ్యానర్ మీద దర్శకనిర్మాత సమర్పించిన రెండవ చిత్రం ‘విశ్వమోహిని’. ఈ చిత్రానికి మాటలు, పాటలు సమకూర్చింది బలిజేపల్లి లక్ష్మీకాంతం. 1942లో “జీవన్ముక్తి” చిత్రానికి మాటలు పాటలు సమకూర్చిన బలిజేపల్లి ‘రాజగురు’ పాత్రను పోషించారు.బుర్రకథను ఆధారం చేసుకొని బాలనాగమ్మ’ చిత్రాన్ని నిర్మించగా, బలిజేపల్లి అద్భుతమైన కథను సమకూర్చి, దానికి సంభాషణలు, పాటలు రాశారు. ఇందులో బలిజేపల్లి నవభోజరాజు పాత్రను పోషించడం విశేషం. చిత్రాలలో నటన సైతం 1944లో శ్రీజగదీష్ ఫిలిమ్స్ వై.వి.రావు ‘తహసిల్దార్’ అనే చిత్రాన్ని నిర్మించగా బలిజేపల్లి ‘సీతయ్య’, ‘పానకాలు’ అనే రెండు పాత్రలను పోషించారు. బలిజేపల్లి రచించిన నవల ‘బ్రహ్మరథం’ ఆధారంగా 1947లో శ్రీవెంకట్రామా పిక్చర్స్ బ్యానర్ మీద మీర్జాపురం రాజావారు ప్రధమ కానుకగా చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో ‘బ్రహ్మరథం’ చిత్రాన్ని నిర్మించగా, చిత్రానికి కథ, మాటలు, పాటలు బలిజేపల్లి సమకూర్చారు. బలిజేపల్లి కథ, మాటలు, పాటలు సమకూర్చి నటించిన చివరి సినిమా ‘రక్షరేఖ’ (1949). ఆర్. పద్మనాభన్ నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి, అంజలీదేవి, కస్తూరి శివరావు, వంగర వెంకటసుబ్బయ్య, కనకం, గంగారత్నం ముఖ్య తారాగణం. ఇందులో బలిజేపల్లి ప్రతాప మహారాజు పాత్రను పోషించారు. అక్కినేని ఆయన కొడుకు సుధాకరుడుగా నటించారు. గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా ఇటికంపాడులో 23 డిసెంబర్ 1881న నరసింహశాస్త్రి, ఆదిలక్ష్మమ్మలకు జన్మించిన బలిజే పల్లి 30 జూన్,1953న కాళహస్తిలో పరమ పదించారు. (డిసెంబర్ 23… బలిజేపల్లి లక్ష్మీకాంతం జయంతి) సశేషం మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-2-22-ఉయ్యూరు • • • • , _! • • • • • • •

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.