ఊరికి ఉపకారి ,శా౦తచిత్తుడు ,చాలా మంచివాడు- శ్రీ చావలి వెంకటప్పయ్య గారు,అణకువ ,భక్తీ ,సేవాతత్పరత ఉన్నసింపుల్ మహిళ- శ్రీమతి సస్యశ్రీ
ఊరికి ఉపకారి ,శా౦తచిత్తుడు ,చాలా మంచివాడు- శ్రీ చావలి వెంకటప్పయ్య గారు
శ్రీ చావలి వెంకటప్పయ్య గారితో వారి కుటుంబం తో మాకు సుమారు నలభై ఏళ్ళుగా పరిచయం ఉంది .ఆయన భార్య శ్రీ మతి ఉమాసుందరి .ఈ దంపతులు మా దంపతుల్ని తమ తలిదంద్రులుగా భావిస్తారు ఆమె మమ్మల్ని నాన్నగారూ అమ్మగారూ అంటే ఆయన అల్లుడుగారుగా అనిపిస్తారు .ఆమె అంగన్ వాడీ టీచర్ .ఆ గ్రూపులకు నాయకత్వం వహించేది .ఆమె మాట వారికీ శిరోధార్యం .వీరిద్దరికీ ఇద్దరబ్బాయిలు .వాళ్ళూ మా కళ్ళముందు పెరిగినవారు. మాకు టుంబంతో సాన్నిహిత్యమున్నవాళ్ళు .’’తాతగారు,అమ్మమ్మగారూ’’అని మమ్మల్ని ఆత్మీయంగా పిలుస్తారు .వీరిద్దరిచదువులు , వివాహాలూ పూర్తీ అయి, పిల్లలు కూడా కలిగారు .అంతా సంతోషంగా ఉన్నారు .కాపులవీధి రామాలయం దగ్గర డాబా ఇల్లుకోనుక్కొని ఉంటున్నారు చాలాకాలం నుంచి .
మా ఇంట్లో ఆబ్దీకలు వస్తే వెంకటప్పయ్యగారు తప్పకుండా ఒక భోక్తగా ఉండేవారు .తర్వాత తర్వాత ఆయనా మంత్రాలు నేర్చి ,ఆబ్దిక మంత్రాలు చెప్పేవారు. మా ఇంట్లో .కార్తీకమాసం లో మా ఉసిరి చెట్టుకింద భోజనాలకు పిలిస్తే తప్పకుండా దంపతులు వచ్చేవారు .ఉమాసుందరి వస్తే సందడే సందడి నవ్వుతూ గలగలా మాట్లాడుతూ అందరికి వడ్డిస్తూ ,అలసట లేకుండా పని చేస్తుంది .అలాగే శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం నాడు వారిద్దర్నీ పిల్చి వాయనం ఇవ్వటం జరిగేది .ఎంత ఆలస్యమైనా వచ్చి తీసుకొని వెళ్ళేవారు .వారికి నూతన వస్త్రాలు అందిస్తూండేవాళ్ళం .మా ఇంట్లో మా అబ్బాయిల పెళ్లిళ్లకు అమ్మాయి పెళ్ళికి గృహప్రవేశానికీ వచ్చారు .ఉమాసుందరి వచ్చారంటే సందడే సందడి .
వెంకటప్పయ్యగారు కాపుల వీధి రామాలయం దగ్గర వినాయకచవితి పందిట్లో పూజలు చేసేవారు .విష్ణ్వాలయం శివాలయం లలో పూజలకు ,మంత్రపుష్పాలకు హాజరయ్యేవారు .పూజలు అభిషేకాలు,వ్రతాలు చేయించేవారు దానాలు పుచ్చుకోనేవారు .ఆబ్దిక మంత్రాలు చెప్పేవారు .చాలా బిజీ గా ఉ౦డేవారేప్పుడూ. చాల సౌమ్యులు .పెద్దాగా మాట్లాడేవారు కాదు చిరునవ్వే ఎప్పుడూ .స్కూటర్ బాగా నడిపేవారు .భార్యాభర్తలు దానిమీదే ఎక్కడికైనా వెళ్ళేవారు .ఉయ్యూరు బ్రాహ్మణ సంఘం ను నా మిత్రుడు స్వర్గీయ వేమూరి దుర్గయ్య ప్రెసిడెంట్ గా .స్వర్గీయ మంత్రాల రాధా కృష్ణమూర్తి స్వర్గీయ గోవిందరాజుల వెంకటేశ్వరరావు ,స్వర్గీయ సీతంరాజు సత్యనారాయణ గార్లు చాలా యాక్టివ్ గా నడిపినప్పుడు ,నేనూ ఏదో ఒక బాధ్యతతో పని చేశాను. సామూహిక ఉపనయనాలు జరిపించాం. అప్పుడు వెంకటప్పయ్య దంపతుల పెద్దకొడుకు ఉపనయనం కూడా అందులో జరిపించిన గుర్తు .అప్పుడే ఆయన అత్తగారూ ,మామగారూ పరిచయమయ్యారు .వీరిద్దరి పిల్లలు ఉయ్యూరు ఆర్ కే ఎం స్కూల్ లో చదివారు .సుబ్రహ్మణ్య షష్టి కి మా ఇంటికి బ్రాహ్మణ వటువులుగా వచ్చి తాంబూలం తీసుకొని సంతృప్తిగా భోజనం చేసేవారు .ఈఇద్దర్దీ నవ్వుమొహమే . .పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా భక్తీ శ్రద్ధ ఉన్న వారు అణకువ , వినయమున్నవారు .తలిదండ్రుల లక్షణాలు వీరికి బాగా అబ్బాయి .
బ్రాహ్మణా సంఘం విష్ణ్వాలయం లో నిర్వహించే కార్తీక వనసమారాధనకు వెంకటప్పయ్య దంపతులు గొప్ప సహాయ సహకారాలు అందించేవారు .ఆమె ఉంటె ఎంతమందికైనా వడ్డన సునాయాసంగా జరిగి పోయేది. గలగలామాట్లాడుతూ ,చకచకా పనిచేస్తూ చేయిస్తూ ,అలుపు సొలుపు లేకుండా భేషజం లేకుండా సాయం చేసేవారు .పిల్లలూ అంతే ఉద్యోగాలు వచ్చి వెళ్ళేదాకా .
మాశ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో కూడా వెంకటప్పయ్యగారు ,పిల్లలు అవసరమైతే పూజారికి సహాయంగా ఉండేవారు .గుడి ప్రతిష్టలకు ఆతర్వాత అక్కడ జరిగే భారీ కార్యక్రమాలకు కల్యాణాలకు వెంకటప్పయ్య గారు వచ్చి తాంబూలం తీసుకొనేవారు .వారికివ్వటం మాకు అత్యంత సంతోషం,సంతృప్తి కూడా .వారి పెద్దబ్బాయి పెళ్లి చేసినపుడు అందర్నీ ఆహ్వానించి భోజనాలు పెట్టారు .మా దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు .మాకే కాదు చాలామందికి బట్టలు పెట్టారు .రెండోవాడి పెళ్లి భోజనం కూడా చేసిన గుర్తు .కోడళ్ళు ఇద్దరూ చాలా బుద్ధిమంతురాళ్ళు .పిల్లలకు సంబంధాలు కుదరగానే మాకు తెలియజేసే సౌజన్యం ఆ దంపతులది .ఊళ్ళో అందరికీ తలలో నాలుకగా ఉండేవారు .అందుకే అందరూ వాళ్ళిద్దరూ అంటే గొప్ప అభిమానం తో ఉంటారు .
ఆశ్వయుజ శుద్ధ అష్టమి దుర్గాష్టమి నాడు మా నాయనమ్మగారు నాగమ్మగారి తిధి .అ రోజు వెంకటప్పయ్య గార్ని పిలిచి దక్షిణా తాంబూలం ఇవ్వటం ఈమధ్యపదేళ్ళనుంచీ చేస్తున్నాం.ఆయన ఊరిలోలేకపోతే ఆయన చెప్పిన వారికిచ్చేవారం .మకర సంక్రమణం సంక్రాంతినాడు గుమ్మడికాయ దానం మాత్రం పుచ్చుకోనేవారు కాదు .ఆయనే ఎవర్నైనా పురమాయించి ఇప్పించేవారు .ఈ సంవత్సరం దుర్గాస్టమి ముందు ఆయనకు ఫోన్ చేస్తే హైదరాబాద్ లో ఉన్నానన్నారు .సంక్రాంతి ముందు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు .ఆవిడకూ చేసినా తీయలేదు .ఏమిటా అనుకొన్నా .
నిన్న మా కోడలు రాణి చెప్పింది వెంకటప్పయ్య గారు చనిపోయారని .నేను ఉమా సుందరి గారికి వెంటనే ఫోన్ చేస్తే వాళ్లరెండవ అబ్బాయి ఎత్తి మాట్లాడాడు విషయం చెప్పాడు . నాలుగు నెలలక్రితం కొంత నలతగా ఉంటె హైదరాబాద్ తీసుకు వెళ్లామనీ,ట్రీట్ మెంట్ బాగానే చేయిన్చామనీ ,కోలుకోన్నారనీ, డిసెంబర్ 24 న అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చివెంకటప్పయ్య గారు తుది శ్వాస విడిచారనీ చెప్పాడు .అయ్యో అనిపించింది .ఆయన మొదటిమాసికం ,త్రైపక్షం ఉయ్యూరులో స్వంత ఇంట్లోనే పెట్టామని ,నాకు ఫోన్ చేశామనీ ఫోన్ కలవ లేదనీ చెప్పాడు .ఊరికి ఉపకారి ,మంచిమనసున్న సౌజన్యశీలి వెంకటప్పయ్య గారి మరణానికి చింతిస్తున్నాం .వారి ఆత్మకు శాంతికలగాలని కోరుతూ వారి కుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాం .
అణకువ ,భక్తీ ,సేవాతత్పరత ఉన్నసింపుల్ మహిళ- శ్రీమతి సస్యశ్రీ
అప్పుడే శ్రీ మతి సస్యశ్రీ మరణించి ఇవాల్టికి సంవత్సరం అయింది .ఆమె కుటుంబం కోటలో ఉన్న ఇంట్లో కాపురముండేవారు .దైవభక్తి ఆమెఅణువణువునా తోణికిసలాడేది .రోజూ మా సువర్చలాన్జనేయస్వామి శివాలయం విష్ణాలయం లను రెండుపూటలా సందర్శించకుండా ఉండేదికాదు .సేవాతత్పరత ఆమె నైజం .మా ఆలయం లో ధనుర్మాసం లో లడ్డూ పూజ ,అరిసెల,వెన్నపూస పూజలకు ఆమె భక్తుఅలందరికీ చెప్పి వారిచ్చేడబ్బు పంచదార బెల్లం సెనగ పిండి వసూలు చేసి పూజారికి అందించేది .కల్యాణాలకు,సామూహికసత్యనారాయణ వ్రతాలకు ధనుర్మాస పూలకు హనుమద్వ్రతానికి హనుమజ్జయంతి కి తప్పక హాజరయ్యేది నక్షత్రహారతికిసిద్ధం చేయటం ఆమెకు చాలా ఇష్టమైన పని చితికేలోసిద్ధం చేసేది .సింపుల్ గా ఉండేది.నన్ను ‘’మాష్టారు గారూ’’అనే సంబోధించేది .మాటకూడా చాలా మెల్లగా మాట్లాడేది .శ్రీ సువర్చలాన్జనేయస్వామికి మాశ్రీమతి కట్టే డిసెంబర్ పూలదండకు మురిసి పోయేది .ఆ దండ లేక పొతే స్వామి వెలా తెలా పోయినట్లు ఉంటాడు అనేది.2008లో మేము అమెరికా వెడుతూ ,ఆమెను మాదోడ్లో ఉన్న డిసెంబర్ పూలు కోసిరోజూ ధనుర్మాసంలోనూ ,ప్రతి మంగళవారం సాయంత్రం దండ కట్టి అందజేయమంటే ,అత్యంత భక్తీ శ్రద్ధలతో చేసి ,మాట నిలబెట్టుకొంది శ్రీమతి సత్యశ్రీ . కోట నుంచి కాపురం దూరంగా ఉన్న అపార్ట్ మెంట్ కు మారినా, ఆమె కాలినడకన నిత్యం అన్ని దేవాలయాలను సందర్శించేది. వంచిన తల ఎత్తని మహా ఇల్లాలు. భర్త కెసీపి లో పని చేసి రిటైర్ అయ్యాడు .పిల్లలు చేతికి అంది వచ్చి పువ్వుల్లో పెట్టి చూసు కొంటున్నారు .ఏలోటూ లేదామెకు.కనిపించినప్పుడల్లా మా అమ్మాయి,పిల్లలు అమెరికాలో ఎలా ఉన్నారని అడిగేది. ఆప్యాయత ఆమె సహజ లక్షణం . అందరు ఒకేకుతుమ్బమని ఆమె భావన .రెండేళ్ళ క్రితం ధనుర్మాసం ఉత్తమ భక్తురాలుగా ఆమెను గుర్తించి ఎదో జ్ఞాపిక అందించాను .సరసభారతి కార్యక్రమాలకు తప్పక హాజరయ్యేది . ఏడాదిక్రితం ఆమె సునాయాసంగా మరణించి దైవ సన్నిధి చేరింది .తెలిసిన వెంటనే ఒక మంగళవారం గుడిలో ఆమె కు శ్రద్ధాంజలి ఘటించాం .మరుపుకు రాని సౌజన్యం శ్రీమతి సస్యశ్రీ ది .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -9-2-22-ఉయ్యూరు —