మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -53

హాస్య చిడతల అప్పారావు

చిడతల అప్పారావు తెలుగు సినీ పరిశ్రమలో ఒక నటుడు. ఎక్కువగా తక్కువ నిడివి గల హాస్య ప్రధాన పాత్రలను పోషించారు. నాటకరంగం నుంచి వచ్చిన ఈయన సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేశారు. దర్శకులు జంధ్యాల, ఇ. వి. వి సత్యనారాయణ ఈయనకు తమ చిత్రాల్లో వేషాలిచ్చి ప్రోత్సహించారు.

నటజీవితం
చిడతల అప్పారావు నాటకరంగం నుంచి వచ్చినవాడు. సినిమాల్లో చిన్న చిన్న విషయాలు వేసేవాడు. పారితోషికం ఇంత అంటూ ఏమీ ఉండేది కాదు. నిర్మాతలు తమకు తోచినంత ఇచ్చేవారు. ఈయన కూడా అడిగితే ఉన్న వేషాలు కూడా పోతాయి అనే భయంతో కావలసిన పారితోషికం అడిగేవారు కాదు. ఈయనతో పాటు థం లాంటి మరికొంతమంది చిన్న హాస్యనటులను జంధ్యాల ప్రోత్సహించి అవకాశాలిచ్చాడు.[1] తర్వాత జంధ్యాల శిష్యుడైన ఇ.వి.వి. సత్యనారాయణ కూడా అప్పారావుకు తన సినిమాల్లో అవకాశం కల్పించాడు.

అప్పారావు పెంకిపిల్ల అనే చిత్రంలో మొదటిసారిగా నటించాడు. వేషాల మీదనే ఆధారపడితే జీవనం గడవదని గ్రహించి మేకప్ నేర్చుకుని సహాయకుడిగా వెళ్ళేవాడు. దుస్తుల విభాగంలో కూడా పనిచేసేవాడు.

నటించిన చిత్రాలు
· బొబ్బిలి యుద్ధం (1964)

· అర్ధరాత్రి (1968)

· జ్యోతి (1976)

· వేటగాడు (1979)

· సర్దార్ పాపారాయుడు (1980)

· కొండవీటి సింహం (1981)

· పటాలం పాండు (1981)

· కలియుగ రాముడు (1982)

· ఖైదీ ( 1983)

· ఘరానా అల్లుడు (1984)

· అడవి దొంగ (1985)

· చట్టంతో పోరాటం (1985)

· అపూర్వ సహోదరులు (1986)

· కొండవీటి రాజా (1986)

· జానకి రాముడు (1988)

· మంచి దొంగ (1988)

· మురళీకృష్ణుడు (1988)

· విజయ్ (1989)

· లారీ డ్రైవర్ (1990)

· కిల్లర్ (1991)

· అప్పుల అప్పారావు (1992)

· జంబలకిడిపంబ (1992)

· ప్రెసిడెంటు గారి పెళ్ళాం (1992)

· బృందావనం (1992)

· చిట్టెమ్మ మొగుడు (1992)

· గోల్‌మాల్ గోవిందం (1992)

· అల్లరి అల్లుడు (1993)

· ఆ ఒక్కటీ అడక్కు (1993)

· ముద్దుల ప్రియుడు (1994)

· ఆలీబాబా అరడజను దొంగలు (1994)

· అసెంబ్లీ రౌడీ (1991)

చిడతల అప్పారావు కుమారుడు ,నవీన్ కుమార్తె కృష్ణవేణి ఒక పత్రిక కిచ్చిన ఇంటర్వ్యులో తండ్రి గురించి చెప్పిన ముఖ్య విషయాలు –‘’ నాన్న అందరికీ సహాయం చేసేవారట..‘మా అమ్మ మాకు ఈ విద్య నేర్పిందిరా’ అంటూ ‘శ్రీవారికి ప్రేమలేఖ’ చిత్రంలో లైసెన్స్‌డ్‌ భిక్షకుడిగాను, ఆలీబాబా అరడజను దొంగలు చిత్రంలో ఒక దొంగగాను, అదే చిత్రంలో ఆడ వేషంలోను… కొన్ని వందల చిన్న చిన్న వేషాలు వేశారు వై.అప్పారావు. ఆయన చిడతలు వాయించటంలో దిట్ట కావటం వలన చిడతల అప్పారావుగా అందరికీ పరిచితులయ్యారు. ముఖ కవళికలతోనే హాస్యం పండించిన చిడతల అప్పారావు గురించి వారి పిల్లలు నవీన్, కృష్ణవేణి తండ్రితో వారికి ఉన్న అనుబంధాన్ని, తండ్రిలోని మంచితనాన్ని ‘సినీ పరివారం’ శీర్షిక కోసం సాక్షితో పంచుకున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..

నాన్నగారు పుట్టి పెరిగినదంతా రాజమండ్రిలోనే. ఎంతవరకు చదువుకున్నారో సరిగ్గా తెలియదు. రాజమండ్రి నుంచి ఒకేసారి ఐదుగురు కలిసి సినిమా మీద ప్రేమతో మద్రాసు వచ్చారట. నాన్న, రాజబాబుగారు, జయకృష్ణగారు, మరో ఇద్దరు వచ్చారట. వారి పేర్లు జ్ఞాపకం లేవు. అందులో రాజబాబుగారు కమెడియన్‌గా ఎదిగారు. జయకృష్ణగారు నిర్మాత అయ్యారు. నాన్నగారికి చొరవ లేకపోవడంతో మరీ పెద్ద పెద్ద పాత్రలు చేయలేకపోయారు. నాన్నగారు హిట్‌ గురించి, ఫ్లాప్‌ గురించి ఆలోచించేవారు కాదు. ఆయనకు రెండూ సమానమే.

ఇదీ మా కుటుంబం..
నాన్నగారికి మొదటి భార్య చనిపోవటంతో, చెన్నై వడపళని దేవాలయంలో రెండో వివాహం చేసుకున్నారట. అప్పటికే సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న అమ్మ వాళ్ల బాబాయ్‌ ద్వారా ఈ సంబంధం వచ్చిందట. అమ్మ పేరు దుర్గ. నాన్నగారికి మేం ఇద్దరం పిల్లలం. నా పేరు నవీన్‌ కుమార్‌. మా అక్క కృష్ణవేణి. మేమిద్దరం చెన్నైలోనే చదువుకున్నాం.

నాన్నతో కూర్చోవటమే మాకు పండుగ…
ఉదయం నాన్నగారు షూటింగ్‌లకు, మేం స్కూల్‌కి వెళ్లటంలో బిజీగా ఉండేవాళ్లం. అందువల్ల రాత్రుళ్లు మాత్రం అందరం కలిసి కూర్చుని భోజనం చేసేవాళ్లం. ఆదివారం వస్తే చాలు.. అందరం కలిసి కింద కూర్చుని, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కడుపు నిండుగా భోజనం చేసేవాళ్లం. ఆయన మాకు ఆ క్రమశిక్షణ అలవాటు చేశారు. ఆ రోజు ఒక ముద్ద ఎక్కువే తినేవారం. మా నాన్నగారితో ఇంట్లో చాలా సరదాగా, జాలీగా ఉండేది.

అందరూ స్నేహంగా ఉండేవారు..
మా ఇంటికి అప్పట్లో పొట్టి సత్యం, రాళ్లపల్లి, చలపతిరావు, జయకృష్ణ, రాజబాబు…వీరంతా వచ్చేవారు. నాన్నగారితో అందరూ స్నేహంగా ఉండేవారు. రాళ్లపల్లిగారి ఇంటి నుంచి మామిడికాయలు, ఊరగాయలు వచ్చేవి. కృష్ణంరాజుగారు ప్రతి పండక్కి స్వీట్స్, వారి తోట నుంచి మామిడిపళ్లు పంపేవారు. అలీ నాన్నగారితో క్లోజ్‌గా ఉండేవారు. బాబాయ్‌ అని పిలిచేవారు.

ఎందరికో సహాయం చేశారు..
నాన్నగారు.. తెలిసిన వ్యక్తిని, తెలియని వ్యక్తిని అందరితోనూ ప్రేమగా ఉండేవారు. ఎవరు డబ్బులు అడిగినా లేదనకుండా ఇచ్చేసేవారు. ఫ్యాన్స్‌ వస్తే, వాళ్లకి భోజనం పెట్టి, వాళ్లు అడిగిన ఫొటో ఆల్బమ్‌లో నుంచి తీసి ఇచ్చేసేవారు. చెన్నైలో మేం ఉన్న బిల్డింగ్‌ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ కోరస్‌ సింగర్స్‌ ఉంటుండేవారు. వారంతా మన తెలుగువాళ్లే. వాళ్లకు పనులు లేకపోతే, నాన్నగారు వారికి సహాయం చేయటం నేను మేడ మీద నుంచి చూసి అమ్మకి, అక్కకి చెప్పేవాడిని. ఎంతోమందికి గుప్తదానాలు చేశారు నాన్న.

తియ్యని జ్ఞాపకం…
నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు నాకు అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ జరిగింది. అది వర్షాకాలం. నేను బడికి వెళ్లకుండా, ఇంట్లోనే ఉండటం వల్ల తోచేది కాదు. ఆడుకోవటానికి కారు బొమ్మ కావాలని అడిగిన వెంటనే, అంత వర్షంలోనూ… గొడుగు వేసుకుని పొట్టి సత్యం గారితో కలిసి పాండీ బజార్‌కి వెళ్లి కారు బొమ్మ తేవటం నేను మరచిపోలేను. ప్రతి రోజూ సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చేసరికి అక్క కోసం బాదుషా, నాకు బందర్‌ లడ్డు, ఇద్దరికీ కుండ స్వీట్‌ (పాండీ బజార్‌ అరుణ స్వీట్స్‌) తెచ్చేవారు. ఇది మాకు తియ్యని జ్ఞాపకం.

అసూయకు ఆమడ దూరం…
ఎంతమంది కమెడియన్స్‌ ఇండస్ట్రీలోకి వచ్చినా, నాన్నగారికి ఎవరి మీద ఈర్ష్య ఉండేది కాదు. వారిలో ఉన్న మంచి గుణాల గురించి చెప్పేవారు. నాన్నగారు మాతో, ‘ధర్మమార్గంలో నడవాలి, ఎవరి దగ్గరా చేయి చాపకూడదు. ఎవరికీ తల వంచకూడదు’ అని చెప్పేవారు. ఆయన చనిపోయేవరకు అలాగే ఉన్నారు. ఎవరికీ తల వంచలేదు. ఎవ్వరి దగ్గరా చేయి చాపలేదు, ఎన్నడూ ధర్మం తప్పలేదు. తుది శ్వాస వరకు నటిస్తూనే ఉన్నారు. నాన్నగారు వేషాల కోసం ఎవరి చుట్టూ తిరగలేదు. అందుకు మేం మా నాన్నగారి గురించి గర్విస్తాం. నాన్నగారు నటించిన సినిమాలలో మాకు… ఆలీబాబా అరడజను దొంగలు, ఏమండీ ఆవిడ వచ్చింది, జంబలకిడి పంబ, అల్లరి పిల్ల… బాగా ఇష్టం.

డబ్బింగ్‌ అంటే తెలీదు…
నాన్నగారు డైలాగ్‌ పేపర్లు ఇంటికి తెచ్చుకునేవారు. మేం పాఠాలు చదువుకుంటుంటే, నాన్న డైలాగులు చదువుకుంటూ నవ్వుకుంటుండేవారు. ఆయన ఎందుకు నవ్వుతున్నారో తెలియక మేం కూడా నవ్వుకుంటూ ఎంజాయ్‌ చేసేవాళ్లం. డబ్బింగ్‌ అంటుండేవారు. అప్పట్లో మాకు డబ్బింగ్‌ అంటే తెలిసేది కాదు. ఇప్పుడు అర్థమవుతోంది. ఎవరైనా కొంచెం వయసువారు ‘మీ నాన్న గోల్డ్, మీ నాన్న భగవంతుడు, మంచివాడు’ అంటుంటే సంతోషంతో పాటు, నేను కూడా అలాగే ఉండాలి అనుకుంటాను. నాన్నగారికి నన్ను హీరో చేయాలనే కోరిక, ఆశ ఉండేవి. అలాగే కెమెరామెన్, డైరెక్టర్‌… ఏదో ఒకటి అవ్వాలి అంటుండేవారు. అమ్మ కోప్పడుతుండేది. నాన్నగారు నా చదువు పూర్తి కాకుండానే కన్నుమూశారు. నేను డిగ్రీ పూర్తి చేశాక, కెమెరామెన్‌ శరత్‌గారి దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాను. షార్ట్‌ ఫిల్మ్స్‌ డైరెక్ట్‌ చేశాను. మంచి హిట్‌ కోసం చూస్తున్నాను. మేం చెన్నై నుంచి హైదరాబాద్‌కి వచ్చి 20 సంవత్సరాలు పైనే అవుతోంది. ‘ప్రేమకు వేళాయెరా’ సినిమా సమయంలో శరత్‌గారి దగ్గర అసిస్టెంట్‌గా కెరీర్‌ ప్రారంభించాను.

మధుర జ్ఞాపకాలు..
నాన్నగారితో కలిసి అందరం తిరుపతి వెళ్తే, పది నిమిషాలలో దర్శనం అయిపోయేది. అక్కడ చాలామంది ఫ్యాన్స్‌ మాతో ఫొటోలు తీయించుకునేవారు. నాన్నగారి ఫ్యాన్స్‌ని చూస్తే, మాకు చాలా సంతోషంగా ఉండేది. ఇప్పటికీ తిరుపతి వెళ్తే, మాకు ఆ సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఎన్‌. టి. రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాన్నగారికి రాజమండ్రిì సీటు ఇస్తామన్నారు. ‘రాజకీయాలు వద్దు’ అని అమ్మ అనటంతో నాన్న మానుకున్నారు. ప్రతి సినిమా ప్రివ్యూ నాన్నతో కలిసి చూసేవాళ్లం. అదొక సరదా. రాఘవేంద్రరావుగారికి, దాసరి నారాయణరావుగారికి నాన్నగారు బాగా క్లోజ్‌.

నాన్నగారికి లంగ్‌ క్యాన్సర్‌ వచ్చి ట్రీట్‌ చేయించుకున్నారు. సినీ పరిశ్రమలో అందరూ సహాయం చేశారు. దాసరి, చిరంజీవి, రాళ్లపల్లి, చలపతిరావు, కల్పనారాయ్, అలీ… ఇంకా చాలామంది వచ్చి నాన్నని పలకరించేవారు. ‘ఎలాంటి మనిషి ఇలా అయిపోయారు’ అని బాధపడేవారు. సినీ పరిశ్రమ మాకు బాగా సహాయం చేసింది. ఈవివి సత్యనారాయణగారి కుటుంబంతో నాన్నగారు బాగా క్లోజ్‌గా ఉండేవారు. వాళ్ల పిల్లలు నాన్నను, ‘బాబాయ్‌’ అని పిలిచేవారు. వాళ్ల పిల్లలిద్దరినీ నాన్న షాపింగ్‌కి తీసుకువెళ్లేవారు.

మంచి జీవితాన్ని ఇచ్చారు..
మా కుటుంబంలో మా కజిన్స్‌ వాళ్లకి నాన్నే పెళ్లి చేశారట. ఎవరు ఇల్లు కట్టుకుంటున్నామని వచ్చి అడిగినా డబ్బు సహాయం చేసేవారు. ‘లేదు’ అనే మాట వచ్చేది కాదట. బంధువులు, కొన్ని షాపులు చూపించి– ‘ఇది మీ నాన్నే పెట్టించారు’ అని చెబుతుంటే మాకు ఎంతో సంతోషం వేస్తుంది. రెండు వేలు, మూడు వేల రూపాయల చొప్పున చాలామందికి డబ్బు సాయం చేసేవారని చెబుతుంటే, నాన్న చేసిన సహాయమే మాకు శ్రీరామరక్షగా నిలిచింది అనిపించింది. మేం పరిశ్రమకు వచ్చాక మా నాన్నగారి గురించి అందరూ చెప్పటం వల్ల ఆయన గొప్పతనం మాకు తెలిసింది. ఆయన వ్యక్తిగత జీవితం, సినిమా జీవితం అన్నీ బావున్నాయి. నాన్న గురించి సినీ పరిశ్రమలో అందరూ మంచి మాటలే చెబుతారు. నాన్నగారు మాకు ఆస్తి కన్నా ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇచ్చారు. అదే ఆయన మాకు ఇచ్చిన మంచి ఆస్తి. నేను పదో తరగతి పూర్తిచేశాక టీవీఎస్‌ చాంప్‌ కొంటానన్నారు. కాని నా రిజల్ట్స్‌ రాకముందే ఆయన కన్నుమూశారు. అందువల్ల ఆ కోరిక నెరవేరలేదనే బాధ మాత్రం మిగిలిపోయింది. నాన్నగారు కన్నుమూయటంతో అప్పట్లో నాన్న గొప్పతనం మాకు తెలియదు.

మా మంచి వాడు అని అందరి చేత అనిపించుకొన్నారు చిడతల అప్పారావు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-2-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.