ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు కుమారన్ ఆశాన్-5(చివరిభాగం )
ఆశాన్ రాసిన కావ్యాలు మళయాళ సాహిత్య విమర్శకులకు చేతినిండా పని కల్పించాయి .ఆయన రాసిన ‘’సీత ‘’బాగా విమర్శకు గురైంది .ఈ కావ్యం పూర్తిపేరు ‘’చింతా విష్టయాయ సీత ‘’.కరుణ రస ప్రపూరిత ఘట్టాలతో వర్ణించాడు .1919లో ప్రచురితమైనా ,అయిదేళ్ళకాలం లో కేవలం 80పద్యాలే రాశాడు .మిగిలిన 112పద్యాలు కొద్దిరోజుల్లోనే రాసేశాడు .ఈమధ్యకాలం లో పెళ్లి అవటం, యోగం బాధ్యతలనుంచి విముక్తి జరిగాయి .సీత కావ్యానికి ప్రేరణ రవి వర్మ చిత్రించిన సీత చిత్రం అంటారు .ఈ కావ్యం రాలిన పువ్వులాగా అద్వితీయం అని పిస్తుంది .కధను ప్రవేశపెడుతూ –‘’అపరాహ్ణకాలం –ఆమె కుమారులిద్దరూ –మహర్షి వెంట అయోధ్యకు వెళ్ళారు –చింతా విష్ట యైన సీత –ఆశ్రమ సమీపాన –ఉద్యానవనం లో కూర్చున్నది ‘’ఆమె తన మిట్టపల్లాల జీవితాన్ని తలపోస్తోంది ..తర్వాత కవి ప్రకృతి రామణీయకత వర్ణించి 16వ పద్యం లో సీత దుఖకారణం తెల్పాడు –‘’మృగాలు బాధ అనుభవించినా బాధ ఎక్కువకాలం ఉండదు –దెబ్బతిన్న గర్వం తో ఉత్పన్నమైన –తీరని బాధకు గురయ్యేది మానవులు మాత్రమె ‘’
ఈ కావ్యం లో పర్యాలోకన దశ ,సందిగ్ధ దశ ,దూషణ దశ ,కల్పనా దశ అని నాలుగు దశలున్నాయని ప్రముఖ విమర్శకుడు సుకుమార్ అజికోడ్ చెప్పాడు .కొందరు సీత నోటిలోనుంచి అనుచితాలు చెప్పించి రాముడిని కించ పరచేట్లు చేశాడు కవి అన్న వారూ ఉన్నారు .కాని ఆశాన్ సృష్టించిన సీత పతివ్రత, గుణవతి ,నీతిమంతురాలు, వివేచనా శక్తిగల ఉత్తమ జాతి స్త్రీ .చీము నెత్తురు ఉన్నమనిషి .వాల్మీకి పదేళ్ళు ఆమెను తెరవెనుక ఉన్చేశాడు .ఆశన్ ఆమె మనసులోని మాటలు చెప్పించాడు .ఆశ్రమం లో పదేళ్ళు సన్యాసినిగా ఉంది –‘’తన శరీర రూపాన్ని విడిచే వరకు ప్రాణి తన సహజ ప్రవృత్తి నిలబెట్టుకొన్నది ‘’అంటాడు కవి .రాముడిని మర్చిపోలేదు –‘’కొండ చిలవలాపడుకొని ఉంది –తలెత్తలేని నిద్రలో ఉంది ‘’అని ఆమెస్థితి వర్ణించాడు .’’సోదర స్వరూప మరిదీ లక్ష్మణా! నన్ను మన్నించు ‘’అంది .’’అపకీర్తి వస్తుందనే భయం తో అపవాదును రాజు రూఢి చేయలేదా ?’’అను కొంటుంది .’’పెళ్ళాడిన భార్యతో కాపురం చేయటానికి అడవిలో ఆయనకు చోటే దొరకలేదా ?’’అను కొంది.’’ధర్మం న్యాయం క్రూరమైనవి బాధాకరమైనవి –రాజులు ధర్మ బద్దులు కదా –అందుకే నా భర్త నన్ను బహిష్కరించాల్సి వచ్చింది –నా విగ్రహానికి ఆరాధకుడు కావాల్సి వచ్చింది ‘’అని తలపోసింది .’’ప్రభూ నీ అర్ధాంగిని మన్నించు –కోపోద్రిక్తంతో నీకు లోపాలు దోషాలు ఆపాదించాను ‘’అని బాధపడింది .ప్రకృతిలోని సర్వానికి వీడ్కోలు చెప్పింది –‘’మీ వల్ల ఆనందానుభూతి పొందిన –ఈ అదృష్టవతి –మీకిక వీడ్కోలు పలుకుతోంది ‘’అన్నది .
సాంఘిక కావ్యాలు
బుద్ధిపూర్వకంగానే ఆశాన్ మహా కావ్య రచన చేయలేదు .జీవిత చరమాంకం లో ‘’దురవస్థ ‘’చండాల భిక్షుకి ‘’అనే రెండు కావ్యాలు రాశాడు .వీటిలో వర్ణ వ్యవస్థ కళంకాన్ని వెలుగు లోకి తెచ్చి ప్రజల దృష్టి ని ఆకర్షించేట్లు చేశాడు .1921లో మోప్లా తిరుగుబాటు తర్వాత జరిగిన హిందూ ముస్లిం కలహాల గురించి రాసిందే దురవస్థకావ్యం –‘’పావురాళ్ళు ఎగిరిపోతున్నాయి –కులాల తారతమ్యాలు అవి చూడలేవు –వాటికి తెలీదు ‘’.హెచ్చరికగా ‘’మీరే శాస్త్రాలు మార్చండి –లేకపోతె శాస్త్రాలే మిమ్మల్ని మార్చేస్తాయి ‘’అంటాడు .చండాల భిక్షుకి దురవస్థ కావ్యానికి ఉత్తరభాగం అనుకో వచ్చు .ఇతి వృత్తం బౌద్ధం లోనిది .ఇందులోచండాలిక –‘’రెక్కలు తెగిన మిణుగురు పురుగులాగా కాలంగడిపింది ఆరాత్రి –స్థిరమైన చైతన్యం ముందు –సోలుతూ ఊగుతున్న సందేహం లాగా ఉంది ‘’అ౦టాడుకవి .బుద్ధుడు ఆమెను శాంతపరచి భిక్షుకి గా స్వీకరిస్తాడు .ఆయన ‘’బిడ్డా నువ్వురావటం మంచిదే అయింది –ఏపాపమూ తెలియనిఆన౦దునికి నీరిచ్చావు –జీవన్మరణాలు అనే దుఖాన్నికలగజేసే దాహం నుంచి –నువ్వుకూడా విముక్తురాలివి కావాలి ‘’అంటాడు భగవాన్ ‘’చండాల స్త్రీశరీరం-బ్రాహ్మణ బీజానికి ఫలవంతం కాదా ?జందెం నెత్తిన పిలక ,నుదుటిబొట్టు పుట్టుకతో వచ్చేవా ?గురు బోధలేకుండా బ్రాహ్మణుడు పండితుదౌతాడా ?’’చివరికి –ప్రేమనుంచే లోకం ఉదయిస్తుంది-ప్రేమవల్లలోకం వర్ధిల్లుతుంది-ప్రేమ ప్రపంచానికి త్రాణ-ప్రేమ అంటే జీవమే ‘’అంటారు ఆప్రేమమూర్తి .
లఘుకావ్యాలు
ఆశాన్ పుష్పవాటి ,మణిమాల,వనమాల అనే సంపుటాలలో తన లఘుకావ్యాలను ప్రచురించాడు .ఇవి సందర్భాన్ని బట్టి రాసిన కవితలు .
పత్రికా సంపాదకుడు
ఆశాన్ సంపాదకుడుగా ‘’వివేకోదయం ‘’పత్రిక నడిచింది ఆయన సంపాదకీయాలు జన జాగృతికలిగించాయి.సాహిత్య వ్యాసాలూ విజ్ఞాన వ్యాసాలూ రాశాడు .చమత్కారం స్వారస్యం అపహాస్యం ఎత్తిపోడుపులతూ సూటిగా విషయాన్న్ చెప్పేవాడు .15 ఏళ్ళు దీని సంపాదకుడుగా ఉంటూ పత్రిఅక్ ప్రజల ఆశయాలకు ప్రతిబింబంగా తీర్చిదిద్దాడు .
విమర్శకుడు
వాళ్లతోల్ కావ్యం ‘’చిత్రయోగం ,ఉల్లూరు పరమేశ్వర్ అయ్యర్ కావ్య౦ ‘’ఉమా కేరళం ‘’,పంతలం కేరళవర్మ కావ్యం ‘’రుక్మాంగద చరిత్ర ‘’లకు ఆశాన్ రాసిన విమర్శ అగ్రశ్రేణికి చెందినదిగా కొనియాడబడింది .విమర్శకాగ్రేసరుడు అనిపించుకొన్నాడు
ఎడ్విన్ ఆర్నోల్డ్ రాసిన ‘’లైట్ ఆఫ్ ఏషియా ‘’ను బుద్ధ చరితంగా అనువదించాడు .వాల్మీకి రామాయణ౦ ను దృష్టి లోపెట్టుకొని ‘’బాలరామాయణం ‘’గా రాశాడు .జేమ్స్ ఎల్లాన్ రచన‘’ఆజ్ ఎ మాన్ ధింకేత్ ‘’ గ్రంథాన్ని మలయాళం లోకి ‘’మనం పోలె మాంగల్యం ‘’గా అనువదింఛి వివేకోదయం లో సీరియల్ వేసి తర్వాత ‘’మనశ్శక్తి‘’గా పుస్తకరూపం లో తెచ్చాడు .పతంజలి యోగశాస్త్రం ఆధారంగా స్వామి వివేకానందుడు రాసిన రాజయోగం ‘’ను సమర్ధంగా అనువదించాడు .మిదోన్ టేలర్’’తార ‘’నవలను దైవికమాయ ప్రతీకారం’’ గా ,,ఇంగ్లీష్ లోని ‘’మైత్రేయి ‘’ని మలయాళం లోకి అనువదించాడు .
బహుముఖ ప్రజ్ఞకల ఆశాన్ అంతర్ముఖుడు .రచనలో నిర్మాణ సౌష్టవం ,పొందిక యుక్తాయుక్త విచక్షణం ,శ్రద్ధ ఆయన సొత్తు .చివరగా ‘’కరుణ ‘’కావ్యం రాశాడు .ఇందులో వాసవదత్త ఉపగుప్తుల కథ ఉంటుంది .సంక్షుభిత మనసుకు శాంతికలుగాజేయటమే ఇందులో ముఖ్యవిషయం .
మరణం
16-1-1924 న ఆశాన్ తిరువనంతపురానికి 15మైళ్ళదూరం లో ఉన్న తోన్నక్కల్ నుంచి ఆల్వే వెళ్ళటానికి సిద్ధమయ్యాడు .అక్కడ ఆయనకు 18ఎకరాలపొలం ఉంది .అక్కడి పెంకుల ఫాక్టరీ లోకోన్నిషేర్లున్నాయి .ఫాక్టరీ సమావేశం లో ఆయన పాల్గొనాలి. కోయిలోన్ నుంచి అలప్పీ వెళ్ళే చివరి పడవలో ప్రయాణం చేస్తున్నాడు .పడవ నిండా జనమున్నారు అష్టముడి సరస్సు పెద్ద అలలల్తో అల్లకల్లోలంగా ఉంది .వాటిని చీల్చుకొని పడవ పోతోంది .అందులో నిద్రపోయే సౌకర్యం లేదు .పద్యాలు చదివి వినిపించమని అందులోని వారు కోరితే బుద్ధ చరితం లోనివి కరుణ కావ్యం లోవి చదివి వినిపించాడు. అర్ధరాత్రి దాటింది .కిందున్న మొదటి తరగతి అరలోకి వెళ్ళాడు. చలిగా ఉంది .ఖాదీ కోటు లోనే ఉన్నాడు .తలపై పల్చని శాలువా కప్పుకొని నిద్రపోయాడు .అంతే.మళ్ళీ నిద్ర లేవలేదు .పడవ పల్లన వద్ద చిన్నకాలువలో మునిగిపోయింది .అనాయాసంగా మరణించాడు ఆశాన్ .ఆపడవ పేరు ‘’రక్షకుడు ‘’రక్షించాల్సిన పడవ భక్షించింది ఆశాన్ ను .విధి వైపరీత్య౦ .మర్నాడు శవం దొరికింది నుదుటిపై దెబ్బ కనిపించింది. అదే చావు దెబ్బ అయి ఉంటుంది .ఆశాన్ వయసు 51మాత్రమె .భార్య భానుమతికి 23.ఏడేళ్ళు మాత్రమె కాపురం చేశారు
మృత్యువు తప్ప ఆశాన్ కు అన్నీ అందుబాటులోకి వచ్చాయి .ఆయన కావ్యాలలో స్త్రీలకూ వెలుగు ప్రసరింపజేశాడు .మళయాళ కవిత్వం లో రినైజాన్స్ కు అంటే పునరుజ్జీవనోద్యమానికి నాయకత్వం వహించిన మహద్భాగ్యం కుమారన్ ఆశన్ కే దక్కింది .ఆయన పేరుమీద అకాడెమీలు విద్యాలయాలు వెలిశాయి .మద్రాస్ లో ఆశాన్ మెమోరియల్ స్కూల్ ఉంది .
ఆధారం –మొదటి ఎపిసోడ్ లోనే చెప్పినట్లు మలయాళం లో కే ఎం జార్జి రచనకు తెలుగులో శ్రీ డి రామలింగం చేసిన అనువాదం –కుమారన్ ఆశాన్ .
రధ సప్తమి శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-2-22-ఉయ్యూరు